పచ్చని చెట్లు పంట పొలాలతో ప్రశాంత వాతావరణము, ఆరోగ్యప్రదమైన మన పల్లెలను గుర్తుకు తెస్తూ, కొంత అధునాతన అలంకారాలతో ఆహ్లాదకరమైన నవ నాగరిక పల్లెటూరులా అనిపించింది పోర్ట్ ల్యాండ్ ముప్పై ఏళ్ల క్రితం నా తొలి పరిచయంలో.
ఆకాశాన్నంటే వృక్ష సమూహాలు, ఆకులే పువ్వులుగా మరిపించే చెట్లు కొన్నైతే, వర్ణింప నలవి గాని వర్ణాలతో ఋతువుకు తగ్గ రంగులను, రూపాలను చూపిస్తూ నేలనంటి పెరుగుతున్న పూల మొక్కలు, కనుచూపుమేరదాకా ఎత్తు పల్లాలపై తివాచీ పరిచినట్లు ఉండే పంట భూములు, పాడి పశువులు, పెంపుడు జంతువులు పలు రకాల పక్షులు ప్రకృతి రమణీయతకు ప్రతిరూపంలా పరిశుభ్రతకు ఆనవాలుగా భగవంతుని కుంచెనుండి జాలు వారిన ఆరు ఋతువుల ప్రకృతి పటంలా కనిపిస్తుంది పోర్ట్ ల్యాండ్.
వలస పక్షుల్లా ఇక్కడికి చేరిన వారందరూ ఒకే కుటుంబంగా వసుదైక కుటుంబాన్ని తలపిస్తూ, అన్ని వయసుల వారికి పోర్ట్ ల్యాండ్ పుట్టినిల్లయి నిలిచింది. తొలి కాన్పులు మలి కాన్పులు పిల్లల సంరక్షణ అంటూ స్వదేశానికి ఈ దేశానికి ” ఆసుపోసినట్లు” తిరుగుతున్న తల్లిదండ్రులు, పెద్దలనందరిని కూడా ఎంతో గౌరవాభిమానాలతో ఆదరించడం ఇక్కడ వారి సంస్కారం అయితే, విద్యార్థులు,బ్యాచిలర్స్ , నవ దంపతులు ఎవరు ఇక్కడికి వచ్చినా ఒకే కుటుంబంలోని వారే అన్నట్లు అనుభూతి కలగడమే గాక, చిన్నా పెద్ద వయసు తేడాలతో సోదర సోదరీ భావంతో ఆత్మీయ సంబంధాలు కలిగి ఉంటారు.
ఆ రోజుల్లో మేము ఇక్కడ గమనించిన మరో విషయం ఏమంటే ఇక్కడికి వచ్చిన వారందరూ వారి వారి ప్రాంతాల్లో ఎవరి వసతులు ఎలా ఉన్నా కూడా, ముఖ్యంగా ఇండియాలో ఇంటి పనులకు వంట పనులకు అదీ ఇదీ అనే ఏమిటి అన్ని పనులకు జీతాలకు మనుషులు ఇప్పటికీ అందుబాటులోనే ఉంటున్నారు. అది లగ్జరీ కాదు కూడా అలాంటి దేశం నుండి బెటర్ లైఫ్ కోరుకుంటూ ఇంత దూరం వచ్చి ఉద్యోగ బాధ్యతలు, ఇంటి పనులు పాచి పని,పాకీ పని, పిల్లల యాక్టివిటీస్ అన్నింటికి ప్రాముఖ్యతనిస్తూ ఆడుతు పాడుతూ పనిచేస్తుంటే అలుపుసొలుపేమున్నది అన్నట్లుగా, భార్యాభర్తలిరువురూ చేయి చేయి కలిపి చేసుకు పోతున్నారు. వారం అంతా ఊపిరి తీసుకొనే సమయం లేకుండా గడిచినా వారాంతంలో అందరూ ఎవరికి వీలైన గ్రూపులతో వారు కలుస్తూ విందు వినోదాలతో మళ్లీ వారానికి చాలా ఎనర్జీ నింపుకున్నట్లు అనిపించేది. ఇక పండుగలు పబ్బాలు పుట్టినరోజులు మెట్టిన రోజులు ఒకటేమిటి అన్ని సంబరాలు అయినవాళ్లను అమ్మలాంటి దేశాన్ని మరిచిపోలేదని ఋజువు చేస్తూ జరుపుకుంటుంటారు. ఏ ఇంట్లో ఏ కాస్త ఇబ్బంది కలిగినా అనారోగ్యాలో మరేతర కారణాలు ఏమైనాప్పటికీ ఇంటి భోజనంతో సహా వారు కోలుకునే వరకు వారి ఆత్మాభిమానం దెబ్బతినకుండా చేయందించేవారు.
ఇక్కడ పుట్టి పెరుగుతున్న పిల్లల గురించి చెప్పాలంటే చదువులతో పాటుగా ఇతర యాక్టివిటీస్ మన సంస్కృతిని తెలిపేవి,ఈ దేశాల్లో నేర్చుకోదగినవి ఈ రెండింటిని కుటుంబ మర్యాదలతో బాటుగా తల్లిదండ్రులు పిల్లలకు పరిచయం చేస్తున్నారు. ఇక్కడ పిల్లలకు కపటం తెలియదు కల్లలాడడం అసలు రాదు. తల్లిదండ్రులు పిల్లల మధ్య స్నేహపూరిత వాతావరణమే గాక” ఎక్స్పెక్టేషన్స్” లేని బాధ్యతలు నెరవేరుస్తూ ఎవరి పరిధిలో వారు
నిజాయితీగా నిర్వర్తిస్తున్నట్లుంటారు. ” ఎంతవరకు అటాచ్మెంట్ ఎప్పటినుండి డిటాచ్మెంట్ ” అనే మన వేదాంత ధోరణి ఇక్కడ కనిపిస్తుంది. మనం విన్న కర్మ సిద్ధాంతం ప్రకారం సృష్టిలో సమానత్వం అనేది ఏ జీవులలోనూ ఉండదు . కర్మలను అనుసరించే జన్మలంటారు కదా, అలా ఋణాను బంధంగా జన్మనిచ్చిన పిల్లలకు సృష్టికి ప్రతి సృష్టి చేసి తమ పిల్లలు ఎవరికన్నా తక్కువ కారు కాదు అంటూ వారికి జీవితాన్ని ప్రసాదించిన తల్లిదండ్రులు, అలాగే తమలో ఒకరుగా వారిని కలుపుకుంటూ తక్కిన పిల్లలు కూడా మానవతను చూపుతారు.
ఇక్కడ ఉద్యోగరీత్యా ప్రాంతాలు,ప్రదేశాలు మారుతూనే ఉంటారు అలాంటి మార్పుతోనే మా అమ్మాయి వాళ్ళు “ఆరిగన్ స్టేట్ లోని పోర్ట్ ల్యాండ్ ” నుండి,” వాషింగ్టన్ స్టేట్ లోని సియాటల్” అనే పట్టణానికి రావడం జరిగింది. ఇక ఆపై సహజంగానే ఆవు వెంట దూడల్లా పిల్లలూ వారి సంరక్షణార్థం మేమూ, ఇండియా నుండి యధారీతి” సియాటెల్” కు రాకపోకలు సాగించాము. స్టేట్స్ మారినప్పటికీ బాంధవ్యాల పునాదులు “పోర్ట్ ల్యాండ్” లో పటిష్టంగా పడ్డ కారణంగా, శుభశుభాలు కష్టనష్టాల సందర్భాలలో ఎక్కడెక్కడి వారందరూ కుటుంబాన్ని చేరి కలిసి పంచుకోవడం మన ఆనవాయితీ లాగానే దూరాన్ని లెక్కపెట్టని అనుబంధం అందరిలో నిండి ఈనాటి వరకు పచ్చగానే కొనసాగుతున్నదనడంలో అతిశయోక్తి ఏ మాత్రం లేదు.
చివరగా నా వ్యక్తిగతానుభవాల్ని మీతో పంచుకున్నప్పుడే,నా ఈ ముప్పయేళ్ళ” పోర్ట్ ల్యాండ్” యాత్ర అర్థవంతమవుతుంది. పాతికేళ్ల కొడుకు గర్భశోకాన్ని, తీరనివేదనను మిగిల్చి ఋణం తీర్చుకొని వెళ్ళిపోయినప్పుడు. అక్కున చేర్చుకుని అనునయించారు ఈ “పోర్ట్ ల్యాండ్” వాసులు. శాపగ్రస్తమైన నా జీవితంలో చిరు వసంతంలా మనవరాలి పెళ్లి ఆమె కోరుకున్న వ్యక్తితో “సియాటల్ “లో ఎంగేజ్మెంట్, “డిట్రాయిట్లో “పెళ్లి నిర్ణయమయ్యాయి. ఇదేం పెద్ద విశేషమా! అనుకోవచ్చు అవును విశేషమే మరి,”పోర్ట్ ల్యాండ్” నుండి ట్రాఫిక్ లో హైవేపై నాలుగు గంటల ప్రయాణం చేస్తూ,కనీసం వారానికి రెండుసార్లు అయినా” సియాటిల్ ” వచ్చి ఎంగేజ్మెంట్ కు ఇంటిని, ఫంక్షన్ హాల్ ను డెకరేట్ చేయడం దగ్గర నుండి తక్కిన ఏర్పాట్లు అన్నీ గమనించుకుంటూ అందరూ ఆనందంగా కాబోయే పెళ్లికి నాందిగా శుభం పలికారు.
కొంత గడువు తో” డిట్రాయిట్” లో పెళ్లి ఏర్పాట్లు మొదలయ్యాయి. ఇప్పుడు ఇండియాలో ఎవరి హోదాకు తగ్గట్లు వాళ్ళు, సెగ తగలకుండా శ్రమ లేకుండా ఐదు రోజుల పెళ్లిళ్లు అనాయాసంగా చేసేస్తున్నారు. ఈ దేశంలో మన సాంప్రదాయం ప్రకారం పెండ్లి జరగాలని అమ్మాయి అబ్బాయి కోరడం వలన, అదీ ఉన్న ఊర్లో కాకపోవడం వలన భారీ ప్రయాసే అయ్యింది. ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం “సియాటిల్ “వారిని కూడా కలుపుకుంటూ “ఫోర్ట్ ల్యాండ్ “వాసులు ప్రతి ఒక్కరూ తాము పెండ్లి పెద్దలై పక్కవారిని అతిథులుగా గౌరవించి మర్యాదలు చేయడం మరెక్కడా చూడని అపురూప దృశ్యం. తమ ఒడిలో ఆడుతూ పాడుతూ పెరిగిన పసిపాప పెళ్లి కూతురు అయిన వేళ వియ్యాల వారు వేలెత్తి చూపలేని విధంగా ఘనమైన ఏర్పాట్లతో పెళ్లి కార్యం పూర్తి చేసి ఇంటి ఆడపడుచును సకల లాంఛనాలతో, కంటతడితో అప్పగింతలు చేయడం,నా శేష జీవిత కాలానికి మధురానుభూతిని, మరువలేని స్మృతినిచ్చింది.
” సమయం లేదు మిత్రమా” అంటూ పదేపదే నా మనసు చెబుతున్న హెచ్చరికకు సమాధానంగా, మోయలేని ఈ ఋణాన్ని కృతజ్ఞతా భారాన్ని మీ ముందు దించుకుని తేలిక పడుతున్నాను. స్నేహ సౌరభాలు పంచిన “పోర్టు ల్యాండ్ ” వాసులందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతాభివందనములు. 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు!!
అక్క, ఆంటీ, అమ్మమ్మ అన్న పిలుపులతో మీ అందరిఆత్మీయతను పొందిన విజయలక్ష్మి ఆంటీ.
_*_