వారానికి ఒకసారి కూలి చెల్లిస్తారు. ఆరోజు క్యాంపంతా పండుగ వాతావరణంగా మారిపోతుంది. కార్మికులంతా ప్రతి ఉదయం కాలువకు పోతారు. స్త్రీలు ఎడతెరిపి లేకుండా అలంకరించుకుంటారు. జుట్టును చాలా శ్రద్దగా జడవేసుకుంటారు. ఆడంబరంగా బట్టలు ధరిస్తారు. మధ్యాహ్నం అందరూ సూపర్వైజర్ గుడిసె ముందు చేరుకుంటారు కూలి కోసం. మిగిలిన రోజంతా వినోదంగా వేడుక చేసుకుంటారు. వారంరోజులుగా చేసిన శ్రమను మరచిపోతారు.
సాలీ దీక్షను ఈ పద్ధతులన్నీ బలహీన పరుస్తున్నాయి. ఆమె ఒక సాయంత్రం క్యాంపులో మెల్లగా నడుచుకుంటూ కొద్ది దూరం పోయింది. పరధ్యానంలో ఆమె కాలనీ గుడిసెలు దాటి వచ్చినట్లు గమనించలేదు. సాయంకాలం వంట మొదలవబోతోంది. ఒక్కసారిగా తనను ఎవరో చీకట్లోకి ఈడ్చుకుపోయారు. అతడు కచ్చితంగా బాగా తాగి వున్నాడు. అతడు ఆమె చీర కొంగును పట్టుకొని తన వైపు లాగుతున్నాడు. ఆమె అతనిని గుర్తుపట్టింది అతడి పేరు శామా. అతడు రొప్పుతూ
“రా ! నాతో రా!” అంటున్నాడు .
అతన్ని విడిపించుకుని ముందుకు పరుగెత్తింది. తన వెనక నుండి తిట్ల వర్షం వినబడింది. ఆమెకు కొన్ని కపటపు నవ్వులు కూడా వినపడ్డాయి. ఒక్కసారి వెనుకకు తిరిగి క్రీనీడలోకి తొంగి చూసింది. అక్కడ ఇద్దరు యువతులు అతని చేతులలో ఇమిడి ఉన్నారు. వారు అతని చేతిలో నలిగిపోవడాన్ని గొప్పగా ఆనందిస్తున్నారు .
కానీ అతితొందరగానే అక్కాచెల్లెళ్ళు ఇటువంటి సంఘటనలను చూడడానికి అలవాటు పడ్డారు. రాత్రిపూట వారి గుడిసెలో వారు పడుకొని ఉన్నప్పుడు, తరచు వారికి అడుగుల శబ్దాలు, ఈలల శబ్దాలు, రహస్య సంభాషణలు, కూని రాగాలు వినిపించేవి. రాత్రంతా ఆ శబ్దాలు కొనసాగుతూనే ఉండేవి. వాళ్లు అప్పుడప్పుడు విచిత్రమైన భావావేశంతో కదిలిపోతున్న శరీరాలను చూసేవారు.
చాలాసార్లు రోడ్డు పని చేస్తున్నప్పుడు కొంతమంది అమ్మాయిలు ఉన్నట్టుండి ఏదో గుర్తుకు వచ్చినట్టు పని వదిలి నడిచి వెళ్లే వారు. కొంత సమయం గడిచిన తరువాత మళ్ళీ వెనక్కి వచ్చి పని చేసేవారు. కొందరు యువకులు అటువంటి అమ్మాయిలను ఇష్టపడడం, వారిపట్ల ఆసక్తి చూపుతూ కలిసి తిరగడం కనిపించేది. ఒక యువకుడు మట్టి తవ్వుతూ ఉంటే, ఒక యువతి మట్టి ఎత్తి పోసేది. అందుకు అతడామెకు తలపై గంపనెత్తి సాయం చేసేవాడు. లేదా అతడు సుత్తితో బండలను చిన్న చిన్న ముక్కలుగా పగల కొడుతున్నప్పుడు, అతని దగ్గరగా నిలబడి చాలా మృదువుగా మాట్లాడుతూ ఉండేది, ఇటువంటి విషయాలు ప్రతిరోజూ సాలీ, మాలీల కంట పడుతూనే ఉండేవి. కానీ వీటిని గమనిస్తున్నప్పటకీ వారు మాత్రం అటువంటి వాటిలో పాల్గొనే వారు కాదు.
సూపర్వైజర్ అతని గుంపు అందరూ యువకులే వారంతా కలిసి పని జరుగుతున్నప్పుడు, తనిఖీ చేయడానికి తిరుగుతూ ఉండేవారు. ఒక్కసారిగా అమ్మాయిల మీదకు వంగి, వారి వీపుపై తడుతూ
“నీ పని చాలా నెమ్మదిగా ఉన్నది, త్వరగా కానివ్వు” అంటూ హెచ్చరించే వారు. వారి చూపులు అవిశ్రాంతంగా అమ్మాయిల చుట్టూ తిరిగేవి. ఆ చూపులు అమ్మాయిలను బలహీనపరిచేవి.
కొన్ని విషయాలు ఆ అక్కాచెల్లెళ్ళను అదృశ్యంగా ప్రేరిపిస్తూ అగాధంలోక లాగేవి, వారికి వారు ప్రవాహంలో కొట్టుకుపోయే వారు.
ఇల్లు గుర్తుకు వచ్చి మాలీఅసహనంగా అక్కతో “మనం ఇంటికి వెళ్ళిపోదాం” అనేది.
కానీ, సాలీ అక్కడ తినడానికి ఏమీ ఉండదని గుర్తు చేసేది. ఎక్కువ రోజులు మనం ఉండవలసిన అవసరం లేదని సర్ది చెప్పేది. వారికి అనేక మంది యువతులతో స్నేహ ఏర్పడింది. వారంతా ఈ ప్రపంచంలో ఒకరిని మించి ఒకరు తెలివైన వారే.
ఒకరోజు కంబాల అని ఒక అమ్మాయి మాటల్లో తన విషయం చెప్పింది. తన తండ్రి అనారోగ్యంతో బాధపడుతున్నాడనీ, అతడు ఏ పని చేయలేడు. తల్లి వారిని వదిలి వేరొకరితో వెళ్ళిపోయింది. తన చిన్న చెల్లెలిని తండ్రిని చూసుకొమ్మని ఇంటి దగ్గర పెట్టి, రోడ్డు పనికి వచ్చానని, మొదట్లో తానుఎంతో ఒంటరితనాన్ని అనుభవించాననీ, కానీ ఫైల్మాన్ అనే మేస్త్రి తన వెంటపడ్డాడని, అతనితో కలిసి ఉంటున్నాననీ, కానీ నా ఇష్టం వచ్చినప్పుడు వదిలేస్తానని చెప్పింది. ఇప్పుడు మాత్రం కలిసి ఉంటున్నాను అని నవ్వింది. తను కట్టుకున్న ఖరీదైన ఎర్ర చీరను, చెవులకు పెట్టుకున్న బంగారు దిద్దులను మురిపెంగా చూపిస్తూ.
సాలీ, మాలీ ఆశ్చర్యంగా చూశారు. మొదటిసారిగా ఒకరు ఇంత నిర్మొహమాటంగా మాట్లాడడం వింటున్నారు. ఆ తర్వాత సాయంత్రం ముగ్గురు అమ్మాయిలు కలిసి వారి దగ్గరికి వచ్చారు.
“ఈరోజు సాయంత్రం సూపర్వైజర్ తన గుడిసె వద్ద సంగీతం వినిపిస్తాడు, మనం కూడా అతని గుడిసెకు వెళ్దాం” అని చెప్పారు.
అతని గుడిసె ముందు అమ్మాయిల గుంపు నిలబడి ఉంది. అతనితోపాటు మరో ముగ్గురు యువకులైన మేస్త్రీలు కూర్చొని ఉన్నారు. సూపర్వైజర్ ఉల్లాసంగా ఒక పురాతన హార్మోనియం మోగిస్తున్నాడు. ఆ పాట కీబోర్డు మీద జిమ్నాస్టిక్ చేస్తున్నట్టుగా ఉన్నది.
సూపర్వైజర్ స్నేహితులు అమ్మాయిలతో మీరంతా ఎందుకంత దూరంగా ఉన్నారు. దగ్గరికి రండి అని పిలిచారు. అమ్మాయిలంతా దగ్గరగా జరిగారు. సూపర్వైజర్ హార్మోనియంను మోగిస్తూనే ఉన్నాడు. అమ్మాయిలు నిలబడి చాలా మోహంతో వింటున్నారు. ఎవరో చిన్న లాంతరను గుడిసెలో వెలిగించారు. ఆ తరువాత కొద్దిసేపటికి ఆర్పి వేశారు. పాట ఆగిపోయి, కొందరిని ఈడ్చుకు పోయినట్టు, ఒకరినొకరు నెట్టి వేసుకున్నట్టు, చీకట్లో చీకట్లో వినపడుతున్నది.
సాలీ, మాలీలు జమున అనే అమ్మాయిని చేయి పట్టుకుని తీసుకొని వచ్చేశారు. ఆ తర్వాత జమున “ఎందుకు నన్ను అక్కడి నుండి ఈడ్చుకు వచ్చారు” అని అడిగింది.
అక్కాచెల్లెళ్ళు ఇద్దరు నవ్వుతూ ఈరోజుకు సంగీతం చాలు అన్నారు.
రానురాను ఇటువంటి సంఘటనలు పెరిగిపోయి కోపం తెచ్చుకోవడం కూడా కష్టమైపోతోంది వారికి.
ప్రతి సాయంత్రం యువతీ యువకులంతా కలిసి డాన్స్ చేస్తున్నారు. ఒకరి కోసం ఒకరు తమ కూలీ డబ్బులు పెట్టి బహుమతులు కొంటున్నారు. డాన్స్ చేయడం కోసం మువ్వల పట్టీలు, వాయిద్యాల కోసం స్టీల్ వైర్లు, యువకులు చిన్న చిన్న సువాసన సబ్బులు, క్యాస్ట్రాయల్ సీసాలు మొదలైనవి.
సూపర్వైజర్ పాతిక సంవత్సరాల యువకుడు. అతని తెల్లని ముఖం పై సన్నని నల్లటి మీసాలు ఆకర్షణీయంగా ఉంటాయి. అతడు రోజంతా సైకిల్ మీద ఒక గుంపు నుండి మరొక గుంపు కార్మికుల వద్దకు తిరగాల్సి ఉంటుంది. అది కష్టమైన పనే సాయంత్రం అతనికి విశ్రాంతి కావాలి. కార్మికులంతా వెళ్లిపోయిన తర్వాత, రోజంతా అతను చూసిన అమ్మాయిలను అంచనా వేసుకుంటాడు. తనను చూసి వారు స్పందించిన తీరును బట్టి. కొందరు అమ్మాయిలు అతని కోసం తహతహ లాడుతున్నారు, మరికొందరు సిగ్గుపడుతుంటారు. అతనికి అనుభవం నేర్పిన పాఠం ప్రకారం నేరుగా ప్రవేశించడం అనేది ఆనందాన్ని ఇవ్వదు. కొంత నటిస్తూ ప్రేమాయణంలో దాగుడుమూతలతో కొంత మభ్య పెట్టాలి కొంత చమత్కారం కూడా అవసరం.
తరచూ రామి , మోతి అనే ఇద్దరు ముసలి స్త్రీలు అతనికి సహాయం చేస్తూ ఉంటారు. ఇటువంటివి సాధించడానికి వేటగాళ్లు పెంపుడు జంతువులను ఎర చూపి వంచన చేసినట్టుగా.
రామి అటువంటి నైపుణ్యాలలో చతురురాలు. ‘చంపి’ అనే గ్రామం నుండి వచ్చినది. ఇంతకుముందు చాలామంది ఉన్నత అధికారులకు సహాయం చేసింది. సాయంత్రం భోజనం అయిన తర్వాత సూపర్వైజర్ తన గాత్రంతో కుస్తీపడుతున్నాడు. అతని తోటి వారు హార్మోనియం తో, ఆ తరువాత పడక పైకి చేరుతారు. రోజంతా చేసిన కఠినమైన శ్రమకు శరీరమంతా నొప్పులతో బాధిస్తూంది. అప్పుడు రామీ, మోతి అతని దగ్గరికి వచ్చి, అతని కాళ్ళకు మసాజ్ చేస్తారు. మృదువుగా మాట్లాడుతారు అతడు నిద్రించే వరకూ. అతడు రోజంతా తాను గమనించిన విషయాలు వారితో చెబుతూ ఉంటాడు. ఆసక్తికరమైన విషయాలు అతన్ని నిద్ర నుండి మేల్కొలుపుతాయి. రామీ, మోతీ అతని కోరికలు తీర్చేందుకు వారు చేస్తున్న ప్రయత్నాల గురించి అతనికి వివరిస్తారు. కొన్ని రాత్రులు ఒక యువతిని బయట నిలబెట్టి సూపర్వైజర్ కు సమాచారం ఇస్తారు. అతడు ఆమెను లోపలికి పిలవమంటాడు. ఆ యువతి లోపలికి రాగానే, వారు “మేము చాలా వృద్ధులము, మా చేతులు నొప్పిగా ఉన్నాయి. సూపర్వైజర్ కాళ్ళు కొంచెం మసాజ్ చెయ్యి” అని అడుగుతారు. ఆ తర్వాత చాలా తెలివిగా వారిద్దరు అక్కడి నుండి తప్పించుకుంటారు.
చాలామంది యువతుల వద్దకు రామీ వెళ్తుంది. ఆమెతో పాటు కొన్ని బహుమతులను, సుగంధ సబ్బులను, పువ్వులను, రంగురంగుల పూసల దండలను తన చీర మడతల్లో దాచుకొని పట్టుకెళ్తుంది. వాటిని యువతులు చేతిలో పెడుతూ. “ఇది నీకోసమే సూపర్వైజర్ పంపాడు. అతడు ఎంత మంచివాడు కదా. నువ్వు అతని గుడిసె దగ్గరికి వచ్చి, అతని పాట వినాలి” అని ఒక నవ్వు నవ్వి. యువతి గడ్డం పట్టుకొని ఆమె ముఖం పైకి ఎత్తి పట్టుకొని, ఆమె కళ్ళలోకి చూస్తూ “ఎంత అందమైన దానివి” అని అంటుంది.
రామీ తన గురించి తాను చాలా గొప్పగా చెప్పుకుంటుంది. ఆమె ఇంకా తన అందాన్ని కాపాడుకుంటూ ఉన్నట్టు, తన జ్ఞాపకాలన్నీ చెప్తుంది, తనకు తాను ఒక నాయకురాలిగా ఊహించుకుంటూ, ప్రతి అమ్మాయిలో తనను ఊహించు కొని మురిసిపోతుంది, తర్వాత ముఖం అద్దంలో చూసుకుంటూ చెవుల పక్కన ఉన్న తెల్ల వెంట్రుకలను వెనుకకు నెడుతుంది. ఆ తర్వాత కొన్ని పువ్వులను జుట్టులో పెట్టుకుంటుంది. ఆమె ఒక పాటను రాగం తీస్తూ పగిలిపోయిన అద్దంలో తన ముఖాన్ని అటు ఇటు తిప్పి చూస్తూ, తన అందానికి మురిసి పోతుంది.
ఆ తర్వాత ఒక సాయంత్రం సాలీ, మాలీ సూపర్వైజర్ గుడిసెకి వెళ్ళవలసిన వంతు వచ్చింది. రామీ తరచు వారి ఇంటికి వచ్చి వెళుతూ ఉండేది. గుసగుసగా ఏదో మాట్లాడేది. ఆమె వచ్చిన ప్రతి సారీ అక్కాచెల్లెళ్ళలో ఎవరో ఒకరు ఉండేవారు కాదు.
చివరకు “ఎందుకు మీరు గుడిసెలోనే మౌనంగా కూర్చుని ఉంటారు, మీరు సాయంత్రాలు బయటికి రండి, ఇది మీకు మీరు ఆనందించవలసిన సరైన సమయం. మీరు మాత్రమే వయసులో ఉన్నారు. ఇలా కూర్చోవడం సరికాదు” అన్నది. కొన్ని పువ్వులు తెచ్చి వారి తలలో అలంకరించింది. కొన్నిసార్లు సూపర్వైజర్ ఆమెకు ఒకటో రెండో రాగి నాణాలను కూడా ఇచ్చాడు. కానీ ఆమెకు ఈ తతంగంలో బహుమతులు అవసరం లేదు. మాయమాటల ప్రతినిధిగా ప్రేమాయణం నడిపించడంలో పొందే ఆనందమే ఆమెకు తగినంత గొప్ప బహుమతి. ఆమెకు కావలసింది మిగిలిన యువతులను ఈ కుట్రలో పాల్గొనేలా చేయాలి, అదే ఆమెకు కావలసినది.
*** *** *** ***
రోజు రోజుకి సాలీ, మాలీలలో ఒంటరితనం ఎక్కువవుతోంది. చుట్టూ ఉన్న వారి జీవితాలను చూసినకొద్దీ విచిత్రమైన ఆందోళన పెరుగుతుంది వారిలో. ప్రత్యేకంగా సాయంత్రాలలో ఎప్పుడైతే యువకులు అమ్మాయిలను తమ పాటలు డాన్సులు మొదలైనవాటితో మర్యాద చేస్తున్నప్పుడు. ఒక అమ్మాయి ఒక వారం అంతా ఆమె ప్రేమికుడ్ని దూరం పెట్టగలదు. తరువాత ఒక భయంకరమైన రాత్రి తన శరీరంలోని రక్తమంతా నాట్యం చేయడం మొదలు పెడుతుంది, అప్పుడు ఆమె తనకు తాను లొంగిపోతుంది. సాలీ, మాలీలు ఇటువంటి సంఘటనలను అన్నింటికీ చూస్తూ ఉన్నారు. డుంగుడుంగా, ఫ్లూట్ , సూపర్వైజర్ హార్మోనియం గోల రాత్రంతా నిద్రపోనివ్వడంలేదు. రామి వారికి చెప్పే స్తుతి పాఠాలు వారిని ప్రేరేపిస్తున్నాయి. ప్రతి ఒక్కరూ ఎదుటివారిని నియంత్రించాలని చూస్తున్నారు. కానీ అదే సమయంలో అసహనం వారిలో పేరుకుపోతోంది.
ఒకరోజు మధ్యాహ్నం మాలీ మరికొందరు పని చేస్తున్నారు. సాలీ ఒక్కతే తలనొప్పితో గుడిసెలో పడుకొని ఉన్నది. రామీ ఇటువంటి అవకాశం కోసమే ఎదురు చూస్తూ ఉన్నది. కనుక రహస్యంగా సాలీ వద్దకు వచ్చింది. అదీ ఇదీ వికృతంగా మాట్లాడుతూ “సూపర్వైజర్ నీ గురించి అడుగుతున్నాడు, నిన్ను అతడు చాలా ఇష్టపడుతున్నాడు, నీవు అతని పాట వినడానికి ఈ రాత్రికి రావాలి” అన్నది.
” ప్రత్యేకంగా నన్నే ఎందుకు” అని అడిగింది సాలీ. రామి నవ్వుతూ “అదే విషయం నువ్వే వచ్చి అడగొచ్చు కదా ” అని సమాధానం చెప్పింది.
సాలీ ఒక్కసారిగా నీరస పడింది.
“వద్దు నేను వెళ్ళను, అది మంచిది కాదు” అన్నది.
“ఏది మంచిది కాదు” అంటూ రామి సాలీ వీపును లాలనగా తడుతూ, మళ్లీ..
“మన గిరిజన జాతిలో ఇదంతా చాలా మామూలే. ఒక అమ్మాయి తన ఇష్టానుసారం ఎవరితో అయినా కలిసి జీవించవచ్చు, ఆమెకు ఇష్టం ఉన్నంత కాలం వరకు. ఇందులో ఏది అనైతికం కాదు. ఇంకా ఏది ఏమైనా నీ చిన్ని బుర్రలో ఇటువంటి ఆలోచనలను పెట్టుకోవద్దు. నువ్వు ఉన్న వయసులో నిన్ను నువ్వు మూసుకొని ఉండటమే దోషము. అదే నువ్వు చేస్తున్నావు” అన్నది.
సాలీకి తనకు తాను బలహీన పడుతున్నట్టుగా భావించింది. మళ్లీ తనను తాను కూడగట్టుకొని, “వద్దు నేను రేపు ఉదయం తిరిగి మా ఇంటికి వెళ్తాను” అన్నది.
“ఓ అయితే సరే, ఒకవేళ నిజంగా నువ్వు వెళ్లాలనుకుంటే ఇంటికి వెళ్ళు, పస్తులుండి చావు. నేనెవర్ని ఆపడానికి, కానీ ఒక విషయం గుర్తు పెట్టుకో, ఎవ్వరూ ఎల్లకాలం యవ్వనంలో ఉండరు. మన జానపదులు అవకాశం వచ్చినప్పుడే వేటినైనా స్వీకరించాలి. ధర్మం నీ వెంట ఎంతో దూరమూ రాదు. ఇక్కడ ఒక యువకుడు, అందగాడు, మంచివాడు, నీవంటే ఆసక్తితో నీకు అన్నీ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాడు. నువ్వెంత అదృష్టవంతురాలివి. నేను చెప్తున్నాను విను, క్యాంపు లోని సగం మంది అమ్మాయిలు నన్ను యాచిస్తూ ఉంటారు. తమ గురించి ఒక్క మాట అతడికి చెప్పమని. కానీ నేను అటువంటి పనులు చేయను. సూపర్వైజర్ నీకోసం కృశించి పోతున్నాడు. సాలీ అతడు నాతో ఏమన్నాడో తెలుసా ? రామీ కనీసం ఆమె తలలో వాడిన పువ్వు నైనా నాకు తెచ్చి ఇవ్వు. నేను చచ్చి పోతాను అన్నాడు” అని రామి తన మాటలను ముగించింది. తరువాత దీర్ఘంగా జాలిగా నిట్టూర్చింది.
సాలీ నేల చూపులు చూస్తూ నేలమీద మట్టిలో చేతి గోళ్ళతో ముగ్గులు వేస్తూ కూర్చుంది.
ఆ తర్వాత “నాకు భయమేస్తోంది రామీ” అని లోగొంతుకతో అన్నది.
రామి ఆమెను దగ్గరకు తీసుకొని “భయమెందుకు తల్లీ” అంటూ లాలించింది.
“భయపడడానికి ఏమున్నది. ఎవ్వరికీ ఏమీ తెలియదు. అంతా నా మీద వదిలేయ్” అంటూ ఆమె లేచి నిలబడి బయటకు వెళ్ళే ముందు, ఒక మాట చెప్పింది.
“నేను మళ్ళీ ఈ రాత్రికి వస్తాను తర్వాత ” అంటూ తలుపు వరకు వెళ్లి, “నా కోసం వేచి ఉండు” అన్నది.
సాలీ ఒక్కతే సిగ్గుతో శరీరంలో రగులుతున్న కోరికలతో కూర్చునే ఉండిపోయింది.
సాయంత్రం మొదటి దీపాలు మినుకు మినుకు మంటున్నాయి. రామీ తిరిగి వచ్చింది. అప్పుడే అనుకోకుండా వస్తున్నట్టు వచ్చి , బయట తలుపు ముందర నిలబడి , సాలీ అని పిలిచింది. ఆమె అడవి గులాబీల పూలదండ సాలీ కోసం తీసుకొచ్చింది. “ఇది నీ కోసం, అతడే ఇచ్చాడు” అంటూ గుసగుసలాడింది.
“నేను మళ్ళీ వస్తాను” అంటూ వెళ్ళిపోయింది. సాయంత్రం వంటలు ముగిసాయి.
రాత్రి సమీపించింది, రాత్రి తినడం కూడా అయింది.
వాయిద్య మోతలు ఆసక్తులను రేపుతున్నాయి. సాలీ గుడిసె నుండి బయటకు వచ్చింది. ఆమె కోసం రామీ ఎదురుచూస్తోంది. రామీ తనతో పాటు ఒక తెల్ల బట్టను తెచ్చింది. దానిని వారిద్దరి తలమీదుగా రెండు శరీరాలు కనపడకుండా కప్పింది. చీకట్లో వారిద్దరూ వడిగా నడుస్తూ సూపర్వైజర్ గుడిసె వైపు వెళ్లారు. ఎవరైనా వారిని చూసినట్లయితే ఎవరో ఒకరే వెళ్తున్నట్టు కనిపిస్తుంది. పరిశీలనగా చూస్తే కింది భాగం రెండు జతల కాళ్ళు కనిపిస్తాయి. కానీ ఎవరు, ఎందుకు చూస్తారు.
చాలా గంటల తర్వాత మెల్లగా బలం లేని తన గుడిసె తలుపుని నెట్టుకుంటూ లోపలికి ప్రవేశించింది సాలీ.
నేలపై ఒంటరిగా పడుకొని ఉన్నది మాలీ. “ఎక్కడికి వెళ్లావు సాలీ ” అని అక్కను అడిగింది.
“నేనూ.. డాన్స్ చేయడానికి” అంటూ తాగినట్లు సమాధానం చెప్పింది సాలీ.
“నువ్వు చాలా అలసిపోయినట్లు ఉన్నావు. దా వచ్చి పడుకో” అన్నది మాలీ.
ఆ తర్వాత వ్యంగ్యంగా నవ్వుతూ ఆలోచిస్తూ “మంచిది మంచిది తర్వాత రేపు నేను డాన్స్ కు వెళ్లాల్సి ఉంటుంది” అన్నది.
మొదటిసారిగా అక్క మీద ఆమెకు కోపం కలిగింది. కోపానికి కారణం చెప్పలేక పోయినప్పటికీ.
సాలీ కళ్ళు నిద్రతో మూసుకుపోయాయి.
ఆమె చాలా అలసి పోయింది. ఆలోచించ లేనంతగా అయోమయంలో ఉంది. ఆమె చెల్లెలి పక్కన నీరసంగా పడిపోయింది.
తర్వాత రామీ వారి వద్దకు రావలసిన అవసరం లేకుండా పోయింది. సూపర్వైజర్ వారి కోసం ఎక్కడో ఒకచోట వేచి ఉండే వాడు. ఒకసారి సాలీ మరోసారి మాలీ, తమకు అఇష్టంగా నైనా సరే వెళ్లేవారు. కొన్నిసార్లు మిగిలిన యువకులు సైతం వీరిని పిలిచేవారు. చాలా సులభంగా ఆ పద్ధతిలో ఆనందాన్ని వారిద్దరూ వెతుక్కుంటున్నారు. వెనుకటి సౌఖ్యం లేకపోయినప్పటికీ. వారందరూ మిగిలిన పడుచు వారివలె కోరికలకు లొంగి పోయారు. కొన్నిసార్లు మిగిలిన వారెవరూ లేనప్పుడు, అక్కాచెల్లెల్లు ఇద్దరూ సంతృప్తిగా తాము సంపాదించిన తమ సంపదను చూసుకొని మురిసి పోయేవారు. అందులో నాణేలు, రూపాయలు, రెండు అణాలు, ఎనిమిది అణాల నాణాలు, కొత్తరకం నాణ్యమైన రంగు రంగుల చీరలు, సువాసన కలిగిన సబ్బులు, సువాసన తల నూనెలు, పూసల దండలు, చెవి రింగులు అన్నీ ఉండేవి. వారిప్పుడు ధనవంతులు సంతృప్తిగా కావలసినంత పనితో డాన్సులు పాటలతో ఆనందంగా ఉన్నారు. వారికి ఆలోచించే సమయమే లేదు. తమ సొంత ఇంటికి సంబంధించిన జ్ఞాపకాలు అప్పుడప్పుడు వెంటాడేవి. కానీ వెంటనే చెదిరిపోయేవి. వారి కుటుంబ ఆప్యాయతలు క్యాంపు లోని చిన్న గుడిసెలోకి మారిపోయాయి. ఆ గుడిసె వెనుక చిన్న ఖాళీ స్థలంలో వారు పొట్ల గింజలు, బీరకాయ గింజలు, గుమ్మడి గింజలు నాటారు. సూపర్వైజర్ ఇంటి దగ్గర నుండి చిన్న అడవి గులాబి కొమ్మను, మల్లె అంటును తెచ్చి వారి దొడ్లో నాటుకున్నారు. వాన పడగానే అవన్నీ పూలు పూసి కాయలు కాస్తాయని వారు వర్షం కోసం ఎదురుచూస్తున్నారు.
సాయంత్రం వేళల్లో వారు స్నానం చేసి చక్కగా బట్టలు ధరించి శ్రద్ధగా తలకు నూనె పట్టించి పువ్వులతో అలంకరించు కునేవారు. సాలీ డాన్స్ చేస్తున్నప్పుడు మాలీ కూర్చొని వింటూ ఉండేది. వారికి వారే సొంత యజమానులు. వారి ఇష్టమైన పనులు వారు చేయగలరు.
పగటి వేళలో చాలామంది అమ్మాయిలు ఒక రోడ్ రోలర్నీ కొత్తగా నిర్మించిన రోడ్డుపై గుంజుతున్నారు. అందరూ కలిసి బరువైన దానిని లేపి ఈడుస్తున్నారు కానీ అది అంగుళం కూడా ముందుకు జరగలేదు.
అప్పుడు ఒక్కసారిగా ఒక జల్లు వర్షం వచ్చింది. వారంతా తడిచి పోయారు. వారి ముఖం పై నుండి నీరుకారిపోతుంది. వారు రెండు వరసలుగా నిలబడ్డారు. ఒక వరుస పొడవైన రోలర్ హ్యాండిల్ పట్టుకొని వేలాడుతున్నారు. ముందు పక్క వారి తడిచిన వక్షాలు ఊగుతున్నాయి. ఒకరి వక్షాలు మరొకరికి తగులుతున్నాయి. వారు నవ్వుతూ పాట పాడుతూ పని చేస్తున్నారు. జాగ్రత్త లేవీ పాటించకుండా, ప్రతి ఒక్కరు ఎదుటివారిలో తమ ప్రతిబింబాన్ని చూసుకుంటున్నారు. కనుక ఆమె అంటే ఒక్కరు కాదు. అక్కడ ఆమె బహువచనం. ఆమె అనేకం.
*** *** *** *** ***