మోక్ష మార్గం

కథ

లత సాయంత్రం తన భర్త సంన్యాసరావు గారికి వేడివేడి ఉల్లిపాయ పకోడీలు, కాఫీ అందించి, త్వరగా ఇంటి పనులు ముగించి, దేవుడి వద్ద దీపం పెట్టి, వారి కాలనీలోనే ఉన్న చిన్న పార్కుకు చేరింది.

ఆమె అక్కడికి చేరడం ఆలస్యం అవ్వడంతో, అప్పటికే ఆమె స్నేహితురాళ్లు హేమ, బిందు, కామాక్షి ఏదో విషయంపై తీవ్రంగా చర్చించుకుంటున్నారు.

“సారీ ఫ్రెండ్స్..మా ఆయన కోసం పకోడీలు చేయడంతో ఆలస్యం అయిపోయింది. ఏ విషయంపై ఇంత గంభీరంగా చర్చిస్తున్నారు?” అంది ఆత్రుతగా.

“ఏమీ లేదు లతా. మనం ప్రతి ఏటా చర్చించుకునే విషయమే, అదే మన చార్ ధామ్ యాత్ర గురించి,” అంది కామాక్షి ఎగతాళిగా.

లత, హేమ, బిందు మరియు కామాక్షిలకు ప్రతి సంవత్సరం లక్షలమంది భక్తులు తమ పాపాలను ప్రక్షాళన చేసుకొని, మోక్షం వైపు నడిపించే కఠినమైన చార్‌ధామ్ యాత్రను చేయాలనేది చిరకాల కోరిక. వీరు ఒకే కాలనీలో ఉండటం వలన, వారి మధ్య స్నేహం మరింత బలపడటమే కాక, వారి కుటుంబాలు కూడా ఒకరితో ఒకరు చాలా సన్నిహితంగా ఉంటూ, కష్టసుఖాలను పంచుకునేవారు. వీరు కొన్నేళ్లుగా యాత్ర ప్రారంభమయ్యే నాలుగు – అయిదు నెలల ముందు నుంచే ప్రణాళికలు వేయడం, అది ఏదో ఒక కారణం వల్ల వాయిదా పడటం జరుగుతూ వచ్చింది. వారు కలుసుకున్నప్పుడు తరచుగా వారి మాటలలో చార్‌ధామ్ ప్రస్తావన వచ్చేది. ఆ రోజు సాయంత్రం కూడా వారి మధ్య జరుగుతున్న చర్చ చార్‌ధామ్ యాత్ర గురించే.

కామాక్షి అన్న మాటకి లత బాధగా నిట్టూరుస్తూ, “అవును కామాక్షి, ఇన్నేళ్లయినా మన కోరిక తీరలేదు. ఎప్పుడూ ఏదో ఒక సమస్య వస్తూనే ఉంది. ఇప్పటికే నాకు అరవై దాటాయి, మోకాలి నొప్పులతో కాళ్ళు ఈడుస్తూ నడుస్తున్నాను. యాత్ర చేయడం ఒక తీరని కలగానే మిగిలిపోతుందేమోననిపిస్తుంది.”

హేమ కూడా సమర్థిస్తూ “అవును లత, నేను కూడా అదే అనుకుంటున్నా. పుట్టినదాన్ని పుట్టినట్టే ఉండిపోయాను. ఈ జన్మలో నేను యాత్ర చేస్తానన్న నమ్మకం లేదు”.

ఆనాడు వారంతా ఇంకా ఆలస్యం చేయకుండా, వీలైనంత త్వరగా ఒక మంచి టూర్స్ అండ్ ట్రావెల్స్ సంస్థను సంప్రదించాలని నిర్ణయించుకున్నారు.

మరుసటి రోజు ఉదయంకాఫీ తాగుతూ ఉండగా బిందు వార్తాపత్రిక మొదటి పేజీలో ఒక పెద్ద ప్రకటనను గమనించింది. “చిరంతన్ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఈ సంవత్సరం చార్‌ధామ్ యాత్రను అద్భుతమైన సౌకర్యాలతో నిర్వహించడానికి సిద్ధంగా ఉంది.మాతో ఉత్తమ ప్యాకేజీని పొందండి. మాపదిహేను రోజుల ప్యాకేజీలో నాలుగు ధామాలు దర్శించడం, బస్సు మరియు రైలు సౌకర్యాలు, నాణ్యమైన వసతి మరియు భోజనం ఉన్నాయి.యాత్రికులు హైదరాబాద్ నుండి ఢిల్లీకి, అక్కడ నుండి హరిద్వార్, యమునోత్రి, ఉత్తరకాశీ, గంగోత్రి, గుప్తకాశి, కేదారనాథ్, బద్రీనాథ్, రుద్రప్రయాగ్ మీదుగా హరిద్వార్ చేరుకుని, ఢిల్లీ ద్వారా హైదరాబాద్‌కు తిరిగి వస్తారు.మొత్తం ఖర్చు నలభై ఐదు వేల రూపాయలు మాత్రమే. డబ్బును ముందుగా చెల్లించాలి,రద్దు చేసిన సందర్భంలో తిరిగి చెల్లించబడదు. చిరంతన్ ట్రావెల్స్‌తో ఈ ఆధ్యాత్మిక యాత్రను చేసి ఆనందించండి”.ప్రకటన చూసిన  బిందు చాలా సంతోషించివెంటనే ఆమె తన ముగ్గురు స్నేహితురాళ్లకు ఈ విషయం తెలియజేసి సాయంత్రం ఆరు గంటలకు పార్క్‌లో కలుసుకోవాలని చెప్పింది.

సాయంత్రంనలుగురు స్నేహితురాండ్రు  ఉత్సాహంగా కలుసుకున్నారు. బిందు తీసుకువచ్చిన వార్తాపత్రికను చదివి, చార్‌ధామ్ యాత్ర చేసినట్టుగా ఊహించుకున్నారు.అన్ని సౌకర్యాలతో కేవలం నలభై ఐదు వేల రూపాయలకే యాత్ర జరుగుతుంటే బాగుంటుందని, ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేసి ట్రావెల్స్ కంపెనీని సంప్రదించాలని నిర్ణయించుకున్నారు.

కానీ, వారి చార్‌ధామ్ యాత్ర కోరిక గురించి కుటుంబ సభ్యులకు ఇంతవరకు తెలియదు. ఇప్పుడు ఈ విషయం చెప్పి, కుటుంబ సభ్యులను ఒప్పించడం ఎలా అనేది వారి సమస్య. లత తప్ప, మిగిలిన ముగ్గురి భర్తలు స్వర్గస్తులయ్యారు. లత పిల్లలు అమెరికాలో ఉంటున్నందున, ఇంట్లో ఆమె భర్త తప్ప మరెవరూ లేరు. అయితే, ఆమె భర్త సన్యాస్ రావు గారికి బయట భోజనం అంటే అస్సలు నచ్చదు.

“మా ఆయన గడప దాటి కాలు బయట పెట్టరు. అందుకని ఆయన మనతోపాటు యాత్రకు వచ్చే ప్రసక్తి లేదు. ఆయనకు వేడి వేడి అన్నం, కందిపప్పు మీద కాచిన నెయ్యి, గోంగూర పచ్చడి, వేడిగా మిరియాల చారు, గడ్డ పెరుగు ఉంటే,వంచిన తల ఎత్తకుండా లాగించేసి, అదే చార్‌ధామ్ యాత్ర అంటారు. ఇప్పుడు నన్నైనా యాత్రకు పంపడానికి ఒప్పుకుంటారో లేదో. యాత్రకోసమని ఎన్నాళ్ళగానో కష్టపడి చీమలా యాభై వేలు దాచుకున్నాను” అంటూ నిట్టూర్చింది లత.

మిగిలిన ముగ్గురి మనసులో కూడా ఇంట్లోవారు యాత్రకు వెళ్ళడానికి ఒప్పుకుంటారో లేదో అన్న ఆందోళనతో పాటు, వారికి దొరికిన ఈ అవకాశమును కోల్పోతామేమో అన్న భయం చుట్టుముట్టింది. వారు అనుకున్నట్టే నలుగురి ఇళ్లలో ఈ విషయం తెలియగానే ఒక పెద్ద యుద్ధమే జరిగింది. కానీ వీరు కూడా వారి ఇన్నాళ్ల కలను నెరవేర్చుకోవడానికి పట్టుదలగా అందరి సందేహాలను సమాధానపరిచి ఒప్పించారు. లత కూడా భర్తను ఒప్పించి, ఆయనకు నచ్చే విధంగా వంట చేయడానికి ఒక వంటమనిషిని కుదిర్చడంతో తప్పక ఒప్పుకున్నారు సన్యాసరావు గారు.

ఇంటివారు వారి ప్రయాణానికి పచ్చజెండా చూపగానే, వెంటనే ట్రావెల్స్ సంస్థతో మగవారు ఎవరైనా మాట్లాడి బుక్ చేయడం మంచిదని భావించి, లత ఇంటికి వెళ్లి సన్యాస్  రావు గారి సహాయంతో చిరంతన్ టూర్స్ అండ్ ట్రావెల్స్ ను సంప్రదించి, వారు అడిగిన వివరాలు తో పాటు పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో మరీ ముఖ్యంగా వయోవృద్ధులకు అవసరమైన మెడికల్ ఫిట్‌నెస్ సర్టిఫికెట్‌, డబ్బులు చెల్లించి పేర్లు నమోదు చేసుకున్నారు.

యాత్రకు సుమారు ఒక నెల ముందుగానే, ట్రావెల్స్ వారు ఫోటో గుర్తింపు కార్డులు, యాత్రలో తీసుకెళ్లవలసిన వస్తువులు, చేయవలసినవి మరియు చేయకూడని వాటి గురించి వివరించిన ఒక పట్టికను పంపించారు. ఆ పట్టికలో వసతి, భోజనం, ప్రయాణ ప్రదేశాల వివరాలు కూడా ఉన్నాయి. లత డయాబెటిస్ పేషెంట్ అవ్వడం వలన, పట్టికలో భోజనం గురించి మరింత శ్రద్ధగా చదివి సంతృప్తిపడింది.

ప్రయాణం ఖాయం కావడంతో నలుగురు స్నేహితురాండ్రు చాలా సంతోషంగా ప్రయాణానికి పది రోజుల ముందే ఒకరితో ఒకరు సంప్రదించుకుని, తీసుకెళ్లాల్సిన వస్తువులు, బట్టలు, అవసరమైన మందులు అన్నీ బ్యాగుల్లో సిద్ధం చేసుకున్నారు. బ్యాగులు ఎక్కువ బరువు కాకుండా, తాము తేలికగా మోసుకోగలిగే విధంగా చూసుకున్నారు. సన్యాస్ రావు గారు  ముందు జాగ్రత్తగా ఢిల్లీలో ఆయనకు తెలిసిన ఒక ఇద్దరు మిత్రుల ఫోన్ నంబర్లు కూడా వారికి ఇచ్చారు. ఆ నలుగురికి ఇక యాత్ర తప్ప ఇంకో ధ్యాస లేదు. ఎంతో ఉత్సాహంగా ఇరుగుపొరుగు వారికీ, అడిగిన వారికి, అడగని వారికి కూడా వాళ్ల యాత్ర గురించి చెప్పారు.

వారు బయలుదేరవలసిన రోజు రానే వచ్చింది. బడికి మొదటిరోజు వెళ్ళే చిన్న పిల్లల్లా ఉత్సాహంగా ఉదయం నాలుగు గంటలకే లేచి, తయారయ్యారు. మెడలో ట్రావెల్స్ వారు ఇచ్చిన గుర్తింపు కార్డును వేసుకుని, సన్యాసి రావు గారు, బిందు యొక్క పెద్ద కొడుకు భూషణ్ కారు తీసుకురావడంతో, వారంతా రెండు కార్లలో సామాను సర్దుకుని స్టేషన్‌కు బయలుదేరారు. స్టేషన్ చేరేసరికి చాలామంది తోటి చార్‌ధామ్ యాత్రికులు ఒకరికొకరు పరిచయాలు చేసుకుంటున్నారు. చిరంతన్ట్రావెల్స్ నిర్వాహకుడు పరమానందరావు తన మరో ముగ్గురు సహాయకులతో కలిసి యాత్రికులను ఆహ్వానించి పరిచయం చేసుకున్నారు. రైలు రాగానే సన్యాసి రావు, భూషణ్ వారిని, సామానును వారి బెర్త్ వద్ద చేర్చి, వారికి అన్ని జాగ్రత్తలు చెప్పి, ఎటువంటి ఇబ్బంది వచ్చినా నిర్వాహకుడు పరమానందరావుకి చెప్పమని, యాత్ర బాగా జరగాలని కోరి, రైలు కదిలే వరకు ఉండి వీడ్కోలు పలికారు.

రైలు కదిలి వేగం పుంజుకోవడంతో, వారు స్వేచ్ఛగా ఆకాశంలో ఎగిరే పక్షుల్లా అనుభూతి చెందారు.
బెర్త్ కింద సామాను సర్దుకుని, నలుగురూ మాటల్లో మునిగిపోయారు. ఆ కోచ్‌లో ఉన్నవారంతా చార్‌ధామ్ యాత్రికులే, అందులో సుమారు ఎనభై శాతం మంది వృద్ధులే. నలుగురిలోనూ, చాలా చురుకైన లత, కాలు నొప్పి ఉన్నా పేరు పేరున అందరితోనూ పరిచయం చేసుకుని వచ్చింది. వారికి పక్క బెర్త్‌లో ఉన్న  అన్నపూర్ణమ్మ గారితో, ఆమె మనవడు గోపితో అంత తక్కువ సమయంలోనే మంచి స్నేహం ఏర్పడింది.అన్నపూర్ణమ్మ గారికి డెబ్బై ఐదు ఏళ్లు ఉంటాయి. గోపి, ఆమె చిరకాల కోరిక అయిన చార్‌ధామ్ యాత్ర చేయించడానికి తీసుకుని వెళుతున్నాడని చెప్పారు.

ఉదయం తొమ్మిదిగంటలకల్లా కాజీపేట స్టేషన్ దాటిన వెంటనే వేడివేడిగా కాఫీ, టిఫిన్లు, మధ్యాహ్నం పన్నెండుగంటలకు రుచికరమైన భోజనం అందజేశారు ట్రావెల్స్ వారు. మధ్య మధ్యలో వారి సహాయకులు వచ్చి మంచినీరు అందించి, ప్రయాణికులకు ఏమైనా అవసరమా అని అడిగి తెలుసుకున్నారు. సాయంత్రం నాలుగుగంటలకు వేడివేడిగా టీ, బిస్కెట్లు ఇవ్వగానే కామాక్షి అందరినీ ఒక్క క్షణం ఆగమని చెప్పి, తన సంచిలో ఉన్న డబ్బా నుండి చేగోడీలు తీసి పంచుతూ, “నిన్న సాయంత్రమే కోడలు, నేను కలిసి ఒక గ్లాసు పిండితో చేశాము. ఇంట్లో కొన్ని ఉంచి, మిగిలినవి మన కోసం తెచ్చాను. రుచి చూసి ఎలా ఉన్నాయో చెప్పండి.నాకైతే కొంచెం ఉప్పు ఎక్కువైనట్టు అనిపిస్తుంది” అంది సందేహంగా. దానికి అందరూ చేగోడీలను కరకరలాడిస్తూ, చాలా బాగున్నాయని కామాక్షి ఓపికను మెచ్చుకున్నారు.

రైలు ఆలస్యం కారణంగా నాగ్‌పూర్ చేరుకునే సమయానికి రాత్రి ఏడుగంటలైంది. నాగ్‌పూర్ చేరుకున్న వెంటనే ట్రావెల్స్ సిబ్బంది వేడివేడి చపాతీ, పనీర్ కూరను అందించారు. వారు అందిస్తున్న సౌకర్యాలు అందరికీ ఎంతో సంతృప్తిని కలిగించాయి. రాబోయే పదిహేను రోజులు కూడా ఇలాగే కొనసాగాలని అందరూ ఆకాంక్షించారు. రాత్రి తొమ్మిది గంటలకు అందరికీ దుప్పటి, రగ్గు మరియు దిండులను అందించారు.అందరూ పడుకోవడానికి సిద్ధమవుతుండగా పరమానంద రావు వచ్చి, ప్రతి ఒక్కరినీ పేరు పేరునా ఆప్యాయంగా పలకరించి, అన్ని సౌకర్యాలు ఉన్నాయో లేదో తెలుసుకుని, రాత్రి పక్క కోచ్‌లో ఉంటానని, ఉదయం ఢిల్లీ స్టేషన్‌లో దిగిన వెంటనే కలుస్తానని చెప్పి వెళ్లిపోయాడు.

అందరూ యాత్ర గురించి ఉత్సాహంగా చర్చించుకుంటూ నిద్రపోయారు. తెల్లవారగానే, ట్రావెల్స్ వారు కాఫీ తీసుకురాకపోవడంతో, నిన్నటి వరకు చేసిన మర్యాదలు అన్నీ ఎక్కడ మాయమయ్యాయా అని అందరూ అనుకున్నారు. గోపి పరమానందరావుకు ఫోన్ చేయగా, ఫోన్ స్విచ్ ఆఫ్ అని వచ్చింది. “నేను వెళ్లి పక్క కోచ్‌లో చూసి వస్తాను” అని చెప్పి, గోపి అంతా వెతికినా పరమానందరావు కానీ అతని సహాయకులు కానీ ఎక్కడా కనిపించలేదని తెలిపాడు. కొంతమంది తోటి ప్రయాణికులు కూడా ఫోన్ చేశారు, కానీ ఫోన్ స్విచ్ ఆఫ్ అని రావడంతో ఏమి జరిగిందో తెలియక అందరికీ అనేక సందేహాలు కలిగాయి. రైలు మథురా స్టేషన్ చేరగానే, అందరూ వారి యాత్ర సజావుగా సాగాలని ద్వారకాధీశుడిని ప్రార్థించి, అక్కడ అమ్ముతున్న వేడి వేడి కాఫీని తాగారు. రైలు వేగం పుంజుకోగానే, ట్రావెల్స్ వారిపై అనేక సందేహాలు అందరి మనస్సులలో చోటుచేసుకున్నాయి. రైలు ఉదయం ఎనిమిదిగంటలకల్లా ఢిల్లీ చేరుకుంది.

రైలు దిగిన చాలా సేపటి తర్వాత కూడా పరమానందరావు కనిపించకపోవడంతో, గోపితో పాటు మరికొందరు రైలు మొత్తాన్ని వెతికారు. కానీ ఎక్కడా వారి జాడ కనిపించలేదు. పరమానందరావుకి, అలాగే హైదరాబాద్‌లోని చిరంతన్ ట్రావెల్స్ కార్యాలయానికి కూడా ఫోన్ చేశారు. కానీ అన్ని నంబర్లు స్విచ్ ఆఫ్ అయి ఉండటంతో, ట్రావెల్స్ వారు ప్రయాణికులను మోసం చేశారని అర్థమైంది.

గోపి వచ్చి అందరికీ విషయం చెప్పడంతో, ఒక్క క్షణం పాటు వారికి ఏమి తోచలేదు. ఎలా స్పందించాలో అర్థం కాలేదు.బాధ, భయం కలగలిపి వారికి ఏమి చేయాలో తోచక కన్నీరు పెట్టుకుంటూ గోపిని సహాయం చేయమని అర్థించారు.”ఆంటీ, మీరు బెంగ పెట్టుకోకండి, నేను ఉన్నాను కదా. మీకు ఏ భయం లేదు. ట్రావెల్స్ వారిని ఇలా వదిలిపెట్టకూడదు.స్టేషన్ మాస్టర్‌ని కలిసి పోలీస్ లకి ఫిర్యాదు చేయాలి” అని గోపి అనడంతో, “అవును బాబు. సరిగ్గా చెప్పావు.ఎంత మోసం చేశారు ముసలివాళ్ళని. వీరిని అస్సలు వదిలిపెట్టకూడదు. ఇవాళ నువ్వే లేకపోతే మాకు ఎంత కష్టం అయ్యేదో” అంటూ కంటతడి తుడుచుకుంది కామాక్షి. గోపి వారిని ఓదార్చి, టిఫిన్, మంచినీళ్ళు తెచ్చి ఇచ్చి, కొంతమందితో కలిసి స్టేషన్ మాస్టర్‌ను కలవడానికి బయలుదేరాడు.

స్టేషన్ మాస్టర్ కపూర్ సాబ్ మంచి వ్యక్తి. గోపితో పాటు మిగిలిన ప్రయాణీకులకు జరిగిన అన్యాయం తెలుసుకుని వెంటనే స్పందించారు. రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేయమని చెప్పి బాధితులకు అండగా నిలిచారు. అంతేకాదు, చార్‌ధామ్ యాత్రికులందరినీ ఆదరించి, వారికి భోజనం, మంచినీరు ఏర్పాటు చేయడమే కాకుండా, విశ్రాంతి తీసుకోవడానికి వెయిటింగ్ రూమ్ కేటాయించి వారి ప్రయాణ కష్టాలను తీర్చారు. రైల్వే పోలీసులు వెంటనే ఫిర్యాదు నమోదు చేసుకుని, ట్రావెల్స్ కంపెనీ హైదరాబాద్‌కు చెందినది కావడంతో అక్కడికి రిపోర్ట్ పంపిస్తామని చెప్పారు. కపూర్ సాబ్ సహాయంతో ప్రయాణీకులు తిరిగి టిక్కెట్లు బుక్ చేసుకుని క్షేమంగా హైదరాబాద్ చేరుకున్నారు.

యాత్ర నుండి వచ్చినప్పటి నుండి నలుగురు స్నేహితురాళ్లు చాలా నిరాశకు లోనయ్యారు. యాత్రకు ఎంత సరదాగా బయలుదేరారో అది వారికి అంత బాధను మిగిల్చింది. డబ్బులు పోయిన బాధకన్నా చార్‌ధామ్ యాత్ర పూర్తి కాలేదనే విచారం ఎక్కువగా ఉంది. ఆ సంఘటన జరిగి మూడు నెలలు గడిచాయి.

ఒకనాడు సాయంత్రం పార్కులో కాలక్షేపం చేస్తుండగా, నలుగురు జరిగిన మోసం గురించి మాట్లాడుకుంటున్నారు. అప్పుడు కామాక్షి, “ట్రావెలర్స్ వారి విషయం ఏమైనా తెలిసిందా లతా? సన్యాసరావు గారు పోలీస్ స్టేషన్‌లో కనుక్కున్నారా?” అని అడిగింది. “ఆయన పోలీస్ స్టేషన్‌కి వారానికి రెండు మూడుసార్లు ఫోన్ చేస్తూనే ఉన్నారు. ఇప్పటి వరకు ఏమి తెలియలేదు కామాక్షి” అంది బాధగా. “వారు పట్టుబడతారు అన్న నమ్మకం లేదు నాకు. చాలా పకడ్బందీగా ప్రణాళిక వేసి ఇంత మందిని మోసం చేశారు” అంది బిందు.

“ఏదైనా మన కల ఒక కలగానే మిగిలిపోయింది. ఇక ఈ జన్మలో యాత్ర చేయగలమన్న నమ్మకం లేదు” అంది హేమ విచారంగా. వీరు ఇలా మాటలలో ఉండగా లతకి గోపి నుండి కాల్ వచ్చింది. “ఆంటీ, చాలా సంతోషకరమైన వార్త చెప్పాలి. ఇప్పుడే పోలీస్ స్టేషన్ నుండి ఫోన్ వచ్చింది, ట్రావెల్స్ వారు పట్టుబడ్డారు. మన డబ్బులు కూడా కొన్ని ఫార్మాలిటీలు చేశాక మనకి ట్రాన్స్ఫర్ చేస్తారు. ఇంకో సంగతి చెప్పాలి ఆంటీ, వచ్చే ఏడు నేను మా బామ్మను చార్‌ధామ్ యాత్ర చేయించి ఆమె కోరిక నెరవేర్చాలని ఉంది. నేనే స్వంతంగా అన్నీ బుక్ చేస్తాను, ఏ ట్రావెల్స్ వారితో వెళ్లను. మీరంతా కూడా వస్తానంటే మిమ్మల్ని కూడా తీసుకునివెళ్తాను. అందరినీ అడిగి చెప్పండి, ఇంకా చాలా సమయం ఉంది కదా. నేను, బామ్మ వచ్చి మిమ్మల్ని కలుస్తాము. ఉంటాను ఆంటీ” అని ఫోన్ పెట్టేశాడు.

గోపి చెప్పిన శుభవార్తతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఆ సంతోషంలో నోట మాట రాలేదు; ఒక క్షణం తాము విన్నది నిజమేనా అన్న సందేహం కలిగింది. ఆయన చేసిన ప్రతిపాదన, వారి మోడుబారిన ఆశలకు ప్రాణం పోసి, వారి చిరకాల అభీష్టమైన మోక్ష మార్గాన్ని మరింత చేరువ చేసింది.

***

Written by Thata Kameshwari

రచయత్రీ పరిచయం
తాతాకామేశ్వరిగారుప్రవాసఆంధ్రులు.ఈమె జననం అంధ్ర, విజయనగరం జిల్లా, చీపురపల్లి. అక్కడేఈమే మవయ్యగరి ఇంటివద్ద ఉండి చదువు పుర్తిచేసుకునిచక్రధర్పూర్, బిహర్ (ప్రస్తుతం ఝారఖండ) లొ అమ్మ-నాన్న వద్ద ఉండి రైల్వేలొ కొన్నాళ్ళు ఉద్యోగం చేసి వివాహం అనంతరం దుర్గాపూర్,వెస్ట్బెంగాల్ లొ సుమారు 30ఏళ్లు ఉన్నారు. ప్రస్తుతం ఈమె ముంబై లో పిల్లల వద్ద ఉంటున్నారు.
ఈమె 2019 నుండికలం పట్టి చిన్ననాటి కోరిక తిర్చుకుంటున్నారు. ఇప్పటికి ఈమెమూడు కధా సంకనలు, వెలుగు - స్ఫూర్తిదాయక కథలు , అర్పణ - అమూల్యమైన కథలు , నివేదన - అపురూప కథా మణిహారం మరియుఆగ్లము లొ వంటల పుస్తకం-చట్నీస్ ఫర్ ది సోల్, ఈటీవల తెలుగులో స్వాద – నార్త్ ఇండియన్ వెజిటేరియన్ వాంటలు వ్రాసారు. ఈమె కథలు గోతెలుగు, సంచిక, మాలిక లాంటి వివిధ అంతర్జాలపత్రికలలో ప్రచురణ అయ్యాయి.
Mob no – 9948028853
Email id – tatabhavani2009@gmail.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ఓ ప్రేమ కథ (మోహనరాగం) – 7వ భాగం

చిత్రమైన చైత్రమాసం..