“మన జాతీయాల సొగసు”

వ్యాస ధారావాహిక

31)”నీటిమూట”

పాత సినిమాలో ఓ పాటలో ” నేను నమ్మనులే నీ మాటలు-అవి కమ్మని పన్నీటి మూటలు” అని పాడుతుంది చిత్రనాయిక.
నీటిని,పన్నీటిని,కన్నీటిని మూట కట్టగలమా?లేదు కదా!
రాజకీయ నాయకుల వాగ్దానాలన్నీ నీటిమూటలతోనే పోలుస్తుంటారు.
గాలినయినా మూటగట్టవచ్చునేమో(బెలూన్లలో లాగా)నీటిని మూటగట్టే మార్గం లేదు.ఇప్పటిలా నీరు కారకుండా బంధించగల వస్తువులూ,పద్ధతులూ తెలియని కాలంలో ఈ మాట పుట్టింది.నీటిని మూటగట్టడానికి శ్రమించినంతసేపు పట్టదు,అవి కారిపోవడానికి.నీళ్లు మూటలో నిలువవు.నిలిపే మార్గం అప్పటికి తెలియదు. అందువల్ల చేసిన ప్రయత్నమంతా వృథా.ఆ భావంతో నిష్ఫల ప్రయత్నాన్నీ, అసాధ్య కార్యాన్నీ,అమలుగాని వాగ్దానాన్నీ నీటిమూటకిందే లెక్కించేవాళ్ళు పూర్వులు.ఇప్పుడది కేవలం పాతకాలపు జాతీయంగా మిగిలింది.ఇప్పుడు ద్రవ,వాయు పదార్థాలన్నింటినీ మూటగట్టే మార్గాలు,విధానాలు అందుబాటులో ఉన్నాయి.

32)”నీటిమీది రాత”

“బావా!నిన్నెంతగా నమ్మాను!నువ్వు నాతో చెప్పినవన్నీ నీటి మీది రాతలేనా..?!”
“మహిళలకు రాజకీయ పదవుల్లో ముప్ఫై మూడు శాతం రిజర్వేషన్ అన్నది నీటిమీది రాత అయిపోయింది”అని అంటుంటారు కదా!
అసలు నీళ్ళమీద రాసే వీలే లేదు కదా!ఆత్మవంచనకో,లోకవంచనకో నీటి ఉపరితలంమీద ప్రయత్నపూర్వకంగా రాసే ప్రయత్నం చేసినా,రాస్తున్నప్పుడే అక్షరాలు కలిసిపోయి,నీళ్లపాలవుతాయి.కాగితంమీద,గోడమీద,రగిరేకులమీద,ఆకులమీద రాసిన అక్షరాలైతే నిలుస్తాయి.నిలిచే అక్షరాలే చెల్లుతాయని,చెల్లవని, కాలదోషం పట్టాయని,తప్పుడు రాతలని,ఫోర్జరీలని రకరకాలుగా వివాదాగ్రస్తం కావచ్చు.అటువంటప్పుడు నీటిమీది రాతలు నిలుస్తాయని అస్సలు నమ్మలేం.నిలవని,చెల్లని,నమ్మరాని విషయాలన్నీ నీటిమీది రాతల్లాంటివే.

33)”చేట భారతం”

“ఆపు తల్లీ!నీ చేట భారతం ఇక”
“మైకు ముందు నిలబెడితే చాలు,మొదలెడతాడిక వీడి చేట భారతం”
ఈ విధమైన సంభాషణలు విన్నప్పుడు “అది చాటు భారతం కాబోలు-చేట భారతంగా రూపాంతరం చెందింది అనుకుంటాము.అప్పటికప్పుడు నోటిమాటగా చెప్పినదాన్ని “చాటువు” అంటారు.ఇది సంస్కృత పదం. శ్రీనాథుని చాటువులు మనకు తెలుసు కదా!గ్రంథ ప్రమాణాల వంటివి చూడకుండా భారత కథను చెప్తే,అది చాటు భారతం.కానీ,చేట భారతం వేరు.నాలుగు మాటల్లో సరిపోయే విషయాన్ని తెగ సాగదీసి విపులంగా చెప్పినా,రాసినా దాన్ని చేట భారతమనే అంటారు(నేను కూడా అలాగే చెప్తున్నానా అసలు విషయాన్ని..?!)
ఇక అసలు విషయానికొస్తే—దాదాపు డెబ్భై,ఎనభై సంవత్సరాల క్రిందట,
అచ్చుయంత్రాలు అందుబాటులోకి వచ్చిన కాలంలో ఇప్పటి దినపత్రికలకన్నా కొంచెం చిన్నవైన కాగితాల్లో భారతం ముద్రించారు.అంటే-చేటంత పెద్ద కాగితాల మీద అచ్చొత్తారన్నమాట!ఆ గ్రంథాలు ఇప్పటికీ కొన్ని పాతకాలపు గ్రంథాలయాల్లో భద్రంగా ఉన్నాయి.సీస పద్యాన్ని అయిదు పంక్తుల్లో,వృత్తాలను రెండు పంక్తుల్లో;కందం,తేటగీతి,ఆటవెలది వంటి పద్యాలను ఒకే ఒక పంక్తిలో ముద్రించేవాళ్ళు.ఆ గ్రంథాలను కూర్చొని చదవాల్సిందే.’వ్యాసపీఠా’ల్లో అవి ఇమిడేవి కావు.అందువల్ల వాటిని ‘చాలా పెద్దవి’ అనే అర్థంలో చేట భారతాలన్నారు.
విస్తరించి చెప్తే చేట భారతం చెప్పినట్లు.తెగకుండా,తేలకుండా చెప్తే భారతం చెప్పినట్లు.

34)”నాలుగాకులు”

“ఆవిడ మనకన్నా ఈ విషయంలో నాలుగాకులు ఎక్కువే చదివింది”
“నీకన్నా వాడు ఏడాకులు ఎక్కువే చదివినట్టున్నాడు,మోసం చేయడంలో వాడి తెలివి చూస్తుంటే!”
ఇలా వింటుంటాం కదా!ఆకులు చదవడం ఏమిటి-?!
అని ఆశ్చర్యమూ,సందేహమూ కలిగే ఉంటాయి మీకు కూడా.
కావలసిన దానికన్నా ఎక్కువనీ, అతిశయమనీ చెప్పడానికి ఈ మాటలు వాడుతారు.ఆకులంటే తాటాకులన్న మాట.కాగితాలు రాకముందు సమస్త శాస్త్రాలూ,వ్యవహార పత్రాలూ తాటాకుల మీదనే రాసేవాళ్ళు కదా గంటాలతో.ఈ జాతీయం అప్పుడు పుట్టిందన్నమాట!

35)”నిప్పులాంటి మనిషి”

ఈ పేరుతో ఎన్.టి.ఆర్. కథానాయకునిగా చలనచిత్రం కూడా వచ్చినదని మీకు తెలుసు కదా.నిప్పు దేన్నయినా తగలబెడుతుంది. చివరికి నీళ్లను కూడా మరగపెడుతుంది.తాకితే కాలుతుంది. పైపెచ్చు మత సిద్ధాంతాల కారణంగా అత్యంత పవిత్రమైనదని భావించబడుతుంది. సీతాదేవి “అగ్నిపరీక్ష” మనకు తెలిసిందే కదా.ఒక మనిషిని నిప్పుతో పోల్చామంటే,ఆ వ్యక్తి దగ్గరకు పోవటమే ప్రమాదకరమనే భావముందన్న మాట.కాలధర్మాన్ని అనుసరించి లంచాలు పట్టని,అవినీతికి దూరంగా ఉండే,అబద్ధాలు మాట్లాడని ఉత్తమ వ్యక్తిని నిప్పులాంటి మనిషని వ్యవహరిస్తున్నారు.ఒక్కోసారి వెటకారంగా’ఆయనాండి?నిప్పులాంటి మనిషండి.దేన్నీ చేత్తో తాకడనడం కద్దు.గడ్డివామి దగ్గర కుక్క తాను గడ్డి తినదు,మరొకరిని తిననీయదు.అలాంటి అవినీతి గడ్డి తినని నీతిపరుణ్ణి నిప్పులాంటి మనిషి అంటున్నారు.ప్రత్యక్షంగా తాను లంచం పట్టక,ఇతరుల ద్వారా ఆ పని చేసే ప్రబుద్ధులనూ అదే పేరుతో పిలుస్తున్నారు.
************

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

కుసుమ వనాలు

భద్రత ఎక్కడ..?