కొత్త లోకాలు (కాలమ్ 3)

“అమ్మ” అనే పదానికి అర్థం మారిపోయిందా?

 ముంజేటి స్పందన గారికి అక్షర నివాళి

విజయనగరం జిల్లా డోలపేటలో ఈ ఏడాది మే 4న జరిగిన ఘటన విన్నాక, కలం వణుకుతోంది. 16 ఏళ్లు కూడా నిండని కన్న కొడుకు చేతిలో ఓ తల్లి ప్రాణాలు కోల్పోయింది. కారణం? “బుద్ధిగా చదువుకో” అని మందలించడం.

“చదువుకో” అనే రెండు అక్షరాలు ఇప్పుడు నేరం అయిపోయాయా? 9 నెలలు కడుపులో మోసి, రాత్రింబవళ్ళు కంటికి రెప్పలా కాపాడి, “నా కొడుకు బాగుపడాలి” అని కలలు కన్న తల్లి… చివరికి కొడుకు చేతిలోనే…
ఇక్కడ తప్పు ఒక్కరిది కాదు మనందరిదీ. ముఖ్యంగా మనం కోల్పోయిన రెండు విషయాలు ఉన్నాయి.

మన స్కూళ్లు “మోరల్ సైన్స్” మర్చిపోయాయి. మా రోజుల్లో,( నేను 76 ఏళ్ళ దాన్ని) మాకు స్కూల్లో ఒక పీరియడ్ ఉండేది – “మోరల్ సైన్స్”. రాముడు మంచివాడు, రావణుడు చెడ్డవాడు, తల్లిదండ్రులను గౌరవించాలి, అబద్ధం ఆడకూడదు అని చెప్పేవారు. *ఇవాళ మార్కులు, ర్యాంకులు, IIT, NEET తప్ప “మనిషి ఎలా బతకాలి” అని ఏ స్కూలూ నేర్పట్లేదు. పుస్తకాల్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉన్నాయి కానీ, గుండెలో “విలువలు” నింపే పాఠం లేదు. ఫలితం? 16 ఏళ్ల పిల్లాడికి కత్తి పట్టుకోవడం హీరోయిజం అయిపోయింది, కానీ అమ్మ మాట వినడం చులకన అయిపోయింది.

అలాగే మన ఇళ్లలో “జాయింట్ ఫ్యామిలీ” కూలిపోయింది. ఒకప్పుడు ఇంట్లో తాత, నానమ్మ, అత్త, మామ ఉండేవారు. పిల్లాడు తప్పు చేస్తే నానమ్మ కథ చెప్పి దారిలో పెట్టేది. తాతయ్య భయం ఉండేది. ఇప్పుడు అమ్మ-నాన్న-పిల్లాడు, అది కూడా ఇద్దరూ ఉద్యోగాలు, పిల్లాడు ఫోన్. పెద్దవాళ్ల మాట, వాళ్ల అనుభవం, వాళ్ల ప్రేమ పిల్లలకు దొరకట్లేదు. ఇంట్లో “తప్పు” అని గట్టిగా చెప్పే పెద్ద దిక్కు లేకపోతే, యూట్యూబ్‌లో రౌడీనే వాడికి దిక్కు అవుతాడు. స్పందన గారు ఒంటరిగా పోరాడి ఓడిపోయారు.

ఒకప్పుడు “మాతృదేవోభవ” అన్నాం. ఇప్పుడు “చదువుకోమన్న తల్లిని చంపేయ్” అనే స్థాయికి దిగజారామా?

పరిష్కారం ఉరిశిక్ష కాదు, ఒక్క అరెస్ట్ కాదు.

పరిష్కారం మనం కోల్పోయిన వాటిని తిరిగి తెచ్చుకోవడంలో ఉంది. స్కూళ్లలో మళ్ళీ “మనిషి పాఠాలు” మొదలవ్వాలి. మార్కులతో పాటు విలువలు నేర్పాలి. వారానికి ఒక్క పీరియడైనా “తల్లిదండ్రులు ఎందుకు గొప్ప” అని చెప్పాలి. ఇళ్లలో మళ్ళీ “మాట్లాడుకోవడం” మొదలవ్వాలి. జాయింట్ ఫ్యామిలీ లేకపోయినా, రోజూ 20 నిమిషాలు ఫోన్ పక్కన పెట్టి పిల్లలతో కూర్చోండి. మీ చిన్నప్పటి కథలు చెప్పండి. “మా నానమ్మ ఇలా చెప్పేది” అని గుర్తుచేయండి.

16 ఏళ్ల ఆ పిల్లాడు జైలుకి వెళ్తాడు. కానీ స్పందన గారి ప్రాణం తిరిగిరాదు. ఆమె చివరి క్షణంలో కొడుకు కళ్లలో కసాయి తనం చూసి ఎంత కుమిలిపోయి ఉంటుందో…

ఈ ఆర్టికల్ చదివిన ప్రతి తల్లిదండ్రులకి నా విన్నపం: మీ పిల్లాడు “సుహానా సఫర్” పాడుకునే వయసులో “మాఫియా” కలలు కనకుండా చూడండి. వాడికి మోరల్ సైన్స్ మీరే నేర్పండి, జాయింట్ ఫ్యామిలీ ప్రేమ మీరే పంచండి.

సమాజం ఎటు పోతోంది అని అడగడం కాదు. మనం ఎటు తీసుకెళ్తున్నాం అని ఆలోచించాలి.

ముంజేటి స్పందన గారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ… ????

Written by Madhavapeddi Usha

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

నాగేశ్వర జ్యోతిర్లింగం

​Where We Bloom