” విజయీభవా… దిగ్విజయీ భవా!!”

ఏడాది పొడవునా వచ్చే ఏ పండగ అయినా మళ్లీ మళ్లీ గుర్తు చేసుకోగలిగే తీపి జ్ఞాపకాలుగా మా పల్లెలు,మా బాల్యం మాకు అందించాయి. మా వాళ్ళు ఆరుగురు అన్నదమ్ములు ఇద్దరు ఆడపడుచులు, వారికి జతగా చేరిన మేమంతా కూడా ఏదో చుట్టరికంతో సంబంధాలు కలుపుకున్న ఆ ప్రాంతాల వాళ్ళమే. మామగారు వ్యవసాయస్థులే అయినా, పిల్లలందరినీ బాగా చదివించారు. అందరూ పెద్ద పెద్ద ఉద్యోగాల్లో పట్టణాల్లో ఉన్నప్పటికీ, మా వారు,బావగారు మాత్రం ఊర్లోనే వ్యవసాయానికి సాయంగా రైస్ మిల్లు, మిల్క్ ఫ్యాక్టరీ లాంటిది కట్టి, ఊరు తరలిపోకుండా కొంత ఆపగలిగారు. ఐదవ తరం నడుస్తున్నా ఇప్పటికీ మాది ఉమ్మడి కుటుంబమే . మా పెద్దవాళ్లు చీకు చింత లేకుండా ప్రశాంతంగా కాలం గడిపిఎనభయ్, తొoభయిలలో పరమపదించారు. మేము ఇప్పుడు దాదాపు వారి వయసులలో ఉన్నాము. అందరo లక్షణంగా ఉన్నాము.
దేశ విదేశాలలో ఎక్కడెక్కడ ఉన్నా మా పిల్లల వరకు సంవత్సరంలో ఏదో ఒక పండుగకు కలిసే వాళ్ళు, ఇప్పుడు ఇక వాళ్ల సంతానం చదువులు ఉద్యోగాలు పెళ్లిళ్లు, ఆపై వాళ్ళ పిల్లలు. ఇప్పుడిక ఎప్పుడు ఎక్కడ ఎలా వీలైతే అలా కలవడం జరుగుతున్నది. అయినప్పటికీ,నిన్న మొన్న పుట్టిన పిల్లల వరకు కూడా కొత్తగా పరిచయాలు అవసరం లేకుండా వావి వరుసలతో అందరం పలకరించుకుంటున్నాము. ఇది చాలా సంతోషించవలసిన విషయం అనిపిస్తుంది.
ఈసారి దసరాకు మా తరం వాళ్లమందరం ఖచ్చితంగా మా ఊర్లో కలవాలనుకున్నాము. దసరాకు నాలుగు రోజులు ముందుగానే అందరూ ఊరు చేరుకున్నారు. మొత్తం పద్దెనిమి ది మందిమి మేము. అందరూ వచ్చి ఉన్నారు అని తెలిసి ఊర్లో వాళ్ళు బంధువులు రావడం, అలాగే రాలేని వాళ్ళ దగ్గరకు మేము వెళ్లడం రోజు ఏదో ఒక కార్యక్రమం ఉంటోది. మా ఊరు తీరు మారింది .వీధి బడుల స్థానంలో కాన్వెంట్లు వెలిశాయి, అయ్యవార్ల తరం మారిపోయి, విద్యాబోధనలో కూడా ఎన్నో మార్పులు వచ్చాయి., పగటివేషదారులు కనుమరుగయ్యారు. పని వాళ్ళ పనితీరులోనూ ఎన్నో మార్పులు వచ్చాయి. కానీ పురాతనమైన, ప్రతిష్ట కలిగిన రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయం అప్పటికి ఇప్పటికి విశేషంగానే ఉంటున్నది. దసరా ఉత్సవాలు ఎంతో వైభవంగా జరుపుతారు. మేము ప్రతిరోజు ఏదో ఒక సమయంలో ఆనాటి అలంకారంతో అమ్మవారిని దర్శనం చేసుకుని వస్తున్నాము.
ఏమి జనం,ఏమి జనం. చీమలు పుట్ట పిగిలినట్లుగా వస్తూనే ఉన్నారు. ఆ తోపులాటల్లోనే అమ్మవారి దర్శనాన్ని చేసుకుని అలసిపోయి ఇంటికి చేరాము. ఈరోజు అమ్మవారు సరస్వతి దేవి అలంకారంలో ధవళకాంతులీనుతూ ప్రశాంతంగా ఉన్నారు. అనుకుంటూ మనసులో మరొకసారి ఆ రూపాన్ని ఆవాహన చేసుకుని తృప్తిపడ్డాము.
మా భోజనాల కార్యక్రమంఅయిపోయాక, ఇంటి వెనుక తులసి కోట అరుగుపైన, పక్కనే వేసున్న మంచాలపైన అందరం కూర్చుని, ఆ కబుర్లు,ఈ కబుర్లు, పిల్లల సమాచారాలు చెప్పుకుంటూ ఇప్పటి హడావుడి నుండి సేద తీరుతూ, జ్ఞాపకాల బాటలో ఒక్కొక్క అడుగు వెనక్కు వేసుకుంటూ ( బ్యాక్ వాక్ లాగా ) జరిగిపోయిన రోజులను గుర్తుచేసుకో సాగాము. వదినా!మన పెళ్ళిళ్లయిన కొత్తల్లో మనందరం రాహు కాలం దీపం పెట్టేందుకు మంగళవారం, శుక్రవారం అమ్మవారి గుడికి వెళ్లే వాళ్ళం గుర్తుందా! పట్టుమని పది మంది కంటే ఉండేవాళ్లుకాదు. ప్రశాంతంగా పూజ ముగించుకుని వచ్చేవాళ్ళం. అవును గుర్తు లేకేo, యాబై ఏళ్ల క్రితం సంగతి చెబుతున్నావు శారదా, కాలం తెచ్చిన మార్పులు మర్చిపోతున్నావు. ఎడ్లబండ్లల్లో తిరిగిన మనం, పిల్లల చదువులు పెండ్లిండ్ల తర్వాత దేశ విదేశాల్లో ఉద్యోగరీత్యా స్థిరపడిపోయిన పిల్లల అవసరాలకు మొన్న మొన్నటి వరకు విమాన ప్రయాణాల్లోనే కాలం గడిపాము. అవునవును అంటూ అందరూ నాకు వత్తాసు పలికారు. మా బావగారు అందుకుంటూ, వయసు రీత్యా మనము చూస్తున్న మార్పులలో,మొబైల్ ప్రవేశంతో కాలం మరింత వేగం పుంజుకుని బహుదేవతారాధనలతో పాటుగా, ఆశ్రమాలు, గుళ్ళు బహుళంగా పరిచయమవుతున్నాయి. జనం ‘మాత్రలు’ వేసుకున్నత సులభంగా ‘యాత్రలు’ చేస్తున్నారు.
ఏదేమైనాప్పటికీ
స్వచ్ఛమైన గాలి ఆరోగ్యమైన ఆహారం ఆనందంగా ఆడుతూ పాడుతూ పెరిగిన మన బాల్యం మన పిల్లలకు కొంతవరకు పరిచయం కానీ వాళ్ల పిల్లలకు ఆ తర్వాతి వారికి పేదరాశి పెద్దమ్మ కథల లాగా అనిపిస్తాయేమో అనుకుంటూ మా చిన్ననాటి విజయదశమి సంబరాలలోకి వెళ్లిపోయాము.
ఆశ్వయుజ మాసం సెప్టెంబరు అక్టోబర్ నెలలో వచ్చే విజయదశమి దశ హరాగా, నవరాత్రి అని కూడా పిలవబడుతూ, తొమ్మిది రోజులు అమ్మవారికి రోజుకొక నామాలంకారాలతో పూజలు ఉండేవి. అలాగే నైవేద్యాలు కూడా,కానీ ఇప్పటిలా అలంకారాలు,పూజా విధానాలు,నైవేద్యాల హడావుడి మేమెరుగము. దశరా పదిరోజులు రోజుకొక అవతార వేషధారణతో, అమ్మవారిదశావతారాలను,ఆయా అవతార సంఘటనలను తెలిపే పద్య,వచన మాధుర్యంతో అలరిస్తూ, ఇంటి యజమానుల వంశపారంపర్యాన్ని ఆశీర్వదిస్తూ, భట్రాజుల పొగడ్తలతో పగటివేషగాళ్ళు ఇంటింటికి తిరుగుతూ ప్రదర్శించేవాళ్లు. ఎనిమిదవ రోజు ఆయుధ పూజ రోజు నిత్యం వాడే వస్తువులు వాహనాలు, ట్రాక్టర్లు సైకిల్ బండ్లు, బస్సులు కార్లు లాంటివి, వ్యవసాయ పనిముట్లు, ఇంటి గడపలు తలుపులు, వంట పొయ్యిలు, కత్తిపీట, రోలు,పచ్చడి బండలు, బీరువాలు అన్నింటిని శుభ్రం చేసి గంధం పసుపు కుంకుమలతో పూజిస్తారు. బెల్లం, శనగపప్పు కలిపిన బొరుగులు అందరికీ పంచుతారు. విజయదశమి నాడు దేవాలయాలలో తప్పనిసరిగా ఉంటే ఉండే జమ్మి చెట్టును పూజిస్తారు. పాండవులు అజ్ఞాతవాసంలో తమ ఆయుధాలను ఈ జమ్మి చెట్టుపై మంత్రబద్ధం చేశారట. అంతేకాక యాగ, హోమాలప్పుడు అగ్నిని రగిలించే( అరణి) సాధనంగా జమ్మి చెట్టు పవిత్రమైనది.ఎన్నో ఔషధ గుణాలున్న ఈ చెట్టును దేవి ప్రతిరూపంగా పూజిస్తారు కూడా. ఇవన్నీ పురాణాలలో చెప్పిన పూజలో భాగాలయితే ,
దసరా పది రోజులు మా బడులకు సెలవులు ఇచ్చేవారు, గురువుల ప్రాముఖ్యతను, గురు శిష్య అనుబంధాన్ని గుర్తుచేస్తూ గురువు పట్ల విద్యార్థులకే కాదు వారి తల్లిదండ్రులకు కూడా ఎంత గౌరవపూర్వక బాధ్యత ఉందో తెలిపే పండుగ విజయదశమి. మా మాస్టారులను మేము ఇప్పటికీ తలుచుకుంటూ ఉంటాము. మాస్టారులతో మాకు అతి చనువు లేదు,అతిగా మాట్లాడే వారం కాదు. అలాగని అతిగా భయపడే వాళ్ళం కూడా కాదు. ఏదో తెలియని అభిమానం ఆత్మీయత సన్నని రేఖలా గురు శిష్యుల మధ్య ఉందనిపించేది. అలాగే మాస్టార్లు కూడా ప్రతి ఒక్క విద్యార్థిని పేరుపేరునా గుర్తుపెట్టుకుని ‘నా స్టూడెంట్ ‘అన్న ఒక్క పదంలో విద్యార్థులందరినీ ఇమిడ్చి, స్టూడెంట్ లందరి పట్ల వారి బాధ్యత తో కూడిన ప్రేమాభిమానాలను వారు వ్యక్తం చేయకుండానే మా మనసుల్లో నింపేవారు. మా ఉన్నతి వారి జీవిత ధ్యేయంగా భావించేవారు. చదువులో వెనుకబడ్డ పిల్లలను, తుంటరి వాళ్లను పేము బెత్తంతో కొట్టినా, గోడకుర్చీ వేయించినా, మాస్టారు పిల్లల మధ్య కక్షలు కార్పణ్యాలు ఉండేవి కావు. మాస్టర్ దండించబట్టి నేను ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నాను అని అనుకునేవాడు ఒకడ యితే, అంత కొట్టినా అక్షరం అబ్బలేదు,నా కొరకు మా మాస్టారు ఎంత తపన పడేవారో అంటూ అపురూపంగా గుర్తు చేసుకునే వాడొకడుంటాడు. వారి వారి స్థితిగతులను బట్టి అందరం ఉన్నత విద్యలను అభ్యసించకపోయినప్పటికీ, జీవిత కాలానికి సరిపడా సంస్కారాన్ని మా మాస్టార్లు మాకందరికీ పంచారు.
విజయదశమి రోజున మాస్టారులతో కలిసి పిల్లలందరూ ఇంటింటికి పద్యాలు పాటలు పాడుకుంటూ ఊరంతా తిరిగే వాళ్ళం. సంవత్సరానికి ఆ ఒక్కరోజు మాత్రం ఆడపిల్లలకు తక్కిన పిల్లలతో కలిసి అన్నీ గడపలెక్కేందుకు అనుమతి ఉండేది. కొత్త పావళ్లు రవికలతో జడ కుచ్చులు తల నిండా పూలతో, అనువైన నగలతో ఆడపిల్లలo,బాలా త్రిపుర సుందరిల్లా తయారైతే, అబ్బాయిలు వెదురు విల్లులతో బాణాల చివర పూలరేకులు, మరువం దవనం లాంటి సువాసన గల ఆకులు, రంగుల పొడులు పొట్లంగా కట్టి బాణాలకు చివర అమర్చి ఇంటి గుమ్మంలో నిలబడి బాణాన్ని సంధించి వదిలితే పూల పొట్లాలు విచ్చుకొని ఇల్లంతా, పూలరేకులు ఆకులు, రంగులు వెదజల్ల బడి సువాసనతో గుభాళించేది . మాస్టారు ద్రోణాచార్యులను మరిపిస్తుంటే విల్లంబులు చేతబట్టిన విద్యార్థులు జీవన కురుక్షేత్రంలో నిలిచి గెలిచే విజయుడులా ఉన్నారు.
వారి వారి ఇంటి వంతు వచ్చినప్పుడు ఆ విద్యార్థి ముఖం గర్వంగా వెలిగిపోతూ అంబారీ ఎక్కినంత ఆనందంగా ఉండేది. మాస్టారులను పిల్లలను ఇంటిలోకి ఆహ్వానించి,సిరి చాపలు పరిచి సిద్ధంగా ఉన్న అరుగులపై కూర్చుండ జేసి పానకం,మంచినీళ్లు తాగేందుకు ఇచ్చేవారు. ఇంటి పెద్దలందరూ కూడా వచ్చి కూర్చున్న తర్వాత మా మాస్టారుల పట్ల మాకున్న బాధ్యతను గౌరవించమని విన్నవిస్తూ ఇలా పాడేవాళ్ళం.
జయీ భవ… దిగ్విజయీభవ
పరగంగా చిన్న చిన్న బాలురము మేము
రేపురా,మాపురా మళ్లీ రమ్మనక
శ్రీమంతులై మహాశ్రేయములు కలిగి
భూమిలో వెలలేని భోగమును కలిగి
ధన ధాన్యములు కలిగి ధర్మములు కలిగి
అందలంబులు కలిగి అతి కీర్తి కలిగి
పొందుగా నవరత్న భూషణాలు కలిగి
సతులతో హితులతో సౌఖ్యములు కలిగి
బంధుజనంబుల ప్రఖ్యాతి కలిగి
అన్నదమ్ములు మీరు ఆయువులు కలిగి
తనయులకు తనయులకు తనయులం కలిగి
మనుమలకు మనుమలకు మనుమలం కలిగి
పాడియు పంటయును బాగుగా కలిగి
గాడి సురభులు మీకు ఘనముగా కలిగి
వన్నె వాసియు కలిగి వర్ధిల్లరయ్యా
సన్నుతాచారములు జరిగించరయ్యా
ఆయువును పుత్ర పౌత్రాభివృద్దిగాను
బాల వాక్కు ఇదే మీకు బ్రహ్మ వాక్కుగాను.
జయీ భవా దిగ్విజయీభవ
పసిబిడ్డలము మేము పలుమార్లు తిరుగ
వసివాడి ఉన్నాము ఎండ వానలకు
పావలా బేడ అయితే పట్టేది లేదు
అర్ధ రూపాయి అయితే అంటేది లేదు
ముప్పావలా అయితే ముట్టేది లేదు
హెచ్చు రూపాయి అయితే పుచ్చుకుంటాము
అయ్యవారికి చాలు ఐదు వరహాలు పిల్లలకు చాలు పప్పు బెల్లాలు
జయీ భవా … దిగ్విజయీభవ
దుష్ట జనులను ప్రస్తుతించేది లేదు
అష్ట కష్టపు వారిని అడిగేది లేదు
పోసగా పెనులోభు లను పొగిడేది లేదు
పాత అప్పులు కావు పలుమార్లు అడుగ
అల్లుండ్లవలె గాము అలిగి మిమ్మడుగ
అంటూ పాడుతున్న మా అభ్యర్థనలను మన్నించి మా పెద్దలు మాస్టారులకు,నగదు, పంచెల చాపులు దినసరి వస్తువులు ఉప్పు పప్పులను మా మాస్టారుల ఇంటికి చేర్చే వాళ్ళు. మాకు పప్పు బెల్లాలు దండిగా
పొట్లాలు కట్టి ఇచ్చేవారు.
కానుకలు స్వీకరించిన మా మాస్టార్లతో కలసి , మేమందరం మహాదానందంతో
రాజాధిరాజా శ్రీ రాజ మహారాజ
రాజతేజో నిధి రాజకందర్ప
రాజ కంఠీరవ రాజమార్తాండ
రాజ రత్నాకర రాజకుల తిలక
రాజీవముఖ హంస లక్ష్మీ నివాస
సుజన మనోధీశ సూర్య ప్రకాశ
జయీ భవా… దిగ్విజయీభవ అంటూ ఆశీర్వచనాలు పలికి, అక్కడితో అలసిపోక ఉత్సాహంగా మరో గడప ఎక్కే వాళ్ళం.
దసరా సంబరాలు అలా మా జ్ఞాపకాల డైరీలో మాసిపోని ముఖ్యమైన పేజీలుగా మిగిలాయి.
మా అందరి చిన్ననాటి దసరా అనుభవాలను మరోసారి తృప్తిగా ఆనందించాము. మర్నాడు విజయదశమి.
అమ్మవారిని మహిషాసుర మర్దని అలంకారంలో దర్శించుకుని, పండుగను వెలితి లేకుండా జరుపుకున్నాము.
బాల్యానికి వృద్ధాప్యానికి మధ్యకాలం ఎంత విలువైనది అయినప్ప టికీ,చిన్ననాటి జ్ఞాపకాలతో సరితూగదు అనుకుంటూ కొత్త ఉత్సాహాన్ని నింపుకున్నాము.

Written by Polamreddy Vijayalaxmi

పొలంరెడ్డి విజయలక్ష్మి శ్యామదాసిగా , రచనా ప్రపంచానికి పరిచయం అయ్యాను. ప్రత్యేకించి విద్యార్హత ఏమి లేదు వానాకాలం చదువు మాత్రమే. యదార్ధాన్ని పునాదిగా , నా అనుభవాలు , నా చుట్టూ జరిగే వాస్తవాలు, నా మనోభిలాషను తృప్తిపరస్తూ, అక్షర రూపంలో సహృదయులైన మీవంటి ప్రోత్సహకులు చెంత చేరి ప్రాణం పోసుకున్నాయి. అలా ఊపిరందుకున్న రచనలు, నవవ్యాస మాలిక , కొత్త కథలు, గుర్తుకొస్తున్నాయి, ప్రియమైన నీకు, కథలు, లోగిలి, ధీర. మరికొన్ని మంత్లీ మ్యాగజైన్ లో కూడా ప్రచురింపబడ్డాయి. వేదం, వేదాంతం, బ్రతుకు బాసటగా నిలిచే అన్నమయ్య కీర్తనలు, ఆధ్యాత్మిక ప్రవచనాలు వినడం, రోజు వాకా పాఠంగా నేర్చుకోవడం అతి ముఖ్యమైన దినచర్య.

పూర్తి పేరు : పొలంరెడ్డి విజయలక్ష్మి
కలం పేరు: శ్యామదాసి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ఉమా చిత్రాలు

పాట