*కొత్త లోకాలు [ కాలమ్]

నవరాత్రులు- మన మనసులు

హలో ఫ్రెండ్స్!

నవరాత్రుల్లో మనల్ని కాపాడే ఆ తొమ్మిది మంది అమ్మవార్లు ఎవరో తెలుసా? మనలోపల దాగివున్న స్వభావాన్ని బట్టి మనమేంటో కూడా తెలుసుకుందాం…

అందరికీ నవరాత్రి శుభాకాంక్షలు! మనం తొమ్మిదిరోజులు అమ్మవారిని పూజిస్తాం కదా, కానీ ప్రతి రోజు ఏ అమ్మవారిని, ఎందుకు పూజిస్తామో తెలుసా? తెలుసుకుందాం రండి.

రోజు 1 – శైలపుత్రి: హిమవంతుడి కూతురు. ఎద్దుపై కూర్చుని త్రిశూలం పట్టుకుంటుంది. జీవితంలో ఎంత కష్టం వచ్చినా ధైర్యంగా నిలబడే శక్తిని ఇస్తుంది. సాధారణంగా మనకు ఏవో కొన్ని ఇబ్బందులు, కష్టాలు వస్తుంటాయి. మనసు నిలకడగా ఉంచుకొని సక్సెస్ వైపు అడుగులు వేయాలి. ఇదే శైల పుత్రి పార్వతి దేవి నుంచి మనం గ్రహించాలి. విజయం సాధించాలి.

రోజు 2 – బ్రహ్మచారిణి: పార్వతీ దేవి శివుడి కోసం ఘోర తపస్సు చేసింది. మనకు ఓపిక, జ్ఞానం నేర్పుతుంది. ఎంత సిరిసంపదలు అష్టైశ్వర్యాలు ఉన్నా సహనం లేకుంటే ఎక్కడో ఓ చోట భంగపడే అవకాశాలు ఉంటాయి. అందుకే
ఓపిక ను వశం చేసుకున్నామా ఇక అన్నీ సాధిస్తాము. ఇదే ఈ అమ్మవారి నుంచి గ్రహించాలి.

రోజు 3 – చంద్రఘంట:
నుదుటిపై చంద్రుడు, చేతిలో గంట. ఇంట్లో ప్రశాంతత, అందం తీసుకొస్తుంది. ఈ అమ్మవారు తక్షణం మన హృదయాలలో ప్రత్యక్ష దైవం కావాలి. ఎన్ని ఉన్నా ఏం లాభం బ్రతుకు లో ప్రశాంతత లేకుంటే? అందుకే ఈ అమ్మవారి ని కొలుద్దాం! గంట శబ్దం చేసేదే కదా ప్రశాంతత ఎలా సాధ్యం అనుకోకండి. మంచి మాటలు మంచి శబ్దాలు మనిషి కి చాలా అవసరం. ఎప్పుడూ నిశ్శబ్దంగా ఉండాల్సిన అవసరం లేదు. శబ్దం కూడా చైతన్యానికి ప్రతీక. చంద్రుడు చల్లదనానికి ప్రతీక. వెన్నెల కురిపించి మనసులోని చీకటి ని తొలగిస్తాడు. మనసును నియంత్రణ చేసి మంచి మార్గం చూపిస్తాడు

రోజు 4 – కూష్మాండ: తన చిరునవ్వుతోనే ఈ విశ్వాన్ని సృష్టించింది. ఆరోగ్యానికి, సంపదకు ఈ మాతను కూష్మాండ దేవి గా వఅమ్మవారిని పూజిస్తారు.
పెళ్లి, పిల్లలు మనందరికీ అవసరం. పిల్లలు సంపదకు చిహ్నాలు. అంటే మన శక్తి సంపదపై సంతృప్తి, సంతోషం కలిగించే విషయం అన్నమాట.

రోజు 5 – స్కందమాత: యుద్ధ దేవుడు కుమారస్వామి తల్లి. పిల్లలను కాపాడే తల్లిగా భావిస్తారు. సంతాన ప్రాప్తి కలుగుతుందని అన్నామంటే కష్టం కూడా వుంటుంది. ఈ కష్టం తప్పకుండా పొందాల్సన కష్టం. పిల్లల తో పని ఖర్చు పెరుగుతుంది కదా. కాని ఇవి లేకుంటే నిర్జీవంగా ఉన్నట్టు అనిపించదూ! ఇదిగో వీటిని చిరునవ్వు తో ఎదుర్కొనే శక్తిని ఇచ్చే మాత ఈమె!

రోజు 6 – కాత్యాయని: కాత్యాయన మహర్షి కూతురిగా పుట్టి మహిషాసురుడిని చంపింది. చెడుపై మంచి గెలుస్తుందని చెప్పే రూపం. మంచి చెడుల సంగమాలే మనుషుల జీవితాలు . పుట్టాము కాబట్టి పెరుగుతాము. ఎదుగుదల లో ఎన్నో సమస్యల్ని ఎదుర్కొనే చాతుర్యం లో ఎక్కడ చెడు ఎదురైనా ఖండిస్తూ ముందుకు సాగడం ఈ అమ్మవారు ప్రసాదిస్తుంది. నవరాత్రుల లో పూజ చేసి, ఏడాది మొత్తం లో కష్టాలు వస్తే ఈ అమ్మ పేరు తలుచుకుంటే చాలు!

రోజు 7 – కాళరాత్రి: చూడటానికి భయంకరంగా ఉన్నా, భక్తుల భయాలన్నీ పోగొట్టే తల్లి. నెగటివ్ ఎనర్జీని తొలగిస్తుంది. ఇప్పుడు సైకాలజిస్ట్ లు చెప్తున్నదీ ఇదే కదా? చెడు, తప్పుడు ఆలోచనలు,. అయ్యో నేను ఇది చేయలేనేమో అనే భయం , ఆత్మ న్యూనతా భావం వంటివి దరిచేయనీయని ధైర్యమిచ్చే తల్లి!

రోజు 8 – మహాగౌరి: కైలాసంలో తెల్లగా మెరిసిపోతుంది. మన తప్పులను క్షమించి మనసును స్వచ్ఛంగా చేస్తుంది. సరే ఇన్ని తెలిసినా తప్పులు చేస్తుంటారు మనుషులు. మరీ మరీ చేయకుండా ఉండేందుకు మనసు లో ఒకింత భయం ఉండాలి. పాప భీతి. కానీ, చెడు ఆలోచనలు కూడా చేయవద్దు. ఎప్పుడైనా పొరపాటున తప్పు చేసినా ఈ చల్లని తల్లిని వేడుకుంటే క్షమిస్తుంది. మళ్లీ అలాంటి తప్పు ఆలోచనలు కూడా చేయవద్దు. ఇలాంటివన్నీ ఈ మాత ప్రసాదిస్తుంది.

రోజు 9 – సిద్ధిదాత్రి: చివరి రోజు అమ్మవారు. జ్ఞానం, విజయం, కోరికలు తీర్చే శక్తి ఇస్తుంది. మంచి సౌఖ్య వంతమైన జీవితం కావాలి. డబ్బు ఉన్న వాళ్లు, డబ్బు లేని వాళ్ళు అనే తేడా లేకుండా అనారోగ్యాలు, కష్టాలు వస్తుంటాయి. ఇవి లేని బ్రతుకు సిద్ధింపజేసే మాత ఈమె.

అన్ని రూపాల్లో అమ్మవారి ని కొలిచి, ఎప్పుడూ తప్పు చేయను అంటూ మొక్కుకుంటూ మంచి బుద్ధి ని ప్రసాదించమని వేడుకుంటాము. మన మనసు పై మనకే నియంత్రణ ఉండాలి. అత్యాశ ఉండొద్దు. అసహనం. అహంకారం వద్దే వద్దు. అప్పుడు గానీ మంచి, చక్కటి జీవితం మనదౌతుంది.
9 రోజులు 9 రూపాలు, కానీ శక్తి ఒక్కటే – అమ్మ ప్రేమ! ఈ అన్ని అమ్మవార్ల రూపాలూ, లక్షణాలు మనందరిలో ఉంటాయి. అవేంటివో తెలుసుకోవడం, మసలుకోవడం మనకు కావాలి. అంతే! ఏమంటారు? అందరికీ దసరా నవరాత్రుల శుభాకాంక్షలు.

మీకు ఈ 9 రోజుల్లో ఏ అమ్మవారంటే ఎక్కువ ఇష్టం? కామెంట్ చేయండి ఫ్రెండ్స్!

Written by Madhavapeddi Usha

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రమక్కతో ముచ్చట్లు -40

ఒడిపిళ్ళు 35వ భాగం