మన తెలుగుభాషకు మాత్రమే స్వంతమైనవి

వ్యాసం

ఏ భాషకు సంబంధించిన జాతీయాలు, సామెతలు ఆ భాషకే స్వంతం.తెలుగుభాషలో మాత్రమే పద్యాలు,వివిధ అవధానాలు, జాతీయాలు,
పలుకుబడులు,నుడికారాలు,నానార్థాలు, పర్యాయపదాలు ఉన్నాయన్నది తెలిసిందే.

ఉదాహరణకు కడుపుమంట అనే జాతీయాన్ని stomach burning అని,కన్ను కుట్టింది అనే జాతీయాన్ని eye stitching అని,నీళ్లు నమలటం అనే జాతీయాన్ని eating water అంటే ఎంత హాస్యాస్పదంగా ఉంటుంది?!

అలాగే rolling stones gather no mass అంటే దొర్లే రాళ్లు బరువును కూడబెట్టలేవు అని అర్థం చేసుకుంటే ఎలా ఉంటుంది?

కాబట్టి,ముందుగా మన జాతీయాల పుట్టు పూర్వోత్తరాలు,అర్థాల గురించి ముందుగా మనం తెలుసుకోవటం,ఇతరులకు తెలపటం ఎంతో అవసరం.

ఇప్పుడు మరికొన్ని జాతీయాల విశేషాలను తెలుసుకుందామా!

అచ్చుబోసిన ఆంబోతు

ఆంబోతు(ఎద్దు) శివుడి వాహనం నందితో సమానం అని ప్రజల్లో నమ్మకం.పెద్దలు చనిపోయినప్పుడు వారి పేరిట ఒక ఆంబోతును వదిలిపెడ్తే కీర్తిశేషులకు పుణ్యం వస్తుందన్న నమ్మకం కూడా ఒకటుంది.దాన్ని అరకకు కట్టకుండా,గ్రామం మొత్తం దాని తిండీతిప్పలూ భక్తిశ్రద్ధలతో చూస్తుంది.అది చేలో పడి మేసినా,తోలాల్సిందేగానీ బందెలదొడ్డిలో పెట్టేందుకు వీల్లేదు.ఒక్కోసారి కరువు వచ్చినా,పశువులకు రోగాలు వచ్చినా గ్రామంలోని ప్రజలంతా కలిసి కట్టుగా ఒక ఆంబోతును వదిలిపెట్టే ఆచారం కూడా వుంది కొన్నిచోట్ల. ఇది ఆంబోతు అని తెలియడానికి గుర్తుగా దాని వీపు మీదనో,తొడ మీదనో అచ్చు(ముద్ర) వేస్తారు.అప్పుడది అచ్చోసిన ఆంబోతు అవుతుంది. ఒక్కోసారి పొరుగూరి చేల మీదకు అది దండయాత్రకు వెళ్లినా,దానికి నిర్బంధం శిక్ష ఉండవు.

ఒరేయ్! ఏంట్రా అచ్చోసిన ఆంబోతులా ఊరి మీద పడి ఆ తిరుగుళ్లు?

వాళ్ళ నాన్న ఊరెళ్లాక,వీడు పొరుగిళ్ళకెళ్లి, అచ్చోసిన ఆంబోతులా ఆడపిల్లల వెంటబడి,వేధిస్తున్నాడు ఒదినా

ఇలాంటి సంభాషణలు మనం వింటూనే వుంటాంగా!

అతలాకుతలం

ఈ మాటకు అతలకుతలమనే రూపాంతరముంది. అంటే తలకిందులు అవటం,విసిగి వేసారటం, అలసట చెందటం అనే అర్థాలున్నాయి.కుతలం అంటే భూమి.భూమి కింద అతల, వితల,సుతల, తలాతల,రసాతల,మహాతల, పాతాళ అనే ఏడు లోకాలున్నాయని మనం వినివున్నాం.కొందరు సుతలానికి బదులు కుతలమని వాడుతుంటారు.అడుగున ఉన్న అతలం పైనున్న కుతలమయినా, కొందరి భావన ప్రకారం దానికి రెండు మెట్ల క్రింద ఉన్న కుతలమైనా..దెబ్బతిన్నట్లే,
పతనమైనట్లే.అధోలోకాలున్నాయన్న విశ్వాసంతో ఈ జాతీయం పుట్టింది.

పాపం ఒకటి మీద ఒకటి వచ్చిపడే సమస్యలతో ఆమె అతలాకుతలం అవుతోంది

వ్యాపారంలో వచ్చే నష్టాలతో ఆ మనిషి అతలాకుతలమవుతున్నాడు

గంటలు,గంటలు ఆ కంప్యూటర్ తో కుస్తీ పడుతూ,ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు సరైన నిద్ర,తిండి లేక అతలాకుతలమైపోతున్నారు.

ఇలా…
అతలాకుతలం అయిపోవటమంటే,అర్థం అదన్నమాట!

నక్కను తొక్కటం

ఈ రోజు వీడు వచ్చే దారిలో నక్క తోకను తొక్కి ఉంటాడురా!అనుకున్న పనల్లా అయిపోతుంది వెంటనే!

ఈ రోజు నక్క తోకను తొక్కి వచ్చావా ఏమిటే?! ప్రతి పోటీలో నువ్వే గెలుస్తున్నావ్?

ఇలాటి సంభాషణలు వినే ఉంటాం.

అదృష్టానికి చిహ్నంగా ఈ మాటను వాడుతుంటారు.జిత్తులమారి అయిన నక్క ఎదురుపడటమే విశేషం.అజాగ్రత్తగా పడివుండడం అంతకన్నా విలక్షణం. ఆ నక్కను తొక్కటమన్నది మామూలుగా కాని పని.అందరికీ సాధ్యం కానిది.ఎవరో ఒక మహనీయుడు అంతపనీ చేసివుంటే అతడు మామూలు వ్యక్తి కాదు.అంటే అదృష్టవంతుడని,సమర్థుడని భావిస్తారు.నక్క ఎదురుపడటం పిల్లి ఎదురుపడినట్లే అపశకునం కింద లెక్క.అలా అపశకునమెదురైనా,అనుకున్న పని మానకుండా చేసేవాడు అదృష్టవంతుడైనా కావాలి;అసహాయశూరుడైనా కావాలి.ఈ భావంతో నక్కను తొక్కడం శుభసూచకమని,అదృష్టలక్షణమని భావిస్తారు.
************

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

మన జాతీయాల్లో అంకెల లంకెలు

The first woman Engineer of India