పని – మనీ – షి

కథ

“విక్రాంత్! ఈరోజు నేను ఆఫీస్కు తొందరగా వెళ్ళాలి. లేట్ నైట్ మెసేజ్ పెట్టారు. పొద్దున్నే చూసుకున్నాను. వెళ్తున్నాను వంటయితే ఏం చేయలేదు. ఏదైనా చేసుకొని తిను”అని భర్త విక్రమ్ కి చెప్పి వెళ్ళిపోయింది సింధూర.

విక్రాంత్ పనిచేసేది యూఎస్ బెస్డ్ కంపెనీ. అందుకనే ఎక్కువగా ఆఫీస్ కాల్స్ నైట్ ఉంటాయి. ఆలస్యంగా లేచి, సింధూర చేసిన బ్రేక్ ఫాస్ట్ కి తిని, సాయంత్రం వంట కోసం అన్ని సిద్ధం చేసి పెడతాడు. ఇద్దరూ ఎక్కువగా వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తారు. వారంలో రెండు సార్లు ఆఫీసుకు వెళ్తారు.

పనులన్నీ షేర్ చేసుకుని, ఇటు ఆఫీసు పనిని, ఇటు ఫ్యామిలీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పుడే పిల్లలు వద్దనుకొని ఇద్దరు ఎవరి ఆఫీస్ పనుల్లో వాళ్ళు నిమగ్నమయ్యారు.

ఆలస్యంగా లేచిన విక్రాంత్ బయటకు వచ్చాడు. ఇల్లంతా చిందర వందరగా ఉంది. అసలు శుభ్రం చేసినట్లే లేదు. వస్తువులన్నీ వంకర టింకరగా పడి ఉన్నాయి.

“ఇదేంటి ?నేను లేచే వరకు ఇల్లంతా అద్దం లాగా ఉండేది. ఈరోజు హెల్పర్ రాలేదా ఏంటి”? అని అనుకున్నాడు.

స్నానం చేసి బ్రేక్ఫాస్ట్ చేసుకోవడానికి ఓపిక లేక, స్విగ్గిలో ఆర్డర్ పెట్టుకుని తిని, సాయంత్రం వంట కోసం కూరగాయలు కట్ చేసి పెట్టి, గోధుమపిండి కలిపి తోచినంత వరకు ఇల్లు సర్దేసి, మళ్లీ ఆఫీస్ పనిలో పడిపోయాడు.

ఇంతలో సింధూర ఫోన్ చేసింది.

“విక్రాంత్! బ్రేక్ఫాస్ట్ ఏమైనా తిన్నావా? లంచ్ సంగతేంటి? నేను ఈరోజు ఆఫీస్ లోనే ఫ్రైడ్ రైస్ తిన్నాను”అన్నది.

“బ్రేక్ ఫాస్ట్ ఆర్డర్ పెట్టుకున్నాను. లేటుగా తిన్నాను. లంచ్ సంగతి చూద్దాంలే! నువ్వు వచ్చాక చపాతీ ,కర్రీ చేస్తావు కదా! అదే తింటాను. సరే గానీ ఈరోజు హెల్పర్ రాలేదా”?అని అడిగాడు.

“నేను తొందరగా వచ్చేస్తానులే! హెల్పర్ వచ్చింది. గిన్నెలు కడిగినవి లేవా”? అని అడిగింది.

విక్రాంత్ ఏదో చెప్పబోయే అంతలో నాకు అర్జెంట్ కాల్ ఉంది విక్రాంత్! ఇంటికి వచ్చాక మాట్లాడుతాను” అని సింధూర ఫోన్ కట్ చేసింది.

సాయంత్రం కొంచెం తొందరగానే ఇంటికి వచ్చింది. రావడంతోనే స్నానం చేసి, నైట్ డ్రెస్ వేసుకొని కాసేపు పడుకుంది. కాసేపటికి విక్రమ్ టీ చేసి ఇచ్చాడు.

విక్రాంత్ కి కూడా కొంచెం ఖాళీ ఉండటం వల్ల ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటున్నారు.

“పొద్దున అడిగినదానికి సరిగా జవాబే చెప్పలేదు. హెల్పర్ రాలేదా? ఇల్లంతా అ లా ఉంది? ఏదో నాకు చేతనైనంత సర్దాను” అన్నాడు.

“నువ్వు లేట్ లైట్ పడుకుని, లేటుగా లేస్తావు. కాబట్టి మన హెల్పర్ సంగతి నీకు తెలియదు. నువ్వు లేచేసరికి ఇల్లు రోజు అద్దంలాగా ఉంటుంది. నీకు హెల్పర్ గురించి ఎలా తెలుస్తుంది”? అన్నది సింధూర.

“విషయం అర్థమయ్యేటట్లు చెప్పు. సీరియల్ లో నెక్స్ట్ ఎపిసోడ్ కి ముందు ఏం జరుగుతుందో ప్రోమో ఇచ్చినట్లు అలా చెప్తావేంటి?”అన్నాడు.

“ఓహో! రోజంతా సీరియల్స్ చూస్తున్నావా ఏంటి”?అన్నది సింధూర నవ్వుతూ.

“విషయం చెప్పు తల్లీ”అన్నాడు చిరాగ్గా విక్రాంత్.

“నేను చెప్పడం కన్నా నువ్వు చూస్తే నే బాగుంటుంది. నేను బ్యాక్ గ్రౌండ్ వాయిస్ ఇస్తాను. నువ్వు ఊహించుకుని అలా ఆకాశం కేసి చూడు”అన్నది సింధూర గమ్మత్తుగా!

“విజువల్ ఎఫెక్ట్స్ ఆ?”అని పైకి చూస్తూ..

“ఇక చెప్పేసెయ్ , ఇంకా నాన్చకు”అన్నాడు.

“పొద్దున ఐదు గంటలకు మన హెల్పర్ వస్తుంది. ముందుగా చీపురు పట్టుకొని ,ఇల్లు ఊడ్చి, తుడిచి , గిన్నెలన్నీ కడిగేస్తుంది. అవన్నీ చేసుకొని తను వెళ్ళిపోతుంది”అంటూ కొంచెం ఆగింది సింధూర.

“మరి ఇంకేంటి? పని చేసుకుని వెళ్ళింది కదా! ఈ ఆకాశం కేసి చూడటమేంటి?నీ‘ఆకాశ సీతమ్మ‘ గొంతు ఏంటి”అన్నాడు విక్రమ్.

“ఆగు, నాయనా! కాస్త స్థిమితంగా విను. నీకే బోధపడుతుంది. రోజూ ఆమె వెళ్ళాక నేను లేచి బయటకు వస్తాను.

ముందుగా ఏం చేస్తానో తెలుసా? ఆమె ఫుల్ స్పీడ్ తో వేసిన ఫ్యాన్లను ఆపేసి ,లైట్లు స్విచ్ ఆఫ్ చేసి హాలు కేసి ఒకసారి చూస్తాను. వంకర టింకర్ గా పడేసిన డోర్ మేట్లను చక్కగా చేస్తాను.

డైనింగ్ టేబుల్ కుర్చీలను అంత దూరం విసిరి, లాగేసి పెడితే, వాటిని మళ్లీ యధా స్థానంలో ఉంచుతాను. ఇక టేబుల్ మీద ఉన్న టేబుల్ మ్యాట్స్ తూర్పు పడమరలే కాక అష్టదిక్పాలకులను దర్శనం చేసుకుంటుంటాయి. వాటిని మళ్లీ యధా స్థానంలో ఉంచేస్తాను.

సామాన్ల ను జరిపి ఇల్లు ఊడుస్తుంది కదా! వాటిని అక్కడే వదిలేసి పెడితే వాటిని వాటి ఇళ్లల్లోకి చేర్చి పెడతాను.

ఇక వంటింట్లోకి వెళ్తే గిన్నెలు కడిగిన టబ్బు లో నీళ్లు ఉంటాయి .ఆ నీళ్లను పారబోసి, కాస్త ఎండ తగిలే ప్లేస్ లో పెడతాను. సింకులో అప్పుడప్పుడు చెత్తను అలాగే ఉంచేస్తుంది. దాన్ని తీసి డస్ట్ బిన్ లో పడేయాలి. డస్ట్ బిన్ లో కవర్ పెట్టడం చేయకుంటే, వేసి పెడతాను.

బాత్రూం డోర్స్ అన్ని తీసే ఉంటాయి. వాటిని పెట్టేసి లోపలికి వస్తానా? రాగానే… ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి చూస్తే గిన్నె నిండా ఉండాల్సిన పాలు సగం ఉంటాయి.

ఆవిడ చక్కని, చిక్కని కాఫీ చేసుకుని తాగి వెళ్ళిపోతుంది. మళ్ళీ జీతం తక్కువనా? అహ! బాగానే ముట్టాలి.చుట్టాలు వస్తె ఎక్సట్రా. పండగలకు బట్టలు.

మరొక విషయం ….ఆరేసిన బట్టలను మొత్తం సోఫాల నిండా పడేసి వెళితే, వాటిని సర్దే టైం లేక, నేను ఒక బాక్స్ లో పెట్టి కనపడకుండా చేస్తాను.

ఇలా స్థానభ్రంశం అయిన వస్తువులను సర్దుకునే సరికి నాకు రోజూ ఆమె చేసే పని కన్నా ఎక్కువ సమయం పడుతుంది”అన్నది సింధూర.

“మరి ఇంత దానికి ఆమెను పెట్టుకోవడం ఎందుకు? మనమే చేసుకుంటే పోలా”అన్నాడు.

“పోతుంది బాబు! పోతుంది !! నీకేం నువ్వు లేట్ నైట్ మీటింగ్ అని హాయిగా ఆలస్యంగా లేస్తావు. కానీ పొద్దున పొద్దున్నే గిన్నెలు కడిగి, బట్టలు మిషన్లో వేసి, ఇల్లు తుడవడం అంటే పెద్ద పని. కనీసం ఆ మీద మీద పనైనా చేయని, అని పెట్టుకున్నాను. ఒక మనకే కాదు. ఇదే పరిస్థితి అందరికీ.ఏదైనా అంటే మానేస్తారు. వాళ్ళకి గ్రూప్స్ ఉంటాయి. తప్పదు మన ఉద్యోగం కన్నా వాళ్ళదే బెటర్.ఒక ఇంట్లో కాఫీ ,ఒక ఇంట్లో టిఫిన్, ఒక ఇంట్లో భోజనం తినేసి శ్రమని ఖర్చు చేయకుండా, పైపైన పనులు చేసేసి హాయిగా కట్టిన చీర కట్టకుండా కట్టేసి ఇంటికి వెళతారు. మనం ఏదైనా తినడానికి పెడితే , తీసుకోకుండా అలా డస్ట్ బిన్ లో పడేసి వెళ్తారు. మేము వేడి గానే తింటామమ్మా అని చెప్తారు . వెళ్లేటప్పుడు పిల్లలకి రకరకాల తినుబండారాలను కూడా కొనుక్కొని పోతారు. మనమైనా ఖర్చు పెట్టడానికి వెనకాడుతాం. వాళ్లయితే వాళ్లకు నచ్చినది తింటారు. నచ్చిందే చేస్తారు.ఇంత చదువులు చదివి మనమేమో రాత్రి పగలు కష్టపడి, ఇంటి కోసం emi లు కట్టుకొని, పొదుపు చేస్తూ ఉంటాము. అయినా డబ్బుకి ఒక్కొక్కసారి ఇబ్బంది పడుతూనే ఉంటాము.

వాళ్లకి ఈపనులే కాక ఉచిత పథకాలు ఉండనే ఉంటాయి. వాటి ఫలాలను అందుకుంటునే, ఇలా అదనపు పనులు చేసుకుంటున్నారు.

పెళ్లికి, పురుళ్ళకు, చదువులకు అన్నింటికీ పథకాల ద్వారా డబ్బు వస్తూనే ఉంటుంది.రేషన్ బియ్యం ఇటు తీసుకుని అటు అమ్మేస్తారు.బైక్ మీద వస్తారు. వాళ్ళ ఇళ్ళల్లో చిన్న ఫంక్షన్స్ కూడా గ్రాండ్ గా చేస్తారు.

మనం సినిమా చూసి ఎన్ని రోజులయ్యింది?

వాళ్ళు ప్రతీ వారం వెళతారట. మన హెల్పర్ చెప్పింది.

ఆదివారం ముక్కా , చుక్కా ఉండాలట”అంటూ పెద్ద ఉపన్యాసం ఇచ్చింది సింధూర.

“ఇక నేను ఆకాశం వంక చూడలేను. విషయం మొత్తం అర్థమైంది .చుక్కలు కనిపిస్తున్నాయి నాకు. ఓ నాలుగు ఇళ్లల్లో నీకు నాకు పని చూడు, ఇంట్లో వండుకునే బాధైనా తప్పుతుంది” అంటూ లాప్టాప్ ముందేసుకుని కూర్చున్నాడు విక్రాంత్.

డిన్నర్ చేయడం కోసం లోపలికి వెళ్ళింది సింధూర నవ్వుకుంటూ.

Written by Laxmi madan

రచయిత్రి పేరు : లక్ష్మి
వృత్తి గృహిణి
కలం పేరు లక్ష్మి మదన్
భర్త : శ్రీ మదన్ మోహన్ రావు గారు (రిటైర్డ్ jd), ఇద్దరు పిల్లలు .

రచనలు:
350 పద్యాలు రచించారు.
కృష్ణ మైత్రి 108 పద్యాలు
750 కవితలు,100 కథలు,30 పాటలు,30 బాల గేయాలు రాశారు.
108 అష్టావధానాలలో ప్రుచ్చకురాలుగా పాల్గొన్నారు.
మిమిక్రీ చేస్తుంటారు.
సీరియల్ "దొరసాని"
సీరియల్ "జీవన మాధుర్యం"

కవితలు, కథలు పత్రికలలో ప్రచురించ బడ్డాయి..

కథలు చాలావరకు అత్యుత్తమ స్థానంలో నిలిచాయి...

ఇప్పుడు తరుణి అంతర్జాల స్త్రీ ల వారు పత్రికలో కవితలు "దొరసాని"సీరియల్, కథలు,
‘మయూఖ‘అంతర్జాల ద్వైమాసిక పత్రిక కోసం "జీవన మాధుర్యం"అనే సీరియల్ ప్రచురింపబడుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ప్రశంస

ఆర్ట్ గ్యాలరీల నగరం – మైసూరు