ఒడిపిళ్ళు 35వ భాగం

చాలా గిరిజన తెగలలో అక్క వివాహం కాకముందే చెల్లెలకి వివాహం చేస్తారు. పరజతెగలో కూడా అటువంటి అభ్యంతరాలు ఏమీ లేవు. సాలీ తనకు తాను సులభంగా రాజీ పడింది. కుటుంబంలోని కొత్త సభ్యుడిగా నంద్యాని సంప్రదాయం ప్రకారం అంగీకరించింది. మాలీ భర్తగా కుటుంబంలో భాగస్వామి కావాలంటే కన్యాశుల్కం చెల్లించిన తర్వాతనే. అతడు సోమ్లా పక్కన రాత్రిపూట నిద్రించేవాడు. ఎవరైనా అతని గురించి అడిగినప్పుడు, తనకు తాను కొత్త గోటీగా పరిచయం చేసుకునే వాడు. కానీ మాలీ తను మాత్రమే ఉన్నప్పుడు, డాన్స్ చేస్తున్నప్పుడు, ఒకరికొకరు ప్రేమికుల వలె ఉండేవారు. అతని ప్రవర్తన అంతా సందర్భోచితంగా ఉండేది. సాలీ కూడా అతనికి ఇష్టమైన వదినగారే. ఆమెతో హాస్యం ఆడుతూ నవ్వుతూ సరదాగా ఉండేవాడు. ఆమె కూడా అంతే స్పందించేది.

సాలీ కూడా అంతే ఆసక్తితో అతని చిలిపి పనులకు స్పందించేది. కానీ ఆ ఆనందం, ఆ సరదాలు అందరి ముందు ఉన్నప్పుడే. నిజానికి ఆమె తన జీవితంలో అంత ఆగిపోయిందని భావించేది. ఆమె తన హృదయంలో తన చెల్లెలు మాలీ పట్ల ఎంతో దయ కలిగి ఉండేది. గతంలో వారిద్దరూ ఒంటరిగా ఉన్నప్పుడు, అందరూ తమను నిర్లక్ష్యం చేస్తున్నప్పుడు ఒకరికొకరు చాలా సన్నిహితంగా ఉండేవారు. కానీ ఇప్పుడు ఆ విధంగా మాట్లాడలేక పోతుంది సాలీ. అది ఇద్దరికీ ఇష్టమైన అంశం అయినప్పటికీ. కాక్లా, కమ్లీ, బాంగ్యాతో గతంలో వలె మాట్లాడ లేనట్టే, మాలీతో కూడా మాట్లాడ లేక పోతుంది. అందరూ కలిసి కూర్చున్నప్పుడు మాలీ మాట్లాడుతూ ఉంటే కూర్చొని వింటూ ఉండేది. తన చెల్లెలికి ప్రేమగా జుట్టును దువ్వి, పువ్వులను అలంకరించేది. తనకు తాను తన స్వరూపం గురించి ఆసక్తిని కోల్పోయింది సాలీ. ఎప్పుడైనా మాలీ అక్కను మంచి దుస్తులు ధరించమన్నప్పుడు, ఏదో ఒక వంక చెప్పి తప్పించుకునేది.

సోమ్లా, నంద్యా కలిసి రోజంతా పని చేస్తూ ఉండేవారు. నంద్యా ఒక విలువ కట్టలేని అద్భుతమైన మనిషి. అతడు తనకు తానుగా ఇంటిని మరమ్మత్తు చేశాడు. ఇంటి చుట్టూ ఉన్న తడకలను సరి చేశాడు. పెరటి తోటలో కూరగాయల కోసం మొక్కలు నాటాడు. అతి త్వరలో అవి విస్తారంగా పండుతాయి. సోమ్లా కొండజాతి వారికి పనిచేశాడు. అందుకని వారు కూడా కొండ ప్రాంతంలో సోమ్లా కొత్త పొలం దున్నడానికి సాయం వచ్చారు. అతి త్వరలో పొలం విస్తరించింది. కొండ శిఖరవాలు నుండి కొండ దిగువ వరకు. చాలా కఠినమైన శ్రమను వారు చేశారు. వారి వాంఛలు తీర్చుకోవడానికి ఇంకా పని చేయవలసి ఉంది. భూమి చుట్టూ అల్లుకున్న వారి కల్పనలు నిజం కాబోతున్నాయి. వారు పనిచేస్తూ మాట్లాడుకున్న కలలన్నీ కూడా అతి త్వరలో సఫలం కాబోతున్నాయి.

*** *** *** ***

చాలా మంది రైతులు విత్తనాలు వేయడం మొదలుపెట్టారు. కొందరు వరి నాట్లు వేస్తున్నారు. కానీ సోమ్లా తనఖా పెట్టిన పొలం ఖాళీగా పడి ఉంది. అప్పుడు ఒకరోజు షావుకారు తన మంది మార్బలంతో గ్రామానికి చేరుకున్నాడు. గోటీలు ముగ్గురు వెదురు బద్దలతో చేసిన కావడులతో అతనికి సంబంధించిన వస్తువులను మోసుకొచ్చారు. షావుకారు డబ్బుల సంచి అందరికీ కనిపించే విధంగా నడుముకు వేలాడుతోంది. అతను గ్రామపెద్దకు ఆకర్షణీయమైన బహుమతి ఇవ్వబోతున్నాడు ప్రత్యేకంగా. గ్రామపెద్ద అందుకు బదులుగా యువకుల వసతి గృహంలో షావుకారుకి వసతితో పాటు రక్షణ కల్పిస్తాడు. షావుకారు గ్రామస్తుల ఎద్దులను అద్దెకు తీసుకొని అతని గోటీలతో సోమ్లా పొలాన్ని దున్నించడం మొదలుపెట్టాడు. తన ఆస్తులను విస్తరింప చేసుకోవాలని షావుకారుకు చాలా ఆత్రుతగా ఉంది. ఆ విషయమే అడుగుతూ గ్రామంలో తిరిగాడు “ఎవరైనా ఏ భూమినైనా అమ్మడానికి సిద్ధంగా ఉన్నారా ?” అంటూ .

ఏ ఒక్కరు కూడా ప్రత్యేకంగా అతని ప్రతిపాదనకు ఆసక్తి చూపలేదు. ఆ సమయంలో వారికి పొలాలలో కావలసినంత పని ఉంటుంది. అదేవిధంగా డబ్బుతో కూడా పని లేదు. షావుకారు వీధుల వెంట తిరుగుతూ, యువతుల కోసం వెతుకుతూ, వారిని కళ్ళప్పగించి చూస్తూ, వారికి కొత్త పేర్లు పెడుతూ తిరుగుతున్నాడు. “ప్రియమైన అమ్మాయిలు, వసంతకాలపు తీయటి బియ్యమా, మధుర వసంతపు పుష్పమా” అంటూ వారిని పిలుస్తున్నాడు. అతనికి గ్రామంలో పెద్దవారు ఎదురైనప్పుడు తన మీసాలను తిప్పుతూ, ప్రత్యేకంగా ఇలా చెప్పే వాడు.

“నేను ఇక్కడ మీ గ్రామంలో ఒక భూమిని తనఖాకు తీసుకున్నాను. అందులో పళ్ళతోట వేస్తున్నాను. ఇక్కడ ఒక గోదామును కూడా కట్టిస్తాను. అంతేకాదు వడ్లు మాండ్యా ధాన్యం కోసం గ్రామస్తులకు రుణాలిస్తాను. వ్యవసాయంలో వారి అవసరానికి, ఇంకా ఎవరికైనా కూలీలకు డబ్బు చెల్లించడానికి, లేదా కూలీలను ఏర్పాటు చేసుకోవడానికి కూడా అప్పుగా డబ్బు ఇస్తాను. ఈ గ్రామంలో రోడ్లు వేయిస్తాను. ఇంకా నా కార్మికుల చేత చెరువు తవ్విస్తాను. ఊరి ప్రజలకు అందరికీ కావలసినంత తాగునీరు అందిస్తాను. మీరంతా చూడండి నేను ఈ గ్రామాన్ని ఎంత గొప్పగా మారుస్తానో” అనేవాడు.

సాయంత్రం చీకటి పెరిగిన తర్వాత షావుకారు యువతులు ఉండే వసతి గృహం ముందు కూర్చున్నాడు. అతనికి తోడు నలుగురైదుగురు గ్రామస్తులు కూడా ఉన్నారు. అప్పుడు సన్నటి జల్లు పడుతూ ఉన్నది. దూరంనుండి ఉరుముల శబ్దాలు ఆగకుండా వినిపిస్తున్నాయి. ఆ సమయంలో షావుకారు తన ప్రసంగాన్ని మొదలు పెట్టాడు. మొదట తన గురించి, తన సంపద గురించి, తన ఆస్తుల గురించి, అధికార శక్తి గురించి, అధికారులలో తన మాట ప్రభావం గురించి, తను ఏదంటే అది చేయగలనని చెబుతూ వచ్చాడు. ఆ తర్వాత ఎవరికైనా శిక్ష పడాలన్నా, ఎవరినైనా జైలు నుండి విడిపించాలన్నా తను చేయగలనని చెప్పాడు. ఆ తర్వాత అతని మాటలు అతని ఆదర్శాల గురించి, తోటి వారి పట్ల అతని ప్రేమ గురించి, అతడి దయ కరుణ తన కార్మికులపై ఏ విధంగా చూపిస్తాడో, అతని సభ్యత, సంస్కారం, నిస్వార్ధత, దైవభక్తి వంటి తనకున్న గొప్ప గుణాల గురించి మాట్లాడాడు. ఆ తర్వాత డబ్బు విషయంలో తాను ఏమాత్రం లెక్క చేయనని ఎంతోమంది గోటీలు తమ రుణాలను చెల్లించకుండానే మరణించారని. వారి పిల్లల నుండి చిన్న పైసా కూడా తాను వసూలు చేయనని , చాలా మంది గోటీల పిల్లలను తన రుణం నుండి విముక్తి చేశానని చెప్పాడు. వాళ్లంతా తమ జీవితాలను పునరుద్ధరించుకోడానికి వారికి సాయం చేశానని చెప్పాడు. షావుకారి కొందరు మనుషుల పేర్లు, కొన్ని ఊర్ల పేర్లు, ఇంతకుముందు వారెవ్వరూ విననివి చెప్పాడు. చుట్టూ ఉన్న వారు ఎవరూ అతని మాటలను నమ్మడం లేదు. అతను ఒక సిగరెట్ తాగి, తర్వాత మళ్లీ కొత్త సంభాషణ మొదలు పెట్టాడు. చుట్టూ కూర్చున్న గిరిజనులు ఆ మాటల్లో పాలుపంచుకున్నారు. అతడు యువతుల వసతి గృహంలో లాంతరు మసక వెలుతురులో అమ్మాయిలందరూ నెమ్మదిగా ఒకరి చేతులు ఒకరు పట్టుకొని కదలడం గమనించాడు. వారు అతని మాటలకు ఆకర్షింపబడి అతనికి కనిపించేలా జరిగి ముసి ముసిగా నవ్వుతూ గుసగుసలాడుతున్నారు. ఒకరినొకరు మోచేతులతో తోసుకుంటూ, మధ్య మధ్యలో ఒక్కసారిగా నవ్వులు ఆగిపోతున్నాయి. షావుకారు మాటలు మధ్యలో ఆపి వారి గది వైపు చూపు సారిస్తున్నాడు. మసక చీకటిలో అతని రోమాలు నిక్కబొడుచుకున్నాయి. ఒక విచిత్రమైన భావనతో అతను చెవులు రిక్కించి వారేమి చెప్పుకుంటున్నారో వినడానికి ప్రయత్నిస్తున్నాడు.

చాలా రాత్రి గడిచి పోయింది అతని చుట్టూ కూర్చుని ఉన్న ఉన్న కొందరు లేచి వెళ్లిపోయారు. ఆ సమయంలో షావుకారు యువతులను సంబోధిస్తూ “అమ్మాయిలూ మీరు నాకోసం ఒక పాట పాడడానికి, నాట్యం చేయడానికి మీకు ఏమి కావాలి” అన్నాడు.

గట్టిగా నవ్వుల తర్వాత ఎవరో ఒకరు గది నుండి “ఎలా డాన్స్ చేయాలి, డుంగుడుంగా వాయించేందుకు ఎవరూ లేరు” అని సమాధానం చెప్పారు. దానికి షావుకారు “మంచిది మీరు డాన్స్ మొదలు పెట్టండి, నేను డుంగుడుంగా వాయించడానికి ఒకరిని వెతుకుతాను” అన్నాడు. రాత్రి మరింత భారంగా మేఘాలతో టప టప చినుకులతో కప్పల అరుపులతో చీకటి మయం అయింది. ఏదో ఒకటి ఇచ్చి పుచ్చుకోవడానికి షావుకారు యువతులతో బొంగురు గొంతుతో “అమ్మాయిలూ మీకు ఏమైనా కావాలా? నాకు చెప్పండి. ఏదైనా సరే బట్టలు, ఆభరణాలు, మిఠాయిలు ఏదైనా సరే. మీరు ఆనందంగా ఉంటే చూడాలని ఉంది” అంటూ ఆతృతగా లేచి యువతుల వసతి గృహం వైపు రెండు అడుగులు వేశాడు. యువతులంతా నవ్వుకుంటూ వేగంగా తమ గదుల్లోకి పరిగెత్తారు ఒకరితో ఒకరు కొత్తగా ఏదో మాట్లాడుకుంటూ. అదంతా ఒక పక్షుల గుంపు ఒకదానితో ఒకటి కువకువలాడినట్టు అనిపించింది. ఒక హెచ్చరికతో అన్నీ ఆగి పోయాయి.

ఇసాక్ అనేవాడు గ్రామ బారిక్ మేనల్లుడు, మధు అనే యువకుడు అదే కులానికి చెందిన వాడు. వారిద్దరూ షావుకారుకు తోడుగా ఉన్నారు. “మీకు కేటాయించిన గుడిసె వద్దకు వెళ్దాం పదండి షావుకారూ” అన్నారు వాళ్ళు. షావుకారు ఒక నిట్టూర్పు విడిచి ఇష్టం లేనట్టు లేచి నడిచాడు.

చిక్కటి చీకటి ఒక్క నక్షత్రం కూడా కనిపించడం లేదు. వందల కొద్ది మిణుగురు పురుగులు చెట్ల పైన మెరుస్తూ చీకటితో పోరాడుతూ ఉన్నాయి. ఇళ్ళు, కొండలు, ఆకాశము, అడవి ప్రతిదీ ఆ రాత్రిలో గుడ్డివి అయ్యాయి. ఒక్కొక్కసారి ఒక పెనుగాలి గర్జిస్తూ చిరుజల్లు కురిపిస్తోంది. ఎముకల్లో మూలుగను కొరుకుతోంది చలి. వారంతా షావుకారు వద్ద నుండి ఇళ్ళకు. నడిచారు ఉన్నట్టుండి షావుకారు ఒంటరి వాడయ్యాడు. అతడు తన కోరికలను ఆనందాన్ని విజయాలను గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నించాడు. కానీ ఏమి గుర్తుకు లేవు. అవి అతనికి నిరాశను కలిగించాయి. అతనికి అన్నీ చాలినంత ఉన్నాయి. అయినా ఇంకా కావాలని ఆశ. చాలా మంది యువతులు కావాలి. చాలా ఎక్కువ పొలాలు కావాలి. ఇంకా ఎక్కువ గోటీలు కావాలి. ఇది అతని ఆలోచన.

యువకుల గృహం వద్దకు రాగానే ఇసాక్ తన ఇంటికి వెళ్ళిపోయాడు. కానీ షావుకారు మధుఘాసిని తనతో వుండమని అడిగాడు. అతడు 18 సంవత్సరాల యువకుడు. మందమైన పెదవులతో గులాబీ కళ్ళతో దృఢమైన శరీరంతో కరడుగట్టిన నేరస్థుడు.

షావుకారు అగ్గిపుల్ల గీసి వెలిగించాడు. చీకట్లో ఒక మద్యంసీసా బయటికి తీసి, కొంచెం మధ్యాన్ని గుట్క వేశాడు. బయట కూర్చున్న మధుఘాసికి ఘాటైన మద్యం వాసనను పసిగడుతూ ఉన్నాడు. షావుకారు ఒక సిగరెట్ వెలిగించి మధు వద్దకు వచ్చాడు. “రాత్రి ఎంత నిరాశగా ఉంది. ప్రతీది విచారం కలిగిస్తుంది. నాకు తోడుగా ఎవరైనా మాట్లాడుతూ ఉంటే బాగుండు. నాకు సహాయం చేస్తావా మధు నీకు నేను ఒక రూపాయి ఇస్తాను” అన్నాడు.

“ఎందుకు? అది చాలా తేలికైన పని” అని సమాధానం చెప్పాడు.

“మీరు నాకు ముందుగా చెప్పి ఉంటే, అసాధ్యం అయ్యేది కాదు. నేను ఎవర్నో ఒకర్ని ఈ గ్రామంలో లేదా మరొక గ్రామంలో వెతికే వాడిని. ‘భీతర్ ఘర్’ అనే ఊరు ఇక్కడికి దగ్గరలో ఉంది. అందులో అందమైన యువతులు ఉన్నారు. ఇప్పుడు రాత్రి చాలా గడిచిపోయింది. అందరూ దీర్ఘ నిద్రలో ఉంటారు. అయినప్పటికీ నాకు డబ్బులు ఇవ్వండి. నా ప్రయత్నం నేను చేస్తాను” అన్నాడు.

షావుకారు నిద్రించడానికి ప్రయత్నిస్తున్నాడు. కానీ నిద్ర రావడం లేదు. అతడు అటు నుండి ఇటు, ఇటు నుండి అటు అసహనంగా దొర్లతూ ఉన్నాడు. అతడు తన అనుభవాల గురించి ఆలోచిస్తున్నాడు. గడిచిన ప్రతి సంఘటన గుర్తుచేసుకున్నా క్రమంగా అంతా నిరాశను కలిగిస్తోంది. అతడు శబ్దాలను వినడానికి ప్రయత్నిస్తూ పడుకున్నాడు. వర్షం పెరుగుతూ ఉంది, కొంచెం కొంచెం ఆగకుండా. చివరకు ఎవరో తలుపు తట్టినట్టు గుసగుసలాడినట్టు నెమ్మదిగా నవ్వినట్టు అనిపించింది అతనికి. ఒక్కసారిగా తాటి చెట్టు నుండి ఆకు రాలి గాలికి కింద పడ్డట్టు. లేచి నిలబడ్డాడు తలుపు వద్దకు వేగంగా పరిగెత్తి ఒక్కసారిగా తలుపు తీసి చూశాడు. అతడు అనుకున్నట్టు అక్కడ ఏమీ లేదు. అక్కడ ఎవరూ లేరు. అక్కడే కాసేపు నిలబడి ఎదురు చూశాడు. కొంచెం కొంచెం ఒక్కసారిగా రాత్రి వర్షం మొదలైంది అతడు వెనక్కి వచ్చి తన గదిలో పడుకున్నాడు. మళ్లీ అతను చెవులు రిక్కించి శబ్దాలను వినడానికి ప్రయత్నిస్తున్నాడు. నిద్ర పట్టడం లేదు. చాలాసార్లు బయటకి లోపలికి తిరుగుతూ ఉన్నాడు. చివరికి నిద్రలో మునిగిపోయాడు.

తెల్లవారి ఉదయం మధుఘాసి యువకుల వసతి గృహం వద్దకు వచ్చి షావుకారును కలిశాడు. తనను క్షమించమని అడిగాడు.

“నేను అర్ధరాత్రి గడిచిన తరువాత చాలా దూరం వరకు మీకోసం నడిచి వెళ్లాను, కాళ్లన్నీ గాయాలయ్యాయి, చూడండీ” అంటూ తన కాలిని లేపి షావుకారు ముఖం వైపు చూపించాడు. “అయినా నేను వెతకడం కొనసాగించాను. నా కాళ్ళ నొప్పిని పట్టించుకోకుండా డోంబులు, పరజాలు ఉండే వీధుల్లో అంతా వెతికాను. చాలామంది యువతులను అడిగాను. అయినా ఏ ఒక్కరూ అంగీకరించలేదు. అప్పుడు ‘కలార్’ అనే గ్రామంలో కొత్తగా పెళ్లి అయిన ఒక యువతి ఉందని వెతుక్కుంటూ వెళ్లాను. ఆమె భర్త తాగుబోతు. ఆమె దగ్గరికి వెళ్ళి అడిగాను మొదట్లో ఆమె అంగీకరించలేదు. కానీ డబ్బు ఆశ చూపి ఒత్తిడి చేశాను. ఆమె అంగీకరించి ఒక షరతు పెట్టింది . ముందు ఒక రూపాయి ఇవ్వాలి తర్వాత ఒక రూపాయి ఇవ్వాలంది. సరే అని అంగీకరించాను. తర్వాత ఆమె చీర కట్టుకొని బయలుదేరే ముందు, ఆమె భర్త నా వెంట పడ్డాడు నేను ఎలాగో తప్పించుకుని బయటపడ్డాను. ఆమె ఈరోజు రాత్రి కుదరదు రేపు రాత్రి తప్పకుండా వస్తాను అన్నదీ. ఆ విషయాన్ని మీకు చెప్పాలనే అనుకున్నాను. కానీ మీరు మంచి నిద్రలో వుంటారు. మీ నిద్ర చెడగొట్టడం ఎందుకని ఇక్కడికి రాలేదు” అని చెప్పాడు.

షావుకారు అంతా విన్నాడు కానీ. ఒక్క మాట కూడా నమ్మలేదు. అయినా చిన్న ఫిర్యాదు చేసినా ఉపయోగం లేదు. కనుక “మంచిది నష్టమేమీ లేదు. ఈరోజు ప్రయత్నించు” అన్నాడు .

మధు తప్పకుండా అంటూ ప్రమాణం చేశాడు. కానీ షావుకారు దగ్గర నుండి వెళ్లేముందు. “ఇది చాలా పెద్ద పని. నాకు ఇంకొక రూపాయి ఇవ్వండి” అన్నాడు.

“సరే తర్వాత. ఈ రాత్రి ఇస్తాను” అన్నాడు షావుకారు.

*** *** ***

వడ్డీ వ్యాపారి రోజంతా తీరిక లేకుండా సోమ్లా వద్ద తీసుకున్న పొలాలను చూస్తూ ఉండేవాడు. కొన్నిసార్లు వేరే వారిని కలిసి మరికొంత భూమిని పొందడానికి ప్రయత్నం చేస్తూ, వారి భూములను తనకు అప్పగించ వలసిందిగా నచ్చ చెప్పే వాడు. అతడి రకరకాలుగా మాట్లాడేవాడు. ఉదాహరణకు “నీకు ఎదిగిన కొడుకు ఉన్నాడని విన్నాను. ఇంకా అతడికి పెళ్ళి చేయలేదట కదా. విషయం ఏమిటి ? నీ వద్ద కన్యాశుల్కం చెల్లించడానికి డబ్బు లేదా? నీకు ఎంత డబ్బు కావాలో చెప్పు. నేను నీ భూమి మీద అప్పుగా నీకు డబ్బులు ఇవ్వ గలను” అనేవాడు. అంతేకాక కొన్నిసార్లు షావుకారు పెళ్లి కానీ అమ్మాయిలతో కూడా మాట్లాడుతూ కనిపించేవాడు. వారు తమ పనుల కోసం ఇంటి నుండి బయటికి వచ్చినప్పుడు. ప్రత్యేకంగా నీరు తెచ్చుకోవడానికి ఏటి దగ్గరికి వెళ్తున్నప్పుడు. వారిని వెంటాడే వాడు. అట్లాగే తమ పశువులకు, గడ్డి కోయడానికి వెళ్ళినప్పుడు. వారిని కలిసే వాడు ఆశగా వారి వైపు చూస్తూ, నిట్టూర్పులు విడుస్తూ, వారికి డబ్బులు ఇస్తానని ఆశ చూపించేవాడు. బట్టలు, మిఠాయిలు, ఇంకా మీకేది కావాలంటే అది కొనుక్కోవచ్చునని చెప్పేవాడు. ఎవరైనా ఒక అమ్మాయి అతన్ని చూసి నవ్వితే చాలు ఆమె వెంట చాలా దూరం అనుసరించేవాడు.

ఇదంతా గ్రామస్తులంతా చూస్తూనే ఉండేవారు. కానీ పెద్దగా పట్టించుకునేవారు కాదు. ఎందుకంటే గిరిజన జాతుల అమ్మాయిలు చాలా స్వేచ్ఛగా మాట్లాడుతారు. వారికి ఇష్టం వచ్చిన వారిని స్నేహితులుగా ఎంపిక చేసుకోగలరు. ఆ గ్రామం షావుకారుకి రెండో ఇల్లు వంటిది. కనుక అతని ఏ చర్యను కూడా ఎవరూ ప్రశ్నించే వారు కాదు.

ఒక్కొక్క సారి రాత్రి వర్షం బాగా కురుస్తూ ఉన్నప్పుడు. మధుఘాసి ఎవరైనా ఒక స్త్రీని రహస్యంగా అతని గదికి బలవంతంగా ఈడ్చుకొని వచ్చేవాడు. అటువంటి సందర్భాల్లో ఆనందం సందేహమే. ఆ రాత్రంతా నిశ్చలంగా విజయమే కానీ కణకణ మండే నిప్పులాగా అసంతృప్తితో ఉదయం అయ్యేది. షావుకారుకి మధుఘాసి మీద కోపం వచ్చినప్పుడు. అతడు లేచి స్నానానికి స్త్రీలు స్నానం చేసే సరస్సుకు వెళ్ళేవాడు. అందరూ అతన్ని చూసి ఎవరితను కొత్త మనిషి పురుషులకు వేరే చెరువు వున్నట్టు తెలియదా అనుకునేవారు. అతను స్నానం చేసేటప్పుడు పవిత్రంగా మంత్రాలు చదువుతూ, కళ్ళను అటు ఇటు తిప్పుతూ, స్నానం చేస్తున్న స్త్రీలను చూస్తూ, అతని అభిరుచిని తెలుసుకునే ప్రయత్నం చేయనందుకు, మధుఘాసిని తిడుతుండే వాడు.

అతని స్నానం అయిపోయిన తర్వాత, ఆ సరస్సు నుండి బయటకు లేచి, గ్రామంలోని అతని వసతికి వచ్చేవాడు. దారిలో గ్రామస్తులంతా అతని శరీరానికి పూయబడిన గంధపు లేపనాన్ని చూసి అతడొక పవిత్రమైన సాధువు అనుకునేవారు. ఆ తర్వాత అతడు ఒక చిన్న గంట ఊపుతూ, ఉల్లాసంగా పూజ మొదలు పెట్టేవాడు. ఆ సమయంలో పిల్లలు అందరూ అతని చుట్టూ మూగి ఆసక్తిగా చూసేవారు. వేళ్ళతో ముక్కు రంధ్రాలను మూస్తూ, ఒక ముక్కుతో గాలిని పీల్చి రెండో ముక్కుతో వదిలేవాడు. అలా ఒక అయిదు సార్లు దీర్ఘ శ్వాస విడిచిన తర్వాత. రెవెన్యూ ఇన్స్పెక్టర్ గరజా సుందర నేర్పించిన, యోగాను అభ్యాసం చేసేవాడు. తన చేతి వేళ్ళను విచిత్రంగా తిప్పుతూ తన హావభావాలను ప్రదర్శించేవాడు. కనుగుడ్లను పైకి కిందికి అనేకసార్లు తిప్పుతూ కోతి చేస్టలేవో చేస్తూ ఉండేవాడు. ఆ తరువాత కళ్ళు మూసుకుని తన గురువు చెప్పినట్టు, ఆ చీకట్లో సొంత మెరుపును చూసేందుకు ప్రయత్నించేవాడు, దేవుడి మీద ధ్యాసను పెట్టి. కానీ అతడు కళ్ళు మూసుకొని సరస్సులో స్నానం చేస్తున్న ఆడవాళ్ళను ఊహించుకునేవాడు. ఈ వేడుక అయిన తర్వాత కళ్ళు తెరిచి, దేవుడి కోసం అప్పటివరకు కింద పెట్టిన అరటిపండు తీసుకునేవాడు. అప్పటికే దానికి చీమలు పట్టి ఉండేవి. అరటి పండును గర్వంతో పిల్లల వైపు విసిరే వాడు. పిల్లలంతా ఆ బహుమతి కోసం పోట్లాడుకుంటూ, అరుచుకుంటూ వెళ్ళిపోయేవారు. ఆ తర్వాత దేవుడి వైపు తన రెండు చేతులతో కొంత గంజాయిని ముందుకు చాపి, భక్తి పూర్వకంగా ప్రార్ధించి, వెంటనే వెనుకకు తీసుకొని దానిని పైపు లో నింపి, వెలిగించేవాడు. పొగ పీల్చడం త్రేన్చడం మొదలు పెట్టేవాడు. అతని మెదడులో కొత్త ఆలోచనలు తిరుగుతూ ఉంటే, పొగను బయటికి వదులుతూ ఉండేవాడు.

*** *** ***

సూర్యకాంతి ఎడతెగకుండా రంగులు మారుస్తూ ఉన్నది. బూడిద రంగు నుండి పాలిపోయిన ఆకుపచ్చ రంగు మళ్లీ నలుపు రంగులోకి ఆ తర్వాత నీలం రంగుకి. ప్రతిసారి పెద్ద పెద్ద మేఘాలు ఆకాశంలో కదులుతున్నాయి. ఆ మేఘాలు ఎరుపు తెలుపు చారలతో అంచుల మీద మచ్చలుగా హద్దులు పెడుతూ, ప్రతి రంగు ఊహకంద కుండా ఉన్నది. ఎవరో కుంచెతో చిత్రీకరిస్తూ మధ్యలో మర్చిపోయినట్టుగా అన్నీ ఊహలు విభిన్న ఆకృతులుగా కనిపించేవి. అవి కొన్ని వింతగా మరికొన్ని సుపరిచితంగా ఉన్నాయి. కొన్నిచోట్ల కుంచె కొనసాగుతూ ఉండగా ఆలోచనల్లో మునిగి నలుపు రంగు అద్దినట్లు, మరొకసారి ఆకాశం నలుపు రంగులోకి మారి, వర్షం రాబోతున్నట్టు, దూరంనుండి పొగలా మేఘాలు కనిపిస్తున్నాయి. ఒక్కొక్కసారి ఆ దృశ్యం నలుపు రంగులో కఠినమైన నిషేధంలా ఉండేది. కానీ అది నిరంతరం కొనసాగుతూ అంతలోనే విడిపోయి మళ్లీ కలుస్తూ నల్లటి మేఘాలు విన్యాసాలు చేస్తున్నాయి. అప్పుడప్పుడు సూర్యుడు కొద్దికొద్దిగా మేఘాల నుండి తొంగి చూస్తున్నాడు ప్రకాశహీనంగా. ఆ సమయంలో మృదువైన, వెలుగుతో కూడిన కాంతి దృక్కావరణం అంతా ఆవరించిన దృశ్యం కనువిందు చేస్తుంది. వర్షపు నీరు వరి పొలాల్లో నిండి సుడులు తిరుగుతోంది. కొండలన్నీ కూడా తెల్లటి వెండి దారాలతో అల్లి నట్టుగా వర్షపు ధారలు కనిపిస్తున్నాయి. సెలయేళ్ళు పొంగి కాలిబాటలపై పరుగులు పెడుతున్నాయి. మునిగిపోయిన రోడ్లు ఎర్రటి రంగుతో పరుగులు పెడుతూ వరదలు కట్టాయి. కనుచూపుమేర నీరు మాత్రమే కనిపిస్తూన్నది. కొండల్లో సెలయేళ్ళు గర్జిస్తూ ఉరుములతో పోటీ పడుతున్నాయి. కింది భాగంలో అంచులపై నిలబడ్డ కదంబ వృక్షాలు వణుకుతూ భయంతో తమ పూల వైపు చూసుకుంటున్నట్లుగా ఉన్నాయి. కొత్తగా అప్పుడే వికసిస్తున్న పూలు మనిషి తలపై వెంట్రుకలు నిటారుగా ఉన్నట్లుగా ఉన్నాయి..అకస్మాత్తుగా ఆ వరదల్లో నీరు మరుగుతున్నట్టు శబ్దం వినపడింది. మచ్చలు మచ్చలుగా నురగలు కక్కుతూ కనపడింది. అది వరద వస్తున్నట్టు సూచన. నీటిలో కొత్త గందరగోళం సృష్టించబడింది. చెట్లు వేళ్ళతో సహా పెకలించ పడుతున్నాయి. జంతువులు ఉన్నపళంగా నీళ్లలోకి లాగబడి కొట్టుకుపోతున్నాయి.

సూర్యుడు మరి బలహీనపడి కాంతి విహీనంగా మారి చింతిస్తున్నట్టుగా ఉన్నాడు. ఆ దృశ్యంలో ఆఖరి కిరణాలు అస్తమయ సమయంలో మబ్బుల మధ్య పొడవైన మెరుపు స్తంభాలు, బురద నీటిలో ప్రతిబింబిస్తూ నిటారుగా కాలుతున్న మంటల వలె కనిపిస్తున్నాయి. ఎర్రటి కాంతి తగ్గిపోతూ మసకబారింది. కొండలకు మరొకవైపు చీకటి వ్యాపిస్తూ నల్లటి మచ్చలు, ఆకుపచ్చ ఎరుపు రంగుల్లో కలుస్తున్నాయి. అక్కడ కూడా నల్లటి మచ్చలు చెట్లు, రాతి బండలు ఆనిశ్చితమైన కాంతిలో విచిత్రమైన ఆకృతుల్లో అడవి జంతువుల వలె కనిపిస్తున్నాయి.

నెమళ్ళు అరుస్తూ పెద్ద పెద్ద చెట్ల కొమ్మలపై తలదాచుకుంటున్నాయి. తెలుపు నలుపు రంగుల బాతులు తమ పెద్ద మెడలను పక్కపక్కన పరిచి, తమ రెక్కలను ఒకదానిపై ఒకటి పరుచుకుంటూ, ఆకాశంలో క్రమం తప్పని విన్యాసాలతో ఎగురుతున్నాయి. భూమిపై ఒక నిశ్శబ్దం విస్తరిస్తూ వర్షం పెరుగుతోంది కొద్దికొద్దిగా. ఉన్నట్టుండి భారీకాయం గల కుల్లూజాతి బాతులు వరిచేల నుండి దీనంగా ఏడుస్తున్నాయి. కొండపై నుండి క్రమం తప్పని విరామాలతో గడియారపు అలారం లాగా జింకల అరుపులు వినిపించాయి. వెలుతురు కొద్దికొద్దిగా చీకటిగా మారి అంతటితో ఆరోజు ముగిసింది.

ముసురుతున్న చీకట్లలో గుడిసెల నుండి పొగ చుట్టుకుంటూ అలలుగా పూరి కప్పుల నుండి పైకి వస్తూ మచ్చలుగా తోటల్లో కనిపిస్తూన్నాయి. విచిత్రం జరిగినట్టు వరి పొలాలలోని వరదలు ఊరిలోకి కూడా వ్యాపిస్తూ చుట్టుముట్టాయి. రాత్రంతా కొద్దికొద్దిగా ఒకదాని తర్వాత ఒకటి వరద నీటిలో ముంచేసాయి. ఊరిలోని అగ్ని ఆరిపోయింది. లోయలు, కొండలు, ఆకాశము పొగచూరిన చీకట్ల కింద సమాధి అయ్యాయి. గాలి బరువుగా విచారంగా వీస్తూన్నది.

Written by Jwalitha

కవి, రచయిత, అనువాదకురాలు, ఫ్యామిలీ కౌన్సిలర్, సామాజిక కార్యకర్త, ప్రచురణకర్త, ప్రకృతి ప్రేమికురాలు, తెలంగాణ ఉద్యమ కారిణి అయిన జ్వలిత అసలు పేరు విజయకుమారి దెంచనాల.
‘బహళ’ అంతర్జాతీయ అంతర్జాల త్రైమాసిక మహిళా పత్రికను 2021నుండి నడుపుతున్నారు.
వీరి రచనలు-
కాలాన్ని జయిస్తూ నేను, సుదీర్ఘ హత్య, అగ్ని లిపి, సంగడి ముంత అనే నాలుగు కవితా సంపుటులు; ఆత్మాన్వేషణ, రూపాంతరం అనే రెండు కథల సంపుటులు; జ్వలితార్ణవాలు అనే సాహిత్య సామాజిక వ్యాసాల పుస్తకం; ఎర్రరంగు బురద, ఆత్మార్ణవం, జగన్నాటకం, ఒడిపిళ్ళు అనే నాలుగు నవలలు మొత్తం 11 పుస్తకాలు రచించారు. ముజహర్ నగర్ లో దీపావళి, ‘పరజ’ వంటి అనువాదాలతోపాటు, బహుజన కథయిత్రుల పరిచయం, మెరిసే అనువాదాలు, అనువాద నవలలు పేరుతో శీర్షికలను నిర్వహించారు.
స్వీయ సంపాదకత్వంలో ఖమ్మం కథలు, మల్లెసాల చేతివృత్తికథలు, కొత్తచూపు స్త్రీల కథలు, పరివ్యాప్త, సంఘటిత, రుంజ, కరోనా డైరీ, లేఖావలోకనం, గల్పికా తరువు, ఓరు వంటి పదో సంకలనాలను ప్రచురించారు. గాయాలే గేయాలై, పూలసింగిడి వంటి అనేక పుస్తకాలకు సహసంపాదకత్వం వహించారు.
మర్డర్ ప్రొలాంగేర్, వుండెడ్ లైవ్స్ పేరుతో వీరి కవిత్వం ఆంగ్లానువాద పుస్తకాలు వెలువడ్డాయి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*కొత్త లోకాలు [ కాలమ్]

మావయ్య బంగారం!-2