“హిమాచల్ ప్రదేశ్ లోని శక్తిపీఠాలు-2”

ధార్మికం

హిమాచల్ ప్రదేశ్ లోని, కాంగ్రా జిల్లాలో వున్న వజ్రేశ్వరీదేవి, చాముండాదేవి, బగళాదేవి శక్తిపీఠాల గురించి ఈ వ్యాసంలో తెలుసుకుందాం. మేం హిమాచల్ ప్రదేశ్ లోని జ్వాలాముఖి, చింతాపూర్ణి శక్తిపీఠాల దర్శనమయ్యాక, జ్వాలాముఖి నుండి సుమారు 40- 50 కిమీ దూరంలో ఉన్న బగళాదేవి ఆలయానికి ప్రైవేటు బస్సులో బయలుదేరాం. ప్రయాణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. మార్గమంతా కొండలతోనూ, లోయలతోనూ, పచ్చని వృక్షాలతో, నీలి ఆకాశంలో తెల్లని మబ్బులతో… చూస్తుంటే మరీ చూడాలనిపించేంత అందంగా ఉంది మార్గమధ్యంలోని ప్రకృతి.
బగళాముఖి ఆలయం:
పరమాత్ముడైన శ్రీ పరమేశ్వరుడు కూడా పూజించే శ్రీ బగళాముఖి (పీతాంబర) దేవి, కాళికాదేవి దశ మహావిద్యలలో ఎనిమిదవ దేవతగా, శత్రునాశినిగా, ఆర్థిక ఇబ్బందుల నుండి, కోర్టుకేసుల నుండి విముక్తిని ప్రసాదించే దేవతగా పేరుండడంతో ఎక్కడెక్కడి నుండో భక్తులు మొక్కులు చెల్లించుకోవడానికి వస్తారు. బగలా అంటే బంధించు, ముఖి అంటే ముఖం. అంటే ఎవరి వాక్కునైనా ఈమె శాసించగలదు కాబట్టి బగలాముఖి అయినది. ఈమె ఆయుధం దుడ్డుకర్ర. సాధకులు ఎక్కువగా ఉపాసిస్తారీ దేవతను. భారతదేశంలో ఈ దేవి కొలువైన ఆలయాల్లో, రెండు ఆలయాలు ఎక్కువగా ప్రసిద్ధి పొందాయి – ఒకటి హిమాచల్ ప్రదేశ్ లోని‌, కాంగ్రా జిల్లాలోని, బంఖండిలో; మరొకటి దక్షిణ భారతదేశంలోని తమిళనాడులోని తిరునెల్వేలి జిల్లాలోని, కల్లిడైకురిచ్చికి దక్షిణంగా ఉన్న పప్పంకుళం గ్రామంలో.
పచ్చని ప్రకృతి మధ్య, పసుపువర్ణంలో ఉన్న ఈ ఆలయాన్ని చేరుకోగానే మనసు ఒక్కసారిగా ప్రశాంతతకు లోనవుతుంది. ఒకసారి మహాప్రళయం సంభవించినప్పుడు, విష్ణువు ప్రార్థన మేరకు భగవతి, బగళాదేవి రూపంలో, పసుపురంగు కొలను నుండి ఉద్భవించి ఆ ప్రళయాన్ని ఆపిందని, ఎటువంటి కష్టాలనైనా అమ్మవారు తొలగిస్తుందని నమ్మకం. దేవికి పసుపు వర్ణమంటే ప్రీతని, అందుకే పీతాంబరి అని కూడా అంటారని కథనం. అందుకే ఆలయం పసుపు వర్ణంలోనే శోభిస్తుంది. అమ్మవారిని కూడా పసుపురంగు దుస్తులతో, పసుపు పూమాలలతో అలంకరిస్తారు.
అమ్మవారు నలుపు వర్ణంలో, పెద్ద పెద్ద నయనాలతో చూడ ముచ్చట గొలుపుతారు. అమ్మవారికి కుడిచేతి వైపు గణేశుడు, ఎడమచేతి వైపు శంకరుడు ఉంటారు. ఇక్కడ అమ్మవారి దగ్గర హంసకూడా ఉంది.
ఆలయ పరిసరాలన్నీ పూలమొక్కలతో నయనా నందకరంగా ఉన్నాయి. ఆలయం ఒక ప్రక్కగా బాన్ గంగానది ప్రవహిస్తూ ఉంటుంది. ఆలయ ప్రాంగణంలోనే ముగ్గురు గురువుల సమాధులు కూడా ఉన్నాయి. అడవి మధ్య ఉన్నట్టున్నా మంచి క్యాంటీన్, ఉండడానికి గదులు, బాత్రూంలు అందుబాటులో ఉన్నాయి. అక్కడనుండి 40-50 కిలోమీటర్ల దూరంలో కాంగ్రా పట్టణంలోనున్న వజ్రేశ్వరీదేవి ఆలయానికి బయలుదేరాం. పట్టణం ఒడ్డున బాన్ గంగా నది ప్రవహిస్తుంది.
వజ్రేశ్వరీదేవి (కాంగ్రాదేవి) శక్తిపీఠం: ఇది కాంగ్రా జిల్లాలోని, కాంగ్రా పట్టణంలో, నాగర్ కోట్ అనే ఊరిలో ఉంది. ఆలయం 11వ శతాబ్దం నాటిదని, పాండవులు నిర్మించారని అక్కడి శాసనాలు చెప్తున్నాయి. 1905 లో వచ్చిన భూకంపంలో ఆలయం పూర్తిగా శిథిలమైతే, 1930లో ఇప్పుడున్నది నిర్మించారు. భూకంపంలో, ఆలయమంతా శిథిలమైనా, యిక్కడున్న చిన్న తారాదేవి మందిరం మాత్రం చెక్కుచెదరలేదని, తారాదేవి మందిరం మీద వ్రాసి ఉంది. ఆలయానికున్న మూడు శిఖరాలు హిందూ, ముస్లిం, సిఖ్ వాస్తులను పోలి ఉన్నాయి.
ఈమెనూ దుర్గాదేవి అవతారంగా కొలుస్తారు. ఈమె పిడుగు (వజ్రం) తో, కలికాల అనే రాక్షసుని సంహరించినందున ఈమెను వజ్రేశ్వరి దేవి అని పిలుస్తారు.
51 శక్తి పీఠాలలో ఇది ఒకటి. ఇక్కడ అమ్మవారి ఎడమ వక్షోజం పడిందని విశ్వాసం. ఇక్కడ అమ్మవారు పిండి (రాయి) రూపంలో ఉంటారు. పిండిని ముఖం రూపంలోనే అలంకరిస్తారు. పసుపు, గంధం కలిసిన రంగులో ఉన్న ముఖంలో చక్కని కళ్ళు, పెద్దనత్తు స్ఫుటంగా కనిపిస్తాయి. మహిషాసురుని వధించాక, దేవి తనకైన గాయాలకు వెన్నను పూసుకుందని… అందుకే ప్రతీ సంక్రాంతికి అమ్మవారికి వెన్నను పూస్తారు. ఇక్కడ దసరా, సంక్రాంతి సమయంలో ఉత్సవాలు అతి ఘనంగా జరుగుతాయి. శక్తి పీఠం కనుక, భక్తుల తాకిడి ఎక్కువగానే ఉంది. ఆలయానికి వెళ్లే మార్గమంతా షాపులతో, సందడిగా ఉంది.
అమ్మవారి మందిరానికి ముందు భాగంలో భైరవనాధ్ మందిరముంటే, వెనుక భాగంలో క్షేత్రపాలకులైన గణేష్, శివ మందిరాలున్నాయి. ప్రాంగణంలో ఒక మూలనున్న ఇంకో శివాలయానికి వెళ్ళాం. అక్కడ ఒక మూలనున్న గాజు పెట్టెలోనున్న పిండి (రాయి)ని చూపించి, అదే అసలు పిండి (దేవత) అని చెప్పారు. పరిశీలనగా చూస్తే అందులో సింహం, అమ్మవారు, గణేష్ ఉన్నట్లనిపించింది.
ప్రాంగణం చాలా పెద్దది. అందులో చాలా ఉపాలయాలు, పెద్ద రావిచెట్టున్నాయి. రావిచెట్టు కందరూ ఎరుపు రంగు వస్త్రాలను కడుతున్నారు. లోపల ఫోటోలు తీసుకున్నాం.
కాంగ్రాలో ఉన్న యాత్రీనివాస్ లో భోజనాలు చేసి అక్కడ నుండి వి.ఆర్.సి ధర్మశాలకు వచ్చాం. ఇక్కడ పరిసరాలు, చుట్టూ చెట్లతో ఆహ్లాదకరంగా ఉన్నాయి. ఆ మరుసటి రోజు, ఇక్కడకు 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న చాముండాదేవి ఆలయానికి బయలుదేరాం.
చాముండాదేవి ఆలయం: ఈమెను కూడా దుర్గాదేవి అవతారంగానే కొలుస్తారు. దీన్ని శక్తి పీఠమంటారు గాని, ఇక్కడ సతీదేవి శరీర భాగాలేమి పడలేదు. గాని ఆలయ మహత్యం వల్ల, శక్తిపీఠానికిచ్చినంత ప్రాముఖ్యతనిస్తారు. చాముండా అమ్మవారు ఉగ్ర స్వరూపిణి. చండ, ముండ అని ఇద్దరు రాక్షసులను సంహరించడం వలన, చాముండా అన్న పేరు వచ్చింది. సప్తమాతృకలలో ఒకరు. 16వ శతాబ్దంలో నిర్మితమైనదీ ఆలయం.
ఇది పాలంపూర్ గ్రామంలో ఉంది. ఈ ఆలయం పక్కనే బాన్ గంగా నది ప్రవహిస్తుంది. పరవళ్ళు తొక్కుతూ తెల్లని నురగతో ధవళ గంగను తలపిస్తుంది. నదిమీద ఉన్న వంతెన, దూరంగా పర్వతాలు, చెట్లను చూస్తుంటే అందమైన ప్రకృతి దృశ్యం కానవస్తుంది. ఆలయంలో ఉన్న పుష్కరిణికి చుట్టూ మొక్కలు, మధ్యలో శివుని ప్రతిమ, నీలి రంగు పెయింటింగ్ వేసి అందంగా తీర్చిదిద్దారు.
ఆలయ కాంప్లెక్స్ చాలా పెద్దది. కొత్తగా పెద్ద హాల్స్, బారికేడ్లు నిర్మించారు. అసలు మందిరం చిన్నగానే ఉంటుంది. మేము వెళ్లేసరికి సుప్రభాత హారతి పూజ జరుగుతుంది. చాలా భక్తిశ్రద్ధలతో పూజను నిర్వహించారు. యాత్రికులమైన మమ్మల్ని కూడా కూర్చోమని, చక్కని కీర్తనలను ఆలపించారు. గుండ్రని పెద్ద కళ్ళతో, కిరీటధారిణియై అమ్మవారు, ఇంకా చూడాలనిపించేంత తేజస్సుతో ఒప్పుతున్నారు. అమ్మవారిని ధ్యానించి, ఏమైనా కోరుకుంటే, అది తప్పక నెరవేరుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అందుకే ఈ ఆలయం కూడా భక్తులతో చాలా సందడిగా ఉంది. మధ్యాహ్నం 12 నుండి 1: 00 వరకు ఆలయం మూసి ఉంటుంది.
అమ్మవారి దర్శనమయ్యాక, ఎడమ వైపున పదిమెట్లు కిందకు దిగితే, నందికేశ్వర ఆలయముంది. నందికేశ్వరుడు గుహలో ఉన్నట్లు ఉంటాడు. నందికేశ్వరుడు పూర్తి లింగాకారంలో కాకుండా కొద్దిగా, సమతలంగా అనిపిస్తాడు. మేము వెళ్లిన సమయంలో రద్దీ లేదు. కాబట్టి చక్కటి దర్శనాలయ్యాయి.
ఆది హిమాని చాముండ, ఆమే అసలైన చాముండా మాత అంటారు. ఆమె ఈ ఆలయానికి దగ్గరలో ఉన్న కొండపైన కొలువై ఉంటారు. అక్కడికి వెళ్లే అవకాశం లేనందువలన, మేం కొండ దిగువనున్న చాముండా దేవి దర్శనంతో సంతృప్తి పడ్డాం. అమ్మవారి సుప్రభాత సేవను ఎంత భక్తిశ్రద్ధలతో చేశారంటే, ఎప్పుడు తలచుకున్నా అక్కడే ఉన్నంత మైమరపు కలుగుతుంది. మా గ్రూపులో వెళ్లిన వాళ్లమందరమూ ధన్యులమయ్యాం.
మేము జూలైలో వెళ్లినాం. వర్షాకాల ప్రారంభం కనుక చాలా ప్రాంతాలలో ఆకాశం నల్లని దట్టమైన మబ్బులతో కూడి, ప్రయాణానికి ఆటంకం కలుగుతుందేమోనని ఓకింత భయమున్నా, ప్రకృతిని ఆస్వాదిస్తూ ప్రయాణం సాగింది. మధ్య మధ్యలో వర్షం పడుతుంటే, చిరుజల్లుల్లోనే తడుస్తూ దర్శనాలు చేసుకునే వాళ్ళం. అదో మరువలేని, మరపురాని అనుభూతి. అలా, ప్రకృతి అందాలను మనసులో నింపుకుంటూ కెమెరాలలో బందీ చేస్తూ, అందమైన హిమాచల్ ప్రదేశ్ లోని శక్తిపీఠాలను, సిద్ధ పీఠాలను దర్శించుకుని, అక్కడనుండి అమరనాధుని దర్శనార్థం జమ్మూకాశ్మీర్ బయలుదేరాం.

Written by Dr. Majji Bharathi

ప్రభుత్వ వైద్య కళాశాల రాజమహేంద్రవరంలో ప్రొఫెసరుగా మరియు మైక్రోబయాలజీ విభాగాధిపతిగా పనిచేస్తున్న డా. మజ్జి భారతిగారు, మూడు కథా సంపుటాలు- 1. ఆలోచనా తరంగాలు (2022), 2. వేకువ (2024), 3. జీవన గానం (2025), 4. భారతీ! వందనము అనే పద్య సంకలనాన్ని వెలువరించి, నాల్గవ కథా సంపుటం "అనగనగా ఒక కథ" ప్రచురించబోతున్నారు. వందకు పైగా కథలు, ఆరోగ్యానికి సంబంధించిన వివిధ వ్యాసాలు, ట్రావెలాగ్స్, కవితలు వివిధ పత్రికలలో (ఈనాడు ఆదివారం అనుబంధం, విశాలాక్షి, విశాఖ సంస్కృతి, మాతృక, భూమిక, పాలపిట్ట, ప్రసారిక, సాహితీ కిరణం మొదలైన పత్రికలలో, కథామంజరి, కౌముది, విహంగ, సారంగ, సంచిక, మాధురి, తరుణి, మయూఖ, రవళి, గో తెలుగు డాట్ కాం మొదలైన అంతర్జాల పత్రికలలో) ప్రచురింపబడ్డాయి. ఐదు కథలకు బహుమతులు, ప్రత్యేక బహుమతులు వచ్చాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

నాన్న మాట

హరి చందన-14