పసిదనంతో ప్రయాణం (కాలమ్ 11)

వామ్మో గుళికలు… సస్త సారో…

కరోనా భయం నుంచి బయటపడిన రోజులు. అప్పటి వరకు మూత బడిన పాఠశాలలు సెప్టెంబర్ నుంచి అన్ని కరోనా జాగ్రత్తలతో ప్రారంభించిన పాఠశాల ప్రాంగణాలు బాలల రాకతో నందనవనాలై విరబూస్తుంటే బుజ్జి బుజ్జి కన్నమ్మలు కన్నయ్యలు చిన్నారి సీతాకోక చిలుకలై విహరిస్తూ చదువుల మకరందం గ్రోలుతుంటే, పట్టాలు తప్పిన వారి భవిష్యత్తు ఇప్పుడిప్పుడే దారిలోకి వస్తుంటే మనసు నిండా చెప్పలేని ఆనందం.
చూస్తుండగానే 2021 కాల గర్భంలో కలిసి పోయింది.

మళ్ళీ స్వచ్ఛమైన బాలల ప్రపంచంతో పాఠశాలు కళకళలాడుతూ ఉన్నాయి. ఆ బంగారు తల్లులు,తండ్రుల విద్యాబోధన చేస్తూ వారిలోని సర్వతోముఖాభివృద్ధిని కనులారా వీక్షిస్తూ వుండటం కన్న అదృష్టం గురువులకు ఇంకేముంటుంది.
వాళ్ళతో అనుబంధాల గురుతుల్ని ఇలా అక్షర బద్ధం చేసుకుని అప్పుడప్పుడూ ఇలా మననం చేసుకుంటూ వుంటే ఈతిబాధలు తొలగిపోయి మనసు ఆనంద పారవశ్యానికి లోనవుతుంది.
ఓ బుజ్జి కన్నమ్మదో,కన్నయ్యదో ఆనాటి అనుభవాల భరిణె తెరవకుండా ఇలా సాగదీస్తూ వుండటం భావ్యమేనా అంటున్నారు కదూ!
మరింకేం పదండి ఓ బుజ్జి కన్నయ్య ముచ్చట చెప్పుకుందాం.
ఓ బుజ్జి కన్నయ్య బడికి ససేమిరా రానని మొండికేస్తున్నాడని తెలిసింది. మా హెచ్చెం సారు ఊళ్ళోనే ఉన్న రామచంద్రయ్య సారు ఎంతమందిని పంపినా వాళ్ళను చూసి దాక్కుని,వాడి బుజ్జి తెలివితేటలు ఉపయోగించి అలవోకగా తప్పించుకుంటూ ఉన్నాడు.
ఇక వాడి జాన్ జిగిరి దోస్తులకు చెప్పడంతో వాళ్ళు ఆ బుజ్జి కన్నయ్య దాక్కునే తావుల గురించి చెప్పారు.
ఇంకేముంది ఓనాడు నలుగురు పెద్ద పిల్లల్ని అటెండర్ని ఇచ్చి పంపించారు.
మొత్తానికి ఆ కన్నయ్య దాక్కుండే తావులోకి వెళ్ళి మాటువేసి వాళ్ళిద్దరు,తల చేతులు ఇద్దరు పట్టుకొని వచ్చారు.
ఇక వాడి అరుపులకు బడి దద్దరిల్లి పోతోంది. స్టాఫంతా అక్కడికి చేరుకున్నాం.
ఆ కన్నయ్యను రామ చంద్రయ్య సారు ముందు నిలబెట్టి తప్పించుకొని పోకుండా వలయంలా నిలబడ్డారు పిల్లలు.
ఇక ఆ కన్నయ్య సారును చూస్తూ ” ఓ సారూ! నీకు దండం పెడతా! నేను బడికి రాను.నన్నొదిలెయ్ సారూ! అంటుంటే సారు కోపంతో”నిన్ను వదిలెయ్యడానికా బడికి తీసుకొచ్చింది. నీ దోస్తులు బడికొస్తుంటే నీకేమైంది. బాగ గాలి గాలి తిర్గుతున్నావ్!” అనంగనే వాడు “సారూ! నన్నొదిలెయ్యక పోతే నేను గుళికలు మింగి సత్త గని బడికైతే అస్సలు రాను ” అని బెదిరిస్తుంటే నిజంగనే వాడేమైన చేసుకుంటాడా ఏంటి మాకు ఓ పక్క భయం మరో వైపు గింత లేడు వాడి బలమైన నిర్ణయానికి అవాక్కయ్యాం.
ఇక సారు ఏమంటారో అని ఉత్కంఠతో ఎదురు చూస్తూ ఉన్నాం.
సారు వాడితో” ఏంట్రా గుళికలు తింటవా? నిజంగా తింటవా? అయితే ఉండు” అని పిల్లలకు సైగ చేసి”ఒరేయ్! వీడు గుళికలు మింగుతాడట. తేండ్రా అనంగనే ఓ పిల్లవాడు గబగబా ఓ పొట్లం పట్టుకొని వచ్చాడు.
అది చూసి ఆ బుజ్జి కన్నయ్య మాటలు చూడాలి.నవ్వకుండా ఉండలేక పోయాం.
” ఓ సారూ! దండం పెడతా! అవి తింటే సచ్చిపోతరు సారూ! నేను తినను సారో!” అని గండమోర్లు పెట్టుకుంటూ ఏడుస్తుంటే అందరమిక మామూలుగ నవ్వలేదు. తిప్పికొడితే వాడికి నిండా ఆరేళ్ళు లేవు గుళికలు తింటే చనిపోతారనే వాడి జ్ఞానానికి భలే ఆశ్చర్యం అనిపించింది.
సారు నవ్వుతూ”మరెందుకురా గుళికలు తింటనంటున్నవు. నీవు గనుక బడికి రాలేదనుకో ఇగ్గో ఈ గుళికలు తినిపించడం గ్యారెంటీ. చదువొద్దు,బడొద్దు అనుకుంటే ఇవి తినిపిస్తా. మరి రోజూ వస్తావు కదా! అనంగనే తలకాయ నిలువుగా గట్టిగా ఊపి “వత్త సారూ! అన్నడు.
అదిగో అప్పటి నుంచి ఎలాంటి చికాకు చేయకుండా బుద్ధిగా బడికి వచ్చాడు.చక్కగా చదువుతూ మా అందరికి ఇష్టమైన విద్యార్థి అయ్యాడు. ఇప్పుడు ఆ బుజ్జి కన్నయ్య ఎక్కడున్నాడో? ఏం చేస్తున్నాడో! వాడికి నేను గుర్తున్నానో లేదో కానీ ఆనాటి జ్ఞాపకం ఈనాటికీ మరిచిపోలేని అనుభూతిగా పెదవులపై చిరునవ్వును పూయిస్తుంది.ఇంతకంటే ఏం కావాలి చెప్పండి.

బుజ్జి కన్నమ్మలు – ప్రేమ పావురాలు
****
పిల్లలు ఎప్పుడూ పెద్ద మనసున్న దైవ రూపాలు. కొట్టినా,కసిరించినా వెంటనే మర్చిపోయి పిలవగానే దగ్గరకు వచ్చే ప్రేమ పావురాలు. ఆకాశమంత అనురాగం పంచే అమ్మలు.బడిలో ఎంత ఆటపాటలు,చదువుల్లో మునిగినా ఇంటి బాధ్యతలు మరువని నాన్నలు.
ఓ ఇద్దరు బుజ్జి కన్నమ్మల వ్యథ.చెప్పినా తీరదు వారి కన్నీటి గాథ. వాళ్ళిద్దరూ చిన్నప్పుడే అమ్మను కోల్పోయిన అనాధలు. వాళ్ళ నాన్న ఎప్పుడూ తాగుతూ ఆ మైకంలోనే ఉండేవాడు. ముసలి నాయినమ్మ వాళ్ళ బాధ్యతను తీసుకుంది. మిగతా కొడుకులు కోడళ్ళు ఆమెను ఏమన్నా పట్టించుకోకుండా తన సంరక్షణలో పెంచసాగింది.
వాళ్ళిద్దర్లో చిన్న బుజ్జి కన్నమ్మ రోజూ ఎంతో ఇష్టంగా నా చుట్టే తిరిగేది. ఎందుకో ఏమో నాకు అంతుపట్టలేదు. మొదట్లో అస్సలు అర్థం కాలేదు.
రోజూ ఓ గులాబి పువ్వు తెచ్చి ఇచ్చేది. నలుగురం మహిళా ఉపాధ్యాయులం ఉన్న ఆ బడిలో నాకే ఎందుకు తెచ్చి ఇస్తుందో తెలియలేదు. రోజూ నేను ఎప్పుడెప్పుడు వస్తానా అని ఎదురు చూసేది. ఇతర టీచర్లు చూస్తారని కాబోలు గౌను చాటున దాచిపెట్టేది. అది గమనించిన నేను ఓ రోజు “ఎందుకురా బంగారూ ! ఎవరికీ ఇవ్వకుండా దాచి దాచి నాకే ఇస్తున్నావు? ” అడిగాను.
అంతే ” నువ్వు…నువ్వూ అంటూ ఆగిపోయింది. ఆసక్తిగా ” నేనూ.. నేనూ ఏమిటో చెప్పుతల్లీ!” అన్నాను తనను అనుకరిస్తూ..
“నువ్వు అచ్చం మా అమ్మ లెక్క ఉంటావు టీచర్! అంది. ఆ మాటలకు నా కళ్ళలో గిర్రున నీళ్ళు తిరిగాయి. అందుకా రోజూ నా చుట్టూ తిరుగుతూ ఉంది ” అనుకున్నా.దగ్గరకు తీసుకోగానే నన్ను హత్తుకుపోయింది.
అలా రోజూ బడికి రాగానే ఆ బుజ్జి కన్నమ్మ కోసం నా చూపులు వెతుక్కునేవి.
కొద్ది రోజులు ఆ ఇద్దరక్కచెల్లెళ్ళు బడికి రాలేదు. నా మనసులో ఒకటే ఆరాటం ఏమై ఉంటుంది ఎందుకని రాలేదని. కారణం తెలుసుకుంటే వాళ్ళ నాయినమ్మకు తీవ్ర అనారోగ్యం.చేసేవారు ఎవ్వరూ లేరు. అందుకే పెద్ద బుజ్జి కన్నమ్మ కూలికి పోతే చిన్న బుజ్జి కన్నమ్మ నాయినమ్మ సేవకోసం ఇంట్లోనే ఉండి పోయింది.
చాలా రోజుల తర్వాత వాళ్ళ నాయినమ్మ కోలుకుందని తెలిసి పిలిపించాం.
“వాళ్ళిద్దర్నీ ఏదైన హాస్టల్లో చేర్పిస్తే బాగుంటుంది” అని సలహా ఇస్తే ఆమె అన్న మాటలు మమ్మల్ని ఆలోచనల్లో పడేశాయి.
“అసలే ఆడపిల్లలు.అక్కడ ఎలా వుంటుందో.రోజులేం బాగా లేవు.ఇప్పటికే రకరకాల వార్తలు వింటున్నాం.చూస్తున్నాం. అందుకే భయంగా వుందమ్మా!” అన్న మాటలకు మా వద్ద సమాధానం లేదు.
నిజమే నేటి దుష్ట దుర్మార్గ సమాజంలో బుజ్జి కన్నమ్మలను ఎలా కాపాడుకోవాలో.ఎదిగే ఆ పసి కూనలకు ఏ రెక్కలు అడ్డుపెట్టాలో … ఇవన్నీ తలచుకుంటుంటే మనసులో తీవ్రమైన ఒత్తిడి, భయాందోళనలు కలుగుతుంటాయి.

Written by Urimalla Sunanda

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

క్విజ్ పోటీ

నాగేశ్వర జ్యోతిర్లింగం