పరస్పరం

“ఏమి చెప్తున్నారు మీరు పిల్లలకు “
” రామాయణ కథ ను “
“తెలుసు! కానీ పిల్లలకు నాలెడ్జి పెంచేవి ఏవైనాచెప్పొచ్చు కదా!”
భర్త వంక చూస్తూ అంది.
‘మన గురించి మనం తెలుసు కోవాలి, సుహా!”
” ఏమిటి తెలుసుకునేది. సత్తె కాలపు కథలు!
” వాటి లో విలువలు అర్ధం చేసుకోవాలి !”
” సరే లెండి. నాకు అంత ఓపిక లేదు.’
“పిల్లలూ! వెళ్ళి పడుకోండి మీరు!” కఠినం గా అంది.
“నువ్వు కూడా రా, అమ్మా!” జాలి గా ముఖం పెట్టి అడిగారు.
“నాకు ఆఫీస్ వర్క్ ఉంది.”
పిల్లలు కదల లేదు.నాన్న వైపు చూసారు.
“మిమ్మల్ని ఇలా కాదు. రెండు తగిలించాలి ” అంది కోపం గా.
“పదండి నేను వస్తాను.!” అతను లేస్తుంటే, ” ఎందుకు అలా వాళ్ళను పాడు చేస్తారు. ఇండిపెండెంట్ గా వ్యవహరించడం అలవాటు చేయాలి పిల్లలకు.!” అంది.
ఉగ్రరూపం లో ఉన్న అమ్మ ను చూస్తూ ఉన్నారు, పిల్లలు.
“నీ ఆఫీస్ వర్క్ స్ట్రెస్ వాళ్ళ పై కాదు.”
అతను కూడా కోపం గా అన్నాడు.
” పిల్లలు పడుకునే టైం అని తెలుసు కదా!ఫోన్ మాటలు తగ్గించి ఉంటే, సరి పోయేది.”
“అంటే ఫోన్ మాట్లాడటం తప్పెలా అవుతుంది.”
“పిల్లలకు ఎన్ని భయాలు ఉంటాయి.
వాళ్ళను ప్రశాంతంగా నిద్ర పుచ్చడం నీ బాధ్యత కాదా!”
” నా బాధ్యత ల గురించి మీరు నాకు చెప్పక్కర్లేదు.”
పిల్లలు తల్లిదండ్రుల గొడవ కు బిక్క చచ్చి పోయారు.
ఇదీ నేటి రామాయణం.
****
పిల్లలను పెంచడం ఒక యుద్ధం లాంటిది కొన్ని కుటుంబాల్లో. భార్యా భర్త ల్లో పరస్పర ఏకాభిప్రాయం ఉండదు. పిల్లలపై తమ అభిప్రాయం రుద్దాలన్న పట్టుదల కూడా ఎక్కువే!
కుటుంబ, సామజిక ఒత్తిళ్ళ మధ్య నేటి పిల్లలు పెరుగుతున్నారు.బాల్యం లో బండెడు సిలబస్ ల భారం.. అర్ధమయ్యేలా చెప్పే సహనం లేని ఉపాధ్యాయుల తో చిక్కులు.
సుహాసిని కి ప్రమోషన్ వచ్చింది.
రాఘవ్ సంతోషించినా, ప్రమోషన్ వదులు కోమన్నాడు. ఆమె కు ఒత్తిడి తగ్గాలని, పిల్లల పై ఎక్కువ ధ్యాస పెట్టాల్సిన సమయం అని.
సుహాసిని కెప్పుడూ భర్త మాటలు సవ్యంగా తోచవు. ఏదో ఉద్దేశ్యం పెట్టుకుని అన్నాడనే ఆలోచిస్తుంది.
రాఘవ్ కూడా ఉద్యోగం లో ఉన్నతి పొంది, వృత్తిపరమైన ఒత్తిళ్ళు
ఎదుర్కొంటున్నాడు.
ఎవరి బిజీ లోవారు ఉన్నప్పుడు, ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే నిశ్చింత గా ఉంటుంది.కానీ సుహాసిని ఆ అభిప్రాయానికి పూర్తి వ్యతిరేకం.
పెద్దవాళ్ళ గారాబాలు పిల్లలను చెడగొడతాయని అంటుంది.
నేడు కుటుంబ బంధాలు బలహీన పడుతున్నాయి. వృద్ధాశ్రమాలు పెరిగి పోతున్నాయి.
రాఘవ్ కు ఆలోచిస్తే వ్యవస్థ ఎటు పోతుందో అర్ధం కావట్లేదు. ఈ పెరుగుట, విరుగుట కొరకేనేమో అనుకుంటాడు.
సహజీవనాలట, ఓయో రూములట..
..చదువు కునే పిల్లలు ఇలాంటి గొడవ ల్లో గొడవ ల్లో ఇరుక్కుని భవిష్యత్తు ను నాశనం చేసుకుంటుంటే బుద్ది ఉన్న పెద్దలు ఏమీ చేయలేక పోతున్నారు.
సహజీవనం చట్టబద్ధం అయ్యింది.హరి హరీ!
పబ్ కల్చర్ విపరీతంగా పెరిగి, డ్రగ్స్ అమ్మకం విపరీతంగా సాగుతోంది. ప్రభుత్వం నిర్వీర్యమవుతున్న యువతరం గురించి ఏమి ఆలోచిస్తుంది.ఎలాంటి వెబ్సైట్ ల ను కంట్రోల్ చేయక, యువత వాటి తాకిడికి శలభాలై మాడి పోతూంది. ఈ పరిస్థితి మారేది ఎప్పుడు? అనుకున్నాడు, రాఘవ్.
ఆలోచిస్తే ఒకరిద్దరి పిల్లలను పెంచడం కూడా ఇలాంటి వ్యవస్థ లో కత్తి మీద సాము లాంటిదే!ఈ వ్యవస్థ లో ని ప్రలోభాలు, ఆకర్షణ ల నుండి పిల్లలను కాపాడు కోవడం, ఈ పోటీ ప్రపంచం లో పిల్లలు నిలబడేలా చేయడం అన్నీ పరీక్ష లే!
ఇప్పుడు వాళ్ళు అదే పరీక్ష నెదురు కునే పరిస్థితి వచ్చింది.
హైస్కూల్ నుండి కాలేజీ ప్రవేశం విద్య లో నే కాదు, జీవితానికీ ఓ మెట్టు లాంటిది.
పిల్లల పరీక్షా ఫలితాలు వచ్చాయి.ఇప్పుడు పిల్లల భవిష్యత్తు గురించి నిర్ణయం తీసుకోవాలి.
వాళ్ళ వ్యక్తిత్వానికి అనుగుణంగా ఉండే విద్య ను ఎన్నుకోవాలి.
సుహాసిని ఎప్పుడో ఒక నిర్ణయానికి వచ్చేసి ఉంది.
ఆమె ఒక అభిప్రాయానికి వస్తే మార్చుకోవడం కష్టం.
ఫలానా కాలేజీ, ఫలానా చదువు..ఇదే ప్రస్తుత ధోరణి!
సుహాసిని మాటలు విని, అక్కడ పిల్లలపై ఒత్తిడి ఎక్కువ ఉంటుంది, సౌకర్యాలు మృగ్యం అని వద్దన్నాడు,
రాఘవ్. కానీ, సుహాసిని వినలేదు.
” ఇంత మంది వెళ్ళట్లేదా!” అంటూ
ఉదాహరణలతో చెప్పింది.
రాఘవ్ కొడుకు వంక చూసాడు.
“నీకు ఇష్టమేనా నానా! నీ గోల్ ఏమిటి?
“బలే మనిషి మీరు! వాడి వయసు ఎంతని ?”
వినీత్ సరే నని తలాడించాడు.
శ్రీ నిజ అప్పుడు ఎనిమిదవ తరగతి చదువుతూంది.
***
కాలం పరుగు తీసింది.
పెళ్ళి వయసు కు వచ్చే కంటే ముందే వరుణ్ణి సిద్ధం చేసుకుంది శ్రీ నిజ.
ఆమె ఎవరినో లవ్ చేసింది. ఏ మాత్రం శ్రీ నిజ కు గానీ , వాళ్ళ స్టేటస్ కు గానీ సరి పోలడు. సుహాసిని లబో మంది.
ఎన్ని ఆశలు పెట్టుకుంది, కూతురి
జీవితం పై!
రాఘవ్ అన్నాడు. “పోనీ! బాధపడి ఏమి లాభం? తనను బాగా చూసుకుంటే చాలు కదా!”
“అలాగని ఎలా అంటారు మీరు? అయినా వాడెక్కడ దొరికాడు దీనికి ఖర్మ కాకపోతే! తల బాదుకుని ఏడుస్తూన్న ఆమె ను చూస్తూ, “ఎక్కడ దొరికాడో తెలియాలి అంటే,అమ్మాయి కదలికలు తెలుసు కోవాలి. వయసు లో ఉన్న పిల్ల ముఖం పై కదలాడే భావాలను గమనించాలి.ఫోన్ కాల్స్ చెక్ చేయాలి.”
” అంటే నా వల్లే జరుగుతున్నట్టా, అన్నీ!”
“నీ ఇష్టం! ఎలాగైనా అనుకో!” రాఘవ్ విసుగ్గా లేచి వెళ్ళి పోయాడు, అక్కడి నుండి.
**
శ్రీ నిజ కు అతని తో నే పెళ్ళి జరిపించారు.ఆమె పట్టుదల ముందు
లొంగి పోక తప్పలేదు .
అత్తింట్లో కి అడుగు పెట్టింది శ్రీ నిజ.
తమ ఇల్లంత బాగా లేకున్నా, అత్త చూసేందుకు ఊరి ఆమె లాగా కనిపించినా, అందరూ తన తో ప్రేమ గా ఉండడం సంతోషం గా ఉంది. రాజీవ్ మంచి వాడే కానీ, కాస్త కోపం ఎక్కువ.
శ్రీ నిజ పెరుగుతున్న కడుపు వంక చూసుకుని మురిసి పోతున్నది.
ఏడవ నెల శ్రీ మంతం జరపాలని, తీసుకొని వచ్చింది, సుహాసిని.
” మీ అత్త చూడడానికి అలా ఉందేమిటి? ” తల్లి హేళన కు దిగ్గున
తలెత్తి చూసింది, శ్రీ నిజ. ” ఎందుకు అమ్మా! ఆవిణ్ణి అనడం ఇప్పుడు అవసరమా!”
“అది కాదే! రాజీవ్ తో చెప్పి ఆవిణ్ణి ఊళ్ళో పొలాల దగ్గరే ఉండి పొమ్మన వచ్చు కదా!”‘
“ఎందుకు అనాలమ్మా! నేను అనను.”
సుహాసిని ముఖం మాడిపోయింది.
“అది కాదే..” ఇంకా ఏమో చెప్పబోతుంటే.. “అమ్మా! ఆపుతావా! అక్కడ ఉన్నప్పుడు ఫోన్స్ చేసి, మీ అత్తగారు చేస్తారులే, వంట నీ కేమి చేతనవును,అనేదానివి.ఏదో చిన్న గొడవ జరిగితే,నువ్వు వచ్చేయి, వాళ్ళే వస్తారు లే, అనేదానివి.కానీ, అమ్మా! తెలుసు కో!
నేను అలా రాను. చావైనా, బ్రతుకయినా అక్కడే అనను కానీ, అంత త్వరగా ఆవేశపడి బంధం తెంచుకోను. నా బిడ్డ కు తండ్రి ప్రేమ దూరం చేయను. ఎందుకు అంటే ఆ విలువ ఏమిటో నాన్న ని చూసి తెలుసుకున్నాను.అమ్మ ఎలా ఉండ కూడదో నిన్ను చూసి తెలుసు కున్నాను.”
సుహాసిని గాయ పడిన అభిమానం తో చివ్వున తలెత్తి చూసింది.
” ఎందుకే,ఎందుకే అలా అంటావు. మీ నాన్న గారు ఉద్యోగం లో ఇంత పైకి రానప్పుడు, మిమ్మల్ని మంచి స్కూల్లో చేర్పించాలనే కద, మీ కోసమే జాబ్ లో చేరాను”
“అయితే, అది నీ బాధ్యతనే కదా! “
“అందుకేనా! ఇన్ని మాటలు..”
సుహాసిని కి కూతురి తిరస్కారం తో
కళ్ళ వెంట కన్నీళ్ళు కారుతున్నాయి.
“మాటలు మాత్రమే కాదు అమ్మా! మనోవ్యధ. వినీత్ గుర్తు కు వస్తే ఆ రోజు అంతా పని ముట్ట బుద్ది కాదు.”
వినీత్ ముచ్చట వచ్చేసరికి సుహాసిని కూడా దుఃఖం తో మౌనం వహించింది.
వినీత్ ఒక ఇంట్రావర్ట్! సీనియర్స్ టీజింగ్ ఎక్కువ ఉంది ఆ కాలేజీ లో! అన్ని గంటలు కట్టి పడేసినట్టు చదవడం అంటే టార్చర్ గా ఉండేది. మార్క్ ల దగ్గర అస్సలు కాంప్రమైజ్ కాని లెక్చరర్స్ తో అదొక రకం టార్చర్ భరించాడు.
తీవ్ర ఒత్తిడికి లోనయ్యాడు.ఆ ఫుడ్ తిన లేక పోయాడు. తరుచూ జ్వరం పడేవాడు.వెనక్కి వస్తే ఫెయిల్యూర్ గా భావించాడు.వాడి మనసు లోనిది త్వరగా బయట పెట్టని వాడు, వాడి ఫ్రెండ్ తో ఒకసారి చెప్పాడట, ఇంటికి వెళ్ళి పోవాలి అని ఉంది, అని. కానీ తన నెవరూ అర్ధం చేసుకోలేరు అన్న ఫీలింగ్ తో వాడికి ధైర్యం రాలేదు. డిప్రెషన్ తో సూయిసైడ్ చేసుకున్నాడు. శ్రీ నిజ కళ్ళ వెంట ధార గా నీరు కారుతూంది.
” అమ్మ! నా కెప్పుడూ నిన్నో మాట అడగాలని ఉంటుంది. వినీత్ అలా కావడానికి, నువ్వు తగిన మోరల్ సపోర్ట్ ఇవ్వక పోవడమే కారణం అన్న
ఫీలింగ్ నీకు ఎప్పుడైనా వచ్చిందా!
వాడూ,నేను రూమ్ లో పడుకుని ఉన్నప్పుడు, వాడు నిన్ను ఎంత మిస్ అవుతున్నానో చెప్పడం నా కెప్పుడూ గుర్తుంటుంది.ఐ హేట్ ఇట్ !” అంది.
సుహాసిని తన పిల్లలకు తన పై ఉన్న నిరసన వింటూ తీవ్రంగా చలించి పోయింది. నిలబడే శక్తి లేక అక్కడే కూలబడి పోయింది.
అప్పుడు భుజం మీద చేయి వచ్చి పడింది. తలెత్తి చూసింది. ఆ కళ్ళు నేను క్షమిస్తాను నిన్ను అన్నట్టు ఉన్నాయి. అదే మూడు ముళ్ళ బంధం!
” శ్రీ ని! అమ్మ నలాగేనా అనేది. ముందు అమ్మ కు సారీ చెప్పు! నీకు చదువు నేర్పిన సంస్కారం ఇదేనా!”
“సారీ!అమ్మా!నానా!” తల దించుకుంది శ్రీ నిజ.
“శ్రీ ని! ఒక అమ్మ తన పిల్లలను తను అనుకున్న స్థాయి లో చూడాలి
అన్న ఆశ తోనే అమ్మా , కొన్ని సార్లు కటువు గా ప్రవర్తిస్తుంది.అమ్మ కు వినీత్ అన్నా, నువ్వు అన్నా పంచ ప్రాణాలు. వినీత్ ను హాస్టల్ నుండి తేవాలి అనిపించినా, మళ్ళీ వాడి కి ఇంటి వాతావరణం అలవాటు అయితే, ఎలా అని ఆలోచించింది.మొదట్లో అలాగే ఉంటారు, వాళ్ళే అలవాటు అవుతారు పిల్లలు అని చెప్పే వాళ్ళ మాటలు విన్నది. ఇంత లో ఇలా అవుతుందను కోలేదు.
అమ్మ వినీత్ కు మోరల్ సపోర్ట్ ఇవ్వ లేదు అన్నావు. ఇప్పుడు నువ్వు – మిగిలిన ఏకైక సంతానం అయిన నువ్వు ఇలా మాట్లాడితే అమ్మ గుండె ను గుచ్చి నట్టు కాదా! అమ్మ ఎలా తట్టుకుంటుందని ఒక నిమిషం ఆలోచించ లేక పోయావా!”
“సారీ!నానా!” అంది శ్రీ నిజ.
“కుటుంబం అంటే ఒకరి పొరపాట్లు ఒకరు క్షమించుకోవడమేనమ్మ! ఒకరికొకరు అర్ధం చేసుకొని అండగా నిలబడడమే!” ఆయన చాచిన రెండు చేతుల్లోకి, ఇరువురూ వచ్చి వాలి పోయారు.
ఎక్కడి నుండో వినీత్ ఆత్మ ఆనంద భాష్పాలు రాల్చింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

మన మహిళామణులు- తాడికొండ రాజేశ్వరి

నేలతల్లి నవ్వింది -4