మన జాతీయాల్లో అంకెల లంకెలు

మన జాతీయాల్లో అంకెల లంకెలు,సంఖ్యావాచకాలతో కూడినవి
చాలా ఉన్నాయండోయ్!
వాటిలో కొన్నిటి గురించి తెలుసుకుందామా!

నలభై

ఆయనకు నిండుసభలో నలభై అయిందంటే అవమానం జరిగిందని అర్థం.మనకున్న అరవై సంవత్సరాల పేర్లలో నలభైయ్యోది పరాభవ. ఇలా సంఖ్యావాచకాలతో చాలా జాతీయాలు పుట్టాయి.ఉదాహరణకు..

మనం ఎక్కువగా ఉపయోగించే జాతీయం..
మూడు పూవులు-ఆరు కాయలు

ఆయన వ్యాపారానికేం ఢోకా లేదు.మూడు పూవులు,ఆరు కాయలుగా విస్తరిస్తోంది అంతటా

ఆమె సంపాదనకేం–మూడు పూవులు ఆరు కాయలుగా ఉంది

పూలు మూడే ఉంటే,మూడే కాయలు కాసే అవకాశముంది.కానీ,మూడు పూలకు ఆరు కాయలు అంటే రెండింతల ఫలితం వచ్చిందన్నమాట.”పాపం! ఆయనకు ఆరు మూడయిందట” అనే సానుభూతి వాక్యాలూ వింటుంటాం.అంటే అనర్థం జరిగిందని అర్థం.ఇలా మూడు-ఆరు అంకెలనే ఎందుకు వాడారన్న కారణం చెప్పలేం.ఉన్న వాడుక ఇది.లేని వాడుకను సృష్టించినా,లోకం మెచ్చి,ప్రయోగిస్తుందనీ చెప్పనూలేం. “కొన్ని మాటలే నిలుస్తాయి.అది భాషా లక్షణం”.

ఒక గురువు తన విద్యార్థిని ఒరే 2526 అంటూ సంబోధిస్తుంటాడు.అంటే అదేదో క్రమసంఖ్య అనుకుంటారు తోటి విద్యార్థులు.అసలు సంగతేమిటంటే…25 ఖర నామ సంవత్సరం అయితే,26 నందన నామ సంవత్సరం. అర్థమైంది కదా..అదీ సంగతి!ఇతరులకు అర్థం కాకుండా తిట్టే సౌలభ్యం కూడా మన తెలుగు జాతీయాల సొగసులో దాగుంది!

మూడో కన్ను

అరేయ్! వాడు మూడోకన్ను తెరిచాడంటే ఎవడికో మూడిందన్న మాటే

అమ్మో!మా ఆయనకిది తెలిసిందంటే మూడోకన్ను తెరుస్తారిక

ఇలాటి సంభాషణలు వింటూ–అసలు మనకుండేవి రెండు కళ్ళే కదా!శివుడికి,శిశుపాలుడికీ,భృగు మహర్షికీ ఈ మూడో కన్ను ఉన్నట్టు పురాణ కథల్లో విన్నాం అనుకుంటున్నారు కదూ?మరి మనిషికి మూడో కన్ను ఏమిటంటే-“పిచ్చికోపం”.
అవును.శివుడికి విపరీతమైన కోపం వచ్చినప్పుడే కదా,మూడోకన్ను తెరిచేది.కొందరు దానిని కనిపించని జ్ఞాననేత్రం అంటారు.కానీ,సామాన్యుల దృష్టిలో మూడో కన్నంటే పిచ్చి కోపమే!

సప్తమీ విభక్తి

సప్తమి అంటే ఏడోది. కొందరు ఏడుపనే అమంగళార్ధం వస్తుందని ‘ఆరున్నొక్కటి’ అని మాత్రమే చెప్తారు.సంస్కృత భాషలోని ఏడు విభక్తులను చిన్నప్పుడే భట్టీయం వేసాం కదా—“డు-ము-వు-లు—ప్రథమా విభక్తి అంటూ.’అందు’,’న’–సప్తమీ విభక్తి కదా!
పాపం!ఆయన సప్తమీ విభక్తిలో ఉన్నాడు అంటూ సానుభూతి వాక్యాలు వింటుంటాం. అంటే “ఆయన అందునా,ఇందునా చెడ్డా”డని అర్థం!ఇంటా, బయటా విఫలమైన వ్యక్తిని,చేపట్టిన పనులన్నీ చెడిపోయి,కష్టాల్లో పడ్డ వ్యక్తిని సప్తమీ విభక్తిలో ఉన్నాడని చెప్తారు.వ్యాకరణ సాంప్రదాయం నుంచి,శాస్త్రం నుంచి వాడుకలోకి వచ్చిన జాతీయమిది.

నాలుగు కాయలు

“ఏదో నీ కడుపు చల్లగా నాలుగు కాయలు కాస్తే, చూసి సంతోషిద్దామనుకుంటున్నా పిల్లా” అంటూ పూర్వం పెద్దవాళ్ళు పెళ్లికూతుళ్ళను ఆశీర్వదించేవారు.నలుగురు పిల్లలనకుండా నాలుగు కాయలనడం పరిపాటి.ఇప్పటి సామాజిక,రాజకీయార్థిక పరిస్థితుల్లో ఒక్క కాయ ను పెంచడమే కనాకష్టంగా ఉంది కదూ!

చతుర్ముఖ పారాయణం

ఆయన ప్రతి రాత్రీ చతుర్ముఖ పారాయణం చేస్తుంటాడు

ఈయన చతుర్ముఖ పారాయణం మొదలెట్టాడంటే ఇక లోకమే తెలీదు

అంటీ అదేదో ఆధ్యాత్మిక పారాయణం అనుకునేరు!

బ్రహ్మదేవుడికి మొదట్లో అయిదు తలలుండేవిట. అయిదో తలా మాత్రం గాడిద తలలా ఉండేదిట. దానిని శివుడు నరికేసాడని బ్రహ్మపురాణం చెప్తుంది.ఒకేసారి ఒక్కో తలతో ఒక్కో వేదం పఠిస్తుంటాడట బ్రహ్మదేవుడు.ఒక్కో తల ఒక్కో దిక్కు చూసే బ్రహ్మదేవుడిని చతుర్ముఖుడన్నారు. పేకాట వాడుకలోకి వచ్చాక (ఆటిన్,డైమండ్,స్పేట్,కళావర్) లను నాలుగు తలలుగా లెక్కేసి,ఓ వ్యసనానికి చతుర్ముఖ పారాయణం అనే అందమైన పేరు పెట్టారన్న మాట!

ఏడుకట్ల సవారీ

బ్రతికుండగా ఎన్ని వైభోగాలనుభవిస్తేనేమి-ఏడు కట్ల సవారీ తప్పదుగా చివరకు ఎవరికైనా

ఎన్ని కార్లలో తిరిగినా,చివరకు ఏడుకట్ల సవారీ తప్పదు

అంటూ ఇతరులపై అసూయతో అనే ఆక్షేపణలు,వేదాంత తత్వాలు వింటుంటాం.
‘సవారీ’ అనే మాట హిందీ/ఉర్దూ పదం.అల్లసాని పెద్దన ‘అసివారు’ అనే రూపంలో వాడుక చేస్తే,నిత్య వ్యవహారంలో ‘స్వారీ’ అనే రూపభేదంలో నిలిచింది.ఈ మాటకు ‘వాహనం,వాహ్యాళికి పోవటం’ మొదలైన అర్థాలున్నాయి.చిలకమర్తి వారి ప్రహసనాల్లో ఈ మాటకు అనేక పర్యాయాలు వాడుక కనిపిస్తుంది.ఏడు కట్లు కట్టేది పాడె కు మాత్రమే.చనిపోయిన వ్యక్తి ఏడు ఊర్ధ్వ(పై)లోకాలు దాటిపోవాలన్న నమ్మకానికి చిహ్నంగా ఏడుకట్లు కడతారని కొందరి వివరణ.సప్త వ్యసనాలున్నా,వాటికి అతీతంగా ఉండే లోకాలకు వెళుతున్నందున అన్ని కట్లు కడతారని మరికొందరి విశదీకరణ. ఎవరి వ్యాఖ్యానమెలా ఉన్నా,ఎంత పరమ నిర్భాగ్యుడికైనా,దరిద్రుడికైనా,బతికివుండగా దొరక్కపోయినా,చచ్చినప్పుడైనా లభించే వాహనయోగమిదే.”మరణాంతాని వైరాణి” అనే నమ్మకమున్న మన దేశంలో పరమ శత్రువులు కూడా ఈ వాహనయోగం కల్పించి,స్మశానానికి తీసుకెళ్తారు.అంటే వ్యక్తితోబాటు అతడిపై శత్రుత్వం కూడా నశిస్తుందన్నమాట.
తన దరిద్రాన్ని,అభాగ్యాన్నీ ప్రస్తావించి విసుక్కునే సమయంలోనూ,ఇతరుల భోగాలను ఈసడించి మాట్లాడే వేళల్లోనూ ‘ఏడుకట్ల సవారీ’ తప్పదని వ్యాఖ్యానిస్తుంటారు.పుట్టినవారు గిట్టక తప్పదు.కాబట్టి ఇదొక్కటే అందరికీ దొరికే వైభవమన్న ఆక్షేపణ ఈ మాటలో ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

కొత్త లోకాలు (కాలమ్)