పోయిన సంవత్సరంలో
పనికిరాని పాత వస్తువులను
భోగిమంటల్లో వేసి కాల్చినట్లు
మనలోని చెడు ఆలోచనలను కాల్చిపారేశాం
సంక్రాంతి పండగలోని ముగ్గులు
చిన్న పెద్దల చిరునవ్వులయ్యాయి
ప్రతి ఇల్లు రంగులమయంగా మారింది
మహాశివరాత్రి రోజున మహేశ్వరున్ని స్మరిస్తూ
కల్మషం లేని భక్తి మార్గాన్ని ఎంచుకొని
ప్రశాంతంగా జీవనాన్ని కొనసాగించాము
ఉగాది పచ్చడిలోని షడ్రుచులు
మన జీవితంలో కలగలిసిపోయాయి
అందులో మరికొంత బెల్లం ఎక్కువై
మానవ జీవితం సంతోషంతో కళకళలాడింది
స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా
మూడు రంగుల జెండాతో పాటు
మనం శాంతి కబూతర్లమై
ఆకాశంలో స్వేచ్ఛగా ఎగిరాము
కాలకూట విషాన్ని చిమ్మే నాగులకు కూడా
నాగుల చవితి నాడు పాలు పోసి
మన అమలిన హృదయగదిలోంచి
భూతదయకు ఆహ్వానం పలికాము
క్రిస్మస్ గిఫ్ట్ గా సంతోషాలను
మన జీవితంలో రంగులను
మన చుట్టూ ఉన్న వారికి కూడా కోరుకున్నాం
మరి ఈ సంవత్సరం కూడా
జనవరి ఫస్ట్ నాడు అందరికీ సంతోషంగా
కేకుముక్క నోట్లో పెట్టి
నూతన సంవత్సర శుభాకాంక్షలను తెలుపుదాం
పోయినేడాదిలాగా ఈ యేడాదికూడా
సంతోషకరమైన రోజులు రావాలని కోరుకుందాం