ఉగాది

1..ఉత్పలమాల
స్వాగతమిత్తువిశ్వవసు సాదర స్నేహపు స్వాంతనంబుతో
భాగము నందరిన్ కలిపి భాసుర మొప్పగ నుత్సవంబునన్
భోగము చిందగన్ విరిసె భూతల శోభలు మిన్ను తాకగన్
రాగము కోయిలల్ పలుకు రమ్యత నామని కాలమందు నన్!

2.ఉత్పలమాల
ఆమని రాగమై కులుకు నానవ కన్యక చూడముచ్చటన్
తామస మంతయున్ తొలగి ధారుణి నిండెను రంగవల్లి తో
గోముగ నిల్చెనే ప్రియుడి కోసము కొమ్మల కోకిలమ్మగన్
కోమల మాధురీ రసము గ్రోలుతు మత్తుగ చిందులేయుచున్!
3.
ఉత్పలమాల
నూతన వర్షమై కదులు నూహల నాశలు తేజమొందగన్
పోతగ పోసెనాశయము పూర్ణిత లక్ష్యము కార్యశీలతన్
జాతికి జాగృతిం గలుగ చైత్రపు కౌముది స్వాంతమీయగన్
ఖ్యాతిని పొందగోరనిల గాథలు కృత్యపు క్రాంతిరేఖలై !

4..ఉత్పలమాల
కోయిల పాటలన్ వినగ కొత్తదనమ్ములు హృద్యమొప్పగన్
హాయిగ జావళీల పద హాస్యపు జల్లుల మేళవింపుతో
మాయల మర్మముల్ విడిచి మంజుల భాషణ మోదమీయగన్
రాయల కాలమందలి సరాగము రాజ్యము నేలగా వలెన్!
5.
ఉత్పలమాల
అర్పణ జేసితిన్ కృతిని నచ్యుత మూర్తికి వందనమ్ముతో
నేర్పుగ భాసిలెన్ ఘనపునెయ్యము నాకస వీధులందునన్
దర్పము లేకయున్ నిలుచు తారల వెల్గులు కైతలందునన్
కర్పుర స్వచ్ఛతల్ విరియు కాంతులు చంద్రుని మోవిపైగనన
6.కందము
తీపి పులుపు చేదు వగరు
తాపినకారపు మిరియము తగినంతుప్పున్
జ్ఞాపికగా షడ్రుచులే
నోపికతోజీవితములనొద్దిక జేయున్!
7.కందము
పంచాంగశ్రవణమ్ములు
వంచన లనురూపుమాపి బ్రతుకున వెలుగుల్
పంచగ మమతలు విరియును
సంచిత పుణ్యము యిహమునసాఫల్యమగున్!

Written by Devaraju Revathi

దేవరాజు రేవతి తండ్రి దేవరాజు సాంబమూర్తి తల్లి శ్యామల 27-10-1972 ఎం.ఏ.బి.ఎడ్ తెలుగు భాషోపాధ్యాయురాలు. జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల ఆసిఫాబాద్. వచనకవిత్వం 2014 నుండి యాభై పైగా కవితలు ఆజాదీ అమృతోత్సవాల్లో సెప్టెంబర్ మూడవ తేదీ 2022 రవీంద్రభారతిలో సన్మానం మల్లినాథ సూరి కళాపీఠం వారి ఆధ్వర్యంలో జాతీయ స్థాయిలో ఉత్తమ కవయిత్రి మరియు ఉత్తమ ఉపాధ్యాయరాలిగా అవార్డు తీసుకోవడం. ముద్రిత రచన:-సుముఖుని శతకం అముద్రిత రచనలు :- హరివిల్లు పద్య ఖండిక, పద్యాలతో రణం హితవరీ పద్యశతకం108 పద్యాలు *కంద మందారాలు108 500 వందలకు పైగా పద్యాలు *వాసరాంబకు నీరాజనం108 పద్యాలు పద్య పూరణలు 110 మారేపల్లి‌ పట్వర్ధన్ గారి అష్టావధానం లో పృచ్ఛకురాలిగా, *త్రిభాషా సహస్రావధాని బ్రహ్మశ్రీ వద్ధిపర్తి పద్మాకర్గారి శతావధానం, *శ్రీ మాడుగుల నారాయణ మూర్తి గారి రెండు అష్టావధానాల్లో *పృచ్ఛకురాలిగా భాగస్వామ్యం భరత్ శర్మ గారి శతావధానం లో పృచ్ఛకురాలిగా భాగస్వామ్యం *ఆధునిక ఆంధ్ర మహాభాగవతం వ్యాసరచన లో భాగస్వామ్యం *సినారే కవిత్వం మరియు పది పుస్తకాలలో పదేసి పద్యాలు వ్రాయడం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ఇద్దరూ సమానమే

ఎప్పుడూ .. విమర్శే నా!