ఒక్కోసారి కలం
అక్షరాలకు బదులుగా
దుఃఖాన్ని లిఖిస్తుంది…

గుండెలోంచి పొగిలి వస్తున్న
ఆవేదన… ఆక్రందన..
మౌనమైన హృదయంలో దాగలేక
కాగితాలను తడుముతుంది..
పరాయవుతున్న తనవారిని తలుస్తూ
ఓదార్పు కరువై
ధైర్యం అడుగంటుతుంటే..
ఆత్మవిశ్వాసాన్ని తట్టి లేపడానికి
నాకున్న ఆసరా ఒక్కటే…
వాక్యాలుగా మనసును సర్దుకుంటూ
ఆత్మీయపదాలని
అంతరంగపు అరల్లో చేర్చుతూ..
అలసటగా అమ్మఒడిలో ఒదిగినట్టుగా
అక్షరాల్లో సేదతీరటం..
మరలా మరొక ఉదయానికి
నన్ను నేను సన్నద్ధం చేసుకోవడం..!
