రమక్కతో ముచ్చట్లు – 29

పుష్పక విమానం మా పట్నం.

అందరికీ దసర పండుగ మేలి పొద్దులు.

ఈ కాలంల పట్నాలంటే తల్లి లెక్క. పట్నం పుష్పక విమానం లెక్క. చుట్టుపక్కల పల్లెల్లకాడ నుంచి, వేరే రాష్ట్రాల నుంచి ఎంతమంది బత్కచ్చినా వాళ్ళందర్నీ పట్నం, పుష్పక విమానం లెక్క గుండెల్ల పెట్టుకుంటది. ఎంత మంది వచ్చినా ఇంకొకళ్లకి జాగా ఇస్తది. అదే పట్నం అంటే. ఇదే మా హైదరాబాదు అంటే!
పుష్పక విమానం పురాణాల్లో చాలా ప్రాముఖ్యమైన దివ్యవాహనం. దీని గురించి ముఖ్యంగా రామాయణంలో విస్తృతంగా ప్రస్తావన వస్తుంది.

పుష్పక విమానమును విశ్వకర్మ అనే దేవ శిల్పి నిర్మించాడట.ఇది సూర్యకాంతిలెక్క దగదగ మెరుస్తదట, ఏ పెట్రోలు డ్రైవర్ అవసరమే లేకుండా వందలాది మందిని మోయగల అద్భుత శక్తివంతమైన వాహనం అనీ,ఈ దివ్యవిమానాన్ని మొదట కుబేరుడు (సంపదల దేవుడు) వాడేవాడు అనీ మనకి పురాణాలు తెలుపుతయి. ఎవ్వల్ల దగ్గర ఏ మంచి ఉంటే.. అది ఎత్తుకుపోయే బుద్ధి కలిగినోడు ఎవడు చెప్పండి? ఇంకెవడు. రావణాసురుడు. ఆ రావణుడు పుష్పక విమానాన్ని ఎత్తుకుపోయిండంట కుబేరుడు దగ్గరికెంచి!
రావణుడు అంటేనే దుష్ట బుద్ధికి, ఎదుటి వాళ్ళ దగ్గర ఉన్నది దొబ్బేసుకోవాలన్న ఒక అత్యాశకి ఉదాహరణ. ఈ కాలంల సుత రావణాసురులు మస్తు మంది ఉన్నరు. వాళ్ళు కష్టపడరు, ఎదుటోళ్లది దోచుకోవడమే వాళ్ళ పని.
రావణుని వధించినంక విభీషణుడు ఈ విమానాన్ని శ్రీరామునికి ఇచ్చి,రాముడు, సీత, లక్ష్మణుడు, హనుమంతుడు, మిగతా వానర సైనికులు అయోధ్యకు పంపినాడట.
అట్ల.. ఎన్ని వేల మంది కూసున్నా.. ఇంకొకళ్ళకి జాగా ఉంటది పుష్పక విమానంల. అందుకే నా పట్నం హైదరాబాదును సుత పుష్పక విమానం అంటున్న. ఎంతమంది బతుకనీకి వచ్చినా..కన్నతల్లి లెక్క ఆదరించి కడుపుల పెట్టుకుంటది.
పట్నం అంటే నాగరికతకు అద్దం. మనిషి జీవనవిధానం కాలక్రమేణా మారుతూ వచ్చిన తీరు, సౌకర్యాల పెరుగుదల, ఆర్థికాభివృద్ధి, విద్యా అవకాశాలు పెరిగిపోయే, సదువులు పెద్ద పెద్ద కొలువులు, ఇట్ల పట్నం నిషాని మారిపోయే.
పట్నం బతుకు చాలా గొప్పగ ఉంటది అని అనుకుంటము, దాని ఎనుక ఉరుకుడు ఎంతుంటదో ఉండేటోళ్లకే ఎరుక. పొద్దుగాల లేస్తే అందరూ… చిన్నదా పెద్దదా… అని కాదు, తమ బతుకు తెరువుకు రోడ్లమీద పడి ఉరుకుతనే ఉండాలి. మళ్ళీ రాత్రి గూటికి చేరాలి పక్షుల లెక్క. అది పట్నం బతుకుల ఉన్న ఒక బాధ. ఒకటే ఆగం బతకంత. బస్సులల్ల, ఆటోలల్ల మెట్రోల ఇట్ల మొత్తం మీద ప్రయాణంలనే ఒడిశి
పోతది రోజంత. ఇల్లు అంటే రాత్రి పండుకోనికి ఒక అడ్డ లెక్క తయారైపోయింది. మస్తు విపరీతమైపోయిన్రు జనాలు. అందరి దగ్గర బండ్లు. రోడ్లల్ల ఇగ జాగా ఏడ ఉంటది? రోడ్లపై ట్రాఫిక్ సమస్యలు ఎక్కువ. కాలుష్యం పెరగడం, ఇండ్ల సమస్యలు, కిరాయి బాధలు.. ఇట్ల గొప్పగ కనబడే పట్నం వెనుక పెద్ద కతనే ఉన్నది. ఒక పెద్ద చిక్కుల కష్టాల చిట్టా ఉంటది.
ఏది ఏమున్న, ఎట్లున్న ఒక మనిషికి ఊర్లల్ల బతుకుడు కష్టమైతే బతుకుబండి గాడికొస్తే, ఎద్దు పడిపోతే, పొలం ఎండిపోతే… మన కూలీ చేతులు, మన కలలు ఎక్కడికి పోవాలే?
అప్పుడుకాళ్లు పట్నం వైపు తిప్పుతయి.

పట్నం అంటే ఎత్తయిన ఇండ్లే కాదు…
ఒకరి కన్నీళ్లు తుడిచే స్నేహం,
ఒకరి ఆకలి తీరే అన్నం,
ఒకరి కల నెరవేరే తలపు… రెండు మెతుకులన్న నోట్లకి ఇస్తది పట్నం, ఎవ్వలొచ్చినా… ఊర్ల నుంచి బతుకోచ్చినమని, బతుకుబండి ఆగిపోయిందని చెప్పుకుంటూ పట్నంల అడుగుపెడితే!
పట్నం గుండె తలుపు వేసుకోదు.
“రామ్మా.. రా, నీ చేతి చెమట ఇక్కడ రోడ్డు కడుతుంది, నీ కష్టం ఇక్కడ కట్టడమవుతుంది” అంటది.
ఇక్కడ రిక్షా తిప్పే వాడూ మనవాడే,
ఇక్కడ బండి తోసే వాడూ మనవాడే,
ఇక్కడ గోడ కట్టే మేస్త్రీ మనవాడే.
పట్నం గోడలన్నీ, వీధులన్నీ వాళ్ల చెమటతోనే బతికుంటయి.
ఎంతమంది పట్నంల రొట్టెలు అమ్ముకొని, పానీపూరి వేసుకొని ఎంత ఆనందంగా బతుకుతున్నరు. పక్క రాష్ట్రంల కెళ్ళి వచ్చిన ఎన్నో పానీపూరి బండిలోళ్ళకి పట్నం ఆధారించి సొంత ఇండ్లను ఇచ్చింది. వాళ్ళ పిల్లలు చదువుకొని బాగుపడి కొలువులు చేసుకుంటున్నరు.
ఆరోగ్యం మీద శ్రద్ధ ఎక్కువైన అందరూ..జొన్న రొట్టె పొంటి సూస్తున్నరు.
జొన్న రొట్టెలు చేస్కునే తల్లులకు ఉద్యోగం అయింది మన పట్నం. ప్రతి గల్లీల సాయంత్రం అయితే చాలు తల్లులు పెంక పెట్టుకొని రొట్టెలు చేస్తున్నరు. మనకు ఆరోగ్యం, వాళ్లకి జీవనోపాధి. ఎంత గొప్పది కదా తమ్మీ మన పట్నం.

కాలేజీ పోరగాళ్ళకి పానీపూరి తినకపోతే రోజు గడవదు ” భయ్యా తొడ ప్యాజ్ డాలో ” అన్న డైలాగు పెద్ద వైరల్ అయిపోయింది. అట్లా.. ఎన్ని పానీపూరి బండ్లు ఈరోజు పట్నంల బంగ్లాలై పోయినయి.
వేల మంది పొరగాన్లు అయితే ఒక బండి కొనుక్కొని, ఉబర్ల ర్యాపిడోల పెట్టుకొని మంచిగ బతుకుతున్నరు వాళ్ళ కష్టం మీద వాళ్ళు. ఏ ఊబర్ పిల్లగాని అడిగినా సుత పక్కూరు నుంచో పక్క రాష్ట్రం నుంచో హైదరాబాద్ కు వచ్చిన ఈడ, కంపెనీల బండ్లు తిప్పుకుంటున్నము దానివల్ల మంచిగా పైసలు వస్తున్నయి, ఒక పెద్ద కొలువు చేసినంత జీతం వస్తుందని చెప్పి ఖుష్ అయ్యే పిల్లలను ఎంతోమందిని చూసిన.
ఇగ జర్ర పైసలు ఉండి, చదువుకున్నోళ్లు గల్లి గల్లిల దుకునం పెట్టినట్టు బడులు ఎన్ని ఉన్నాయో చెప్పుడు కష్టం! దాంట్ల పిల్లలు సదువులు, చాలా మందికి ఉద్యోగాలు వస్తున్నయ్. ఈ బడులది ఒక పెద్ద కత. ఈ ప్రైవేట్ సదువుల కత గురించి మనం ఇంకో రోజు ముచ్చట పెట్టుకుందాం. ఏదేమైన గాని మస్తు మందికి కొలువులు వస్తున్నయ్, పిల్లలూ సదువుకుంటున్నరు అన్నమాట మాత్రం నిజం.
పెద్ద పెద్ద దుకాణాలు, షాపింగ్ మాల్లు, హోటల్లు, సినిమా హాల్లు ఇట్ల చదువుకున్నోళ్లకు, కొంచెం స్కిల్ ఉన్న వాళ్లకు ఎన్నో రకాల కొలువులు ఎన్నో రకాలుగ.. బతకనీకి దారులు.
ఇగ ఇంకొకముచ్చట… ఒకప్పుడు పండుగలు అంటే పల్లెలు అనేటోళ్లు! ఇప్పుడు మా పట్నంల వచ్చి సూడండి అది ఏ పండుగ అయినా సరే, ధూమ్ ధామ్ బజాయిస్తరు. బోనాలు, బతుకమ్మ దసరా, దీపావళి, వరలక్ష్మి వ్రతం, గణేష్ చవితి,ఒకప్పటి పల్లె మొత్తం పట్నంల దించుతున్నరు.
భాగ్యనగరం నిజంగా భాగ్యనగరమే అనిపిస్తది నాకు సూస్తుంటే. హైదరాబాదు షానే వేరబ్బా..!
” హైదరాబాదు ఇది హైదరాబాదు భిన్న సంస్కృతులు కలగలిసిన పాదు…!”
అంటరు మన మహాకవి సినారె గారు.
ఇంకా ఇక్కడ సంగీతము, సాహిత్యము శాయరీలకు సుత ఏమి కొదువలేదు. ఎంతో గొప్ప గొప్ప సాహిత్యకారులున్న జాగమన ఈ పట్నం.
పూసలన్నీ గుచ్చితే ఒక అందమైన దండ లాగ అన్ని రకాల మనుషులు,అన్నిప్రాంతాల జనాలు ఉన్న మన పట్నం, మన హైదరాబాదుకు అందరం బలం అవ్వాలి. అందరూ వచ్చి ఇక్కడ చేరితే సరిపోదు. ఈ నగర శుభ్రతను, పట్నం బాగోగులను కూడా చూసుకోవడం అందరి బాధ్యత. పట్నం ఒక అమ్మలా అందరినీ కడుపుల దాసుకుంటది, బుక్కెడంత బువ్వ పుట్టే తొవ్వ సూపుతది. పరాయి జేసి ఎవర్ని నూకెయ్యదు.
ఎదుటివాడి భాష వేరైనా, ఊరు వేరైనా, చేతి పని ఉన్నంత వరకూ పట్నం ఒడిల జాగా ఉంటది.
అందుకే అంటరు…
“బతుకుబండి ఆగితే, పట్నం బండి లాగుతుంది
కలల దారిలో దూసుకుపోతుంది.”

ఇది ఇయాల నేను మీతో ముచ్చట పెట్టిన పట్నం కత! అందుకే మనం యాడున్న అదే మన సొంత ఇల్లు లెక్క. మన సొంత గ్రామం లెక్క. పట్నంను కూడా మంచిగ చూసుకోవాలి. పరిసరాల శుభ్రతను కాపాడుకుంటా.. పక్కన ఇరుగుపొరుగుతో స్నేహంగ ఉందాం. అందరం అన్ని పండుగలు దిల్దార్ ధూమ్ ధామ్ చేసుకుందాము. కలిసిమెలిసి ఉందాం!

ఉంట మరి పైలెం.
మీ
రమక్క

Written by Ramadevi Kulkarni

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

హుళక్కి

హరి చందన- 6 భాగం