ఆధునిక తెలుగు కవిత్వంలో రేణుక అయోలా ఒక ప్రత్యేకమైన గళం. ఆమె రచనల్లో మనసు, మనిషి, సమాజం, స్త్రీ అస్తిత్వం అనే అంశాలు సహజంగా కలిసిపోయి జీవనానుభవాలకు అక్షరరూపం ఇస్తాయి. జీవితాన్ని గమనించే కవయిత్రి చూపు లోతైనది, కానీ ఆ లోతు మృదుత్వంతో కూడినది. సున్నితమైన స్త్రీ మనసు లోతుల్లో పెరుగుతున్న బాధ, నిశ్శబ్దం, ప్రశ్నలు, ప్రతిఘటనలు ఇవన్నీ ఆమె కవిత్వంలో బలమైన శబ్ధంగా మారతాయి. రేణుక అయోల కవిత్వం స్త్రీని కేవలం బాధితురాలిగా కాదు, బలమైన వ్యక్తిత్వంతో కూడిన సజీవ ఆత్మగా చిత్రిస్తుంది.
రేణుక అయోలా గారు గంటి కపర్ది మరియు గంటి హేమలతల దంపతుల కుమార్తె. ఆమె పుట్టిన ఊరు ఒడిశాలోని కటక్, ప్రస్తుతం నివాసం హైదరాబాద్. భర్త అరుణ కుమార్ అయ్యల సోమయాజుల. ఈ కుటుంబ నేపథ్యం ఆమె ఆలోచనలకు, సాహిత్యానికి ప్రేరణగా నిలిచింది. ఆమె జీవిత అనుభవం, గమనించే కళ్ళు, స్త్రీ జీవితం పట్ల ఉన్న లోతైన అవగాహన కవిత్వంలో ఒక వాస్తవికతను కలిగిస్తాయి. ఆమె కవిత్వం పఠించినపుడు మనకు ఒక మానవతా తత్త్వం, సామాజిక అవగాహన, స్త్రీ అవేదన, ఆత్మగౌరవం వంటి అనేక పొరలు కనిపిస్తాయి.
రేణుక అయోల సాహిత్య ప్రస్థానం విస్తారమైనది. ఆమె రచించిన పుస్తకాలు పడవలో చిన్ని దీపం (2006), లోపలి స్వరం (2012), ఎర్రమట్టి గాజులు (2019), రవిక (2025) ఇవన్నీ కవితా సంపుటాలుగా విడుదలై వీరి మనోభావాలకు ప్రతిబింబంలా మిగిలాయి. అలాగే కథాసంపుటి రెండు చందమామలు (2008), దీర్ఘకావ్యాలు మూడవ మనిషి(2015), పృధ ఒక అన్వేషణ (2021) వంటి గ్రంథాలు ఆమె కవిత్వపు వైవిధ్యాన్ని, ఆలోచనల లోతును స్పష్టంగా చూపిస్తాయి. ఇటీవల కాలంలో రచించిన మరొక కవితా సంపుటి (రవిక) స్త్రీవాద కవిత్వానికి తార్కాణం గా నిలిచింది.

రేణుక అయోలా కవిత్వం స్త్రీ జీవితం మీదే ప్రధానంగా తిరుగుతుంది. కానీ అది కేవలం ఫిర్యాదుగా, బాధగా నిలవదు. ఆమె స్త్రీని ప్రశ్నించే వ్యక్తిగా, తన ఉనికి గురించి సమాజాన్ని నిలదీసే స్వరంగా చూపుతుంది. ‘‘జీవితం గాజు పెంకు లోతుగా గుచ్చుకున్నంత బాధ’ అని వీరు రాసిన వాక్యం, జీవితం అనే పాదరసంలో స్త్రీ అనుభవించే వేదనను స్పష్టంగా చెబుతుంది. అయితే ఆ బాధలోనే బలం ఉంది. రేణుక అయోల కవిత్వంలో ఆ బలం కనిపిస్తుంది.
సమాజంలో స్త్రీపై జరిగే అన్యాయాన్ని ఆమె కేవలం వర్ణించరు. ప్రశ్నిస్తారు. వీరి కవిత్వం నిర్భయమైనది, నిర్లజ్జమైన సమాజాన్ని ఎదుర్కోవడానికి సిద్ధమైనది. ‘‘ఈ దేహాలకి పేర్లు లేవు’’ అనే కవితలో ఆమె స్త్రీ దేహంపై పురుషుడి కామ దృష్టిని తీవ్రంగా ఖండిస్తుంది. ఈ కవిత ఆవేదనలోంచి పుట్టిన తిరుగుబాటు స్వరం. మగవారి దృష్టిలో స్త్రీ కేవలం దేహంగా కనిపిస్తే, రేణుక ఆ దేహానికే అర్థం ఇవ్వడం ద్వారా అతని అజ్ఞానాన్ని చీల్చేస్తుంది. ‘‘మా పేరు మాదే, మా ఉనికి మాదే’’ అనే పాదాలు స్త్రీ ఆత్మగౌరవానికి అక్షరరూపం.
రేణుక అయోలా కవిత్వం స్త్రీవాదమా కాదా? స్త్రీలపై అనేకమంది కవిత్వం రచిస్తున్నారు. స్త్రీ బాధలను ఎత్తి చూపుతున్నారు. స్త్రీకి అన్యాయం జరుగుతోందని ఎలుగెత్తి తమ భావాల ద్వారా ఎలుగెత్తి చాటుతున్నారు. అలాగని అవి స్త్రీవాదాలు కావు. కాలేవు. కారణం ప్రపంచంలో వున్న అనేక సమస్యలపై కవి స్పందించినట్లే స్త్రీ అస్తిత్వం కూడా ఒక సమస్యగా తీసుకుని చర్చిస్తున్నారు. కానీ రేణుకా అయోలా అలా కాదు. నిలదీసి ప్రశ్నిస్తున్నారు. ఒక విధంగా స్త్రీ జీవితాన్ని విడమరచి చూపుతూ.. అనేక సమాధానాలు లేని ప్రశ్నల్ని లేవనెత్తుతున్నారు. కనుకనే నేను వీరి కవిత్వం స్త్రీ వాదమనే చెబుతున్నాను. ఆమె కవిత్వంలో స్త్రీ సమస్యలను ప్రస్తావించినప్పటికీ, అవి మనిషి మనుగడకు సంబంధించినవే. స్త్రీని అణచివేసే సమాజపు ధోరణి, మనిషిని బంధించే యాంత్రిక జీవనశైలి, మానవ సంబంధాలలో పెరుగుతున్న నిశ్శబ్దం ఇవన్నీ ఆమె పదాల్లో ముడిపడి వస్తాయి. ‘‘ఆమె అతను ఒకే ఇంట్లో…మాటలు ఉండవు’’ అనే కవితలో ఆమె ఆధునిక దాంపత్య జీవితంలోని నిశ్శబ్దాన్ని ఎంత చక్కగా చిత్రించిందో గమనిస్తే మనసు కదిలిపోతుంది. కరెంటు పోయినప్పుడు వచ్చిన చీకటిలో ఇద్దరు ఒకరినొకరు చూసుకుని మాటలు మాట్లాడటం, ఆ చీకటి వారి జీవితంలో వెలుగుగా మారడం ఇది కేవలం ఒక కవిత కాదు, ఒక ప్రతీక.
ఆధునిక మనిషి సంబంధాల్లోని శూన్యతను, టెక్నాలజీ మధ్య చిక్కుకున్న భావనలను ఈమె ఎంతో సాధారణమైన సంఘటనతో ఆవిష్కరిస్తారు. వీరి కవిత్వంలో భాష సాధారణమే కానీ లోతైన అర్థాలను మోస్తుంది. రేణుక అయోలా పదాలను అలంకారంగా కాకుండా ఆత్మనిశ్వాసంగా వాడుతారు. ప్రతి వాక్యం వెనుక ఒక చలించిపోయిన అనుభవం ఉంటుంది. వీరి వ్యక్తీకరణలో భాష నిప్పులా మండుతుంది, కానీ అదే సమయంలో కరుణగా కూడా ఉంటుంది. ఉదాహరణకు ‘‘ఏ విలువలేని ఆడతనం కోసం ఆమె గుమ్మం దాటకుండా హక్కుల్ని అడిగింది’ అనే వాక్యం, స్త్రీ స్థితిని నిర్లక్ష్యం చేసే సమాజం మీద ఒక పదునైన బాణంలా ఉంటుంది. ఆమె కవిత్వంలో ఉన్న వేదన నిస్సహాయతను కలిగించదు. ప్రతిఘటనను పెంచుతుంది.
రేణుక అయోల కవిత్వం ఒక రకంగా సమాజ దర్పణం. వీరి పదాల్లో మనకు మనమే కనిపిస్తాం. వీరు రాసిన అసహ్యం వంటి కవితలు, మన సమాజంలో మహిళల పట్ల ఉండే అసభ్యపు మాటలు, అనాగరిక భావనలను సూటిగా అద్దంలో చూపుతాయి. ఆ అద్దం భయపెడుతుంది, కానీ ఆ భయం మనలో మార్పుని రగిలిస్తుంది. ఈ మార్పే రేణుక కవిత్వం ఉద్దేశం. వీరి కవిత్వంలో మరో ప్రత్యేకత. నిశ్శబ్దాన్ని కూడా ఆమె పదంగా మార్చగలగడం. ‘‘మాటలు ఉండవు’అనే పదం ఆమె రచనల్లో తరచుగా వినిపిస్తుంది. కాని ఆ నిశ్శబ్దం కూడా ఒక భాష. స్త్రీ జీవితంలోని నిశ్శబ్దం, దాచుకున్న భావనలు, చెప్తే వినబడవు అన్న భయం ఇవన్నీ ఆమె కవిత్వంలో సంభాషణగా మారుతాయి. కవయిత్రి గుండె లోతుల్లో ఉన్న ఆ నిశ్శబ్ధ కేకలు పాఠకుడి మనసును తాకుతాయి.
రేణుక అయోలా రచనల్లో ప్రకృతి, సమాజం, మనిషి ఇవి ఒకే దారిలో కదులుతాయి. వీరి కవిత్వం లోపలి స్వరం. ఆ స్వరం కొన్నిసార్లు మృదువుగా, కొన్నిసార్లు అగ్నిలా ఉంటుంది. ఆమె సాహిత్యంలో స్త్రీ సున్నితత్వం, సామాజిక సత్యం, ఆత్మపరిశీలన అనే త్రివేణి సంగమం ఉంటుంది. మూడవ మనిషి వంటి దీర్ఘకావ్యంలో హిజ్రాల వేదనను ఆమె మనసుకి చేరే భాషలో చెబుతుంది. ఇది కేవలం సాహిత్యం కాదు మానవతా ప్రకటన.
రేణుక అయోల కవిత్వం ద్వారా సంధించే ప్రశ్నలు సమాజంపై, మనసుపై, సంబంధాలపై. ‘‘ప్రశ్న అనేది జీవితానికి బలమైన ఆయుధం’అని ఆమె చెప్పినట్లుగా, ఆమె కవిత్వంలో ప్రశ్నలే ఆయుధాలు. ఈ ప్రశ్నలు మనలో ఆత్మపరిశీలన రేపుతాయి. ఒక కవయిత్రిగా వీరి పాత్ర కేవలం రాయడం కాదు, మనసులను కదిలించడం.
వీరు రాసిన ప్రతి పద్యం సాహిత్యంగా మాత్రమే కాదు, ఒక తాత్విక చింతనగా నిలుస్తుంది. ఆమె చూపు గృహస్థ జీవితం, సామాజిక అసమానతలు, టెక్నాలజీ ప్రభావం, మానవ సంబంధాల వైఖరి అన్నీ సమానంగా గమనిస్తుంది. రేణుక అయోల కవిత్వం చదివినపుడు మనం జీవితం గురించి ఆలోచిస్తాం. మనలోని మౌనాన్ని వినిపించుకుంటాం.రేణుక అయోల కవిత్వం యొక్క మూలం సత్యం. ఆమె తాను చూసినది, అనుభవించినది, ఆలోచించినదే రాస్తారు. ఆమె పదాలు ఉపమానాల వెనుక దాక్కోవు. అవి నేరుగా మనసును తాకుతాయి. ఆమె కవిత్వం పాఠకుడిలో దాగి ఉన్న మానవత్వాన్ని మేల్కొలుపుతాయి. తన రచనలతో రేణుక అయోలా అనేక పురస్కారాలు అందుకున్నారు. వారణాసి వెంకట శోభ స్మారక సాహిత్య ప్రతిభా పురస్కారం, అన్నమయ్య సాహితి పురస్కారం, ఇస్మాయిల్ సాహితి పురస్కారం, లేఖిని మాతృదేవో పురస్కారం, జోత్స్నన కళాపీఠం పురస్కారం వంటివి ఆమె సాహిత్య ప్రాభవానికి నిదర్శనం.
కవయిత్రి రేణుక అయోల కవిత్వం చదివితే మనం మన సమాజాన్ని కొత్త కళ్ళతో చూస్తాం. ఆమె అక్షరాలు కేవలం పాఠాలు కాదు, అనుభవాల రక్తంతో రాసిన వాక్యాలు. ఆమె పదాల్లో ఒక స్త్రీ స్వరం మాత్రమే కాదు, ఒక కాలపు మనసు ఉంది. ఆమె కవిత్వం మనలో ఆలోచన, ఆవేదన, ఆవిష్కరణ అన్నింటినీ కలిగిస్తుంది. ఈ విధంగా రేణుక అయోల సాహిత్యం ఆధునిక తెలుగు కవిత్వంలో ఒక సాక్ష్యంగా నిలుస్తుంది స్త్రీ భావోద్వేగాలకి, మనిషి బాధలకు, నిశ్శబ్దపు చీలికలకు అక్షరరూపం ఇచ్చిన ఓ జీవన ధ్వని. ఆమె కవిత్వం నేడు అవసరమైన స్వరం ప్రశ్నించే స్వరం, నిలదీసే స్వరం, ఖచ్చితమైన మార్పు కోరుకునే స్వరం. ఉదాహరణకు ’’గాయమైన గానం’కవితలోని అద్భుతమైన దృశ్యాత్మక భాగం. ‘‘కొండ అంచుల నుండి/వాగుల అలల మీద నడుస్తూ/ప్రాణాలకి అడుగున ఉన్న/సుతారపు తీగల్ని కదిలిస్తోంది/ నిర్జన మైదానాల మీద/ వెన్నెల వెలుగుల తెరల్లా చల్లగా’’ ఈ పంక్తులలో ఒక అంతర్మధన గమనం కనిపిస్తుంది. కవయిత్రి మనసు కొండ అంచుల మీద నిలబడి, తనలోని అంతర్భావాల వాగుల మీద నడుస్తూ జీవన నాడులను తాకుతోంది. ‘‘ప్రాణాలకి అడుగున ఉన్న సుతారపు తీగలు’ అనేది అద్భుతమైన రూపకం. మనసులోని అత్యంత సున్నితమైన భావాల్ని సూచిస్తుంది. అవి కదిలినప్పుడు గానం పుడుతుంది, ఆ గానం కొన్నిసార్లు గాయమైనది కూడా కావచ్చు., ‘‘నిర్జన మైదానాల మీద వెన్నెల వెలుగుల తెరల్లా చల్లగా’ఈ వాక్యం వేదనలోని శాంతిని, చీకటిలోని వెలుగును ప్రతిబింబిస్తుంది. నిశ్శబ్దం మధ్య వెలుగుల చల్లదనం అనేది కవయిత్రి అంతరాత్మలోని సాంత్వన. ఈ కవిత భాగం మనసులోని గాయాలు మరియు గానం మధ్య ఉన్న సున్నితమైన సంబంధాన్ని తెలియజేస్తుంది. గాయమే గానంగా మారుతుంది. వేదన సౌందర్యంగా మారుతుంది. రేణుక అయోలా గారి కవిత్వానికి ఇది ప్రత్యేక లక్షణం బాధలోనూ ఒక అందం, నిశ్శబ్దంలోనూ ఒక సంగీతం ఉంటుంది. జీవితం కొండ అంచుల్లా కఠినమైనదైనా, మనసులో ప్రవహించే వాగుల అలలు ఎప్పటికీ గమనం ఆపవు. ఆ అలల్లో కదిలే ప్రతి సుతారపు తీగ ఒక గాయమైన గానంలా మనసును తడుపుతుంది.
రేణుక అయోలా గారి ‘‘ఎర్రమట్టి గాజులు’కవితలోని హృదయాన్ని తాకే భాగాన్ని గమనిస్తే.. అవి వీరి సాహిత్య దృష్టిలోని లోతైన స్త్రీ అనుభూతి, మాతృబంధం, కాలంతో పోరాడే ఆడపిల్ల యొక్క మౌన ప్రతిఘటనను ప్రతిబింబిస్తాయి. ఇక్కడి భావనను విశ్లేషిస్తే ‘‘కాలం గీసిన గీతాలు చూపిస్తున్నాయి. గీతాలు ఊరు చేరనివ్వని రాతలు/నాకోసం ఎదురు చూసే గాజుల చేతులు’’ ఇక్కడ ‘‘కాలం గీసిన గీతాలు’అనేది స్త్రీ జీవితంలోని విధి రేఖలను సూచిస్తుంది. ఆ గీతలు మనిషి చేత గీయబడినవి కాక, సమాజం, సంస్కారం, పరిమితులు గీసినవి. ‘‘గీతాలు ఊరు చేరనివ్వని రాతలు’ఈ పాదం స్త్రీకి విధించిన బంధాలను, ఆమె కాళ్లకు వేసిన అజ్ఞాత శృంఖలాలను ప్రతిబింబిస్తుంది. ‘‘నాకోసం ఎదురు చూసే గాజుల చేతులు’’ అనగానే, మనకు ఒక తల్లి, ఒక ఆడపిల్ల, ఒక స్త్రీ అందులో ఎవరో ఒకరు ఎదురు చూస్తున్నట్టు అనిపిస్తుంది. ఆ గాజులు స్త్రీత్వానికి, ప్రేమకు, బంధానికి ప్రతీక. ‘‘ఆడపిల్ల చదవాలి గుండెలు గట్టి పడాలి’’ ఇది కవయిత్రి సమాజానికి చేసిన గాఢమైన పిలుపు. ఆడపిల్ల కేవలం బంగారు బంగిళ్లలో నడవాల్సిన జీవి కాదు. ఆమె చదవాలి, ఆమె మనసు గట్టి పడాలి. ఇది ఒక స్త్రీ విద్యా మంత్రంలా అనిపిస్తుంది. ‘‘గుండెలు గట్టి పడాలి’’ అన్న పదబంధం సాహిత్యంలో చాలా బలమైనది స్త్రీ బలహీనతగా కాకుండా ధైర్యస్వరూపిణిగా అవతరించాలనే భావనను అది ప్రతిబింబిస్తుంది.
‘‘భోదించే చేతుల మీద అనుకున్న వెంటనే వాల లేని పిట్టలా’ఇది తల్లీబిడ్డల మధ్య ఉన్న ఆ లోతైన బంధాన్ని ప్రతిబింబించే వాక్యం. తల్లి భోదించే చేతులు ఆప్యాయత, శ్రద్ధ, సంరక్షణకు సంకేతం. కానీ ఆ చేతులపై వాలలేని పిట్టగా ఆడపిల్ల కనిపిస్తోంది అంటే, తల్లి భోదించినప్పటికీ, కాలం ఆమెకు విశ్రాంతి ఇవ్వలేదు. జీవితం ఆమెను ఎప్పుడూ ప్రయాణంలోనే ఉంచింది. ‘‘ఎప్పటికీ లేవలేని అమ్మ నిద్రని చూడడానికి ప్రయాణిస్తున్నాయి’ఈ పంక్తి అంతరంగాన్ని గాయపరుస్తుంది.
ఇది మాతృవియోగపు వేదన. తల్లి ఇక లేవని తెలుసుకున్నా, కవయిత్రి మనసు ఇంకా ఆ నిద్రను చూడాలనుకుంటుంది. ‘‘ఎప్పటికీ లేవలేని నిద్ర’అనేది మరణానికి సున్నితమైన ప్రతీక. కానీ దానిని ‘‘చూడడానికి ప్రయాణిస్తున్నాయి’అని చెప్పడం మాతృప్రేమ యొక్క శాశ్వత బంధాన్ని తెలియజేస్తుంది. ‘‘చిట్టి ఎర్రమట్టి గాజులు చప్పుడు చేస్తూనే ఉన్నాయి’ఈ చివరి పాదం కవితకు ఒక ఆత్మ ఉంటుంది. అమ్మ లేకపోయినా, ఆమె జ్ఞాపకాలు ఇంకా చప్పుడు చేస్తున్నాయి. ఆ చిట్టి ఎర్రమట్టి గాజులు ఒక మౌన సంగీతం. కాలం మర్చిపోయినా, కవయిత్రి మనసులో మాత్రం ఇంకా మ్రోగుతూనే ఉన్నాయి. ఈ కవితలో రేణుక అయోలా తన కవిత్వపు మూలభావాన్ని స్త్రీ, తల్లి, సమాజం, జ్ఞాపకం ఈ నాలుగు దిశల్లో ముడిపెట్టి అద్భుతమైన భావసమగ్రతను సృష్టించడం గమనిస్తాం. ఈ కవితలోని గాజులు కేవలం అలంకారం కాదు. అవి ఒక జీవిత గాధ, ఒక తల్లిదీపం, ఒక స్త్రీ ఉనికి యొక్క శబ్దం. రేణుక అయోల శైలిలో కనిపించే సున్నితమైన వేదన, మాటల్లో లేని తడి ఇక్కడ కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ప్రతి పాదం వెనుక ఒక కదిలిపోయిన జీవితం ఉంది. ఈ కవిత స్త్రీ మనసులోని అత్యంత గుప్తమైన మూలలోంచి పుట్టిన ఆవేదన. అదే సమయంలో, అది ప్రేమకు, గౌరవానికి, ఆత్మబలానికి ప్రతీక. ఇదొక ప్రతీకాత్మక కవిత గాజులు అనేవి స్త్రీ జీవితం మొత్తానికి ప్రతీకగా మారాయి. ఆ గాజులు విరిగిపోయినా, వాటి శబ్దం మాత్రం సమాజం అంతా వినిపిస్తుంది.
ఇక రేణుక అయోలా గారి ‘‘మూడవ మనిషి’అనే దీర్ఘకావ్యం గురించి ప్రస్తావించదలిచితే.. ఆ కావ్యం వీరి సాహిత్య ప్రస్థానంలో అత్యంత సామాజికంగా, తాత్వికంగా, మానవతా భావంతో నిండిన కవితా సృష్టిగా నిలిచిన రచన. రేణుక ‘‘హిజ్రా’వ్యక్తిత్వాన్ని అంటే లింగపరమైన పరిమాణాల మధ్య చిక్కుకున్న మనిషిని అద్భుతమైన కవితా భాషలో ఆవిష్కరించారు. రేణుక అయోలా ఇక్కడ ‘హిజ్రా’ అనే పదాన్ని దయనీయమైన స్థితిగా కాకుండా, ఒక ధైర్యమైన మనిషి ఉనికిగా, బతుకు ప్రతీకగా చూపింది. ఇప్పుడు ఒక్కో భావాన్ని విశ్లేషిస్తే.. ‘‘జన్యు కారణం అనుకున్నా/పుట్టుక లోపం అనుకున్నా/లోపం శరీర భాగం అయినప్పుడు’ఇక్కడ కవయిత్రి సమాజపు దృష్టిని తాకుతోంది. సామాజం ‘‘హిజ్రా’అనే మనిషిని ‘‘లోపం’గా చూస్తుంది. పుట్టుకలో జరిగిన తప్పిదం, ప్రకృతి పొరపాటు అని. కానీ రేణుక అయోలా ఆ దృష్టిని తిరస్కరిస్తోంది. ఆమె చెబుతోంది ‘‘లోపం శరీర భాగం అయినప్పుడు’అంటే అది ప్రకృతిలోని సహజమైన రూపం. అది తప్పు కాదు. అది మనిషి వైవిధ్యానికి సూచిక. ఈ ఒక పాదంలోనే ఆమె సామాజిక న్యాయపరమైన, మానవతా దృష్టిని ప్రతిబింబించింది.‘‘ఎక్కడనుంచి మొదలవుతుందో తెలియకపోయినా ప్రయాణం ఆగలేదు’ఈ పాదాలు అంతర్భావపూరితమైనవి.
మనిషి తన ఉనికి ఎక్కడ మొదలైందో, ఎందుకు తాను భిన్నంగా ఉన్నాడో తెలియకపోయినా, జీవితం ఆగదు. హిజ్రా అయినా, స్త్రీ అయినా, పురుషుడైనా జీవితం ఒక నిరంతర ప్రయాణం. ఈ పంక్తులు ఆత్మబలం కు ప్రతీక. కవయిత్రి ఇక్కడ జీవన గమనం గురించి మాట్లాడటం మనం గ్రహించాలి. ‘‘లోపలి స్త్రీతో బయట ప్రపంచంలో బతకాలి అనుకున్నప్పుడు’ఇది మొత్తం దీర్ఘకావ్యంలోని హృదయం. ఇక్కడ ‘‘లోపలి స్త్రీ’అనేది హిజ్రాలోని ఆత్మస్వరూపం, అంతర్మనసులోని స్త్రీ భావన. కానీ ఆ స్త్రీ బయట ప్రపంచంలో బతకడం చాలా కష్టం. సమాజం అంగీకరించదు, గౌరవించదు, అవమానిస్తుంది. అయినప్పటికీ ఆమె బతకాలి అనుకోవడం ఇది ఒక మానవీయ తిరుగుబాటు. లోపలి స్త్రీతో బతకాలి అనుకోవడం’అనేది మనిషి ఆత్మాన్వేషణకు ప్రతీక. రేణుక అయోలా ఈ భావనను బాధతో కాదు, గౌరవంతో చెబుతారు.
‘‘ఆ మనిషి కోసం ఆ రూపం కోసంఎన్ని మైళ్లయినా ఎలాంటి దారైనా నడవక తప్పదు అనుకుంటూ’ఇది ఒక ప్రయాణదృశ్యం మాత్రమే కాదు. అది మనిషి ఉనికి కోసం చేసే అంతర్మథనం. హిజ్రా తన స్వరూపాన్ని కనుగొనడానికి, తన ఆత్మను అర్థం చేసుకోవడానికి చేసే ప్రయాణం. సమాజం ఏ రకమైన అడ్డంకులు పెట్టినా, ఆ మార్గం వదిలిపెట్టకపోవడం ఇదే ‘మూడవ మనిషి’ కావ్యం యొక్క ప్రధాన తత్త్వం.‘‘ధైర్యపు గొడుగుతో నిలబడిన ప్రతిసారి నువ్వు ‘హిజ్రావి’ఈ పాదాలు ఈ కవితకు మానవతా శిఖరంగా నిలుస్తాయి. ‘‘ధైర్యపు గొడుగు’అనే రూపకం ఎంతో గాఢమైనది వర్షంలో తడవకుండా కాపాడేది గొడుగు, కాని ఇక్కడ అది సమాజపు అవమాన వర్షం నుంచి ఆత్మను కాపాడే ధైర్యం. ప్రతిసారి ఆ హిజ్రా నిలబడినప్పుడు, ప్రపంచం ఆమెను తక్కువ చేసింది, ఆమె మళ్లీ లేచి నిలబడి, నవ్వి చెబుతుంది ‘‘నువ్వు హిజ్రావి.’’ ఇక్కడ ‘‘హిజ్రావి’అనేది గౌరవ సూచిక పదంగా మారింది. అది దూషణ కాదు, గుర్తింపు. రేణుక అయోలా హిజ్రాల్ని మనిషిగా గౌరవించాలనే వాక్యాన్ని కవిత్వంగా, సున్నితంగా, కానీ కత్తిలా పదునుగా చెబుతారు. దీని ద్వారా రేణుక అయోలా కేవలం హిజ్రాల జీవితం గురించి రాయడం కాదు ఆమె మనిషితనం అంటే ఏమిటి అన్న ప్రశ్న వేయడం కనిపిస్తోంది. మనిషి శరీరంతో కాదు, ఆత్మతో నిర్వచించబడతాడు అంటారు.
‘‘మూడవ మనిషి’అనే దీర్ఘకావ్యం మొత్తం, సమాజంలో తృతీయ లింగానికి ఉన్న స్థితిని మాత్రమే కాకుండా, మనం ‘‘భిన్నతను అంగీకరించగలిగే మనుషులమా?’’ అనే ప్రశ్నను నిలబెడుతుంది.ఈ కవితలోని భాష బలమైనది, కానీ కరుణతో కూడినది. పదాలు సున్నితంగా ఉంటాయి కానీ వాటి వెనుక ఒక అగ్ని ఉంటుంది. రేణుక అయోలా ఇక్కడ కవయిత్రిగా కాకుండా, ఒక తాత్వికురాలిగా మాట్లాడుతోంది ఒక ఆత్మను సమాజం ఎలా అణచిందో, ఆ ఆత్మ మళ్లీ ఎలా లేచి నిలబడిరదో చెబుతోంది. ఈ చిన్న భాగంలోనే రేణుక అయోలా గారి సాహిత్య దృష్టి, మానవతా హృదయం, స్త్రీ సున్నితత్వం అన్నీ గోచరిస్తాయి. కవిత్వం మనిషి హృదయాన్ని చూసే ప్రయత్నం తీర్పు ఇవ్వడం కాదు, అర్థం చేసుకోవడం.
రేణుక అయోలా గారి మరో ప్రయోగం ‘‘పృధ’దీర్ఘకావ్యంలో ఈ పాదాలు స్త్రీ అస్తిత్వం, స్వాతంత్య్రం, శరీర స్వాధీనత వంటి మౌలిక అంశాలపై అద్భుతమైన ప్రతిఘటన స్వరాన్ని మ్రోగిస్తాయి. ‘‘శరీరంతో ఆదుకునే హక్కు ఎవరిచ్చారు’అన్న ప్రశ్నతో ప్రారంభమయ్యే ఈ ఆవేదన కేవలం ఒక స్త్రీ గళం కాదు, శతాబ్దాలుగా మౌనంగా మిగిలిన స్త్రీ సమాజం తరఫున వచ్చిన గర్జన. ఈ కవితలో కవయిత్రి స్త్రీని ఆస్తిగా, వస్తువుగా చూసే పురుషాధిక్య దృష్టిని ఛిద్రం చేస్తూ, స్త్రీ శరీరం మీద ఆధిపత్యం చూపించే సమాజపు మానసికతను నిలదీసింది. ‘‘స్త్రీ పనికి వస్తుందో లేదో, మగ సంతానం ఇస్తుందో లేదో’అని స్త్రీని కొలిచే బేరగాళ్లను, ‘‘నాగరికత లేని ద్రోహులు’ గా సంబోధిస్తూ రేణుక ప్రశ్నిస్తారు. నిజంగా స్త్రీని సుఖపెట్టే, అర్థం చేసుకునే సత్తా ఈ సమాజానికి ఉందా? ‘‘నేరేడు కళ్ల కాటుక ధారలతో దుల్హన్ బొమ్మ నీటి మునకని అద్దానికి చూపించి అడుగుతున్న ఆమెకి రాజ్యం అధికారం ఏ అవకాశం ఇవ్వలేదు, అడవిలో వదిలేసింది’అనే పాదాల్లో పృధ పాత్ర స్త్రీ చరిత్రలోని నిరసనకారిణి ప్రతిరూపంగా వెలుగొందుతుంది.