చిట్టి కథ గొప్ప సందేశం

తనకు మాలిన ధర్మం

ఒక అడవిలో రెండు జింకలు ఉండేది రెండు ఎంతో స్నేహంగా ఉండేది ఎప్పుడు కలిసిమెలిసి తిరుగుతూ సరదాగా నవ్వుతూ గెంతుతూ అడవంతా తిరుగుతుండేవి. ఒకరోజు రెండు జింకలు అడవి అంత తిరిగి తిరిగి అలసిపోయి బాగా దాహం వేస్తుండగా ఒక కొలను దగ్గరికి చేరుకున్నాయి. కొలను నిండా నీటితో నిండి అందంగా కనిపిస్తుంది. అప్పుడు అందులో ఒక జింక అమ్మయ్య మనకు దాహం తీరే మార్గం దొరికింది అని దాహం తీర్చుకోవటానికి ముందుకు వెళుతుండగా మొదటి జింక అది గమనించి మిత్రమా ఈ కొలనులో మొసలి ఉంది. ఈ కొలనుమనకు దాహం తీర్చుకోవటానికి అనుకూలమైన చోటు కాదు. వేరే ఎక్కడికైనా వెళ్దాం పద అని రెండవ జింకతో చెప్పింది. అప్పుడు రెండవ జింక అయ్యో మిత్రమా నీకు అన్నింటికీ భయమే. చూడు కొలను నిండుగా నీరు ఎంత సమృద్ధిగా ఉందో!!! ఇక అక్కడ నల్లగా కనిపిస్తున్నది ఏ నల్లరాళ్ళు అయి ఉంటాయి నువ్వు అనవసరంగా బ్రమతో భయపడుతున్నావ్ అన్నది. అప్పుడు మొదటి జింక అయ్యో మిత్రమా నువ్వు నీటిని చూసి మోసపోతున్నావు. నీళ్లు ఉన్నచోటే కదా మొసళ్ళు, క్రూర జంతువులు ఉండేవి. అది గ్రహించలేకపోతున్నావు ఎందుకు?? నువ్వు దాహంతో ఉండి పొంచి ఉన్న ఆపదను పట్టించుకోవటం లేదు .వద్దు మనం వేరే ఎక్కడికైనా వెళ్దాం ఈ అడవిలో రెండు మూడు కొలనులు ఉన్నాయి నేను చూశాను. అక్కడికి వెళ్దాం పద ప్రాణాలతో ఉంటే దాహం తీర్చుకోవడానికి చాలా మార్గాలు ఉన్నాయి అన్నది. అయినా రెండవ జింక మొదటి జింక మాటలు వినకుండా నిదానంగా ఒక్కొక్క అడుగు వేస్తుంది. సరే అయితే ఆ నీటిలో మొసలి ఉన్నది లేనిది ఇప్పుడే నిరూపిస్తాను చూడు అని కొలనులోని నీటి దగ్గరకు వెళ్ళింది. అది వెళ్లడమే ఆలస్యం అదును కోసం ఎదురుచూస్తున్న మొసలి దాహం తీర్చుకోవటానికి నీటి కోసం వచ్చిన మొదటి జింక పిల్ల మెడను పట్టుకొని లోపలికి లాక్కుంది క్షణంలో నీరంతా నెత్తుటి మడుగులా మారిపోయింది జింకపిల్ల జాడ కనిపించలేదు. మొసలి మాత్రం కడుపునిండా తనకు కావలసిన ఆహారాన్ని భోజనం చేసి తృప్తిగా అక్కడినుండి వెళ్ళిపోయింది. దిగ్భ్రాంతికి గురైన రెండవ జింక వెంటనే తేరుకొని అక్కడి నుండి కాలికి బుద్ధి చెప్పింది. మొదటి జింక రెండవ జింకను నమ్మించడానికి వాస్తవాన్ని చూపించటానికి తన ప్రాణాలను కూడా లెక్కచేయకుండా నీటి వద్దకు వెళ్ళింది. చెప్తే వినకపోతే దాని కర్మ అని వదిలేస్తే కనీసం మొదటి జింక ప్రాణాలైనా మిగిలేవి. చెప్పినా వినని మూర్ఖురాలైన మిత్రుని కాపాడడం కోసం మొదటి జింక తన ప్రాణాలను కూడా పణంగా పెట్టింది. అయినా రెండవ జింక అదేమీ పట్టనట్టు తన ప్రాణాలు నిలబెట్టినందుకు ఏమాత్రం బాధ కానీ, కనీస కృతజ్ఞత కూడా లేకుండా అక్కడి నుండి వెళ్ళిపోయింది. అందుకే మన పెద్దలు చెప్తారు
తనకు మాలిన ధర్మం మొదలు చెడ్డ బేరం అని ఇదండీ కథ
మనం కూడా ఒక్కొక్కసారి ఇలాంటి తప్పిదాలు చేస్తుంటాం. మంచి చెప్పినా కూడా ఎవరు వినరు. ఎదుటి వ్యక్తి యొక్క అనుమానాన్ని పటాపంచలు చేయటానికో, మన యొక్క నిజాయితీని నిరూపించుకోవడానికో, ఎదుటి వ్యక్తులను నమ్మించడానికో, లేదా వాస్తవాలను కళ్లకు కట్టినట్లు చూపించడానికో ఇలాంటి తప్పిదాలను చేస్తుంటాం. కానీ ఎదుటి వ్యక్తికి మన మీద నమ్మకం కలగడం కోసమో, నిజనిర్ధారణ కోసమో మనంచేసిన పని మన ప్రాణం మీదికే వస్తుంది. వారిని నమ్మించడం కోసం మనం ప్రాణాలను పణంగా పెట్టడం ఎంతవరకు సమంజసం చెప్పండి.
చెబితే విననప్పుడు వదిలేయటం అంత ఉత్తమం లేదు.

ఈ చిట్టి కథను చదివి మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను తెలియజేయగలరని మనవి.

లోకా సమస్త సుఖినోభవంతు 

Written by Madhava Srinivas

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సాహిత్య సుగంధాలను వెదజల్లుతున్న యలమర్తి అనూరాధ

మన మహిళామణులు