బాలసదనంకు వెళ్లి ఒక రెండు గంటలు అక్కడ పిల్లలందరినీ చూసి మళ్ళీ ఇంటికి బయలుదేరింది సౌదామిని.
నీలాంబరికి జ్వరం కొంచెం తగ్గడంతో మెల్లిగా లేచి వెళ్లి స్నానం చేసి తనకు ఇష్టమైన వైట్ బెంగాలీ కాటన్ సారీ మీద రంగురంగుల పువ్వులు ఉన్న చీర కట్టుకొని తలదువ్వుకొని కొప్పు వేసుకొని ఎప్పటిలా కుంకుమ బొట్టు పెట్టుకొని దేవుడి దగ్గరికి వెళ్లి దీపారాధన చేసుకొని మధ్య వాకిలిలో మహేశ్వరితో కుర్చీ వేయించుకొని కూర్చుంది.
” మహీ! లైట్ గా కాఫీ పౌడర్ వేసి కాఫీ తీసుకొని రా” అని చెప్పింది.
అప్పుడే బయటకు వచ్చిన అలేఖ్య నీలాంబరిని చూసి..
” అమ్మా! మూడు రోజుల నుండి అంత జ్వరం వచ్చింది నీకు ..అప్పుడే స్నానం చేసి చల్లగాలిలో వచ్చి కూర్చున్నావా !కొంచెం తగ్గినా కూడా పడుకోలేవు కదా నువ్వు.. లోపలికి వచ్చి కూర్చో మ్మా!” అన్నది.
” కాసేపు కూర్చుని వస్తాలే మూడు రోజుల నుండి లోపల కూర్చుని విసుగు వస్తుంది ఈ కొంచెం సేపటికి ఏం కాదులే తల్లీ!” అన్నది నీలాంబరి.
” అయినా చెప్తే వింటావా నువ్వు అసలు నీకు జ్వరం ఎందుకు తగ్గిందో తెలుసా సౌదామినినీ చూడగానే నీ జ్వరం తట్ట బుట్ట సర్దుకుని వెళ్ళిపోయింది.. అంతే కదా నిజం చెప్పు తమ్ముడు పెళ్లి గురించి బెంగ పెట్టుకున్నావా” అన్నది అలేఖ్య.
” అంత బెంగెం పెట్టుకోలేదు కానీ కొంచెం దిగులుగా మాత్రం ఉంది.. ఆ మాత్రానికే జ్వరం వచ్చిందని నేను అనుకోను మొన్న రాత్రంతా తోటలో తిరిగాను దోమలు కుట్టాయేమో ఆరోజు అసలు నిద్ర పట్టలేదు.. సౌదామిని గురించి ఆలోచిస్తూనే ఉన్నాను సాగర్ కు ఈ విషయాలు ఎక్కువగా తెలియకుండా జాగ్రత్త పడుతున్నాము వాడికి తెలిస్తే వాడెంత బాధపడతాడో! అన్నది నీలాంబరి.
ఇంతలో అక్కడికి వచ్చిన సౌదామిని..
” అత్తయ్యా! అప్పుడే జ్వరం తగ్గిపోయిందా బయట కూర్చున్నారు” అని అడిగింది లోపలికి వస్తూ..
” నువ్వు వచ్చావు కదా! అమ్మకి మొత్తం జ్వరం తగ్గిపోయింది ఏం మంత్రం వేసావు సౌదామినీ!” అన్నది నవ్వుతూ అలేఖ్య.
” అవునా మీ జ్వరం తగ్గడానికి క్రెడిట్ అంతా నాదేనా! డాక్టర్స్ ఇచ్చిన మందుల సంగతేం లేదా” అన్నది నవ్వుతూ సౌదామిని.
” దాని మాటలుకేం లేమ్మా! కొంచెం తేలిగ్గానే ఉంది అందుకే బయట వచ్చి కూర్చున్నాను మధ్యాహ్నం నీతో ఏమీ మాట్లాడలేదు నేను.. ఇంట్లో ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా “అని అడిగింది నీలాంబరి.
” అందరూ బాగున్నారు మీతో ముఖ్యమైన విషయం మాట్లాడదామని వచ్చాను కానీ మీరు జ్వరంతో ఉన్నారు” అన్నది సౌదామిని.
” ముందు లోపలికి వెళ్లి ఫ్రెష్ అయ్యి రా! మహితో నీకు కూడా కాఫీ పంపిస్తాను అప్పుడు తీరికగా మాట్లాడుకుందాం” అన్నది అలేఖ్య.
” సరే! వదినా!” అని లోపలికి వెళ్ళిపోయింది సౌదామిని.
పది నిమిషాల తర్వాత సౌదామిని బయటకు వచ్చి నీలాంబరి పక్కనున్న కుర్చీలో కూర్చుంది అప్పటికే అలేఖ్య వచ్చి కూర్చుని ఉంది.
” ఇప్పుడు చెప్పు ఏంటా ముఖ్యమైన విషయం” అన్నది నీలాంబరి.
ఇంతలో మహేశ్వరి అందరికీ కాఫీలు తెచ్చి పెట్టింది.
కాఫీ కప్పు చేతిలోకి తీసుకొని తాగుతూ సౌదామిని అక్కడ జరిగిన విషయం అంతా క్లుప్తంగా చెప్పింది.
సాగర్ విషయం ఇంట్లో తల్లితో చెప్పినట్లు.. ఆమె ఒప్పుకున్నట్లు సంకేతం ఇవ్వడం అవి కూడా నీలాంబరికీ చెప్పింది.
ఒక్కసారి నీలాంబరి మొహం సంతోషంతో వెలిగిపోయింది..కుర్చీలో నుండి లేచి సౌదామినినీ గట్టిగా హత్తుకుంది.. అలాగే అలేఖ్య బుగ్గపై ముద్దు పెట్టింది.
” నాకు తెలుసు అంతా సవ్యంగా జరుగుతుందని” ఉద్వేగంగా అన్నది నీలాంబరి.
అలేఖ్య కూడా సంతోషంతో..” కంగ్రాట్యులేషన్స్ సౌదామిని” అన్నది.
” ఇంకా నాన్న ఒప్పుకోవాలి వదినా! నాన్న ఏమంటారో ఏమో” అన్నది సౌదామిని.
” నో నెగటివ్ థాట్స్ అందరూ ఒప్పుకుంటారు మీ పెళ్లి త్వరలోనే జరుగుతుంది” అని చెప్పింది అలేఖ్య.
ముగ్గురు ఇంట్లోకి వెళ్లిపోయారు. ఆరోజు రాత్రి సాగర్ కి ఫోన్ చేసి జరిగిన విషయం అంతా చెప్పింది సౌదామిని. సాగర్ కూడా జరిగింది విని సంతోషపడ్డాడు.
” సౌ! చెప్పాను కదా మనం పాజిటివ్ గా ఆలోచిస్తే అంతా బాగుంటుంది.. ఇక్కడ నా పనులు కూడా చక్కగా సాగుతున్నాయి నా ప్రపోజల్ కూడా యాక్సెప్ట్ అవుతుందని అనిపిస్తుంది… కాకపోతే అక్కడ నేను ఏ ప్లేస్ లో జాబ్ సెలెక్ట్ చేసుకోవాలో అర్థం కావడం లేదు ..లేదా నేనే ఓన్ గా చేసుకోవాలా ఇవన్నీ ఆలోచిస్తున్నాను” అన్నాడు సాగర్.
” తొందరపడకుండా నిదానంగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకో… పెళ్లికి ఇప్పుడే అంత తొందరేం లేదు అంతా సెటిల్ అయిన తర్వాత చేసుకుందాము ..ఈ టెన్షన్స్ మధ్య చేసుకున్నా కూడా సంతోషం ఉండదు” అని చెప్పింది సౌదామిని.
” నువ్వు అన్నది కూడా నిజమే అందుకే ఆచితూచి అడుగులు వేస్తున్నాను” అన్నాడు సాగర్.
” నీకు ఇది ఆఫీస్ టైమింగ్స్ కదా మరి నీ పని చేసుకో.. నేను కూడా ప్రయాణం చేసి అలసిపోయాను భోజనం చేసి పడుకుంటాను.. నేను వచ్చేవరకు అత్తయ్య జ్వరంగా ఉండింది కానీ సాయంత్రం వరకు నార్మల్ అయింది” అని చెప్పింది సౌదామిని.
” అయ్యో అమ్మకు జ్వరమా నాకు చెప్పనే లేదే అమ్మతో మాట్లాడనా” అన్నాడు సాగర్.
” వద్దు ఇప్పుడు నార్మల్గానే ఉన్నారు పడుకోవడానికి లోపలికి వెళ్లారు రేపు మాట్లాడవచ్చు లే” అన్నది సౌదామిని.
” సౌందర్యలహరిని కూడా ఈ మధ్య వీడియో కాల్ లో చూడలేదు ఎప్పుడు నేను ఫోన్ చేసినా పడుకునే ఉంటుంది అది మెలకువగా ఉన్నప్పుడు నాకు కాల్ చేస్తావా” అన్నాడు సాగర్.
” సరే రేపు చేస్తాను” అని చెప్పి ఫోన్ పెట్టేసింది సౌదామిని.
మరో 10 రోజులు గడిచిపోయాయి అలేఖ్య సుధీర్ సౌందర్యలహరి అమెరికాకు వెళ్లిపోయారు. నీలాంబరి మరియు భూపతి పాపను వదిలి ఉండలేక ఏడ్చారు… నీలాంబరి కైతే మనసంతా బాధతో నిండిపోయింది. చిన్నపిల్లలను వదిలి ఉండడం కష్టమే అనుకొని క్షణక్షణం సౌందర్యలహరిని గుర్తు చేసుకో సాగింది. ఇంట్లో చలనం లేకుండా ఉన్న బొమ్మలను చూసి పిల్లల లేకుంటే ఇల్లంతా స్తబ్దుగా అయిపోయింది ఎంతమంది ఉన్నా పసిపాపలు ఉంటే ఆ ఇంటి సందడే వేరు ఇలా ఆలోచిస్తూ సౌందర్యలహరిని గుర్తు చేసుకో సాగింది నీలాంబరి.
వీలైనంతవరకు సౌదామిని నీలాంబరి దగ్గరే కూర్చుంటుంది పడుకోవడం కూడా నీలాంబరి గదిలోనే పడుతుంది.. ఎందుకంటే ఈమధ్య భూపతి గారు ఏవో పనుల మీద పట్టణం కు వెళ్ళిపోతున్నారు.
ఇంకా ఉంది