
కాలింగ్ బెల్ శబ్దానికి టక్కున మెలకువ వచ్చింది భాగ్యానికి… టైం చూస్తే ఆరు గంటలు అవుతుంది…
” కొంచెం లేట్ వస్తే ఏం పోయింది ఈ విజయ ..సరిగ్గా 6 గంటలకు వచ్చేస్తుంది… అయినా దాందేం తప్పుందిలే బోలెడు ఇళ్లల్లో పనులు చేసుకోవాలి” అనుకుంటూ కళ్ళు నలుపుకుని లేచి ముందుగా తన అరచేయిచూసుకొని.” కరాగ్రే వసతే లక్ష్మి కరమధ్యే సరస్వతి కరమూలే స్థితా గౌరీ. ప్రభాతే కర దర్శనం..” అని చదువుకుంటూ వెళ్లి తలుపు తీసింది….” అయినా తనకు మాత్రం ఆలస్యంగా లేచి భాగ్యం ఉందా లేచిన దగ్గర నుండి ఎన్ని పనులు ఉంటాయని”… ఇలా అనుకుని బయట తలుపు దగ్గర ఉన్న పాల ప్యాకెట్లు తీసుకొని వంటింట్లో స్టవ్ గట్టుమీద పెట్టి దంతావధానం కానిచ్చి ముందుగా తన కోసం చాయ్ పెట్టుకుంది… ఈ ఒక్క ఛాయ్ మాత్రమే తాను ప్రశాంతంగా తాగగలిగేది.. ఎందుకంటే అప్పటికి ఎవరూ లేరు కనుక…
పనులు చేస్తున్న విజయని పిలిచి…
” ముందుగా చాయ్ తాగి పనులు చేసుకో చల్లారిపోతుంది మా ఆయన కన్నా ఎక్కువ నిన్ను బ్రతిమిలాడమే సరిపోతుంది నాకు” అని నవ్వింది భాగ్యం.
” నాక్కూడా పొద్దున్నే ఇంత ప్రేమగా ఇచ్చేది నువ్వేనమ్మ నేను ఎవరింట్లో తాగను నన్ను ఇంటి మనుషిలా చూసుకుంటావు” అన్నది విజయ.
భాగ్యం సోఫాలో వెళ్లి కూర్చుని మొబైల్ చేత పట్టుకొని పొద్దున్నే ఎవరెవరు వాట్సాప్ మెసేజ్లు పెట్టారని చూసింది..
” ఏముంటాయిలే గుడ్ మార్నింగ్ మెసేజ్లు తప్ప మనం చెప్పకుంటే సూర్యుడు ఉదయించనట్టు పొద్దున్నే గుడ్ మార్నింగ్ మెసేజ్ లు ..మెసేజ్లు అయితే పర్వాలేదు వీడియోలు క్లిప్స్ పిక్చర్స్ ఇలా ఎన్నో.. ఇంటర్నెట్ డేటా అంతా మన ఇండియాలో దీనికోసమే పోతుందట” ఇలా అనుకోని మొబైల్ కింద పెట్టి బాల్కనీలో నుంచి కనబడే విశాలమైన ప్రపంచాన్ని చూస్తూ కూర్చుంది. అపార్ట్మెంట్ అవుట్ సైడ్స్ లో ఉండడం వల్ల చుట్టూ ప్రకృతి చాలా అందంగా కనిపిస్తుంది చిన్న చెరువులు తోటలు అన్నీ ఎంతో ఆహ్లాదంగా ఉన్నాయి అందులో నుంచి కనిపించే సూర్యోదయం ఎంతో అద్భుతంగా ఉంటుంది..
చాయ్ కప్పు కింద పెట్టిందో లేదో భర్త పిలుపు.. అతనికి బ్రష్ చేసుకున్న వెంటనే కాఫీ కప్పు చేతికి అందాలి… వెంటనే వెళ్లి ఫిల్టర్ లో వేసిన కాఫీని గిన్నెలో పోసి పంచదార పాలు పోసి వేడి చేసి కప్పులో పోసి తెచ్చి ఇచ్చింది భర్త దామోదరానికి.
ఆయన పూర్తిగా పేపర్ చదవడంలో నిమగ్నం అయిపోయారు… చిన్నగా నిట్టూర్చి “కనీసం ఒక మాట అయినా మాట్లాడించరు పొద్దున్నే ఒక మంచి మాట వినాలని అనుకుంటుంది వెళితే ఆఫీసు లేకుంటే పేపరు లేదా టీవీలో వార్తలు ఇది తప్ప వేరే లోకమే లేదు..
ఈ కాలంలో బయట సినిమా ధియేటర్ కి వెళ్ళే అవసరం లేకుండా మంచి మంచి సినిమాలు ఓటీటిలో వస్తున్నాయి అవైనా కలిసి చూద్దామంటే సగం చూడగానే రన్నింగ్ కామెంట్లు పెడతాడు దానితో విసిగెత్తి టీవీ కూడా చూడాలనిపించదు”ఇలా మనసులో అనుకుంటూ కూరగాయలన్నీ ఫ్రిజ్ లో నుంచి తీసి బయటపెట్టి చేయాల్సిన టిఫిన్ ఏంటో ఆలోచించుకుంటూ స్నానానికి వెళ్ళింది.
“నా పని సాండ్విచ్ లా మారిపోయింది అయినా నా తరం వాళ్ళకంతా ఇదే రాత అని అనుకున్నది..”
భాగ్యం శాండ్విచ్ అని ఎందుకు అనుకున్నదో కథ చదువుతుంటే మీకే అర్థమవుతుంది.
స్నానం చేసి వచ్చి ముందుగా దేవుడి దీపం వెలిగించి తనకు నోటికి వచ్చిన స్తోత్రాలు అన్ని చదువుకుంటూనే ఉంది తీరిగ్గా కూర్చొని పారాయణం చేసుకోవాలంటే టైం ఎక్కడ ఉంది..అలా నోట్లో నోట్లో స్తోత్రాలు చదువుకుంటూ..
ఈ పూటకి ఉప్మా చేస్తాను ఉప్మా ఎవరికి సహించదు. అయినా తొందరగా అవుతుంది కదా !ఎప్పుడూ వాళ్ళ రుచులు వాళ్ళ ఇష్టాలు.. నాకంటూ ఏ కోరిక లేదు కాస్త విశ్రాంతి తీసుకుందామంటే ఎక్కడ వీలవుతుంది! అనుకున్నది.
“ఉప్మా అన్నమాట గాని ఇప్పటి ఉప్మా ఏమైనా వెనుకటి ఉప్మా నా అప్పట్లో పోపులో పచ్చిమిరపకాయలు అల్లం వేసి ఉప్మా చేయడం ఎంతో సులభంగా ఉండేది…
ఇప్పుడు ఉల్లిపాయ, టమాటోలు, ఆలుగడ్డ ముక్కలు క్యారెట్ ముక్కలు పచ్చిమిర్చి ఇవన్నీ వేసి చేయాలి అది కూడా టెక్చర్ బాగా కనిపించాలి ఇన్ని ఉన్నాయి” అనుకుని ముందుగా రవ్వ వేయించి పక్కన పెట్టుకొని కూరగాయలన్నీ కోసి పక్కన పెట్టుకొని స్టవ్ మీద నీళ్లు పెట్టింది చాయ్ కోసం..
అత్తగారు మామగారు లేచిన అలికిడి వినిపించింది..
” అమ్మో ఆలస్యం అయితే ఇంకేమన్నా ఉందా 9 గంటల వరకు టిఫిన్ టేబుల్ మీద ఉండాలి” అని తొందరపడుతూ స్టవ్ మీద బాండ్లీ పెట్టి ఉప్మా చేసింది.
ఇంతలో
” భాగ్యం ఓ భాగ్యం.. చాయ్ అయ్యిందా తాగి స్నానానికి వెళ్తాను” అని అత్తగారి కంఠం.
” అయ్యింది అత్తయ్య ఒక్క నిమిషంలో తెస్తున్నాను” అంటూ ట్రేలు రెండు కప్పులు పెట్టుకొని ఒక ప్లేట్లో బిస్కెట్స్ పెట్టుకొని లోపలికి వెళ్ళింది..
మామగారు తప్పకుండా చాయ్ తో పాటు బిస్కెట్లు తింటారు.. ఇద్దరూ చక్కగా బాల్కనీలో కుర్చీలు వేసుకొని కూర్చున్నారు.. వెళ్లి టీపాయ్ మీద చాయ్ కప్పులు బిస్కెట్లు మంచినీళ్లు పెట్టి..
” ఆహా! ఎంత అదృష్టం వీళ్లది అన్ని అమర్చి పెడితే చక్కగా కబుర్లు ఆడుకుంటూ కాఫీలు తాగుతారు కలిసి టీవీ చూస్తారు పాత సినిమాలు చూస్తూ కబుర్లు చెప్పుకుంటారు” తన పెళ్లయినప్పటి నుండి చూస్తుంది వారి జీవితం ఎంతో సంతోషంగా ఉంది ఇద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉంటారు అలాగని వాళ్లంటే అసూయ ఏం లేదు.. కాకపోతే కొంచెం చిన్న చిన్న పనులు అయినా సహాయం చేసి పెడితే బాగుండేది కదా! తనకు కొంచెం వెసులుబాటు ఉంటుంది అని అనిపించేది ఈ మధ్య అయితే ఇంకా ఎక్కువ అనిపిస్తుంది తనకు వయసెక్కువైపోయింది.. తనకు మాత్రం ఇలా కూర్చుని కాఫీ తాగుతూ ఎంజాయ్ చేయాలని ఉండదా”?
ఇలా అనుకుంటూ బయటకు వచ్చింది.. ఇంతలో కొడుకు కోడలు కూడా లేచారు వాళ్ళిద్దరూ ఆఫీసుకు వెళ్లాలి వాళ్లకు కావలసినవి కూడా అమర్చాలి….
కిచెన్ లోకి వచ్చిన కోడలు అత్తయ్య బాక్స్ లోకి ఈరోజు ఏం చేస్తున్నారు అని అడిగింది… ఎన్నోసార్లు చెప్పాలని అనుకుంటుంది స్నానం చేయకుండా వంట చేస్తుంటే దగ్గరికి వచ్చి నిలబడవద్దని… వంట చేసిన గిన్నెలు ముట్టుకోవద్దని చెప్పాలని ఎన్నోసార్లు అనుకుంది కానీ మాట గొంతులోనే ఆగిపోయింది ఎందుకంటే ఎంత మంచిగా చూసిన అత్త అనే పదం కఠినంగానే ఉంటుంది ఒక్క మాట అంటే ఇంకేమైనా ఉందా ఈ కాలం పిల్లలు ఓర్చుకుంటారా అందుకని తానే సర్దుకుంటూ వాళ్లు లేవక ముందే మడిగా నైవేద్యంకు పక్కన పెట్టేసుకొని ఇంకా ఏదైనా కానీ అని రాజీ పడుతుంది…
సాండ్విచ్ అని ఎందుకు అన్నాను ఇప్పుడు అర్థమైందా? అటు పై నుండి ప్రెషర్ ఇటు కింది నుండి ప్రెషర్ అన్నమాట…
ఇలా ఉదయం అంతా స్వాగతం తోనే గడిచిపోయింది భాగ్యంకు..
చేయాల్సిన పనులు బోలెడు ఉన్నాయి… అలా హడావుడి పడుతూ…..
(సశేషం)