శిక్షణ – క్రమశిక్షణ

2025 ఆగస్ట్ తరుణి పత్రిక సంపాదకీయం

ఆకాశంలో పక్షులు మూకుమ్మడిగా ఎగురుతూ ఉంటాయి.  చూస్తే మన కంటికి ఒక గీత అలా వెళ్తున్నట్టు కనిపిస్తుంది. నేల మీద చీమలు ఒకే వరుసలో ప్రయాణిస్తూ ఉంటాయి. ఆశ్చర్యం మన కళ్ళ వంతు అవుతుంది. ప్రకృతి ఎన్ని నేర్పించిన మనుషులు వాళ్ళ బుద్ధికి చైతన్యానికి తగిన ప్రేరణను ఇవ్వరు. బద్ధకం అనే ముసుగులో మగ్గుతారు. కొన్ని అవసరమైన విషయాలను స్పృశిస్తూ శిక్షణ క్రమశిక్షణ జీవితాలకు ఎంత అవసరమో తలుచుకుందాం.

    మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చి డెబ్భై తొమ్మిది ఏళ్ళు. ఎందరో వీరుల త్యాగఫలం. శిక్షణ క్రమశిక్షణ వల్లనే బ్రిటిష్ వాళ్ళను తరిమికొట్టగలిగాం. స్వేచ్ఛా పతాకాన్ని ఎగురవేశాం. ప్రత్యేకమైన యుద్ధ విద్యల శిక్షణ తీసుకోకున్నా ప్రత్యక్షంగా ఇది క్రమశిక్షణ అని చెప్పలేకున్నా క్రమశిక్షణాయుతమైనటువంటి అహింసా పరమైన యుద్ధాన్ని చేసి సాధించుకున్నాం. నాయకులు ఎట్లా నడిపిస్తే అట్లా నడిచి ప్రాణాలకు తెగించి త్యాగాలను చేసి 1947 ఆగస్టు 15 న త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసాం. నాయకులు చెప్పినట్టు నడవడం అంటేనే క్రమశిక్షణకు మరో రూపం అన్నట్టు.

ఇట్లాగే జీవితం అనే యుద్ధంలో కూడా విజయాన్ని సాధించాలంటే క్రమశిక్షణను మించిన ఆయుధం లేదు. క్రమశిక్షణ ఉంటే సహనం వస్తుంది ధైర్యం కలుగుతుంది మంచి పేరును తెచ్చుకుంటారు దానితో అందరి మనసులను గెలుస్తారు. ఇంతకన్నా గెలుపు ఇంకేముంటుంది?

క్రమశిక్షణతో నిత్యజీవితం గడుస్తూ ఉంటే మానసిక ఒత్తిడి శారీరక ఒత్తిడి తగ్గి సహజ సిద్ధంగా ఉన్న సామర్థ్యం ప్రస్ఫుటమవుతుంది. ఇది స్వీయ శిక్షణ వలన సాధించగలుగుతారు. దీనివల్ల స్వల్పకాలికల లక్ష్యాలపై కాదు దీర్ఘకాలిక లక్ష్యాలపై దృష్టిని సారించగలుగుతారు. సమబాహు త్రిభుజం,  షడ్భుజం ఎట్లా పద్ధతిగా ఉంటాయో అటువంటి పద్ధతి అయిన జీవితం అలవడుతుంది.

” క్షమాయుక్తస్య తపో వివర్ధతే ” అంటే ఓర్పు ఉన్న వాళ్లకు తపస్సు పెరుగుతుంది అర్థం.

“తస్మాత్ సర్వేషాం సర్వ కార్య సిద్ధ్భవతి” తపస్సుతో అందరికీ అన్ని

కార్యాలు సిద్ధిస్తాయి అని అర్థం. ఇక్కడ తపస్సు అంటే ముక్కు మూసుకొని కూర్చోవడం కాదు పట్టుదలతో పనిని చేయడం, కార్యాన్ని సాధించుకోవడం అని ఈ శ్లోక పాదాల లో ఉన్న  భావాన్ని ఇట్లా తీసుకోవాలి.

లేచింది మొదలు నిద్రించే వరకు ఊపిరి సలపని పనుల వల్ల ఉక్కిరిబిక్కిరి అయిపోయే వాళ్ళు ఎందరో ఉంటారు దీనికి కారణం డైలీ ప్లాన్ సరిగా లేకపోవడమే అంటే క్రమశిక్షణా రాహిత్యం వల్లనే అనేది స్పష్టం. ఇది పెద్దలకైనా పిల్లలకైనా ఒకటే సూత్రం. పిల్లలు అంటే బడి పిల్లలను లెక్కలోకి తీసుకుంటే, వాళ్ళ శక్తి సామర్థ్యాలు గుర్తించుకోకుండా బడిలో ఇచ్చిన హోంవర్క్ ను ఎప్పటికప్పుడు పూర్తి చేయకుండా కొండ లాగా పెట్టుకుంటారు. ఆ తర్వాత చింతిస్తారు భయపడతారు.‌ ఇంకా అయ్యాక కానీ తల్లిదండ్రులు ఎటువంటి పిల్లల్లోని భయాన్ని పోగొట్టడానికి ప్రయత్నాలు చేస్తుంటారు. దీనికన్నా ముందే హెచ్చరికలు చేస్తూ మంచి అలవాట్లన చేస్తూ ఉంటే ఈ కష్టం ఉండదు.  తల్లిదండ్రులే ఇలా క్రమశిక్షణతో వాళ్ల పనులను చేసుకోవడం అలవాటు ఉన్న వాళ్ళ పిల్లలైతే ఎప్పటి పని అప్పుడే చేసేసుకుంటారు. అప్పుడు ఇంటి పనిని కొండలా భావించుకోరు.

చదువులో శిక్షణ ఇస్తారు గురువులు. ఆ శిక్షణలోనే క్రమశిక్షణ అంతర్లీనంగా ఉంటుంది. సైనికులు తీసుకునే శిక్షణ ఎలా ఉంటుందో తెలియని వాళ్ళు ఎవరున్నారు? అంతటి డిసిప్లిన్ ఉంటే క్షమాగుణం అలవడుతుంది. సొంత విషయాలకెలా ప్రాధాన్యత ఇస్తారో ఇతరులకు సహాయం పడడంలోనూ అంతటి ప్రాధాన్యత ఇచ్చే నేర్పు అలవడుతుంది. మర్యాదగా చెప్పగలుగుతారు, తప్పులు చేయకుండా ఉంటారు. తప్పేదో ఒప్పేదో గ్రహించే తెలివిడి వస్తుంది. దీని వలన విలువలకు ప్రాధాన్యతనిస్తారు. దుర్మార్గమైన పనులు చేయరు, చెడుకు దూరంగా ఉంటారు.

విద్య ను ఎందుకు నిగూఢ గుప్తమంటాం? అంటే విద్య నేర్చుకున్న వాళ్ళు అంటే చదువు నేర్చుకున్న వాళ్ళు తప్పనిసరి  సరైన శిక్షణ లోనే పెరుగుతారు. తరగని జ్ఞాన సంపద ఎంతో విలువైనది అని అర్థం.బోధనలో ఉపాధ్యాయులు అభ్యాసం చేయించడం వలన, వ్యాయామాలు చేయించడం వలన,పాఠ్య బోధనలు చేయడం వలన తప్పకుండా క్రమశిక్షణ అనేది నేర్చుకుంటారు విద్యార్థులు. ఇవన్నీ కూడా శిక్షణా కార్యక్రమంలోని వివిధ ప్రక్రియలు. శ్రద్ధాసక్తులు తో క్రమశిక్షణతో విద్య నేర్చుకున్న వాళ్లకు జీవిత కాలంలో గుప్తనిధి వంటిది గా జ్ఞానమే నిలుస్తుంది.

క్రమశిక్షణ అనేది మనల్నే కాదు  మనచుట్టూ ఉండే ప్రపంచాన్ని కూడా మార్చేస్తుంది. క్రమశిక్షణతో ఉన్న వ్యక్తులు మార్గదర్శకంగా కనిపిస్తారు. దీని వల్ల ఇలాంటి క్రమశిక్షణాపరులను చూసేవాళ్లు కూడా తప్పనిసరి జాగ్రత్తగా ఉంటారు.

చీమలను చూసి క్రమశిక్షణ నేర్చుకో భూమిని చూసి ఓర్పును నేర్చుకో చెట్టును చూసి ఎదుగుదల నేర్చుకో అంటారు. ఇవి జీవిత సత్యాలు.

క్షమాశీలులు ప్రపంచాన్ని జయిస్తారు. ఎన్నో రుజువులు ఉన్నాయి.

క్రమశిక్షణ నేర్పించే వాళ్లకే కాదు నేర్చుకోవాలని ఆసక్తి ఉన్నవాళ్ళకి కూడా  క్రమశిక్షణ ఉండాలి.

Self-pinterest సొంత క్రమశిక్షణలో ధైర్యం ఉంటుంది. నైపుణ్యాలు బయటపడతాయి, ప్రవర్తన మెరుగుపడుతుంది. అందుకే శిక్షణ క్రమశిక్షణల మధ్యన విడదీయరాని సంబంధం ఉంటుంది. Discipline అనేది వ్యాయామం శారీరక సామర్థ్యాన్ని ఎలా పెంచుతుందో, చదువుతూ ఉంటే చదువుతూ ఉంటే జ్ఞాపకశక్తి ఎలా పెరుగుతుందో అలా నిర్దిష్టమైన నైపుణ్యాలను improve చేసి విద్యాభ్యాసంలో, వృత్తిలో ఉత్తమ శ్రేణిలో  నిలుపుతుంది.

క్రమశిక్షణ  లో పెడితే క్రమశిక్షణగా ఉండడం కన్నా స్వీయ క్రమశిక్షణ అనేది అలవడుతుంది. అంటే ఎవ్వరి పర్యవేక్షణ కూడా ఉండాల్సిన అవసరం ఉండదు.

మంచి భవిష్యత్తు ఉండాలి అంటే స్వీయ క్రమశిక్షణ ఉండాలి.  ఇది over stress ను తగ్గిస్తుంది confidence levels పెంచుతుంది. ఇలా శక్తివంతులైన తర్వాత కోచ్  వూ నువ్వే స్టూడెంట్ వి నువ్వే అవుతావు. Participent నువ్వే అవుతావు, Mentor వూ నువ్వే అవుతావు.

వ్యాయామాత్ లభతే స్వాస్థ్యం దీర్ఘాయుష్యం బలం సుఖం !!

ఆరోగ్యం పరమం భాగ్యం స్వాస్థ్యం సర్వార్థ సాధనం! !

వ్యాయామం వల్ల ఆరోగ్యం చేకూరుతుంది దీర్ఘాయుష్షు, బలం, సుఖం కలుగుతాయి. ఆరోగ్యమే మహాభాగ్యం. స్వాస్యం సర్వార్థాలకు సాధనం అన్నారు. Regular exercise gives you good health అన్నారు కదా regular exercise అనేది key to every success అనీ అన్నారు కదా!  ఇలా క్రమశిక్షణతో  ఉంటే, కాంతిమయమైన జీవితాన్ని గడుపుతారు.

ఎప్పటి పనిని అప్పుడే చేసుకుంటూ పోతే అనుకున్నవి సాధిస్తారు. కాల విక్షేపం అంటే Post Ponement చేస్తూ పోతే అన్ని పనులకు విఘ్నాలే  కలుగుతాయి.

లేచింది మొదలు ఐదువేళ్ళు నోట్లోకి ఎలా వెళుతున్నాయి ? అమ్మానాన్నలు ఎంత కష్టపడితే ఇప్పుడు అనుభవిస్తున్న సుఖాలు ఇంత నేవళంగా అందుతున్నాయి అనే ఆలోచన నే ఇప్పటి పిల్లలకు లేకుండా పోతున్నది. ఇది సరైన పద్ధతి కాదు!  చెప్పండి !!  మీ పిల్లలకు మీరు పడుతున్న కష్టం వెనుక ఉన్న ఉద్దేశం ఏమిటి? ఎలా కష్టపడుతున్నారు? ఎంత ప్లాన్ చేస్తున్నారు ? కుటుంబం ఉన్నత దశలో ఉండాలని తీసుకుంటున్న సాధికారిక నిర్ణయాలు ఎలాంటివి ? అనే విషయాలన్నీ పిల్లలతో చర్చించాలి సందర్భం వచ్చినప్పుడల్లా చర్చలకు కూడా తావీయకుండా పిల్లలకు నేర్పించాలి.

మేం కష్టపడ్డాము కనుక మా పిల్లలు కష్టపడకూడదు అనే ఒక సదుద్దేశంతో ఎంతో గారాబంగా అడిగినవన్నీ ఇస్తూ పెంచుతున్న ఇప్పటి జీవన విధానాన్ని చూస్తే ఒక్కోసారి ఆశ్చర్యం వేస్తుంది. ఇవేమీ తెలియకపోవడమే పిల్లలు క్రమశిక్షణకు దూరమవుతున్నారు అనే అభిప్రాయమే సర్వత్రా ప్రకటితమవుతున్నది.

ముఖ్యంగా నిత్య కార్యక్రమాలు రోజువారి పనులు పిల్లలతో చేయించాలి. వాళ్ల చదువులతో పాటు ఇల్లు శుభ్రంగా పెట్టుకోవడం, వాళ్ళ బట్టలను మడతపెట్టి లోపల పెట్టుకోవడం వంటివి నేర్పించాలి. విధిగా వాళ్లతోనే చేయించాలి. ఎట్లా చేస్తే వంట రుచికరంగా శుభ్రంగా కంచంలోకి వస్తోంది? కడుపులోకి వస్తోంది? అనేది తెల్పాలి. ముఖ్యంగా తెల్లవారుజామునే నిద్రలేవడం అని అలవాటు చేయాలి. సూర్యోదయం కన్నా ముందు మనం నిద్రలేస్తే శరీరం చాలా చురుకుగా ఉంటుంది బద్ధకం దరిదాపు రాదు రోజంతా స్వచ్ఛంగా హాయిగా గడుస్తుంది సమయపాలనకు అలవాటవుతారు. సమయపాలన మించిన క్రమశిక్షణ ఇంకొకటి లేదు.

పిల్లలు నిద్ర లేవగానే పక్క బట్టలను సర్దుకోవడం వాళ్ళు కప్పుకున్న చెద్దరు, బ్లాంకెట్ మడత పెట్టి పెట్టుకోవడం, దిండు సరిగా పెట్టడం ఇవి తప్పనిసరి నేర్పించాలి. లేచాక ఎక్కువ సమయం తీసుకోకుండా కాలకృత్యాలు తీర్చుకోవడం అలవర్చాలి. స్నానం చేయగానే ఒక్క నిమిషం అయినా భగవంతుడి పటం ముందు నిలబడి ధ్యానం చేయడం, దండం పెట్టుకోవడం అలవాటు చేయాలి. ఇది concentration ను కు తొలి అడుగు అవుతుంది.

భుజిస్తున్నప్పుడు ఎక్కువ మాట్లాడకుండా సరిగ్గా నమలితినే విధానాన్ని నేర్పాలి.తినగానే ప్లేట్ బయట వేసి శుభ్రంగా చేయి కడుక్కోవడం సరిగ్గా చేస్తున్నారా కనిపెట్టాలి. చిన్నచిన్న అవసరాలకు ఇస్తున్న కొద్ది డబ్బులైనాసరే  సరైన మార్గంలో ఖర్చు చేస్తున్నారా పిల్లలు?  అనేది ఒక కనిపించని నిఘా నేత్రంతో గమనించాలి. ఇవన్నీ చిన్న విషయాలు గానే కనిపిస్తాయి, పెరుగుతుంటే వాళ్లే నేర్చుకుంటారులే అని అనుకుంటారు.  కానీ, ఈ అలవాట్లే జీవితంలో మంచి అలవాట్లుగా మారడానికి మొదటి మెట్లు అవుతాయని పెద్దలే గ్రహించకుంటే ఇక పిల్లలే నేర్చుకుంటారు? ప్రేమ గుడ్డిగా వాళ్లకి తీరని నష్టాన్ని కలిగించకూడదు. క్రమశిక్షణ కోసం కఠినంగా ఉండడం వల్ల ప్రేమకు మచ్చ రాదు. మొక్కై వంగనిదే మ్రానై వంగదు అనే పెద్దల మాట నిత్య నూతనమైన మాట. సార్వకాలికమైన మాట.

క్రమశిక్షణ విషయంలో ఆడపిల్లలు మగ పిల్లలు అనే వ్యత్యాసాన్ని చూపించకూడదు. ఎవరైనా జీవితంలో ఎదిగి సుఖపడాల్సిందే. ఈ జీవిత సత్యాన్ని గుడ్డి ప్రేమ మరుగున పరుస్తుంది. అందుకే ముందు తల్లిదండ్రులు నిత్య జీవితంలో క్రమశిక్షణతో  ఉండాలి. అందరం ఇటువంటి మంచి ఆదర్శమైన దిశలో పయనిద్దాం.

_____*****_____

Written by Dr. Kondapalli Neeharini

డా|| కొండపల్లి నీహారిణి, తరుణి సంపాదకురాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

మూడు గిన్నెలతో ముచ్చటైన కాపురం

స్నేహ బంధం