రమక్కతో ముచ్చట్లు -40

​చుట్టూ చుట్టాలున్నా.. బతుకంతా ఒంటరేనా!

​అందరికీ శనార్థులు.
మంచిగున్నరా!

​ఏందక్కా.. ఈ శీర్షిక సూసి ‘ఇదేం గోల’ అనుకుంటున్నరా? విననీకే ఎంత గుండె తరుక్కపోతుంది. ఈ కాలంల మనుషుల బతుకులు ఎట్ల తయారైనయో తలచుకుంటే ఏడుపొస్తది.
​”చుట్టూ చుట్టాలున్నా.. బతుకంతా ఒంటరేనా!” – ఈ ముచ్చట నేడు ప్రతీ ఇంట్ల, ప్రతీ గుండెల గుచ్చుకుంటున్న
నిజం. ఒకప్పుడు ఇండ్లు ఎప్పుడు చూసిన కళకళ లాడు తుండే . పక్కింటోళ్లు, సుట్టాలు, పక్కాలు ఎవ్వరు వచ్చిన మనసారా పలకరించుకునేటోళ్లం. ఇల్లంత పిల్లల లొల్లితో,పెద్దోళ్ల ముచ్చట్లతోని పండుగ వాతావరణం లెక్క ఉంటుండే!. మరి గిప్పుడు? ఇండ్లన్నీ పెద్ద పెద్ద భవనాలు అయినయ్, కానీ మనుషుల మధ్య దూరం మేడల ఎత్తున పెరిగిపోయినయి.
​ఎవరి గదులు వాళ్లవి, ఎవ్వరి లోకం వాళ్లది. ప్లాట్ల ఇండ్లు, గేటెడ్ కమ్యూనిటీల బతుకులు వచ్చినంక.. పక్క ఫ్లాట్ల ఎవడు ఉంటుండో సుత ఎర్కలేని దైన్యం వచ్చింది. ఒంటి మీద నూలు పోగు లేనప్పుడు పుట్టిన మనిషి, ఎదిగినంక ఎన్నో బంధాలను ఏర్పరచుకుంటడు. అమ్మా, నాయన, భార్య, పిల్లలు, అన్న, తమ్ముడు, దోస్తులు.. ఇవన్నీ కలిపితేనే కదా జీవితం! కానీ ఇప్పుడు ఇవన్నీ ఉండి సుత మనిషి లోపల ఆగాదం అంత ఒంటరితనం (Loneliness) అనుభవిస్తున్నడు.
​పొద్దున లేస్తే ఎవరి పరుగు వాళ్లదే. ఆఫీసు, పని, టెన్షన్లు.. ఇవన్నీ పోయి సాయంకాలం ఇంటికి వస్తే, పలకరించే గొంతు కరువైతది. మొగుడు-పెళ్లాం ఇద్దరూ ఉద్యోగాల పొంటి ఉరుకుతున్నరు. పిల్లలు స్కూలు, ట్యూషన్లపొంటి తిరిగి తిరిగి అలిసిపోతున్నరు. ఇండ్లకు వచ్చినా ఎవరి చేతుల వాళ్ల ఫోన్లు ఉంటున్నయే తప్ప, ఒకరి మొహం చూసి ఒకరు నాలుగు మంచి ముచ్చట్లు పెట్టుకునే తీరిక ఎవ్వళ్ళకు ఉన్నది?
​అన్ని ఉన్నా అల్లుడు నోట్ల శని అంటరు చూడు.. అట్లనే ఇంట్ల నలుగురు మనుషులున్న, ఎవ్వరి లొల్లి వాళ్లదే. మనసు విప్పి బాధ చెప్పుకోనీకి పక్కన ఒక మనిషి లేక, లోలోపల కుమిలిపోతున్నరు. చిన్న చిన్న టెన్షన్లకే తట్టుకోలేక పిచ్చివాళ్ల లెక్క అయిపోతున్నరు, లేకపోతే డిప్రెషన్ల పోయి బతుకు మీద ఆశ వదులుకుంటున్నరు. ఇది ఏరకమైన బతుకు అయ్యా బాబు! సంపాదనల పడి, డబ్బుల కోసం పరుగెత్తి.. ఆఖరికి మనశ్శాంతిని, పక్కన ఉండే మనుషులను సుత శాశ్వతంగ పోగొట్టుకుంటున్నరు.
​నాకు మస్తు ఎరుకున్న ఒక ముచ్చట చెప్త వినుండి. మా ఊర్ల ముసలవ్వ ఒకామె ఉండేది. ఆయమ్మకు ఇద్దరు కొడుకులు. పెద్దోడు సిటీల పెద్ద ఉద్యోగం, ఇంకోడు విదేశాల ఉన్నడు. ఆ అవ్వకు ఏ కొదవ లేదు, అన్ని సౌకర్యాలు ఉన్నయ్. కానీ ఆయమ్మ ఎప్పుడూ ఇంటి గుమ్మం దిక్కు సూస్కుంట ఏడ్చేది. “నా దగ్గరికి వచ్చి నాతోని అద్ద గంట మాట్లాడే కొడుకు లేడు, నా కష్టసుఖాలు ఇనే దిక్కు లేదు. ఈ పైసలు , ఈ మిద్దెలు నాకు ఎందుకు?” అని శోకనాలు పెట్టేది. చివ్వరికి ఆ అవ్వ ఒంటరితనంతోనే పానం ఇడిశింది. అంటే సూడుండి.. మనుషులతో సంపాదన కాదు ముఖ్యం, అనుబంధాలు ముఖ్యం!
​ఇంటికి పెద్ద దిక్కుగ ఉండాల్సిన ముసలోళ్లను పలకరించే నాథుడు లేడు. వాళ్లను మూలకు కూసోబెట్టి, ఫోన్లు చేతికి ఇస్తున్నరు. చిన్న పిల్లలను ఆడిపించాల్సిన అమ్మమ్మ, తాతయ్యలు ఒంటరిగా టీవీల ముందు కాలం వెళ్లదీస్తున్నరు.
​అందుకే చెల్లే… తమ్మీ…!!
డబ్బులు సంపాదించుకోండి, పెద్ద పెద్ద ఇండ్లు కట్టుకోండి.. తప్పులేదు. కానీ ఆ ఇండ్లల్ల మనుషులు లేకుండా ఒంటరిగ మాత్రం బతకకండి. రోజుల కొంచం సేపు ఫోన్లు పక్కకు పెట్టి, పక్కనున్న వాళ్లతోని నవ్వుకుంట మాట్లాడుండి. కష్టసుఖాలు పంచుకోండి. బంధాలను బతికించుకోండి. లేకపోతే ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదు, మన ఇల్లే మనకు ఒక జైలు లెక్క తయారయితది.
​సదివిన అందరికీ కోటి దండాలు.

​ఉంట మరి పైలం.
మీ

Written by Ramadevi Kulkarni

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

నేలతల్లి నవ్వింది -4

*కొత్త లోకాలు [ కాలమ్]