రమక్క తో ముచ్చట్లు-31

నీ మనసే ఒక వాట్సాప్ గ్రూప్ అయితే!

అందరికీ శనార్థులు!
ఎట్లున్నరు.

ఫోన్లు వచ్చిన కాడినుంచి మనుషులకు దూరమై ఇంట్ల సుత మాట్లాడుకుంటలేము. ఎప్పుడు ఫోన్లనే ఉంటం అని అందరికీ, అందరి మీద ఉంది. అవునా కాదా! ఇగ వాట్సాప్ యాప్ గురించి అయితే చెప్పనే వద్దు, వాట్సాప్ ల ముచ్చట్లు, వాట్సాప్ల సదువులు, వాట్సాప్ల సందేశాలు, పూజలు, పునస్కారాలు, అన్నీ వాట్సాప్లనే!
ఇప్పుడు నేను సుత వాట్సాప్లనే ఈ ముచ్చట పంపుతున్న. వాట్సాప్ లొల్లి మాత్రం ఇంతింత కాదుర…బై ఏమంటరు.
మన బతుకంత మనతోని మనమే మాట్లాడుకునే ఒక ఎండ్లెస్ గ్రూప్‌ చాట్‌ లెక్కనే ఉంది. మనకు మనమే “Typing…” అని కనిపించే పరిస్థితి ఇగ!
గీ ముచ్చట మాత్రం నిజం, దేని మీద నైనా అదుపు ఉండాలి. మొదలు పెట్టుడు కాదు, యాడ ఆపాల్నో తెల్వాలి అంటరు.
మనస్సే మనిషిని మనిషిలెక్క నిలబెట్టేది. కానీ అదే మనస్సు జెర లొల్లి జేస్తే, మనిషి చిత్తడి అయి తికమక పడుతడు.
ప్రతి ఒక్కలకు,వందల- వందలు వాట్సప్ గ్రూపులుంటయి. ఏ గ్రూపుల చూసినా గదే కత, ఇండ్ల కెంచెల్లి అండ్లకు పంపుతరు. ఇదే యవ్వారం నడుస్తనే ఉంటది. మంచి మాటలు, సూక్తులు.. చెత్తబుట్టనే ఇగ.. మన చెత్త పక్కింటి ముందేస్తే, పక్కింటి వాళ్ళు ఆ చెత్తను ఆ పక్కింటి ముందు ఏసినట్టు, ఇసొంటి మెసేజ్లు దొర్లుతనే ఉంటయి. ఇగ… ఒక్కొక్కపారి అయితే డిలీట్ చేస్కోనీకి సుత హైరాన అయిపోతది పానం. అక్కరకు రాని చెత్తనంతా ఊడ్చి పాడెయ్యకపోతే జాగ ఉండదు, పనికిరాని మెసేజ్లు అన్ని డిలీట్ చేయకపోతే జాగా ఉండదు వాట్సప్లో అట్లనే.. మన మనసు సుత! మన మనసుల సుత అక్కరకు రాని, పనికిరాని బాధ పెట్టి,చెత్త లాంటి మెసేజ్లను సంఘటనలను, ఊడ్చిపడేయకపోతే, మంచికి జాగా ఉండదు. అంటే మన మనసు సుత ఒక వాట్సాప్ సమూహం లెక్క అనుకుందాం. ఇయ్యాల ఇదే ముచ్చట పెట్టనీకి వచ్చిన.

ఒక్కసారి ఆలోచన చేద్దాం.
మన మనస్సు ఒక వాట్సాప్ గ్రూప్ అయితే,
అది అసలు ఎసొంటి గ్రూప్?
ఎవల్లు అడ్మిన్? ఎవల్లు సైలెంట్ మెంబర్లు? ఎవల్లు unnecessary గా ఎమోజిస్ పంపేటోళ్ళు? ఎవల్లు ఎప్పుడూ లొల్లి చేసే టోళ్లు? జెర సరదాగా ముచ్చట పెట్టుకుందాం.

మనస్సు గ్రూపుకు ఒక పేరు పెడుదాము పేరు: “నా లోపల ఓ జర్నీ” అనుకుందాం.
పేరు పెట్టినం మంచిగుంది. ఈ సమూహంల
ఈ గ్రూప్‌కి బయట వాళ్లు ఎవరూ ఆడ్ కారు. అయినా, మనమే రిమోవ్ చేస్తం.
మొదట మన గ్రూప్‌కు పేరు పెడదాం.
“లోపలి శబ్దాలు – నాలో నేను , నా గురించి & అతిగా ఆలోచించుడు. ఇందులో గ్రూప్ మెంబెర్స్ . అడ్మిన్ ఎవల్లు ఉండాలే సూద్దాం.వాట్సాప్ గ్రూప్‌ల అసలు పవర్ అడ్మిన్ దగ్గరే ఉండాలి… కానీ మన జీవితంల సీన్ కొంచం వేరే ఉంటది.
మన మనస్సు గ్రూప్‌ల మనమేఅడ్మినుగ ఉండాలి. కానీ చాలా సార్లు అట్ల జరుగదు.
గదే లొల్లి. మన మనసు వాట్స్అప్ కు మన వర్తమానం అంటే ఈరోజు అడ్మిన్ లెక్క ఉంటే బతుకు సుఖంగా ఉంటది కానీ మనము అయిపోయిన టైంను, అయిపోయిన అనుభవాలనుకుంటే గతంలో అడ్మిన్ చేస్తము. అడ్మిన్ పూర్వకాలంల జరిగిపోయిన పాత సంఘటనలను, పాత బాధలను తవ్వి తవ్వి తవ్వి.. తవ్వి ఇయ్యాలకు తిండి లెక్క పెడతది మనకు. అడ్మిన్ ఇచ్చిన టాస్కును సభ్యులు పూర్తి చెయ్యాల్నాయే.. గతం తాలుక చేదు అనుభవాలల్ల గుంజుక సస్తుంటం. మనాది అయితం. అవుస్రం లేని ఆలోచనలతోని ఆరోగ్యం మనస్సు ఖరాబ్ చేస్కుంటం.
ఒక్కోపాలి భయం అడ్మిన్ అయితది, దీందొక కత! మన మనసు నిండ భయం వచ్చి కూసుంటే ఎట్లుంటది, దయ్యం కూసున్నట్టే ఉంటది, తాడును చూసి పాము అంటరు, గట్ల మన నీడని చూసి మనం భయపడే పరిస్థితి. ఏ పనీ చేయలేకపోతం,ఒక అడుగు ముందుకు ఎయ్యలేకపోతం. ఇంగ ఒక్కోసారి అడ్మిన్ల
వేరేటోళ్లు అన్నమాటలచ్చి కూసుంటయి. దీని ఆట అయితే అంతంత ఉండదిగ. ఈ అడ్మిన్ ఇచ్చే టాస్కులకు కొంప కొల్లేర్లే. మొగుడు పెళ్ళాలు, అత్త మామలు ఒదినే-ఆడబిడ్డలు ఇగ తన్నుక సావాలి ఇంట్ల. అంతుంటది మనసు వాట్సప్ గ్రూపు కత.
మనసు-మెదడు రెండు కలిస్తే మనిషి నిర్ణయాలు, వాళ్ళు చేసే పనులు, వాళ్ళ విజయాలు, బతుకులు ఉంటయి.
గందుకే మన మనసు కూడ ఒక వాట్సాప్ సమూహం లెక్క, ఎట్లనైతే పనికిరానివి, అక్కరకులేనివి డిలీట్ చేసుకుంటమో అట్లనే పనికిరాని అన్నిటినీ డిలీట్ చేసుకుని మన మనసు అనే వాట్సప్ సమూహంను క్లీన్ గ, మెమొరీ ఖరాబ్ కాకుండ కాపాడుకోవాలి. కనుక దానికి అడ్మిన్ మనమే ఉండాలి. ఎవరి మనసు గ్రూపుకు వాడే అడ్మిన్ అన్నమాట. వేరే వాటిని పనికిరాని వాటిని తీసుకొచ్చి, అడ్మిన్ చేస్తే అవి పెత్తనం చెలాయిస్తయి కదా. ఈ మాట యాదికుండాలే!
అడ్మిన్ పగ్గాలు నువ్వే ఎత్తుకోవాలి శెల్లె – తమ్మీ! నీ మనస్సు గ్రూపు అడ్మిన్ నువ్వే అయితే అండ్ల గ్రూప్ మెంబర్లు ఎవళ్ళు ఉంటరో ఎర్కనా..
లాజిక్ అన్న,ఎమోషన్ శెల్లి,భయం మామ,
ఆనందం పాప,ఓవర్‌థింకింగ్ బిడ్డ,ఆలస్యం అత్త, గట్ ఫీలింగ్ తమ్ముడు… ఇట్ల ఒక మనిషి బతుకుల ఏమేమి అవసరమో.. ఏమేమి చెయ్యాలి, తప్పనివి ఏంది, అనవసరమైనవి ఏంది తెలుస్తది. ఏది అవసరమో అవే ఆన్లైన్ మెంబర్స్ ఉంటరు. ఇప్పుడు నీకు అర్థమైంది అనుకుంట వాట్సప్ సమూహం మనసు లెక్క. దానిని మనం ఎట్ల నడిపించుకోవాలి అనేది. అందుకే వేరేటోలని తెచ్చి కూసబెట్టుడు కాదు, నీకు నీవే అడ్మిన్ ఉండుడు అంటే ఏందో, రమక్క ఏం చెప్తుందో నీకు మంచిగ సమజ్ అయ్యింది అనుకుంటున్న తమ్మీ!

ఇప్పుడు ఒక చిన్న కత చెప్త ఇను!
కొత్తగ నీకు మోటివేషనల్ స్పీకర్ అవ్వాలి అనిపించింది అనుకుందం,
బాగ మాట్లాడటం, ప్రేరణ ఇవ్వడం అంటే ప్రాణం. కానీ ఎక్కువసార్లు
మనస్సు వాట్సాప్ గ్రూప్ల సభ్యులు ఉన్నరు కదా ఇట్ల చెప్పుడు మొదలు పెడ్తరు…

నువ్వు :“నేను ఒక ప్రోగ్రాం చెయ్యాలి.”
భయం: “అయ్యో, ఆడియన్స్ అందరూ నవ్వుతరు.”
అలస్యం అత్త: “ఏందిరా… ఈరోజు పండుకో అవ్… రేపు సూద్దాం .”
ఓవర్‌థింకింగ్: “వాళ్లు ఏమంటరో? ఆ డ్రెస్ బాగుంటద? నీ వాయిస్ సరిపోతదా?”
లాజిక్ అన్నయ్య: “నీ రచన మంచిగుంది. ట్రై చెయ్యొచ్చు.”
గట్ ఫీలింగ్: “చేయ్. నీ కల నువ్వే నెరవేర్చుకోవాలి”

ఇంతమంది ఇన్ని చెప్పేసరికి మోటివేషనల్ స్పీకర్ అవుదాం అనుకున్న నీ ఆశ సగం సచ్చిపోతది. అప్పుడు నువ్వు నీ మనసుకు ఒక మెసేజ్ పెట్టాలి అది ఏందంటే..
“ఇగ నుండి ఈ గ్రూప్ అడ్మిన్ నేను!
ఎవరైనా negative లేదా overthinking messages పెడితే, remove from group చేస్తా!”అని. అంటే.. నిరాశ పెట్టె మెంబర్లను రిమూవ్ చేసి పడేయాలి మనసుల కెంచి!
ఒక్క నిర్ణయం!ఒక్క చిన్న step!
ఆ నిర్ణయంతో రెండు నెలలల్ల స్టేజ్ మీద మైక్ పట్టుకోని మొదటి స్పీచ్ ఇచ్చేస్తవ్!

ఆ రోజు గట్ ఫీలింగ్ తమ్ముడు అంటడు..
“చూశినవ? అడ్మిన్ పవర్ ఎవల్ల దగ్గర ఉంటే వాళ్ళు విజేతలు” అని.

వాట్సాప్ గ్రూప్‌లో pinned message ఉంటుంది కద గట్లనే మన మనస్సుగ్రూపుల సుత మనం ఏ మెసేజ్ పిన్ చేసుకుంటమో గదే జీవితం అయితది. ఒకళ్ళ మీద మనం
“వాడు చెడ్డోడు” అని పిన్ చేస్కుంటే గదే కానోస్తది. “నేను చెయ్యలేను నాకు చాతకాదు …” అనేది పిన్ చేస్తే– బతుకంత భయమే ఉంటది.
“సూద్దాం… ప్రయత్నిస్తే వస్తది” అనేది పిన్ చేస్తే,మార్పు మొదలయితది.నువ్వే నీ బతుక్కు అడ్మిన్ ఉండాలే. గదే నీ మనస్సు వాట్సాప్ గ్రూపుకు!

“నేనే నా అడ్మిన్” అని పిన్ చేస్కో సెల్లె…! బతుకు టర్నింగ్ పాయింట్ అయితది.
ఇట్ల కానీకి ఇంకొన్ని సెట్టింగులు మార్వాలి.. ముందుగాల్ల..భయం, ఎదుటోళ్ల మాటలు,
గతం నుంచి వచ్చే పాత మెసేజులు,అనుమానాలు, పనికిమాలిన సందేహాలను మ్యూట్ చేసి పడెయ్యాలి,
Unmute చేయాల్సినవాటి మీద ఖ్యాల్ ఉండాలి. ఇవి శాన ముఖ్యం అవేందంటే.. ముందుగాల్ల వచ్చేది గట్ ఫీలింగ్ అంటే నీ అంతః చేతన, లాజిక్ ( తార్కికం )కొత్త ఆలోచనలు, ప్రేరణలు,చిన్న చిన్న ఆనందాలు వీటిని తక్కువ జెయ్యొద్దు ఇవే ముఖ్యమైనవి. ఇగ అస్సలు గ్రూపుల కెల్లి
Delete for everyone, శాశ్వతంగా నూకి పారిశేటివి ఏందంటే నీ గురించి వచ్చిన నెగటివిటీ “నేను చేయలేను” అనే ఇంప్రెషన్స్,సొసైటీ పెట్టిన లేబల్స్ అంటే పనికిమాలినోళ్లు నిన్ను తక్కువ జేసీ నీకు పెట్టిన పేర్లు, గతంలోని నీ ఓటమిలు సమజయిందా.. ఏమేమి డిలీట్ చేసెయ్యాల్నో!

మల్ల జెప్తున్న.. యాదికుండనీ నీ మనస్సు గ్రూపుకు నువ్వే క్రియేటర్,నువ్వే అడ్మిన్!

మనస్సు నీ సేవకుడు అయితే నువ్వు రాజయితవు, మనస్సు నీ యజమాని అయితే నువ్వు బానిసయితవు. సూడు మల్ల ఎట్లుంటవో…
ఇంకో ముచ్చట ఈ గ్రూపు ఒక్కరోజుల సైలెంట్ కాదు,కానీ నువ్వు admin అయితే నీ బతుకు notifications మారిపోతయి.
ఇగ అప్పుడు నువ్వే ఒక గొప్ప మెసేజ్ పెట్టుకో “ఈ గ్రూప్‌కి అడ్మిన్‌ నేనే!” అని.

( వాట్సాప్ గురించి చెప్పుకున్నం కదా, గందుకని ఇంగిలీశు పదాలు ఎక్కువైనయ్, ఏమనుకోకుండ్రి )

సమజయ్యిందనుకుంట.
ఉంట మరి
పైలం

Written by Ramadevi Kulkarni

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ఇంతకీ నీవు ఏ బొమ్మవి ?

లోకాభిరామాయణం 4