హరి చందన-12వ భాగం

సాంఘిక నవల

పడుకోడానికి వెడుతుంటే సీతమ్మ వెనుకనుంచి “అమ్మాయ్ఉదయం త్వరగా లేవండి.. గుళ్లో అభిషేకం ఉంది. స్నానాలు చేసి వెళ్ళాలి “. చెప్పింది.
“అలాగే ఆంటీ!” లోపలికెళ్ళాక,సెల్ లో నాలుగుగంటలకి అలారం సెట్ చేసింది చందన.
తల్లీ తండ్రి తో మాట్లాడి ఫోటోలు షేర్ చేశారు.
******************

సంక్రాంతినాడు ఉదయమే చందన నిద్ర లేచి శైలజని కూడా నిద్ర లేపి, ఇద్దరూ కిందకి వెళ్లారు
ముగ్గులు వేస్తున్న వాళ్లకు సాయం చేశారు. తమకి తోచిన ముగ్గులు వేశారు. ‘చందనా!ఇక్కడ చుక్కలు కలుపు, అక్కడ చుక్కలు పెట్టు” అంటూ,సీతమ్మ, రుక్మిణి కూడా కలిసిపోయి మాట్లాడుతుంటే తను తీసుకున్న నిర్ణయంలో పొరపాటు లేదనిపించింది.కానీ, హరి కుటుంబం తరఫు నుంచి ఎలాంటి నిర్ణయం వస్తుందో తెలియదు. అయినా ముందు జగదీశ్, శ్యామల పెళ్లి గురించి చూడాలి. అసలు… ”
“అమ్మాయ్!అంతా దీర్ఘoగా దేని గురించి ఆలోచిస్తున్నావ్? వెళ్లి స్నానాలు చేసి రండి “సీతమ్మ హెచ్చరిక తో ఇద్దరూ పైకి వెళ్లారు. సోనీ లేచి కూర్చుని సెల్ లో మాట్లాడుతోంది. ఒకరి తరువాత ఒకరుగా ముగ్గురు స్నానాలు చేసి, కొత్త చీరలు కట్టుకుని,ముస్తాబు అయ్యారు.
కిందకి వెళ్లి వృద్ధ దంపతుల ఆశీర్వాదం తీసుకున్నారు.
“ఈ సంక్రాంతి మాకు జీవితంలో మరిచిపోలేనిది తాతయ్యగారూ! మీ వంటి పెద్దల ఆశీస్సులు మాకు లభిస్తున్నాయి.” అంది చందన, వీల్ ఛైర్ లో కూర్చుని ఉన్న తాతయ్య గారి పాదాల దగ్గర కూర్చుని, ఆయన పాదాలంటి నమస్కరిస్తూ.
ఆయనబోసినోటితో నవ్వుతూ “శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు”
చందన తలమీద్ చెయ్యి వేసి, దీవించారు.
“ఏమేపిల్లా! మీ వాళ్ళు సంబంధాలు చూస్తున్నారా? తాతగారు దీవించారంటే జరిగి తీరుతుంది ” బామ్మగారు బోసినోటితో నవ్వారు.
“చూస్తున్నారు అమ్మమ్మా. 1,2 సంబంధాలు మాటల్లో ఉన్నాయి చూడాలి, ఏది సెటిల్ అవుతుందో మరి ” అంది శైలజ.
“నీకూ పెళ్లి కల వచ్చేసింది..ఇద్దరూ ఒకేసారి చేసేసుకుంటే మీ వాళ్ళకి పెళ్లిభోజనం ఖర్చులు కలిసి వస్తాయే చిన్న పిల్లా ”
“అయ్యో!బామ్మా, మా వాళ్ళు నాకు ఇంకా చూడడం మొదలు పెట్టలేదు . మేమిద్దరం ఒకే తల్లి పిల్లలం కాదు,మా అమ్మ వాళ్లమ్మ మంచి స్నేహితులు. మేము అంతకంటే ఆత్మీయులం అయ్యాము.
నాకు తోడబుట్టిన అక్కాచెల్లెళ్ళు లేరు,దానికీ లేరు. మేమే ఒకరికొకరం అయ్యాం. “చెప్పింది శైలజ.

“రక్తసంబంధం కంటే స్నేహమే ఎక్కువ. ఇద్దరూ ఒకే కుటుంబం లోని వాళ్ళని చేసుకుంటే ఇద్దరూ జీవితాంతం కలిసి ఉండవచ్చు ”
అంది ఆవిడ.
చందన,శైలజ మొహమొహాలు చూసుకున్నారు.
రామ్ ప్రసాద్, కృష్ణ ప్రసాద్ ఆ గదిలోకి రావడంతో “మేము మళ్ళీ వస్తాం తాతయ్యా!” లేచి బయటికి రాబోతుంటే “ఆగండమ్మా! మీ ముందే ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి “వారిని ఆగమని చెప్పి,”తమ్ముడూ!హరిని పిలువు “”అన్నాడు.
కృష్ణప్రసాద్ గుమ్మం వరకూ వెళ్లి, స్నేహితులతో కబుర్లు చెప్తున్న
హరిని పిలిచాడు.హరి లేచి వచ్చాడు.

రామ్ ప్రసాద్ తండ్రి పక్కన కూర్చుని “నాన్నగారూ! మన హరి ఈ అమ్మాయిని ఇష్ట పడుతున్నాడు. మీరిద్దరూ సరేనంటే వీళ్ళ పెళ్లి జరిపించేద్దాం “చెవి దగ్గర నోరు పెట్టి గట్టిగా చెప్పాడు.
హరి,చందన మొహమొహాలు చూసుకున్నారు. ఏమి చెప్తారా అని ఎదురు చూస్తున్నారు.
“అంతే కాదు,ఆ చిన్నమ్మాయిని మన సుబ్బక్క మనవడికి చేసుకుంటానoటోంది.”

“ఎవరూ…. ఆ సుందరానికా “అడిగిoది మహాలక్షమ్మగారు.
“అవునమ్మా! ”
ఈ సారి మొహమొహాలు చూసుకోవడం చందన, శైలజలవంతు అయింది.
షాక్ తగిలినట్లు గుడ్లు పెద్దవి చేసి చూస్తున్న శైలజని చూసి, తనలో తనే నవ్వుకున్నాడుహరి.
“సుబ్బక్క, బావగారు కాసేపట్లో మనవడిని తీసుకుని వస్తున్నారు.
ఇక్కడే పెళ్లి చూపులు జరిపించి, నచ్చితే ఓ మాట అనుకుంటే
సరిపోతుంది ”
శైలజ ఏదో అనబోతుంటే, చందన చెయ్యి నొక్కి ఆపింది.
“మనం కులం గోత్రం మంచి చెడు అంటూ అన్నీ చూసి జగ్గూకి
పెళ్లి చేశాం.
ఆ అమ్మాయి మన ఉమ్మడి కుటుంబంలో ఇమడలేక, నేను కావాలో, మీ కుటుంబం కావాలో తేల్చుకోమంటే మనవాడు కుటుంబమే కావాలని అన్నాడు. ఆ అమ్మాయి పిల్లాడిని కూడా వదిలేసి వెళ్లి మరో పెళ్లి చేసేసుకుంది. అందుకే హరి విషయంలో వాడి నిర్ణయానికి ఒప్పుకుందామనుకుంటున్నాను.”
“మన సీతమ్మ ఏమంటోoదిరా ? రుక్మిణిని అడిగావా కృష్ణుడూ!”
“అవున్రా రామా!అత్తా కోడళ్లకి సఖ్యత కుదిరితేనే ఆ కుటుంబాల్లో కలతలు ఉండవురా అబ్బాయ్!”అన్నారు బామ్మ గారు.
“నీ కోడళ్లిద్దరూ నీమాటే తమ మాట అన్నారమ్మ ” చెప్పాడు కృష్ణ.
“మీ అందరికీ ఇష్టమైతే మాదేముందిరా! కాటికి కాళ్ళు చాచుకుని ఉన్నవాళ్ళం.భవిష్యత్తు అంతా పిల్లలిది. నువ్వన్నట్లు జగ్గూ కి అన్నీ చూసి చేశాము. కానీ, అది మూడునాళ్ల ముచ్చట అయింది. వాళ్లకి నచ్చినట్లే కానివ్వండి ” అన్నారాయన.
“అమ్మాయ్! ముందు మీ అభిప్రాయం చెప్పండమ్మా ” బామ్మ గారూ చందన వైపు చూసింది.
“ఇక్కడ ఇంత హఠాత్తు పెళ్లి ప్రసక్తి వస్తుందనుకోలేదు. మా అమ్మ నాన్న గారితో ఒకమాటచెప్పి….”
“మంచిది..అదే పద్ధతి కూడా.ఇక్కడ మా అనుమతి ముఖ్యం అయినట్లే, మీ కన్నవారి అనుమతి కూడా తప్పనిసరి. కాకపోతే
అందరూ కూర్చుని మాట్లాడుకుంటే… అవసరార్ధం “అప్పుడు మేమిలా అనుకున్నాం, అలా అనుకోలేదు “వంటి తప్పించుకునే పరిస్థితి ఉండదు. ఇలా అందరూ కూర్చుని మాట్లాడుకుంటే చాలా సమస్యలకి పరిస్కారం దొరుకుతుందని మా నమ్మకం.”
“అవునూ ముసుగులో గుద్దులాట వ్యవహారం ఉండకూడదు..
ఏ నిర్ణయాలు తీసుకున్నా, మంచి అయినా, చెడు అయినా అందరం కూర్చుని చర్చించుకోవడం మా అలవాటు. అందువల్లనే మనస్పర్ధలకి తావుండదు.”అన్నాడు కృష్ణ ప్రసాద్
“నిజమే అంకుల్.! అమ్మ,నాన్నగారితో ఒకమాట చెప్పాకే నేను ఏ విషయమైనా చెప్పగలను.మీరoదరు కులాంతర వివాహానికి ఒప్పుకుంటారోలేదో అని. హరిగారు పెళ్లి ప్రస్తావన తెచ్చిన విషయం కూడా ఇంకా ఇంట్లో చెప్పలేదు నేను .మరో మాట! శైలు విషయం పూర్తిగా కొత్త విషయం. ఇప్పుడు మీ అక్కగారు వచ్చినా స్నేహధర్మంగా పరిచయాలు కానివ్వండి.ఒకవేళ ఇద్దరికీ నచ్చితే అప్పుడు మా పెద్దమ్మ పెదనాన్న గారికి చెప్తాను.” మర్యాదగానే చెప్పింది చందన.

“భేషుగ్గా చెప్పావమ్మా.అదీ పద్ధతoటే… అమ్మ నాన్నకి చెప్పకుండా మీరే నిర్ణయం తీసుకుని ఉంటే “ఈ పిల్లలిద్దరికి పెద్దవాళ్ళoటే లెక్క లేదులావుందీ అనుకోవలసివచ్చేది “అన్నాడు కృష్ణ ప్రసాద్.
“థాంక్యూ అంకుల్ అర్ధం చేసుకున్నందుకు.”చేతులు జోడించి నమస్కరించింది చందన.
“ఆలస్యం అమృతం విషం అంటారు.వెళ్లి మీ వాళ్ళతో మాట్లాడిరామ్మా ” ఎప్పుడొచ్చిందో గాని సీతమ్మ చందనతో చెప్పింది.
” అంతా ఓకే అనుకున్నాక ఎవరూ మాట్లాడితే ఏంటీ బాబాయ్, మీరే వాళ్ళ నాన్నగారితో మాట్లాడండి “అన్నాడు జగదీశ్.
“అదీ పాయింటే! మీనాన్న గారి నంబర్ డయల్ చేసి మా అన్నయ్యకి ఇవ్వమ్మా ” అన్నాడు కృష్ణ.
నంబర్ డయల్ చేసి “”డాడీ!… ఆ బాగున్నాము చాలా ఎంజాయ్ చేస్తున్నాం.” స్పీకర్ ఆన్ చేసింది.
“అక్కడ వాళ్లనేమీ ఇబ్బంది పెట్టడంలేదుగా ”
“లేదు డాడీ…. రాంప్రసాద్ అంకుల్ మీతో మాట్లాడతారట “సెల్ రాంప్రసాద్ కి ఇచ్చింది.
“నమస్కారం వాసుదేవరావుగారు!”
“నమస్కారం రాంప్రసాద్ గారూ! పిల్లలందరూ వచ్చి,మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నట్లున్నారు.”
“ఇబ్బంది అనుకుంటే అసలు రమ్మని అంగీకారం చెప్పేవాళ్ళమే కాదు. మీకో శుభవార్త చెప్పడానికి కాల్ చేస్తున్నాను.”
“శుభవార్తనా? ఏమిటి సార్ ”
“సార్ కాదు బావగారు అనండి.. మీరు అంగీకరిస్తే మీ అమ్మాయిని మా ఇంటికోడలుగా చేసుకోవాలనుకుంటున్నాం ”
“అవునా… సంతోషం…”
“అంతేకాదు శైలజని మా అక్క మనవడికిచ్చి చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాం. ఈ విషయం వారికి కూడా తెలిపి, మీ దంపతులు, ఆ దంపతులు ఒకసారి వస్తే అన్నీ విషయాలు… అంటే.. కట్న కానుకలు అనుకునేరు…. అదేమీ కాదు. పరస్పరo పరిచయాలు చేసుకుని, మంచి చెడు మాట్లాడుకుందాం ”
“అలాగే నండి తప్పకుండా. మంచిరోజు చూసుకుని వాళ్ళు, మేము బయలు దేరి వస్తాం “అన్నాడు వాసుదేవరావు.
సెల్ చందనకి ఇచ్చి “నీ తరఫు నుంచి సందేహాలు, అనుమానాలు లేవు కదమ్మా ” అడిగాడు రాంప్రసాద్.
” నేను మాములుగా నా ఉద్యోగం నేను చేసుకోవచ్చు కదా? ”

“నిరంభ్యoతరంగా చేసుకోవచ్చు. నీకు తెలిసిందే…ఇది ఉమ్మడి కుటుంబం. ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా,పెద్దవాళ్ళని గౌరవిస్తూ,… అలా అని మీ ఆత్మభిమానాన్ని కోల్పోవలసిన అవసరం రాకుండా చూసుకోవాలి అందరితో ప్రేమగా, కలిసిపోవాలి”
“అంతే కాదమ్మాయ్! పండుగలకి శుభాకార్యాలకి వస్తూ పోతూ కోడలిగా బాధ్యతలు అందుకోవాలి “చెప్పింది సీతమ్మ.
“ఏ ఇంటికి వెళ్లినా అవి తప్పనిసరి.లేకుంటే కలతలే. అయినా ఉమ్మడి కుటుంబం అని తెలిసే ఒప్పుకుంటోంది కనుక నువ్వు వేరే చెప్పాలా అక్కా!అయినా చదువుకున్న పిల్లలకి పది సార్లు చెప్పక్కర్లేదులే “అంది రుక్మిణి.

“ఇందాకే నేను చెప్పాను కదమ్మాయ్.. ఆయన ఆశీర్వదిస్తే జరిగి పోతుందని. చూశావా కళ్యాణ ఘడియ ఎలా తోసుకొచ్చిందో!” ముసలావిడ బోసి నోటితో నవ్వింది.
” తాతయ్యగారి నోటి మాటే కాదు, మీ నోటి మాట కూడా ఫలించబోతోందిగా అమ్మమ్మ, మీరు అన్నారుగా మీరిద్దరూ ఒకింటి కోడళ్ళు అయితే బాగుంటుందన్నారుగా “అంది చందన.
“ఒకరు మనవడిభార్యగా, మరొకరు మునిమనవడిభార్యగా ”
అంది రుక్మిణి.
“వాళ్ళిద్దరికీ నచ్చిన తరువాత ఆ మాట అనుకోవాలి ఆంటీ ” అంది చందన.
“నిజమేలే బలవంతంగా చెయ్యము కదా ”
ఆ మాటకి అందరూ ఒప్పుకున్నారు.
ఆ గదిలోనుంచి బయటికి రాగానే స్నేహితులందరు శుభాకాంక్షలు
చెప్పారు.
“థాంక్స్!. కానీ మా పేరెంట్స్ వచ్చి మాట్లాడినతరువాతే సంబంధం కుదిరినట్లు.మా ప్రమేయం లేకుండా, మా పెద్దరికాన్ని మంట కలిపి పెళ్లి చేసుకుంటున్నావు అని వాళ్ళు నాగురించి అనుకుని బాధ పడకూడదు. అందుకే ఇంక ఎవరూ ఆ టాపిక్ ఎత్తద్దు ప్లీజ్!” అంది.
“ఒకే డన్!”అందరూ బొటనవేలు చూపించారు.
“అమ్మ నాన్న గురించి ఎంత చక్కగా ఆలోచిస్తున్నావమ్మా.”
సుశీల వైపు చూసి “నేర్చుకో!”అంది సీతమ్మ.
“అయ్యో!ఆంటీ….”
“మీరేమీ కంగారు పడక్కరలేదు… అమ్మ చెప్పింది నిజమే. మీ దగ్గర నేర్చుకోవలసినవి చాలా ఉన్నాయి ” నవ్వేసింది సుశీల.
“ఇదీ పాజిటివ్ థింకింగ్..ఆవిడ దగ్గర నేను నేర్చుకునేదేంటి అని తల ఎగరేయకుండా చెప్పింది … మాచెల్లి బంగారం ” అన్నాడు జగదీశ్.
బయటి నుంచి సన్నాయి మేళం వినిపిస్తుంటే………

(సశేషం )

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

గతమెంతో ఘనము

పాఠశాల గదిలో జీవిత పాఠాలు