మళ్లీ కూయవే గువ్వా-2

ధారావాహిక నవల

జరిగిన కథ

అన్యోన్య దాంపత్యానికి అసలైన చిరునామా అన్నట్లుండే జంట – మాధవి, కేశవరావులది. అరవై సంవత్సరాల వయస్సులో పిల్లలు, మనవలతో ఆనంద జీవితాన్ని కొనసాగిస్తున్నారు. కేశవరావు తన పెద్ద భార్య ఆరోగ్యం గురించి చింతిస్తుంటే మాధవి ధైర్యం చెప్తుంది.

వేసవికాలం మధ్యాహ్నాన, ఊరగాయల పని చేసుకుంటూ, అటూ ఇటూ తిరుగుతున్న మాధవి, కాలింగ్ బెల్ మ్రోగటంతో తలుపు తెరిచి, ఎదురుగా నిలబడి ఉన్న తన స్నేహితురాలు జాహ్నవిని చూసి, ఆశ్చర్యానందాలకు లోనవుతుంది.

ఇక చదవండి…

ఎదురుగా తన స్నేహితురాలు జాహ్నవి.

కళ్ళకున్న గాగుల్స్ తీసి, చేత్తో పట్టుకుంటూ నిలబడ్డ జాహ్నవిని చూడగానే మాధవి ఆనందంగా, “హాయ్ జాహ్నవీ, ఎప్పుడొచ్చావు అమెరికానుండి?”అంది.

“నీ సంగతి చెప్పు ముందు! ఏమిటసలు పత్తాలేవు? పిల్లల పెళ్ళిళ్ళు అయిపోయాయి, బాధ్యతలు తీరాయి, ఇప్పుడైనా అమెరికా రమ్మని చెప్పాను కదా! ఒక్కదానివి ఉండి ఏంచేస్తున్నావసలు? డ్రైవింగ్ నేర్చుకోవడం, క్రిష్టా కొనేయడం అయిందా?”  అంటూ సోఫాలో ఎదురుగా ఉన్న కేశవరావుని చూసి టక్కున తన వాక్ప్రవాహాన్ని ఆపేసి, ఆశ్చర్యంగా మాధవి వంక చూసింది జాహ్నవి.

మాధవి కాస్త తడబడుతూ, “మావారే కేశవరావు గారు! ఏమండీ! ఈమె జాహ్నవి! నా చిన్ననాటి ఫ్రెండ్. అమెరికాలోనే చదువు, పెళ్ళి, పిల్లలు. ఇండియా వచ్చినప్పుడల్లా నన్ను కలుస్తుంది… రావే, కూర్చో!”  అంటూ చనువుగాచేయిపట్టిలాగుతూ మరోసోఫాలోకూలేసిందిజాహ్నవిని.

జాహ్నవి ఇంకా షాక్ నుండి తేరుకోలేదు.

అది గ్రహించిన కేశవరావు, “మీ ఇద్దరూ చాలారోజులకు కలిసినట్లున్నారు. మాట్లాడుకోండి, నేను కాసేపు పడుకుంటాను. కేరియాన్ జాహ్నవి గారూ, ఫీల్ ఫ్రీ!” అని నవ్వుకుంటూ లోపలికి వెళ్ళాడు.

“ఏంటే జాహ్నవీ, అంత షాక్ తిన్నావు? నువ్వు కోరుకున్నది ఇదేకదా! నేను ఇలా హేపీగా ఉండాలనే కదా నీ కోరిక! నేనేమైనా తప్పు చేసానా?”

అనంటున్న మాధవిని దగ్గరగా తీసుకుంటూ, ”తప్పేముందే!ఇన్నాళ్ళకైనానీ జీవితం ఒకగాడినపడింది.ఈయనేదోపొలిటీషియన్అనుకుంటా!టీవీలో చాలాసార్లు చూసాను. ఈయనెలా దొరికాడు? తోడునీడకి వెళ్ళావా? లేక ప్రేమ పెళ్ళా? ఆయనకి కూడా భార్య లేదా? పిల్లలున్నారా?  అసలు పదిహేనేళ్ళ క్రితమే నీకు చెప్పాను. అమెరికాలో మన తెలుగు డాక్టర్ నీ వివరాలు విని ఇష్టపడ్డాడని,  పెళ్ళిచేసుకుని నిన్ను పిల్లలని చూసుకుంటాడని. అప్పుడు మెట్టవేదాంతం చెప్పావు. ‘ఈ బ్రతుకింతే! నా పిల్లలకు, నా అమ్మానాన్నలకే అంకితం!’ అని. ఇప్పుడు ఇంత మార్పు! అదీ ఏడాదిలో నీలో ఎలా మార్పు వచ్చింది? ఇంత సీక్రెట్ గానా?”మళ్ళీ ప్రశ్నలు కురిపించింది జాహ్నవి.

మాధవి జవాబు ఇచ్చేలోగా కేశవరావు పిలుపు.

“మధూ! ఒకసారి వస్తావా!”  పిలుపు వినగానే, “ఉండవే, ఏమిటో కనుక్కుని వస్తాను” అని లోపలకి వెళ్ళింది మాధవి. లోపలినుండి మాటలు వినవస్తున్నాయికానీ వినడం సభ్యత కాదని టీవీ ఆన్ చేసింది జాహ్నవి.

“జాహ్నవీ! కాస్త టీవీ చూసుకుంటూఉండు! ఈయన బైటకి వెళ్ళాలి! ఆయనకు టీ పెట్టి ఇచ్చి వస్తాను. ఆయన వెళ్ళిపోతే మనం ఫ్రీగా కబుర్లు చెప్పుకోవచ్చు.” అంది మాధవి.

“సరే మాధవీ, ఆయన పని చూడు. ఫర్వాలేదు!” అంది జాహ్నవి.

టీవీలో ఏదో పాతసినిమా వస్తోంది.  సినిమామీద ఆసక్తి లేకున్నా, అలా చూస్తోన్న జాహ్నవి మనసు మాధవి చుట్టూ తిరుగుతోంది. ఇద్దరూ ఒకే స్కూలు, ఒకేకాలనీలో పుట్టి పెరిగారు.  మాధవీ, తనూ ఎంతగా కలిసి మెలిసి ఉండేవారో! తామిద్దరినీ బంగారు బొమ్మలు అనేవారందరూ!హైస్కూల్ చదువులు చదివేటప్పుడుసెలవులు వస్తేరోజూ ఎక్కడో అక్కడికి వెళ్ళాల్సిందే!

మాధవి వాళ్ళ అమ్మ రాజ్యలక్ష్మిపోస్టాఫీస్‌లో ఉద్యోగం చేసేది. ఆవిడకి వీలున్నప్పుడుపిల్లలు తింటారని చచ్చీ చెడీ తయారుచేసిన పిండివంటలన్నీ ఆటలకు తెచ్చేసేది. అయినా వాళ్ళ అమ్మఏమీ అనేదికాదు. మాధవిఅంటే ప్రాణం! తను కూడాఅలానే చేసి, ఇంట్లో చివాట్లు తినేది.

తనకు అన్నయ్యలు, అక్కలు ఉన్నారు. అందుకని ఆ సందడి కోసం మాధవి తరచు తమ ఇంటికి వచ్చేది. అమ్మ తమతోపాటు మాధవికి పూలజడలు కుట్టడం, చేతులకు కాళ్ళకు గోరింటాకు రుబ్బిపెట్టడం చేసేది. అవి ఎర్రగా పండితే తామందరిని నిలబెట్టి దిష్టి తీసేది. అమ్మ మాధవిని కూడా ఇంకో కూతురిలా చూసుకునేది. మాధవి వాళ్ళ అమ్మ గౌరి, గోరింటాకులు పెట్టుకున్న తమ చేతులు, పాదాలు చూసి మురిసిపోయేది.

మాధవి వాళ్ళు, తాము తమ తండ్రుల ఉద్యోగాల నేపథ్యంలోవిజయవాడ దగ్గర ఉన్న పల్లెటూర్లనుండిహైదరాబాద్ వచ్చి సెటిల్ అయినవారే! అందువలన ఆంధ్రా, తెలంగాణా అన్న భేదం లేకుండా అన్ని పండుగలు,  వేడుకలుకాలనీలోని వాళ్ళతో కలిసి జరుపుకునేవారు. అందరూ కలసి జాతరలకు వెళ్ళడం, బోనాలపండుగచేయడం, అట్లతద్దె, నోములు,గొబ్బిళ్ళు, బతకమ్మ అన్నీ చేసేవారు. టెన్త్ క్లాస్ అయిందో లేదో నాన్నకు అమెరికాలోపెద్ద ఉద్యోగం రావడంతో తామందరూ అమెరికా వెళ్ళిపోయారు.

వెళ్ళేటప్పుడు తామిద్దరినీ ఊరడించడం ఎవరి తరం కాలేదు.

“నువ్వు కూడా పెద్ద చదువులకి అమెరికా వచ్చేయి.”  అని చెప్పి తను వెళ్ళింది కానీ ఇక్కడ మాధవి, అక్కడ తను ఎలా ఉంటామో అని బాగా ఏడ్చేది.

తను ఇంటర్ చదువుతున్నప్పుడే మాధవికి పెళ్ళని తెలిసి హతాశురాలైంది. పెద్ద చదువుల పేరిట మాధవి తమ దగ్గరకి వస్తుందని అనుకుంది. కానీ మాధవికిపెళ్ళని తెలిసింది. తామిద్దరూ తరచు రాసుకునే ఉత్తరాల వల్ల మాధవికి కూడా గోపాల్ అంటే చాలా నచ్చాడని తెలిసింది. తాముపెళ్ళికి వెళ్ళలేకపోయారు కానీ అందరూ చెప్పినదాని ప్రకారం మాధవి పెళ్ళి చాలా ఘనంగా జరిగింది.

తను ఎమ్మెస్ చేస్తున్నప్పుడువెకేషన్‌కి వచ్చినప్పుడు మాధవి వాళ్ళ ఊరు వెళ్ళింది. అప్పటికే మాధవికిపెద్దది యామిని పుట్టేసింది. రెండోది కడుపులో ఉంది.

మాధవి వాళ్ళది పల్లెటూరు అయినా ఇంట్లోసకల సదుపాయాలుఉన్నాయి దేనికీ లోటు లేదు గోపాల్‌కి వ్యవసాయంతో పాటు పొగాకు బిజినెస్కూడా ఉండటంవలన వాళ్ళ నాన్న, అన్నయ్యలతో చాలా బిజీగా ఉండేవాడు. ఉమ్మడి కుటుంబం. నౌకర్లు, చాకర్లతో సంపన్నమైనపడికట్టు! పెత్తనమంతా మాధవి అత్తగారు ప్రభావతిదే! అందరికీఏంకావాలో ఆవిడే చూస్తుంది. ఆవిడన్నదానికి ఎవరూ కాదనకూడదు అంతే! అని మాధవి చెప్పింది.

తానంది, “పోనీలేవే మన వయసెంతని పెత్తనం చేయటానికి?   మొగుడిని, పిల్లలని చూసుకో చాలు!” అంది. మాధవి నవ్వేసింది.

తన నెచ్చెలి ఇలాగే పదికాలాలుసుఖంగా ఉండాలని మనసారా కోరుకుంది.మాధవి అత్తగారు తను వచ్చేటప్పుడు తనకి పట్టుచీరె పెట్టి పంపించారు, పెళ్ళి కుదరాలని ఆశీర్వదించి.  ఆవిడ పెత్తనం మరీ అంత చెడ్డదికాదనిపించింది. అన్నీ తనే చేయాలన్న పంతమే కాని చెడ్డది కాదనిపించింది. కానీ విధి మాధవి జీవితంతో ఇన్ని ఆటలు ఆడుతుందని అనుకోలేదు. మాధవికి వచ్చిన కష్టం చూసి తామెంత తల్లడిల్లారో తానెప్పటికీ మర్చిపోలేదు.

***

పెళ్ళయిన పదేళ్ళకు నిండా పాతికేళ్లైనా లేని మాధవికి నల్గురు పిల్లలు. భర్తతో విడాకులు, మళ్ళీ హైదరాబాద్ వచ్చేసిందని తెలిసి తను తట్టుకోలేకపోయింది. ఫోన్ చేస్తే మాధవి ఏడ్పు, రోదన తప్ప మాట్లాడలేకపోయింది. తను ఆమెని కొన్నాళ్ళు కదిలించకూడదనుకుని ఎప్పుడైనా ఫోన్ చేసి వేరే విషయాలే మాట్లాడేది. ఏదో కోర్సులు చేసి జాబ్ చేస్తోందని తెలిసి పోనీలే ఇలా బిజీగా ఉన్నా మంచిదే అనుకుంది కానీ మాధవి జీవితం ఇంత నార్మల్‌గా అయిపోవడం తోడులేకుండా మిగలటం తనకి అమ్మానాన్న అక్కలకు అన్నయ్యలకు చాలా బాధ కల్గించింది.

ఎవరికివీలైనప్పుడువాళ్ళు మాధవిని కలవడం అలవాటుగా మారింది.తన ఎమ్మెస్ పూర్తి కావడం అక్కడేడాక్టర్ చదివిన తన కొలీగ్ వరుణ్‌నిపెద్దల ఆశీర్వాదంతో ప్రేమవివాహంచేసుకోవడంఅటు ప్రొఫెషన్, పిల్లలు ఇలా బిజీ లైఫ్… రెండేళ్ళకో మూడేళ్ళకో వచ్చినప్పుడు కలవడం జరిగేది.

మధ్యలో వరుణ్ హాస్పిటల్ లో ఇండియన్ పంజాబీ డాక్టర్ త్రివేదికి భార్య లేదని, ఏక్సిడెంట్‌లో చనిపోయిందని, పిల్లలుకూడా లేరని తెలిసి మాధవి వివరాలు చెప్పి ఆమె ఫొటో చూపిస్తేనచ్చిపెళ్ళి చేసుకుంటానని ఒప్పుకున్నాడు. కానీ మాధవి ఒప్పుకోలేదు. తనుకూడా బలవంతం చేయలేదు.

‘ఇప్పుడు ఈ అరవయ్యేళ్ళవయసులో ఎలా ఒప్పుకుంది?  పిల్లలందరి బాధ్యతలు పూర్తయ్యాయని ఒప్పుకుందేమో!’ అనుకుంటూఉత్సుకత నిండిన మనసుతో తను కూర్చున్న హాలంతా కలయజూసింది, జాహ్నవి. గోడలకి ముగ్గురు కూతుళ్ళు అల్లుళ్ళు, కొడుకులు కోడళ్ళు, వాళ్ళ పిల్లలతోమాధవి ఉన్న ఫొటోలు. కేశవరావు, మాధవి పెళ్ళి దండలతో ఉన్న ఫొటోలు కనిపించాయి జంట చక్కగా ఉన్నారు అనిపించింది జాహ్నవికి. లోపలనుండి మాటలు నవ్వులు వినవస్తున్నాయి. అలాగే నవ్వుకుంటూ వచ్చిన మాధవి ట్రేలో తెచ్చిన గ్లాసులతో తెచ్చిన ఆరంజ్ జ్యూస్, కాజూపకోడీ, కాజూ కట్లీ ఉన్న ప్లేట్ ఒకటి జాహ్నవికి అందిస్తూ, “తీసుకోవే!”  అని అందించింది

అవి తీసుకుంటూ ఉండగానే లోపలనుండి ట్రిమ్‌గా తెల్లని బట్టల్లో తయారై వచ్చిన కేశవరావు, “మధూ! నాకు కాస్త సెక్రటేరియట్‌లో పనుంది. అది చూసుకుని వస్తాను. మా ఫ్రెండ్ తన కారులో వచ్చాడు, నన్ను పికప్ చేసుకోవడానికి. మన కార్ ఉంది కదా! మీ ఇద్దరూ చాలారోజులకి కలిసినట్లున్నారు ఎక్కడికైనా వెళ్ళాలంటే మన డ్రైవర్‌కి కాల్ చేయి! ఫ్రీగా మాట్లాడుకోండి. రాత్రి డిన్నర్‌లో జాయిన్ అవుతాను”  అని చెప్పి, “వస్తాను మేడమ్!”  అని జాహ్నవికి కూడా చెప్పి వెళ్ళాడు.

అతనిని సాగనంపడానికి వెళ్ళిన మాధవిని చూస్తే ఎంతో ముచ్చటగా అనిపించింది. అదేమి అనుబంధమో,  ఇంతగా అల్లుకుపోయారు. ఎన్నేళ్ళ పరిచయమో తెలుసుకోవాలని మరింత ఉత్సుకత పెరిగింది.

భర్తను పంపించి లోపలకి వచ్చిన మాధవి, “పదవే! మనం గెస్ట్ రూమ్ లోకి వెడదాము. హాయిగా కబుర్లు చెప్పుకుందాము” అని లోనికి దారితీసింది.

గెస్ట్ రూమైనా సకల సదుపాయాలతో ఉంది. అక్కడే ఉన్న డబుల్ కాట్ సోఫాలు చూపిస్తూ, “నీ ఇష్టం  ఎక్కడ కూర్చున్నా!” అనంటున్న మాధవి మాటకి జవాబుగా,  “సోఫాలోనే ఎదురుబదురుగా కూర్చుందాము.” అనంటూ ఒక సోఫాలో కూలబడింది జాహ్నవి.

ఆమెకి ఎదురుగా మరొక ఛైర్ సోఫాలో కూర్చుని, తమతో తెచ్చిన స్నాక్స్ ప్లేట్స్, జ్యూస్ గ్లాసులు, అక్కడున్న టీపాయ్ మీద పెడుతూ, “జాహ్నవీ! ఇప్పుడు నేను ఎంతో ఆనందంగా ఉన్నానే! ఇంక నాగురించి మీరంతా హేపీగా ఉండొచ్చు. బాధలు పడటానికే పుట్టానేమో అనుకునే నేను గత పద్దెనిమిదేళ్ళుగా ఎంత సంతోషంగా ఉన్నానో మీ ఎవరికీ తెలీదు. పెళ్ళితో వచ్చే సాంఘిక భద్రత లేని సంబంధాలు ఎంతవరకు సురక్షితమో మనకు తెలియదు. మేమిద్దరంఒక గడువు పెట్టుకున్నాము.అయినా కూడా మేమిద్దరం ఒకరినొకరు అర్ధం చేసుకుని చేరువ కావడానికి మేము ఒకటి కావడానికేరెండేళ్ళు పట్టింది. ఇంక ఇప్పటివరకు మామధ్య చుట్టరికాలు, సన్నిహిత సంబంధాలు మా కుటుంబాలకు ఉన్నాయని అందరికీ పరోక్షంగాతెలిసినా మా ఇద్దరి అనుబంధం ఎవరికీ తెలియకుండా ఉండటానికి ఈ పాతికేళ్ళు అసిధారావ్రతం చేసినంత కష్టపడ్డాము.ఈ సంగతి ఎవరికీ ఎప్పటికీఎవరికీ చెప్పొద్దు అనుకున్నాను. కానీ కేశవరావుగారికిఅప్పటినుండీ నేను ఆయన భార్యగానే బ్రతకాలని కోరిక! కానీ నేను పెట్టిన గడువుకోసం‌ఆయన ఆగారు. ఇప్పుడు నేనెలా బ్రతికినా నన్ను సమాజం తప్పుపట్టదు.కానీ నా పిల్లలకే ఎలా చెప్పాలో అనుకున్నాను.అది కూడా సామరస్యంగా తేలిపోయింది…” అని ఒక నిముషమాగి, ఆరెంజ్ జ్యూస్ కొంత తాగి, కాస్త సర్దుకుని మళ్ళీ చెప్పడం మొదలుపెట్టింది మాధవి. ఆమెవైపే తదేకంగా చూస్తోంది జాహ్నవి.

“జాహ్నవీ! నీకే కాదు! నిజంగా నాగురించి ఎవరికీ ఏమీ తెలియదు. నీ చదువు, పెళ్ళి, సంసారం మధ్యలో వెకేషన్‌కి వచ్చినప్పుడు నువ్వు హడావిడిగా రావటం., వెళ్ళటం, వెళ్ళేలోపుగా వీలైనప్పుడు ఒకటి రెండుసార్లు కలవడం తప్ప, నాకైన అనుభవాలు, నా మనసులో జరుగుతున్న సంఘర్షణలు నీకెప్పుడూ చెప్పలేదు. చెప్పడానికి అవకాశం రాలేదు. అవన్నీ నీతో కాక మరెవరితోనూ షేర్ చేసుకోలేను. నీకు, నా చుట్టూ ఉన్న సమాజానికి, నా భర్త నన్ను వదిలేసాడని, నా పిల్లల కోసం నేను కష్టపడ్డానని మాత్రమే తెలుసు! ఉన్న ఆస్తులు అమ్మి వాళ్ళ చదువులు, పెళ్ళిళ్ళు బాధ్యతలు నిర్వర్తించేలా మా అమ్మానాన్నలు నా పక్కనే ఉన్నారు. నాకన్నివిధాలా సహకరించారు.

మా పిల్లల పెళ్ళిళ్ళకన్నిటికీ వచ్చావు. నన్ను అందరిలా అక్కున చేర్చుకుని అభినందిస్తూ వచ్చావు. నా పిల్లల చదువుల కోసం, పెళ్ళిళ్ళకోసం నేనడగకపోయినా సహాయాలు చేసావు. కానీ, నాపెళ్ళి ఎలా అయిందో, నా భర్త నన్ను, పిల్లల్ని వదిలి విడాకులు ఎందుకిచ్చాడో… ఏదీ నీకు తెలియదు.భర్త వదిలేసిన నా వెనకాల ఎందరు పడ్డారో, ఎవరికీ చిక్కకుండా నేనెలా ఉన్నానో… నాకున్నబంధాలు నా పిల్లలైతే, నాకున్న భరోసా మా అమ్మానాన్నలు కావటాన అవకాశాలు వచ్చినా హద్దులు దాటలేదు. నా అందం‘అడవికాచిన వెన్నెల’ అనుకున్నాను. కానీ, నా జీవితంలో నిజమైన వెన్నెల చాలా ఆలస్యంగా వచ్చింది. అమావాస్య ఎరుగని పున్నమి జాబిల్లిలా నాకు దొరికిన చంద్రుడు ఈ కేశవరావుగారు!” అంటూ ఉపోద్ఘాతంగా మొదలుపెట్టింది మాధవి.

***

Written by Chengalvala Kameshwari

చెంగల్వల కామేశ్వరి గారికి
గృహిణిగా సాంప్రదాయబద్దంగా తెలుగు
సంస్కృతిని పాటించడం ఇష్టం!
ముప్పయ్యేళ్లుగా ఎన్నో కథలు, వ్యాసాలు , కవితలు రాస్తూ సాహితీసేవ ఒకవైపు
ఒక మహిళామండలికి ప్రధాన కార్యదర్శిగా
మహిళాభ్యుదయానికి పాటుపడుతూ
పేదవారికి, ఆరోగ్య సమస్యల లో ఉన్నవారికి తను చేసే సహాయంలో అందర్నీ భాగస్వాములను చేస్తూ సామాజిక సేవ చేస్తూ ఉండటం మహా ఇష్టం!

సంగీతం, పెట్స్, ప్రయాణాలు,వండి వడ్డించటం, స్నేహం, ఇలాంటి ఇష్టమయిన అభిరుచులు. ఎన్నో ఉన్నాయి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

పాట

మంగళ హారతి