చెరుకుతుద వెన్ను పుట్టిన

కథ

కొత్తగా పెళ్లయి తొలి పండుగ సంక్రాంతికి పుట్టింటికి మా ఊరు వచ్చాము. అక్క,బావ కూడా ఢిల్లీ నుండి వచ్చారు అక్కకు ఆరు నెలల బాబు. త్వరలో అమెరికా వెళుతున్నారు వాళ్ళు. మేము ముగ్గురక్క చెల్లెళ్ళం ఒక్క అన్నయ్య. అన్నయ్య బీదర్లో ఇంజనీరింగ్ చదువుతున్నాడు చెల్లి అమ్మ వాళ్ళ దగ్గరే ఇంటి నుండే స్కూల్ కి వెళ్తున్నది. అందరం కలుసుకున్నట్లు ఉంటుందని అన్నయ్య కూడా వచ్చాడు అమ్మ వాళ్ళు హైదరాబాద్ నుండి వారం రోజులు ముందుగా వచ్చి పండగ ఏర్పాట్లలో ఉన్నారు.
మా ఊరు,మా గురించి ఇక్కడ మీతో కొంత పరిచయం చేసుకోవాల్సి ఉంది. ఇసుకపల్లి సముద్ర తీరాన అధునాతనమైన పల్లెటూరు మాది. పాడిపంటలతో సస్యశ్యామలంగా రైతే రాజని చాటుతుందిమా ఊరు. మా ఊరికి ఒక చరిత్ర కూడా ఉంది మహాత్మా గాంధీ స్వాతంత్ర పోరాట సమయంలో ఉప్పు సత్యాగ్రహ ఉద్యమ పర్యటనలో మా ఊరు వచ్చారట. ఊరినంతా ఉత్తేజపరిచిన ఈ ఉద్యమంలో తరాలుగా పేరు ప్రతిష్టలతో పాటు పెద్దింటి వారన్నమా తాతగారు కూడా జనాలను ఉత్సాహపరుస్తూ ఈ ఉద్యమంలో పాల్గొని ఆదర్శవంతంగా ముందుకు నడిపించారని అప్పటి వార్తాపత్రికల్లో గాంధీ గారితో పాటుగా ఫోటోలతో సహా వార్తలు వచ్చాయని ఆ పేపర్ కటింగ్స్ మా ఇంట్లో ఉన్నాయి.
మాకు ఊహ తెలిసినప్పటికి మా తాతగారు స్వర్గస్తులయ్యారు. నిలువెత్తు ఫోటో మాత్రం ఇంట్లో ఉండేది. మా తాతగారి లాగానే దర్పంగా, అందంగా మానాన్న ఉంటారని, తాతగారి ఒరవడి మా నాన్నలో బాగా కనిపిస్తుందని అందరూ అనేవారు. నాన్న అప్పట్లోనే రిషి వ్యాలీలో చదువుకున్నారట. వ్యాపార విద్య కాకుండా విలువలతో కూడిన విద్యా సంస్థగా ఇప్పటికీ రిషి వ్యాలీ గురించి చెప్తుంటారు. నాన్న ఆలోచనలు, భావాలు జనాకర్షకంగా ఉండేవి. మా ఊరు వేణుగోపాలస్వామి ఆలయ నిర్మాణకర్తలు మా తాతగారు కాగా, నాన్న ధర్మకర్తగా స్వామి ఉత్సవాలు, ఊరేగింపులు ఘనంగా ప్రత్యేకంగా జరిపించేవారు. హై స్కూల్ కరస్పాండెంట్ గా కూడా చుట్టుపక్కల పల్లెల నుండి పేద పిల్లలను ప్రోత్సహిస్తూ వసతి,భోజన సౌకర్యాలతో పాటు ఉచితంగా చదువుకునేందుకు ఏర్పాటు చేశారు. ఎంతోమందికి పై చదువులకు సహాయపడుతూ ఉద్యోగాల్లో కూడా చేర్పించారు. సొసైటీ ప్రెసిడెంట్ గా కొత్త కొత్త ప్రణాళికలతో రైతులకు,చిన్న వ్యాపారస్తులకు ఎంతో చేయూతనిచ్చేవారు. దానగుణంలో ఎముక లేని చెయ్యి అనిపించుకున్నారు. ఆయన సహాయార్థం వచ్చేవాళ్లు, ఊరి విశేషాలు ముచ్చటించేవారు, సన్నిహితులు, బంధువుల రాకపోకలతో ఇల్లు ఎప్పుడు కళకళలాడుతుండేది. నాన్న పెద్దలనాటి మా బంగాళాను హాస్పిటల్ కు ఇచ్చేసి ఉచిత వైద్య సౌకర్యాలు ఏర్పరిచారు. నాలుగు ఎకరాల స్థలంలో పూల తోటలు, పండ్ల చెట్ల మధ్య ఇప్పటి రిసార్ట్స ను మరిపిస్తూ అప్పట్లోనే మా నాన్న ఆయన సొంత ప్లాన్ తో జమ్ము గడ్డి,పైకప్పుగా అన్ని వసతులతో ఇల్లు కట్టించారు.
మా ఊరికి ఐదు మైళ్ళ దూరంలో మా అమ్మమ్మగారి ఊరు. తాతగారు, అమ్మమ్మ చాలా నిరాడంబరమైన వాళ్లు. వారి సంతానంముగ్గురు ఆడపిల్లలలో మా అమ్మ మధ్య ఆమె. పేరు కౌసల్య, పేరు ఎంత కోమలమో మనిషి,మనసు కూడా అంత సున్నితం. చాలా అందమైన ఆమె. ఆడపిల్లలకు చదువులు ఎందుకు అవసరమైనప్పుడు ఒక కార్డు ముక్క రాయగలిగితే చాలు, చాకలి పద్దు చూసుకుంటే చాలు అన్న రోజులవి. ఆధోరణిలోనే చదువులు చెప్పించలేదు, పెద్దబాల శిక్ష మాత్రం పూర్తి చేయించారు. అయితే, ఆ చదువుతోనే మా అమ్మ మాకు అక్షర పునాది వేసింది. తీరిక చేసుకుని ఇంట్లోనే ఒకటవ తరగతి వరకు పూర్తి చేయించి ఆపై స్కూలుకు పంపింది మమ్మల్ని అందరినీ. వెంకటేశ్వర స్వామి ఇలవేల్పుగా శనివారం వ్రతాలు, ధనుర్మాస పూజలు, ఉపవాసాలు ఇంటెడు పనులు చేసుకుంటూనే, ఎవరికి ఇబ్బంది కలగకుండా భక్తిగా చేసుకునేది. ఈ విషయంలో అమ్మను అనుసరిస్తూ మరువలేని జ్ఞాపకాలని మిగులుచుకున్నాను నేను. అమ్మ అంటే పని వారి దగ్గర నుండి బంధువుల వరకు అందరికీ అభిమానం.అమ్మా నాన్న కూడా ఒకరికొకరు ఎంతో అనుకూలంగా ఉండేవారు. మా నాన్నకు మేమంటే చాలా ప్రేమ. అన్ని వ్యవహారాల మధ్య కూడా మాతో గడిపేందుకు సమయం ఉంచుకునేవారు. ఎప్పుడూ ఏవో పేచీ లతో పుట్టింటికి వచ్చి ఉండే మా మేనత్తలు, అప్పుడప్పుడు అత్తపెత్తనంతో నాయనమ్మ అమ్మను సాధించేవారు అయితే నాన్న వరకు ఏ విషయాలు వెళ్లేవి కావు. తీరిక వేళల్లో మా అమ్మ మాకెన్నో విలువలతో కూడిన విషయాలను చెప్పేది.
జీవితం ఒక్కలా సాగితే చెప్పుకునేందుకు చరిత్రేముంటుంది. అలాంటి చరిత్ర పుటే, మా జీవితం. వడ్డించిన విస్తరిలా నిండుగా మధురంగా సాగిపోతున్న మా జీవితాల్లో అపశృతికి అంకురార్పణ జరిగింది.
ఇంటా బయట కూడా వేలెత్తి చూప లేనట్లు గడిచిపోతున్న నాన్న జీవితంలో అమావాస్య మొదలై, మా కుటుంబానికి పీడ పట్టినట్లు అయింది. చిరకాల మిత్రుని చితికిపోయిన సంసారాన్ని నిలబెట్టేందుకు అతనికి చేయి అందించి తాను మునిగిపోయినట్లయింది. పోచంపల్లి, సూర్యరావుపేటల్లో కాంట్రాక్ట్ పనులు భారీ ఎత్తున మొదలుపెట్టిన మిత్రుడు పార్ట్నర్స్ తో ఇబ్బందులు మొదలయి నాన్న సహాయం కోరాడు. కేవలం ఆర్థిక సహాయమే కాకుండా తోడుగా నిలిచి గట్టెక్కించమని ప్రాధాయపడటంతో నాన్న కాదనలేకపోయాడు. అలా మొదలై అంతటితో ఆగక ఇంకా కొత్తగా విస్తరించి రియల్ ఎస్టేట్ బిజినెస్ కూడా జత అయింది ఈ మార్పుల్లో మేము హైదరాబాదుకు మారాము. ఈ మధ్యకాలంలో నాయనమ్మ కాలం చేశారు. సరూర్నగర్ లో పదెకరాల స్థలంలో నవాబులబంగ్లా కొన్నాడు నాన్న. మేము సిటీలో స్కూళ్లలో చేరాము. స్కూల్ కి వెళ్లి వచ్చేందుకు కారు,డ్రైవర్ను ఏర్పాటు చేశారు. ఈ కొత్త ప్రపంచం మాకు బాగానే అనిపించింది. అమ్మకు మాత్రం ఎక్కడైనా అమ్మ పని అమ్మదే కానీ సిటీ కాపురం కావడంతో బంధువుల రాకపోకలు ఎక్కువయ్యాయి. సిటీ చూసేందుకు, షాపింగులకు తిప్పడం ఎక్స్ట్రా పని అయింది అమ్మకు.
సూర్యరావుపేటలో కొత్త వర్క్ తీసుకున్నారు నాన్న.పెద్ద వర్క్ అవడంతో పది పదిహేను రోజులకు ఒకసారి ఇంటికి వచ్చేవారు. ఇలా ఇన్ని రోజులు నాన్నను చూడకుండా ఉండటం మాకు చాలా వెలితిగా అనిపించేది. అమ్మలో కూడా తెలియని దిగులు. రోజులు గడిచే కొద్ది ఇంటి వాతావరణంలో ఏదో తెలియని మార్పు నాన్న ఉన్నప్పుడు తరచూ కబుర్లు చెప్పుకుంటూ అందరంఆరు బయట పడుకునే వాళ్ళం.కొన్నాళ్లుగా అర్ధరాత్రి ఏవో గుసగుసగా మాటలు వినిపిస్తూ మెలకువ వచ్చేది. అంతలోనే చిన్నగా ఏడుపు.చల్లని రాత్రి కూడా నాకు చెమటలు పట్టేవి. ఏం జరుగుతున్నది? అమ్మ ఎందుకు ఏడుస్తున్నది? వణికి పోతూనే పడుకునేదాన్ని, పిల్లలందరి పరిస్థితి ఇదేనేమో నాకు తెలియదు. అన్న నాతో చాలా ప్రేమగా చనువుగా ఉంటాడు. ఈ విషయమై అన్నయ్యను అడగాలనిపించింది. అన్నయ్యా! నాకు చాలా భయంగా ఉంటున్నది,ఏం జరుగుతున్నది చెప్పు ప్లీజ్. నువ్వు అనవసరంగా ఏవో ఊహించుకోకు బంగారు. మనలాగానే అమ్మ కూడా నాన్నని మిస్ అవుతున్నది సరేనా! ఎంత బ్రతిమాలినా ఇలాగే చెప్పి ఊరుకోబెట్టేవాడు. అక్క కూడా అంతే. కానీ వాళ్ళిద్దరికీ విషయం ఏంటో తెలుసని నా గట్టి నమ్మకం. స్కూల్ కి వెళ్ళినా ఇవే ఆలోచనలు ఇంటికి వెళ్లేసరికి అమ్మను చూస్తానో లేదో, ఎందుకు అలా అనిపిస్తుందో అదీ తెలియడం లేదు నాకు. ఇంటర్వెల్లో క్లాస్ రూమ్ లో డెస్క్ మీద తల ఆన్చి వెక్కివెక్కి ఏడ్చిన రోజులు ఉన్నాయి. గుండెలు దడ దడ లాడుతూ ఇంటికి వెళ్లి అమ్మను చూశాక అమ్మయ్య నాది ఉత్తుత్తి భయమే అనుకునేదాన్ని. భయంలోనే బ్రతికిన రోజులవి. వ్యక్తం చేయలేని బాధ అది. ఎందుకో కానీ అమ్మ అక్కకు పెళ్లి చేసేయాలని ఆతృత పడసాగింది, మంచి సంబంధం కుదరడంతో అక్క పెళ్లి చేసేసారు . నేను బాగా చదువుతానని నన్ను డాక్టర్ చదివించాలని అమ్మా,నాన్న ఎప్పుడూ అనేవారు. కానీ పరిస్థితుల వల్ల అమ్మ పట్టుదలతో కోరి వచ్చిన సంబంధం కాదనకుండా మరో రెండేళ్లకు నా పెళ్లి కూడా జరిగిపోయింది.
సూర్యరావుపేటలో కొత్త వర్క్ తీసుకున్నారు నాన్న.పెద్ద వర్క్ అవడంతో పది పదిహేను రోజులకు ఒకసారి ఇంటికి వచ్చేవారు. ఇలా ఇన్ని రోజులు నాన్నను చూడకుండా ఉండటం మాకు చాలా వెలితిగా అనిపించేది. అమ్మలో కూడా తెలియని దిగులు. రోజులు గడిచే కొద్ది ఇంటి వాతావరణంలో ఏదో తెలియని మార్పు నాన్న ఉన్నప్పుడు తరచూ కబుర్లు చెప్పుకుంటూ అందరంఆరు బయట పడుకునే వాళ్ళం.కొన్నాళ్లుగా అర్ధరాత్రి ఏవో గుసగుసగా మాటలు వినిపిస్తూ మెలకువ వచ్చేది. అంతలోనే చిన్నగా ఏడుపు.చల్లని రాత్రి కూడా నాకు చెమటలు పట్టేవి. ఏం జరుగుతున్నది? అమ్మ ఎందుకు ఏడుస్తున్నది? వణికి పోతూనే పడుకునేదాన్ని, పిల్లలందరి పరిస్థితి ఇదేనేమో నాకు తెలియదు. అన్న నాతో చాలా ప్రేమగా చనువుగా ఉంటాడు. ఈ విషయమై అన్నయ్యను అడగాలనిపించింది. అన్నయ్యా! నాకు చాలా భయంగా ఉంటున్నది,ఏం జరుగుతున్నది చెప్పు ప్లీజ్. నువ్వు అనవసరంగా ఏవో ఊహించుకోకు బంగారు. మనలాగానే అమ్మ కూడా నాన్నని మిస్ అవుతున్నది సరేనా! ఎంత బ్రతిమాలినా ఇలాగే చెప్పి ఊరుకోబెట్టేవాడు. అక్క కూడా అంతే. కానీ వాళ్ళిద్దరికీ విషయం ఏంటో తెలుసని నా గట్టి నమ్మకం. స్కూల్ కి వెళ్ళినా ఇవే ఆలోచనలు ఇంటికి వెళ్లేసరికి అమ్మను చూస్తానో లేదో, ఎందుకు అలా అనిపిస్తుందో అదీ తెలియడం లేదు నాకు. ఇంటర్వెల్లో క్లాస్ రూమ్ లో డెస్క్ మీద తల ఆన్చి వెక్కివెక్కి ఏడ్చిన రోజులు ఉన్నాయి. గుండెలు దడ దడ లాడుతూ ఇంటికి వెళ్లి అమ్మను చూశాక అమ్మయ్య నాది ఉత్తుత్తి భయమే అనుకునేదాన్ని. భయంలోనే బ్రతికిన రోజులవి. వ్యక్తం చేయలేని బాధ అది. ఎందుకో కానీ అమ్మ అక్కకు పెళ్లి చేసేయాలని ఆతృత పడసాగింది, మంచి సంబంధం కుదరడంతో అక్క పెళ్లి చేసేసారు . నేను బాగా చదువుతానని నన్ను డాక్టర్ చదివించాలని అమ్మా,నాన్న ఎప్పుడూ అనేవారు. కానీ పరిస్థితుల వల్ల అమ్మ పట్టుదలతో కోరి వచ్చిన సంబంధం కాదనకుండా మరో రెండేళ్లకు నా పెళ్లి కూడా జరిగిపోయింది.
ఇప్పుడు సంక్రాంతికి ఇలా అందరం కలిసాము. ఏరా బంగారు ఎలా ఉన్నావు? నాన్న ఆప్యాయంగా నన్ను దగ్గరకు తీసుకుంటుంటే ఈ క్షణం ఇలాగే నిలిచిపోతే బాగుండునని పించింది. అన్నట్లు ఇంట్లో అందరూ నన్ను బంగారు అనే ముద్దు పేరుతో పిలుస్తారు.మరునాడు భోగి అనగా అన్నయ్య మమ్మల్నందర్నీ సినిమాకు తీసుకెళ్లాడు. బాబును అమ్మ దగ్గర వదిలి అందరం వెళ్ళాము. మాకు రెండు సొంత సినిమా హాల్స్ ఉన్నాయి.అందరం సరదాగా మాట్లాడుకుంటూ సినిమా చూస్తున్నాము . సొంత హాలు కదా మర్యాదలకు లోటు లేదు కూల్ డ్రింక్స్ అని, మసాలా వడలని, పులిబొంగరాలని ఏవో తెచ్చిస్తూనే ఉన్నారు. ఇంటర్వెల్ అయ్యి సినిమా మొదలైంది. ఇంతలో ఇంటి నుండి పాలేరు వచ్చి, చిన్నయ్యా! మీరు ఇంటికి త్వరగా రావాలి. మారు మాట లేకుండా, ఇంకో మాట అడిగేందుకు కూడా అవకాశం ఇవ్వకుండా పరుగున వెళ్లిపోయాడు. ఏం జరిగిందోనని గాబరా పడుతూ ఇంటికి బయలుదేరాము. బాబుకి ఏమైనా బాగోలేదా! భయంతో చెమటలు పట్టేశాయి. అన్నయ్య మౌనంగా డ్రైవ్ చేస్తున్నాడు. ఇంటికి వచ్చేసాము. మేము వసారా దగ్గరికి వచ్చేసరికి మాకు కనిపించిన దృశ్యం క్రింద పరిచిన పరుపుపై అమ్మ బాబును ఒళ్లో పెట్టుకొని కూర్చుని ఉంది. నాన్న పక్కనే నిలబడి ఉన్నాడు. అంతకుముందు జరిగిన గొడవకు పర్యవసానంగా అనుకుంటా, కోపంగా నాన్న కాలితో విసురుగా అమ్మను డొక్కలో తన్నాడు. ఇలా నాన్నను మేము ఎప్పుడూ చూడలేదు. అమ్మ బాబు పడిపోకుండా గట్టిగా పొ దవిపట్టుకుని చిన్నగా మూలుగుతూ పక్కకు వాలిపోతుంటే, నేను ఒక్క పరుగులో వెళ్లి అమ్మను పట్టుకొని బాబుని చేతుల్లోకి తీసుకున్నాను. బావగారు,మా వారు అక్కడ ఉంటే బాగుండదని అన్నయ్యని తీసుకొని రూమ్ లోకి వెళ్ళిపోయారు. చెల్లి ఏడుపాపుకుంటూ నా పక్కన కూర్చుంది. అక్క మాత్రం ఊరుకోలేకపోయింది. ఏంటి నాన్నా ఇదంతా? మందులింపుతో కూడిన అలాంటి స్వరాన్ని మా ఇంట్లో మొదటిసారిగా విన్నాము. నాన్న ఏమీ మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్లిపోయారు. అమ్మ ఏమీ జరగనట్లే నెమ్మదిగా లేచివెళుతూ, భోజనానికి పిలువమ్మా అందరిని అంటూ వంటావిడను తోడు పెట్టుకుని టేబుల్ సర్దింది. కానీ ఎవ్వరికీ ముద్ద దిగలేదు అమ్మకు తగిలిన దెబ్బ మరుసటి రోజుకు బాగానే నొప్పి చేసింది అయినా ఆమె అల్లుళ్లకు అన్నీ సమకూర్చింది. నాన్న చాలా మామూలుగా పలకరించుకుంటూ అల్లుళ్లకు మర్యాదలు చేశారు. ఎలాగో పండుగ గడిచిపోయింది. తొలి పండుగ అనుకోని అనుభవాన్ని మిగిల్చింది. తిరిగి ఊరికి వెళ్లే రోజు అమ్మను వదిలి వెళ్లాలంటే గుండెల్లో బాధ. నాన్న దగ్గరకు వెళ్లి, వెళ్ళొస్తా నాన్న! పెదవులు కదలినట్లు అనిపించింది కానీ శబ్దం బయటకు రాలేదు . నాన్న కళ్ళల్లో సన్నని నీటి పొర. మౌనంగా తలనిమిరారు.ఆ తర్వాత కొద్ది రోజులకు అక్కా వాళ్లు అమెరికా వెళ్ళిపోయారు.
నేను తొలి కాన్పు ప్రసవించి పాపతో అమ్మ వాళ్ళ దగ్గర సరూర్నగర్ లో ఉన్నాను. అన్నయ్య కూడా మాతో గడిపేందుకు బీదర్ నుంచి వచ్చాడు పాపను క్షణం విడిచిపెట్టకుండా ఒళ్లో ఊపుతూ ఘoటసాల పాటలు పాడుతుండేవాడు. మంచి స్వరం అన్నయ్యది. అమ్మ కూడా పాపతో అన్ని ముచ్చట్లు తీర్చుకుంటూ చాలా సంతోషంగా ఉంటున్నది, నాన్న ఎప్పట్లాగానే వచ్చి పోతున్నారు కానీ అప్పటివరకు ప్రశాంతంగా ఉన్న ఇంటి వాతావరణం నాన్న వచ్చినప్పుడు ఏ రోజు ఏమిటో అన్నట్లు మారిపోయేది. ఎప్పుడు వస్తారా అని మేము ఎదురు చూసే మాకు ఎంతో ఇష్టమైన మా నాన్న, ఎప్పుడు వెళ్ళిపోతారా అని ఇప్పుడు చూస్తున్నాము. ఆరోజు రాత్రి భోజనాలైన తర్వాత నేను రూమ్ లోకి వెళ్లి పాపకు పాలిస్తున్నాను,చెల్లి నా పక్కనే కూర్చుని చదువుకుంటున్నది. అన్నయ్య కూడా చదువుకోవాలని తన రూమ్ లోకి వెళ్ళాడు. పాపకు మూడో నెల పెట్టింది మంచి రోజు చూసుకుని మా అత్తగారింటికి వెళ్లేందుకు సిద్ధమవుతున్నాను. అమ్మ అన్నయ్యతో చార్మినార్ వెళ్లి నా కొరకు కొన్ని చీరలు ఎంబ్రాయిడరీలకు ఇచ్చి వచ్చింది లెక్కకు ముప్పై ఒక్క చీర అని, పాపకు గౌనులు , పాల బుట్ట ( డైపర్ బ్యాగు లాంటిది), బంగారు ఉగ్గు గిన్నె, బంగారు గాజులు, గొలుసు,వెండి గజ్జలు అన్ని సిద్ధం చేసి పెట్టింది. మా అత్తగారింటి చాకలికి చీర, ఇంకా బిడ్డ సారే యాభై కేజీల చక్కెర బస్తా , స్వీట్స్,పండ్లు పూలు ఇక్కడి నుండి మోసుకెళ్ళకుండా ఊరు నుండి చేర్చే ఏర్పాటు జరిగింది. ఇంకా బిడ్డ పాలకు పాడావు ( పాడి ఆవు ). అన్ని సిద్ధం చేస్తున్నారు.
ఉన్నట్టుండి పెద్దగా అరుపులు వినబడటంతో అదిరిపడుతూ పాపని ఎత్తుకునే చెల్లి,నేను బయటకు వచ్చాము. ఊహించని సంఘటన అన్నయ్య నాన్న చొక్కా కాలర్ పట్టుకుని ఆవేశంతో ఊగిపోతూ మా అమ్మను గొంతు నులుముతావా?మూ లుగు విని నేను రాకపోయి ఉంటే చంపేసే వాడివి. ఇంకెంతకాలం హింసిస్తావు అమ్మను, మాకెన్నాళ్ళీ నరకం. నీ ఇష్టం వచ్చినట్లు ఊరేగు, కానీ మేమున్న చోటుకు నువ్వు ఎవరిని తీసుకురావాలనుకుంటున్నావో అది మాత్రం ఎన్నటికీ జరగని పని. ఆమె పట్టుదల ఈ ఇంట్లో మా మధ్య స్థానం కల్పించమని కదా, అసలు ఆమె ఎవరు? ఛీ తలచుకుంటేనే అసహ్యంగా ఉంది. అన్నీ చూస్తూ ఇన్ని రోజులు ఏం చేయాలో అర్థం కాక చేతకాని వాడిలాగా కుమి లిపోతున్నాను. నీ ముందు నేను ఎందులోనూ సరిపోను, ఇప్పుడు నన్నీస్థితికి నువ్వే తీసుకువచ్చావు. ఊర్లో ఉన్నప్పుడు ప్రశాంతంగా ఆనందంగా ఉన్నాము. ఎంతో ఉన్నతంగా ఊరికే రారాజుగా బ్రతికిన నువ్వు పంతంతో ఇప్పుడు ఇలా అమ్మను కక్షగా సాధించడమేమిటి ఖర్మ కాకపోతే! పదిమందికి మేలు చేస్తూ, మంచి చెడులు చెప్పగలిగిన నీకు శని పట్టినట్లుగా ఈ కొత్త వ్యసనాలు ఏమిటి? పిల్లల భవిష్యత్తు నాశనం అవుతుందని, కుటుంబ గౌరవం, నీ మర్యాద ఇన్నింటినీ గురించి ఇంత హింస అనుభవిస్తున్నది అమ్మ. తెలిసి తెలియనట్లు మమ్ములనుండనీ, చూసి చూడనట్లు బంధువులు ఉంటారని అమ్మఎంతగానో నీకు నచ్చచెప్ప చూసింది. కానీ మరో మనిషిగా మారిపోయిన నీకు ఇవేవీ చెవికి ఎక్కడం లేదు. మాదాకా ఈ విషయాలు ఏవి రాకూడదని అమ్మ శతవిధాల ప్రయత్నించింది. కానీ నువ్వు ఈరోజు ఇంత దిగజారిపోయి ప్రవర్తించావు
అంటూ నాన్న ఊహించని ఈ హఠాత్పరిణామానికి తేరుకునేలోగా అట్లా చొక్కా పట్టుకునే నాన్నను తోసేసి, అమ్మ చెయ్యి పట్టుకుని నారూమ్ లోకి వచ్చేసాడు. అమ్మ సొమ్మసిల్లినట్లు పడుకుంది. ఎన్నాళ్ళనుండో అణచిపెట్టుకున్న ఆవేశం లావాలాపైకి పొంగినట్లు ఉన్నాడు అన్నయ్య. అసలు అన్నయ్యేనా అని నిర్గాంత పోయి చూస్తున్నాను నేను. సహజంగా అన్నయ్య చాలా నెమ్మదస్తుడు, అమ్మమ్మ వాళ్ళ దగ్గర గారాబంగా పెరిగాడు. నాన్నతో చనువు తక్కువ, మాట్లాడడం కూడా తక్కువ. ఇప్పుడు ఈ ఆవేశం చూస్తుంటే ఇన్నాళ్లు,లో లోపల ఎంత కుమిలి పోయాడో అర్థమయింది. అమ్మ మా పెళ్లిళ్ల కొరకు ఎందుకు ఆతృత పడిందో కూడా అర్థం అయింది. ఆ రాత్రి ఎలా గడిచిందో తెలియదు మర్నాడు ఉదయం చూస్తే నాన్న వెళ్ళిపోయారు. మరో రెండు రోజుల తర్వాత మేము కూడా బయలుదేరి అమ్మమ్మ గారి ఊరు వచ్చాము. ఆ వయసుకు అన్నయ్యకు తెలిసిన చోటు అదొక్కటే. అమ్మ స్తబ్దుగా ఉంటున్నది యాంత్రికంగా పాప పనులు చేస్తోంది. అమ్మమ్మ నాన్నను పొగుడుతూ ఈ కర్మ ఎందుకు దాపరించింది అంటూ, మనసు ఉండక ఏవో నిష్ఠూరాలు మాట్లాడుతున్నా, తాతయ్య మాత్రం , పని వాళ్ళనే కాదురా, పగవాళ్లను కూడా పరుషంగా మాట్లాడడం తెలియదురా మీ అమ్మకు.ఇలా ఎందుకు జరిగిందో, ఈ వయసులో మాకు ఈ వేదన ఏమిటో అంటూ బాధపడ్డాడు. మంచి రోజు చూసి అమ్మమ్మ,అన్నయ్య నన్ను అత్తవారింట వదిలి వచ్చారు. అమ్మను వదిలి రావడం చాలా దిగులుగా అనిపిస్తున్నది. అమ్మ నాన్నలతో ఎంతో సంతోషంగా వెళ్లవలసిన నేను ఇలా వెళ్లాను.
అన్నయ్య చదువు ఆగిపోయింది,చెల్లి కూడా అంతే కొన్నాళ్ళు ఇలాగే జరిగింది.నాన్న కూడా వర్కుల దగ్గరే ఉంటున్నట్లు, సరూర్నగర్ గాని, మాఊరికి గానీ ఎప్పుడో తప్ప రావడం లేదని తెలిసింది. అమ్మమ్మ బలవంతంతో అన్నయ్యకు ఆ ఊరిలోనే సంబంధం చూశారు పెద్దగా ఆస్తిపాస్తులు లేవు గాని ఒక్కతే అమ్మాయి అన్నయ్యకు ఈడు జోడు అని నిశ్చయించారు. పెళ్లికి నాన్నని పిలిచేందుకు అన్నయ్య ఒప్పుకోలేదు అమ్మ మనసులో ఏముందో తెలియదు. అక్క కూడా అమెరికా నుండి రాలేకపోయింది. ఎంతో వైభవంగా జరగవలసిన పెళ్లి సింపుల్ గా జరిగిపోయింది. పెళ్లికి వచ్చిన బంధువులంతా కాలం గతితప్పి కాకపోతే ఈ పిల్ల ఆ ఇంటి కోడలు అయ్యేదా! అంటూ పెళ్లికూతురి అదృష్టాన్ని పొగిడారు. అన్నయ్య స్నేహితుల ద్వారా బరంపూర్ లో ఉద్యోగం తెచ్చుకున్నాడు అమ్మను చెల్లిని కూడా తీసుకొని బరంపూర్ కాపురం పెట్టాడు. అక్కడ నుండి అమ్మ జీవితంలో మరొక అధ్యాయం మొదలైంది అంతటి కోటీశ్వరులు కాలికి చేతికి పని మనుషులతో రాజసంగా జరుపుకున్న అమ్మ సాదాసీదాగా బ్రతికేందుకు బరంపూర్ వెళ్ళింది. అమ్మ ఔన్నత్యాన్ని గుర్తించలేకపోయిన వదిన చిన్న బుద్ధులే చూపించింది. అక్కడ విషయాలు చెల్లి చెబుతుంటే కన్నీరు ఆగలేదునాకు. నిప్పులు చెరిగే ఎండలో తడి గుడ్డ నెత్తిపై వేసుకొని దూరం నుండి తాగేందుకు,వంటకు నీరు మోసుకొచ్చేదట అమ్మ. పెళ్లి కావలసిన పిల్ల ఎండకు గాలికి తిప్పితే మొరటు బా రిపోతుందని చెల్లిని ఏ పని చేయనిచ్చేది కాదట, అన్నయ్యకు తెలివిగా ఏవో సాకులు చెబుతూ కాల్ కింద పెట్టకుండా మాతో అన్ని పనులు చేయించేది వదిన. అన్నయ్య తత్వం తెలిసిన అమ్మ అన్నయ్యకు ఈ విషయాలు ఏవి తెలియనివ్వలేదు అని చెప్పింది చెల్లి. అమ్మ అనుమతి లేకుండా అన్నయ్యతో ఈ విషయాలు ఎలా మాట్లాడాలో అర్థం కాక యాతన పడసాగాను.
చాలా రోజుల తర్వాత పది రోజులు సెలవులపై అన్నయ్య వాళ్లు అమ్మమ్మగారి ఊరు వచ్చారు.అత్తగారు కూడా అక్కడే కాబట్టి అక్కడ గడిపి తిరిగి బరంపూర్ వెళ్తూ నా దగ్గర రెండు రోజులు ఉండి అమ్మను,చెల్లిని నా దగ్గర వదిలిపెట్టి వెళ్తూ వారం రోజుల్లో మళ్ళీ రావాల్సిన పని ఉంది బంగారు అప్పుడు అమ్మ వాళ్ళని తీసుకెళ్తాను. అలాగే అన్నయ్య,నేనూ చెబుదామని అనుకుంటున్నాను,నా దగ్గర కొద్ది రోజులు ఉంటారులే అని. నీవసతిని బట్టి తీసుకెళ్లొచ్చులే తొందరేముంది. అన్నయ్య,వదిన, వాళ్లకు ఇప్పుడు ఒక పాప.వాళ్ళు ముగ్గురు వెళ్ళిపోయారు. మేము వ్యాపార రీత్యా టౌన్ లో ఉంటున్నాము. అమ్మలో చాలా మార్పు. ఆ రాత్రి అమ్మ పక్కన అమ్మపై చెయ్యేసి పడుకుని తృప్తిగా నిద్రపోయాను. మరునాడు గమనించాను అమ్మఒళ్లంతా నీరు పట్టినట్లు అనిపించి, మా ఫ్యామిలీ డాక్టరుకు చూపించాము. ఆయన అమ్మని చూడగానే, నన్ను,మావారిని లోపలికి పిలిచి అమ్మకు లివర్ సిర్రోసిస్ అని, ఎక్కువ రోజులు జరగదని చెబుతూ, ఇన్ని రోజులు ఎందుకు నిర్లక్ష్యం చేశారని మందలింపుగా అన్నారు. మద్రాస్ కు తీసుకెళ్తాం డాక్టర్ గారు. అంత అవసరం రాదు, వృధా ప్రయాసమ్మా,!నా అభిప్రాయం ఇది అని గట్టిగానే చెప్పారు డాక్టర్ గారు. ఇంటి వరకు బిగబట్టుకున్న దుఃఖం, బాత్రూంలోకి వెళ్లి పెద్దగా ఏడ్చేశాను.
కనీసం డాక్టర్ ఏం చెప్పారు అని కూడా అమ్మ అడగలేదు. నాకు ఱుణమున్నట్లుగా నా దగ్గరకు చేరిన అమ్మ ఆరోజు నా చేత్తో ఒక్క ముద్ద అన్నం తిన్నది అదే చివరి మెతుకు. మరునాటికే అమ్మకొంత అపస్మారక స్థితికి వచ్చింది. డాక్టర్ వచ్చి సెలైన్ స్టార్ట్ చేశారు అమ్మా! అమ్మా!అని తట్టి పిలిస్తే,’ఊ’ అని అనగలిగింది. అదే ఆఖరి మాట. మన ప్రయత్నం మనం చేద్దాం,మద్రాసుకు తీసుకెళ్దామని మా వారు పట్టుబట్టి అప్పటికప్పుడు బయలుదేరుతూ, నాన్నకు, అన్నయ్యకు, అక్కకు,అమ్మమ్మ వాళ్లకు, బంధువులందరికీ పరిస్థితి తెలిపాము. ట్రీట్మెంట్ మొదలుపెట్టారు, నాన్న,అన్నయ్య, అమ్మమ్మ వాళ్లు మద్రాస్ వచ్చేసారు, అక్క, బావఅమెరికాలో బయలుదేరారు. నాన్నకు దూరమైన తర్వాత మేం అందరం కలుసుకున్నది ఇప్పుడే, కానీ ఇది తెలిసే స్థితిలో అమ్మ లేదు. నాన్నలో పూర్వపు కళ లేదు. బంధాలకు, బాధలకు, యాభయిఐదేళ్ల జీవితానికీ వీడ్కోలు చెబుతూ,ఆ రాత్రి మౌనంగా సెలవు తీసుకుంది అమ్మ. ఊరికి తీసుకొచ్చేసాము. తిరిగి తన ఇంటికి చేరిన జీవంలేని ఆమె శరీరానికి అట్టహాసంగా అంత్యక్రియలు జరిగాయి. ఊరంతా ఊరేగింపుగా ఆమె వెంట నడిచింది. ఉత్తమురాలుగా, ముత్తయిదుగా వెళ్లిపోయిన పుణ్యాత్మురాలుగ అందరి నోట నిలిచిపోయింది అమ్మ.
పందిళ్లు వేయించడం, వంటలఏర్పాట్లతో బంధువులంతా హడావిడిగా ఉన్నారు .
అమ్మ లేదు,ఇక చూడబోము ఈ ఆలోచనే మనసును మెలి పెడుతున్నది. కొంచెం దూరంలోచెట్ల కింద వేసిన మంచంపై కూర్చుని ఈ హడావుడి అంతా చూస్తున్నాను. అక్కకు ఇప్పుడుఇంకో పాప కూడా పిల్ల ఇద్దరికీ ఫీడ్ చేస్తూ ఉంది. అన్నయ్య నాపక్కన వచ్చి కూర్చుంటూ నా చేయి తన చేతిలోకి తీసుకుని ఏడ్చేసాడు. నేను తప్పు చేశానో,ఒప్పు చేసానో తెలియడం లేదు బంగారు, సమర్ధుడైన నాన్న , అసమర్థతతో నేను ఇద్దరం అమ్మకు న్యాయం చేయలేకపోయాము. నాన్నతో గొడవ పడిన తర్వాత పిరికి తనం వదిలి అక్కడే నిలబడి ఉంటే , అమ్మ స్థానం అమ్మకుండేదేమో! నా మాటకు కట్టుబడి, నాకు విలువిచ్చి నా పక్కన నిలిచింది. అమ్మ,నాన్నకు దూరం కావడం కూడా మన కొరకే అని తెలుసు, అందుకే అమ్మ చివరి క్షణం వరకు కూడా ఆయనను ఒక్క మాట కూడా పరుషంగా అనలేదు, ద్వేషించలేదు. అని చెబుతూ జరిగిన వాటిల్లో తన పొరపాట్లను గుర్తు చేసుకుంటూ బాధపడుతుంటే, అన్నయ్యా,ఊరుకో నిజమే నువ్వన్నట్లు చావో బ్రతుకో అమ్మకు నాన్నతోనే, ఆ స్థానం తప్పిన తర్వాత ఆమె జీవచ్ఛవంలాగే గడిపింది. ఇప్పుడు నువ్వు బాధ పడితే అమ్మకు శాంతి ఉంటుందా, శాప వశాన భూమి మీదకు వచ్చి మన పుణ్యం కొద్ది మన అమ్మగా జీవించి, శాపం తీరగానే వెళ్ళిపోయింది అనుకుందాము. అంటూ అన్నయ్యను ఊరడించాను. అక్కడి కార్యం ముగించి వెళ్లేముందు నేను, చెల్లి నాన్న దగ్గరికి వెళ్ళాము. అక్క నాన్నను చూసేందుకు కూడా ఇష్టపడలేదు. మమ్మల్ని చూసి నాన్న దగ్గరకు తీసుకొని గుండెలకు హత్తుకున్నారు. అ ప్పుడు వెల్లువలా పొంగిపొర్లింది దుఃఖం. నాన్నది కూడా అదే స్థితి. ఒకసారి మేము ఆనందంగా గడిపిన ఆ ఇంటి నంతా మనసారా చూసుకొని ఎక్కడి వాళ్ళం అక్కడకు అందరం వెళ్ళిపోయాము.
భర్తను ప్రేమించింది, గౌరవించింది, ఆయనే ఊపిరిగా బ్రతికిన అమ్మ మునిగిపోతున్న సంసార నౌక నుండి బిడ్డలను ఒడ్డుకు చేర్చి అమ్మగా నిలబడింది. విధి వక్రించింది అన్నారే కానీ, అమ్మను గాని, నాన్నను కానీ ఎవరు వేలెత్తి చూపేసాహసం చేయలేకపోయారంటే, అమ్మ ఔన్నత్యం, మౌనమే ఆయుధంగా,పెట్టని గోడలా నిలిచిన ఆమె వ్యక్తిత్వం.
అమ్మతోనే ఆ ఇంటి వైభవం ముగిసిపోయింది, కళకళలాడుతూ సందడి చేసిన చోటు బీడుపడి గతాన్ని గుర్తు చేసుకుంటూ నిలిచి ఉంది. అమ్మ మరణం తర్వాత మేమెవ్వరం మా ఊరు వెళ్ళలేదు. అమ్మ మౌనమే శాపంగా నాన్న కూడా పూర్వపు వైభవంతో ఉండలేకపోయారు. స్థిరచరాస్తులు అన్నీ, అన్నయ్యకు, ఆడపిల్లలకు , ఆశ్రితులకు, ట్రస్టులకు రాసేసి కాలమిచ్చిన తీర్పులా నాన్న అరుణాచలం రమణ మహర్షి ఆశ్రమంలో చేరిపోయారు.

“చెరుకు తుద వెన్ను పుట్టిన
చెరుకున తీపెల్ల చెరచు కదరా సుమతి.”
అమ్మ చిన్నతనంలో నేర్పించిన పద్యమిది. ‘బుద్ధి కర్మానుసారిణి ‘ నాన్నవేసిన చిన్న తప్పటడుగు చెరుకు చివర పుట్టిన వెన్నులాగా, మా జీవితాల్లోని మాధుర్యాన్ని హరించి వేసింది. నాన్న దగ్గర చేరిన ఆమె కోరిక అయితే నెరవేరలేదు కానీ, ఎంతో గొప్పగా బ్రతికిన కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది. చెట్టుకొకరుంగ అయిపోయాము. ఆమె కనబడిన వారందరికీ పచ్చని సంసారం నాశనం చేశాను, ఆ పుణ్యాత్మురాలకి ద్రోహం చేసినందుకు అనారోగ్యంతో, ఆదరించే వారు లేక అనాధలా బ్రతుకుతున్నాను అంటూ ఏడ్చేదట. అన్నయ్య ఊర్లో పొలాలు కౌలుకిచ్చి, ఇంటి స్థలాన్ని మా దగ్గర పని చేసిన పాలేర్లకు ఇళ్ల స్థలాలకుగా ఇచ్చేశాడు సరూర్నగర్ ఇంట్లో ఉంటున్నాడు, చెల్లికి పెళ్లి కుదిరింది అక్క, బావ కూడా అమెరికా నుండి వచ్చున్నారు. పెళ్లికి నాన్నని పిలుచుకు వచ్చేందుకు మేము నలుగురం వెళ్ళాము. కానీ బంధాలకు, అనుబంధాలకు అతీతంగా నాన్నలో మరో కోణం చూసాము. మచ్చలేని చంద్రుడిలా ఆగుపించాడు.

శ్యామదాసి

Written by Shyama Dasi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

“కొత్త లోకాలు..”(కాలమ్)-2

ఎన్నికలు – స్త్రీల పాత్ర