హాయ్ వంటింటి మహారాణులు!
మీ ఇంట్లో వంట ఏమిటండి?
నేను మాత్రం ఈరోజు టమాటో పప్పు, బెండకాయ శాకం, ఆహా! అనిపించే టమాటా క్యారెట్ చారు.
రసమే కదా అని నీరసంగా ముఖం పెట్టకండి. చెప్పాను కదా ఇది మన లోపల శక్తిని పెంచే అద్భుతమైన చారు.
ఈ చలికాలంలో కొద్దిగా అన్నం పెట్టుకొని, నిండా చారు పోసుకుని తినాలి. అంటే చారులో మెతుకులు ఈత కొట్టినట్లు ఉండాలి. అంత కొంచెం అన్నం అంత ఎక్కువ చారు. అప్పుడు ఈ చలికి పూడుకుపోయిన గొంతు తెరుచుకుంటుంది. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అదంతా ఎందుకు మనకు కడుపులో హాయిగా ఉంటుంది.

చారు మొదలు పెడదామా!
మీ ఇంట్లో వ్యక్తులను బట్టి ఎంత కావాలో అంత చేసుకోండి. నేను మాత్రం కొంచమే చేశాను.
ఒక క్యారెట్ నాలుగు టమాటాలు ఒక ఉల్లిపాయ కొత్తిమీర కరివేపాకు .
మెంతి జీలకర్ర ధనియాల పొడి
కొంచెం మిరియాల పొడి
అవసరముంటే పచ్చిమిరపకాయలు వేసుకోవచ్చు లేదా కారమైన వేసుకోవచ్చు. నేను వేయలేదు ఎందుకంటే మా ఇంట్లో బుడ్డోళ్లు ఉన్నారు. వాళ్లు కారం అసలే తినరు. మరీ చిన్న పిల్లలు .
ఇంకా ఏం చెప్పాలి? పోపు దినుసులు, నూనె అంతే కదా!
ఇప్పుడు క్యారెట్ ఉల్లిపాయ టమాటాలు మిక్సీ పట్టేసుకున్నాను.
ఒక గిన్నెలో ఈ మిశ్రమం మరియు నీళ్లు పోసి బాగా మరగనివ్వాలి. అవసరం అనుకుంటే చింతపండు కూడా వేసుకోవచ్చు. కానీ నేను వేయలేదు. బాగా మరుగుతుండాలి. ఎవరి మీద అయినా కోపం వస్తే మనకు లోపల రగిలిపోతుంది కదా అలా మరగాలి.
అది మరుగుతూ ఉంటుంది నేను ఒక మాట చెప్పనా!
అవును బట్టలు కట్టుకోవడంలో ఎవరి స్వేచ్ఛ వారిదేనా?
తల్లితండ్రులకి, అన్నదమ్ములకి, అక్కాచెల్లెళ్లకి ఏదైనా బాగా లేకుంటే చెప్పే హక్కు లేదా!
సమాజంలో ఉన్నప్పుడు వలువలు సరిగా ఉంటే విలువలు పెరుగుతాయి.
మంచి వస్త్రధారణలో ఉంటే అమ్మ అనాలనిపిస్తుంది. అదే బట్టలు పొదుపు చేస్తే బొమ్మే కదా!
సరే ఈ టాపిక్ నచ్చకుంటే వదిలేస్తాను.
ఇప్పుడు ఇవన్నీ బాగా మరుగుతున్నప్పుడు ఉప్పు మెంతి జీలకర్ర ధనియాల పొడి కొంచెం మిరియాల పొడి కొద్దిగా బెల్లం వేసి ఇంకాసేపు మరగనిచ్చి, ఇప్పుడు చక్కని పోపు వేసుకోండి.
ఇంగువ వేయడంలో పొదుపు చూపించవద్దు.
పోపు వేశాక ఇంకేముంది కంచంలో అన్నం పెట్టుకొని నాలుగు గంటెల చారు పోసుకొని ఉంటే అప్పడాలు వడియాలు నంచుకుని తినండి!
అన్నం కొంచెం మెత్తగా ఉంటే బాగుంటుంది.
తేలిగ్గా జీర్ణం అవుతుంది. కడుపులో హాయిగా ఉంటుంది. పిల్లలకు కూడా పెట్టవచ్చు.
ఈ చారు పెట్టడం మీకు ఇదివరకే వచ్చినట్లయితే నన్నేం అనకండి!
Ok నా girls????
లక్ష్మి మదన్