ఈ మధ్య కాలంలో AI అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి చాలా వింటున్నాం. దాని మూలంగా అమెరికా లాంటి అగ్ర రాజ్యాలలో ఎన్నో layoffs జరుగుతున్నాయి అని వార్తలు వస్తున్నాయి. Google, Microsoft, Amazon లాంటి దిగ్గజ కంపెనీలే వేలాది మంది ఐటీ ఉద్యోగులను రోడ్డున పడేశాయి. దాని మూలంగా ఎంతోమంది ఉద్యోగులు నిరాధారులైపోతున్నారు. కడుపు చేత పట్టుకొని రోడ్డున పడుతున్న దుస్థితి!
ఈ సమస్యని మనం కూలంకషంగా చర్చిస్తే మనకు అర్థం అయేదేంటే కంపెనీల యాజమాన్యం యొక్క స్వార్థ ప్రయోజనాలే ఇందుకు కారణం అని చెప్పవచ్చు. కానీ AI ని తెలివిగా ఉపయోగించుకుంటే ఈ అనర్థం వాటిల్లదు అని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే AI మీద పూర్తిగా ఆధారపడలేం. దానికీ పరిమితులు ఉన్నాయి. AI ఒక్కోసారి తప్పు సమాచారాన్ని నిజంలా చెబుతుంది. దానినే Hallucination అంటారు. AIకి Bias ఉంటుంది, కానీ Emotional Intelligence ఉండదు. ఏడుస్తున్న కస్టమర్‌ని ఓదార్చే మానవత్వం దానికి లేదు.
కాబట్టి ఉద్యోగులను ఉద్యోగాలలోంచి పూర్తిగా తొలగించి AI మీద ఆధారపడే బదులు, ఉద్యోగులకు AI సహాయం తీసుకుంటూనే తమ పనితీరును మెరుగు పరుచుకునే అవకాశం ఇవ్వాలి. Layoff కాదు, Pay-off ఆలోచన కావాలి. ఉద్యోగుల్ని తొలగించే బదులు 3 నెలల AI ట్రైనింగ్ ఇచ్చి Re-skill, Up-skill చేస్తే, ఆ పెట్టుబడి రేపు డబుల్ లాభంగా తిరిగి వస్తుంది. ఒకప్పుడు టైప్‌రైటర్ పోయి కంప్యూటర్ వచ్చినప్పుడు నేర్చుకున్నవాళ్లే నిలబడ్డారు కదా.
Tata, Infosys లాంటి కంపెనీలకు మార్కెట్లో గౌరవం ఎందుకు ఉంది? “People First” అనే విధానం వల్లే. AI వాడుతూ కూడా ఉద్యోగుల్ని కాపాడుకునే కంపెనీని ప్రజలు, కస్టమర్లు ఎక్కువ నమ్ముతారు. దయ అనేది CSR కాదు, అది Smart Business Strategy.
అందువల్ల ఉద్యోగులను తొలగించకుండానే సత్ఫలితాలను యాజమాన్యం పొందవచ్చు కదా అన్నది నిర్వివాదాంశం. ఇందుకు యాజమాన్యానికి ఉండాల్సిన ఒకే ఒక్క అర్హత ఉద్యోగుల పట్ల చూపించవలసినది కాసింత దయ, కరుణ, కనీస మానవత్వం మాత్రమే!
ఎందుకంటే AIకి ఆకలి వేయదు, జ్వరం రాదు, పిల్లల స్కూల్ ఫీజు కట్టాల్సిన బాధ ఉండదు. కానీ ఆ AIని కనిపెట్టిన మనిషికి అవన్నీ ఉన్నాయి. మనిషిని మరచిపోయి యంత్రాన్ని పూజిస్తే, రేపు ఆ యంత్రాన్ని నడిపే మనిషే ఉండడు. మనిషి మెదడు + AI వేగం = నిజమైన ప్రగతి.