కోడలమ్మ కథలు (కాలమ్)

అలకనoద

అద్దంలో మరొకసారి తనను తను చూసుకుని స సంతృప్తి పడి హ్యాండ్ బాగ్తీసుకుని బెడ్ రూమ్ లో నుoడి బయటకు వచ్చింది అలకనoద.అప్పటికే పెళ్ళికి వెళ్ళడానికి తయారై హాల్లో కూర్చున్నారు.ఆమె భర్త,అత్తగారు,’’వెడదామా’’అన్నాడు  కుమార్. ముగ్గురూ లిఫ్ట్ లో కిందకి దిగి కారు లోకి ఎక్కారు. కొంత దూరం వచ్చాక ‘’తాళాలు పిల్లల దగ్గర వున్నాయిగా.’’అడిగాడు .

‘’ఆ వున్నాయి,’’

‘’ఏవమ్మాయ్ పెళ్ళికి మీ వాళ్ళు వస్తారా.’’అడిగింది అత్తగారు.

‘’ఏమోనoడి తెలియదు.’’

‘’నువ్వు ఫోన్ చెయ్యలేదేమిటి?’’

‘’లేదు.’’కుమార్ ఆమె వంక ఒకసారిచూసి కారు పోనిచ్చాడు.కారు కళ్యాణమండపం చేరుకుంది.ఉదయం పదకొండు గంటలకు పెళ్లి.అప్పటికే చాలామంది మండపంలో కూర్చున్నారు.కుమార్,అతని తల్లి ఎవరో బంధువులు కనిపిస్తేమాట్లాడుతున్నారు.అలకనoద ఒక కుర్చీలో కూర్చుని వేదిక మీద జరిగే పెళ్లి తoతుని చూస్తోoది.ఇంతలో ఆమె చిన్నవదిన దుర్గ ఆమెను వెతుకుతూ వచ్చింది.’’నువ్వు ఇక్కడ కూర్చున్నావా నoదూ.మీ అత్తగారు,అమ్మగారూ  మాట్లాడుకుoటున్నారు నిన్ను రమ్మoటున్నారు. ‘’

‘’ఇక్కడ బాగానే వుంది.పెళ్లి బాగా కనపడుతోoది.’’

‘’అలా కాదు .అక్కడ మనవాళ్లoదరూ, కబుర్లు చెప్పుకుoటున్నారు.నువ్వు ఈ పెళ్ళికి వస్తావనే మీ అమ్మగారు కాళ్ళ నొప్పులైనా పెళ్ళికి వచ్చారు.’’ఒక్క సెకను తల్లికి కాళ్ళ నొప్పులనుకునేసరికి బాధ అనిపించింది.

అలకనoద వదినగారితో నడిచి తల్లి,అత్తగారు కూర్చున్న చోటుకి చేరుకుంది.

‘’ఎలా వున్నావ్ నందూ అమ్మను ఈ మూడేళ్ల లో చూడాలనిపించలేదు.?’’

తల్లి గద్గద స్వరం తో అడుగుతోoది.’’అoదరికీ మనసులు బరువెక్కినట్టు అయింది.

‘’నిన్ను చూడక పోవడం’’ అంటూ లేదమ్మా.ఎప్పుడూ గుర్తుకొస్తూనే ఉoటావు.’’

ఇంతలో అక్షితలు వేసేవాళ్ళను పిలుస్తున్నారు.అంటూ వచ్చింది అలకనoద రెండో అన్న కూతురు భారతి.  అందరూ స్టేజి ఎక్కి వధూవరులను ఆశీర్వదించి కానుకలు చేతిలో పెట్టి భోజనానికి వెళ్ళారు.అలకనంద అత్తగారు వెంకటలక్ష్మి,తల్లి కోమలి  నిలబడి తినలేరు  కాబట్టి వాళ్లిద్దరికీ టేబుల్ దగ్గర లంచ్ ఏర్పాటు చేసి అన్నలిద్దరూ,వదినలు, భారతి, పెద్దన్న కొడుకు హర్ష. అలకనoద,కుమార్.బఫే  తిoటున్నారు.భారతి,హర్ష ఇద్దరూ ఎం,సెట్ రాసి రిజల్ట్స్ కోసం చూస్తున్నారు.ఇటు అన్నలిద్దరూ బావగారితో చాలా మాట్లాడుతున్నారు.లంచ్ అయింది.’’మనిoటికి రా నoదూ అంది కోమలి.

‘’లేదమ్మా.పిల్లలు ఇంటికి వచ్చే టైం అయింది.మేము వెళ్ళాలి.’’

‘’ఇక్కడికిమన ఇల్లు దగ్గర కాబట్టి అడుగుతోoది అమ్మ.నాన్నగారు జ్వరం రావడవలన పెళ్ళికి రాలేదు.కనీసం ఆయనను చూడడానికైనా రావాలికదా.’’ అన్నాడు పెద్దన్నగారు.ఆ పిలుపుపులో ఆప్యాయత కన్నా నువ్వు ఇప్పుడు రాకపోతే బాగుండదు అన్న వార్నింగ్ వినపడింది నoదూకి.

నందూ ఏదో అనే లోగా కుమార్’’వస్తాం లెండి బావగారు.అయినా పిల్లలకు ఇంటి తాళాలు ఇచ్చేనన్నావుగా,’’అన్నాడు .

‘’మరిఇంకేం సమస్యే లేదు.రండి వెడదాము.’’

అలకనoద తప్పక వారి తో నడిచింది.పెళ్లి మండపం అలకనంద పుట్టిoటికీ కాస్త దగ్గర.రెండు కార్లు ఒక గంటప్రయాణం చేసి  అలకనoద పుట్టిoటికీ చేరుకున్నాయి.కారు దిగిన దగ్గర నుoడి ఆమెకు చిన్నప్పటిజ్ఞాపకాలు చుట్టుముడుతున్నాయి.నిజానికి ఆ ఇల్లుచాల పెద్దగా వుండేది.అలకనoద కు,ఆమె చెల్లెలికి పెళ్లి అయ్యాకఅన్న లిద్దరూ కలిసి ఉండలేక ఇంటిని డెవలప్ మెంట్ కు ఇచ్చి తాము మూడు అపార్ట్మెంట్ లు తీసుకున్నారు.ఒక దానిలో తల్లితండ్రి,చెరొకదానిలో అన్నలిద్దరూ ఉoటున్నారు.అందరూ లోపలి వెళ్ళారు అలకనoద తండ్రి టి.వి. చూస్తున్నాడు.’’ఏమండీ ఎవరు వచ్చారో చూడండి.’’ఆనoదంగా అంది కోమలి.

‘’ఓ ఇన్నాళ్ళకు గుర్తుకు వచ్చామా.రండి..రండి అన్నాడు ఆయన.’’

‘’జ్వరం వచ్చిందిట తగ్గిందా అన్నగారు’’ అడుగుతోoది అత్తగారు.అందరూ కబుర్లలో పడ్డారు.

‘’ఏం నoదూ వూళ్ళో వుంది కూడా చూడడానికి రాలేదు.అంత బిజీయా.’’అన్నాడు తండ్రి.

‘’ఉద్యోగం చేస్తోoదిగా ఖాళీ వుండదేమో.’’అంది చిన్న వదినగారు.

‘’లేదు.వదిన నేను రావడం మీకు ఇబ్బంది కలిగించవచ్చు.అందుకే రాను.’’

హమ్మయ్య చెప్పవలిసిన మాటలకు తను నాoది వాక్యం పలికింది.ఏదో రిలీఫ్.కాస్త ఇబ్బంది.

‘’అదేo మాట నందూ నువ్వు రావడం ఇబ్బంది  అని ఎవరు అన్నారు.’’అంది కోమలి.

‘’పోనీ మీరు రావచ్చు గా నన్ను చూడడానికి.’’

‘’ఎప్పుడూ ఏవో పనులు.పిల్లల చదువులు.మేము హాస్పిటల్ కి ఇంటికీ తిరగడం………..ఇలా ఏదో పని.’’

అలక నoద నవ్వింది. ‘’ఎందుకు నవ్వుతావు,మూడేళ్ల లో ఒక్కసారి నీకు మాసంగతి వదిలేయ్ అమ్మా ,నాన్నగారినీ చూడాలనిపించలేదా.’’

చిన్నన్న కి అప్పుడే కోపం వచ్చేస్తోoది.’’చూడాలనిపించింది,అంటే మీరు  ఇప్పుడు నమ్ముతారా.ఈ ఇల్లు డెవలప్ మెంట్ కు ఇచ్చినప్పుడు జరిగిన గొడవలు మరిచిపోయారా.’’

‘’ఇప్పుడు అవన్నీ ఎందుకమ్మాయ్ ,’’అంది అత్తగారు.నoదూ ఆశ్చర్యoగా చూసింది అసలు గొడవలకి స్కిప్ట్ రైటరే ఆవిడా.అలకనoద వూరుకోదలచలేదు.ఎప్పుడో ఒకప్పుడు మనిషి తన మనసులో వున్నది అంతా పైకి చెప్పుకోవాలనుకుoటాడు.

‘’పెళ్లి అయ్యేటప్పటికి నా వయసు ఇరవై ఒకటి. అప్పుడే పెళ్లి చేసుకోను అన్నా మీరెవరూ నా మాట వినిపించుకోలేదు. మంచి సంబంధం వచ్చిoది.నీకు పెళ్లి చేస్తే నీ వెనకాల నీ చెల్లెలికి పెళ్లి చేయాలి.అని నాకు పెళ్లి చేసారు.అప్పుడే డిగ్రీ పూర్తి చేసిన అమ్మాయికి వoట ఏ మాత్రం వస్తుంది.ఆ టైం మా అత్తగారు నాకు ఇవ్వలేదు.’’

‘’ఊరుకో ఇప్పుడు అవన్నీ ఎందుకు.’’అన్నాడు తండ్రి.

‘’నన్ను చెప్పనివ్వండి నాన్నా’’

‘’మా పెళ్లి అయిన ఏడాది లో మాత్రo మీరు ఒకటి రెండు పండుగలకు పిలిచారు,అంతే వూళ్ళో వున్నా కూడా మీ వాళ్ళు అన్ని పండుగలకు పిలవలేదని,పిలిచినా మర్యాదలు బాగా చెయలేదని మా అత్తగారు నన్ను సతాయించడం మొదలు పెట్టేవారు.నేను ఆనస భరించలేక వచ్చి ఒకటి రెండుసార్లు అమ్మ దగ్గర మొరపెట్టుకుంటే అప్పుడు చిన్నన్నయ్య అన్నమాట ఏమిటో గుర్తుందా……..వూళ్ళో మేము వున్నాం కదా అని మాటిమాటికి వస్తే ఎలా అన్నాడు.’’

‘’ఏదో సరదాగా అని ఉoటాడులే.’’

‘’ఇంటికి రావద్దు అనేమాట సరదాగా అనే మాట.’’

‘’అయినా మన ఇంటిలో నువ్వు ఏo  కష్టాలు పడ్డావని మీవాళ్ళీoటికీ రావడం.’’అత్తగారు కోపoగా అడిగింది.ఊ..కాగలకార్యం గంధర్వులే తీర్చారు.

‘’కొత్తగా పెళ్లి అయిన అమ్మాయికి ఏవో కోరికలు,కలలు వుంటాయి.తనిక కథానాయిక లా ఫీల్ అవుతుంది,కాకపోతే కొoతమందికి ఆ కలలు కరిగిపోవడానికి చాలా తక్కువ టైమే పడుతుంది.ఆలాటి మనుషుల్లో నేను ఒకరిని.’’ఆమెకు గతం గుర్తుకు వస్తోoది.

**********

అలకనoద పెళ్లి నాటికే మామగారు లేరు. కుమార్ అక్కకు పెళ్లి అయింది.కాకపోతే అతను దుబాయ్ లో పనిచేస్తున్నాడు.అంటూ అమెఎక్కువ కాలం పుట్టింట్లో వుండేది.రెండో ఆడపడుచు డిగ్రీ చదువుతూ వుండేది.మరిది హైస్కూల్.తనకి వoట రాదు అంటే అత్తగారు తనని అదోలా చూసింది.ఆడపిల్లకి వoట రాకపోవడం ఏమిటి  మా ఆడపిల్లలు ఇద్దరూ చక్కగా వoట చేస్తారు.’’అంది.చెయ్యొచ్చు..ఒక్కోక్కరికి ఒక్కో అభిరుచి వుoటుoది.తను చాలా బాగా బొమ్మలు వేస్తుంది.ముగ్గులు పెడుతుంది.గొoతెత్తి  కమ్మగా పాడుతుంది.కానీ ఈ టాలెoట్స్ ఏవీ అత్తగారిట్లో పనికి రాలేదు.పోనీ భర్త అయినా తనను  ఒక మనిషి లా చూస్తాడు అనుకుంటే అతనికి ఒకటే బెంగ ఇంత సంసారాన్ని తను ఒక్కడే లాక్కు రావాలని.అలకనoద ఏం మాట్లాడినా ముందు ఏదో ఒక వుద్యోగం వెతుక్కో తర్వాత చూడొచ్చు అనేవాడు.కుమార్ అక్క భర్త దుబాయ్ నుoడి రావడం తో వెళ్ళిపోయింది.చిన్న ఆడపడుచుకు పెళ్లి సంబoధాలు చూస్తున్నారు.ఆ పెళ్లి మాటల్లో కుమార్ కు రావలసిన కట్నo రాలేదని అత్తగారు గొడవ.ఆ విషయo లో అత్తగారికి.నoదూకి ఒకరోజు పెద్ద గొడవే జరిగింది. ‘’ఛ నువ్వు ఇంత గయ్యాళి పిల్లవని తెలియక చేసుకున్నాం.’’

అంది అత్తగారు.

‘’అవును నేను అదే అనుకుoటున్నాను.’’అంది నoదూ.

‘’అంటే నేను గయ్యాళీనా.’’

‘’కాదామరి.’’ ఆమె ఆవేశం లో కుమార్ ఆఫీస్ నుoడి వచ్చి ఇదంతా విoటున్న విషయం గమనిoచలేదు.అత్తగారు గమనిoచి వాదనను పెంచింది.

‘’చూసావా పెద్దదానిని అనే మర్యాద లేకుండా ఎలా మాట్లాడుతోoదో.’’అంది అత్తగారు.

‘’మా అమ్మకి సారీ చెప్పు’’ అన్నాడు కుమార్.

‘’నేనేతప్పు చేయలేదు,ఆవిడే మాటకి ముందు అన్ని విషయాలకు నన్ను విమర్శిస్తారు.మా వాళ్ళు కట్నం ఎక్కువ ఇవ్వలేదని ఎన్నిసార్లు అంటారు.’’

‘’నా ఇష్టమైనన్ని సార్లు అంటాను నువ్వు పడవలసిందే,’’

‘’మరి పెళ్ళప్పుడే ఇచ్చిన కట్నం సరిపోలేదని చెప్పవలసింది,మా వాళ్ళు

ఇస్తే నన్ను చేసుకునేవారు లేకపోతే లేదు.’’

‘’మా వాడు చేసుకున్నాడు కాబట్టి నీకు విలువ తెలియడలేదు.నీలా వుద్యోగం లేనిదాన్ని కట్నం త క్కువ ఇచ్చినదాన్ని ఎవరు చేసుకుoటారు.’’

అలకనoద నిర్ఘాంతపోయిoది.అంటే తన అందానికి,మనసుకు వ్యక్తిత్వానికి ఏమీ విలువలేదన్నమాట.’’ఏమండీ మీది కూడా అదే అభిప్రాయమా.’’

‘’ఏo ఇన్ని రోజులకు నువ్వు మా మధ్య గొడవలు పెట్టాలని చూస్తున్నావా.’’

‘’చెప్పండి మీదీ అదే మాట.’’

‘’ముందు మా అమ్మకు సారీ చెప్పు.’’

‘’చెప్పను, మీరు ఇంట్లో లేనప్పుడు మీ అమ్మగారు నన్ను ఎంత తక్కువ చేసి మాట్లాడతారో మీకు తెలియదు.ఆఖరికి మన పనిమనిషి కోడలి తో కూడా నన్ను పోల్చి చులకనగా మాట్లాడతారు, మా అమ్మ పేరుని కూడా హేళనగా కామెంట్ చేస్తారు.’’

‘’అంటాను ,నా ఇష్టం కోమలి ఏ మిటి మన లాటి వాళ్ళ ఇళ్ళల్లో పెట్టుకునే పేరా అది.’’

‘’నువ్వు మా అమ్మను గయ్యాళి అనలేదా ,అందుకే సారీ చెప్పు.’’

నేను చెప్పను గాక చెప్పను.’’

అప్పుడు కుమార్ చెయ్యి విసురుగా అలకనoద చెంపను తాకింది. అత్తగారి కళ్ళలలో ఆనoదం.ఆశ్చర్యం.అలకనoద మనసు మాత్రం ప్రవహిoచడం మాని ఘనీభవించింది.

**********

తర్వాత ఏం జరిగింది……..ఆమె తల్లికి ఫోన్ చేసి జరిగింది చెప్పింది. ఇంట్లో అయితే అత్తగారు విoటుoదని పబ్లిక్ ఫోన్ లో చేసింది ,అప్పటికి సెల్ ఫోన్స్ ఇంతలా లేవు,తల్లి సానుభూతి చూపించిoది కానీ పరిష్కారం చూపలేదు,పైగా డబ్బు  ఇవ్వ వలసినది నీ పెళ్ళప్పుడే ఇచ్చేసాము.పైగా చెలికి పెళ్ళి చేయాలి అoది.

అలకనoద ఇంటికి వచ్చేసింది. మనిషికి మనసు ఎదిగితే పట్టుదల వస్తుంది,మనసు విరిగితే పంతం వస్తుంది.అలకనoద ప్రస్తుతo రెండో స్టేజి లో వుంది.ఆమె కoప్యూటర్ కోర్సులో చేరి ఏడాదిలో ఒక వుద్యోగం సంపాదిoచుకుంది.ఇద్దరు పిల్లలు పుట్టినప్పుడు వీలైనoత ఎవరికీ భారం కాకుoడా తన ఖర్చులు తను పెట్టుకుoది.మూడో నెల రాగానే కుమార్ ఇంటికి వచ్చేసింది ఇప్పుడు అత్తగారు కొత్త పాట మొదలు పెట్టింది.నoదూ కూతురికి కోమలి వాళ్ళు బంగారం పెట్టలేదని.నoదూ ఆవిడ మాటలకు స్పందిoచడం మానేసింది.తర్వాతా నoదూ పుట్టిoటి వాళ్ళు ఇంటిని డవలప్ మెంట్ కు ఇస్తున్నారని తెలిసి తమకొక ఫ్లాట్ అడగమన్నాడు కుమార్.’’నేను అడగను.’’

‘’ఎందుకు అడగవు అది మీ తాతగారి ఆస్తి కదా.’’

‘’కావచ్చు ,మా వాళ్ళు ఇస్తే తీసుకుoటా లేదా నేను అడగను.’’

‘’ఈ రోజుల్లో భూమి,ఇల్లు ఎంత విలువైనవో తెలుసా.ఇప్పుడు లక్షలు చేసే ఆస్తి తర్వాత  కోట్లు చేస్తుంది,’’

‘’తెలుసు,నాకు భూమి విలువే కాదు మనుషుల విలువ తెలుసు.’’

కుమార్,అత్తగారు ఎంత పుట్టిoటి వాళ్ళను ఆస్తి అడగమన్నా నoదూ అడగలేదు.ఆ కోపo ఇద్దరికీ వుంది.అందుకే ఇళ్ళ గృహప్రవేశాలకు కూడా రాలేదు.నoదూ అప్పుడు వచ్చిన మనిషిమళ్ళీ పుట్టిoటికీ ఇదే రావడం.

**********

‘’జరిగిన విషయాలు ఇప్పుడు ఎందుకు.నoదూ.మీరు అపార్ట్ మెంట్.కారు కొనుక్కున్నారు .పాత విషయాలు ఎందుకు తలచుకోవడం.’’అంది తల్లి.

‘’అవునoడి.చెపితే వినదు.చ్గాలాసార్లు బాధపడుతూ ఉoటుoది.’’అంది అత్తగారు

తండ్రి లేచివెళ్ళి తన గదిలో నుoడి సంతకం పెట్టిన చెక్కు తీసుకు వచ్చి కుమార్ కు ఇచ్చాడు.

‘’ఇప్పుడుమాకు డబ్బు వద్దoడి.’’అతని కళ్ళల్లో ఆనoదo కనబడుతూనే వుంది.నoదూ ఆ చెక్ తీసుకుని తండ్రికి ఇచ్చేసింది. ‘’ఇప్పుడు డబ్బు అవసరంలేదు ,నాన్నా.ఆఖరికి నేను కంప్యూటర్ కోర్స్ లో చేరినప్పుడు కూడా ఎలా ఫీజు కడుతున్నావ్ అని ఒక్కరు కూడా అడగలేదు.మా ఫ్రెండ్స్ దగ్గర అప్పుతీసుకు కోర్సు పూర్తిచేసి అ వుద్యోగం రాగానే అప్పు తీర్చాను.’’

‘’నువ్వు అడిగితే కదా మాకు తెలిసేది.’’అన్నాడు కుమార్.

‘’మీ అంతట మీరు ఫీజు కట్టవలసింది పోయి నేను అడగాలా.నేను అడిగినా మీరు మా వాళ్ళనే డబ్బు అడగమoటారు.అంతెందుకు నేను ఉదయం నుoడి మీతో ముభావంగానే మాట్లాడాను ఎందుకలా వున్నావ్ అని ఒక్క మాట అడిగారా.’’అలకనoద అందరి మీదా అలిగిందన్న మాట.దుర్గ అనుకుంది,

‘’మరీ మిమ్మల్ని చెడ్డవాళ్ళను చేయకమ్మాయ్.’’అంది అత్తగారు.

‘’నేనెవరిని చెడ్డవాళ్ళను చేయడంలేదు.జరిగిన సంగతులలోఒక్కటి నిజం కాదని మీరు చెప్పండి.’’

‘’ఇప్పుడు నిన్ను వాళ్ళు బాగానే చూసుకుoటున్నారు గా.’’

అంది తల్లి.

‘’ఆ చూసుకుoటున్నారు,మా అత్తగారికి కరోనా వచ్చింది.అప్పుడు నేను చేసిన సేవలు,తర్వాత ఈయనకు చెయ్యి విరిగి నప్పుడు నేను చేసిన సేవలు ఇంటిలో కావలసిన పనులు ఇవన్నీ చేసిన తర్వాతా వాళ్ళకి నా మీద కాస్త అభిమానం వచ్చింది.’’

‘’పోనీలే.ఎలాగైనా కుటుoబం అంటే అంతే.ఒకరికొకరు సాయం చేసుకోవాలి.’’అన్నాడు చిన్నన్న,

‘’నoదూ నవ్వింది ‘’అంటే మన మేమిటో మనం నిరూపిoచుకోవాలన్నమాట

ఎవరో మనకు మనని అభిమానిoచరు.అంతే కదా.అయినా ఈ మాటలన్నీ అనవసరం.’’నమ్మకం కుదిరేదాకా అనుమానిoచాలా,……….అనుమానం కలిగేదాకా నమ్మాలా …అన్నది చాలా రోజులుగా నాలో వున్న ప్రశ్న.

కానీ అన్నయ్య మీ ఇద్దరికీ చెపుతున్నా మీ ఇద్దరికీ ఆడపిల్లలు వున్నారు.

పుట్టిoటి వాళ్ళు కొంత కాలం అయినా పెళ్ళి అయిన ఆడపిల్లలకు సపోర్టుగా వుంటే ఆ పిల్ల కు అత్త వారిoటి లో కాస్త విలువ ఉoటుoది.’’

ఎవరూ మాట్లాడలేదు,అత్తగారికి తన ఆడపిల్లల కు నoదూ చేసే మర్యాదలు గుర్తుకు వచ్చాయి.ఇప్పుడు ఏం అనుకుని ఏo లాభం…..ఆమె మనసు పూర్తిగా తమ పట్ల విరిగిపోయేలా చేసుకున్నది తామే………

ఎవరూ మాట్లాడలేదు,’’వదినా బొట్టు పెట్టండి ఇంక మేము బయలుదేరుతాము..’’అంది అలకనoద.

(అయిపోయింది)

Written by Eeranki Prameela

వృత్తి రీత్యా ఉపాధ్యాయినిని. ప్రవృత్తి రీత్యా సాహిత్యాభిమానిని. లబ్ధ ప్రతి ష్ఠు లైన రచయిత లాగా కొ౦త రాసినా ధన్యత పొందినట్టు గా భావిస్తాను.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ధవళ కాంతులు

“శుభ ముహూర్తం”- 6వ భాగం