మేఘ సౌధాలు అయస్కాంతంలా
ఆకర్షిస్తుంటే!
నిజవాసానికై తపించిన సామాన్యజనుల
పేరాశ పెడదారిపట్టి
భూ బకాసురుల
అక్రమ కట్టడాల
వలయంలో చిక్కి
కూల్చివేత పర్వంలో
గల్లంతైన చిరునామాలతో దిక్కుతోచక
గగ్గోలు పెడుతుంటే …
సర్కారు హుకుంతో
హైడ్రా అత్యుత్సాహపు ఆగడాలకు గూడు చెదిరి రోడ్డునపడ్డ జనావళి
భీతావహులై
చేస్తున్న ఆక్రందనలు ఆకాశాన్నంటగా…
న్యాయస్థానం ఏలుబడిపై
కన్నెర్ర చేసిందట !
ఎపిగ్రఫీ గ్రాఫుల రూపం మార్చుకుని పాలనాపగ్గాలు
చేతబట్టిన వారి
పాదాక్రాంతమౌతుందట!
ఆశతోనో అవసరంతోనో
కబ్జాల రాబందు పాలబడ్డ ఆకాంక్షాజీవులే అందరూ!
ఆవాసాలు నేలమట్టమై
నిలువ నీడలేక
కన్నీటి నిప్పుల మడుగులో అంగలార్చేవారు కొందరు!
అందినంత దండుకుని
గుంపులో గోవిందా !
అంటూ కిక్కురుమనక
మరికొందరు
కథకంచికి చేరకముందే…
చట్టం లొసుగులు సవరించుకుని బలహీనుడి కంటి వెలుగైతే శాసనమావర్ధిల్లు !అంటూ
పీడిత జనం
న్యాయ దేవత ముందు మోకరిల్లదా!