అనుభూతి దొంతరల వెలుగులు

ఆదివారం కావడంతో తీరుబడిగా కూర్చుని న్యూ స్ పేపర్ చదువుకుంటూ ఉన్నాను. రికమండేషన్ లెటర్ లా నానమ్మ నారాయణా! పిల్లలు టపాసులు కావాలని గొడవ పెట్టేస్తున్నారురా, వాళ్లనుతీసుకెళ్లి కొనిపెట్టయ్యా! ఏం చెబుతానో అని నా వైపు చూస్తూ అక్కడే కుర్చీలో కూర్చుంది. పేపర్ మడిచి పక్కనపెట్టి, దీపావళి ఇంకా పది రోజులు ఉంది నానమ్మా! వాళ్లు నీ దగ్గరకు వచ్చి నస పెడుతున్నారని నాకు అర్థమౌతూనే ఉంది.ఇంత ముందుగా తెచ్చుకుని టపాసులు కాల్చే రోజుల్లో లేము మనము. ఇంకా చెప్పాలంటే క్షణంలో కాలి బూడిద అయ్యే టపాసుల కోసం డబ్బు వృధా చేయడం ఎందుకనే ఆలోచనతో కూడా ఉన్నాం. ఒక్క మాటలో చెప్పాలంటే బడ్జెట్ యుగoలో ఉన్నాము.

నానమ్మా! ఆ రోజుల్లో పాతిక రూపాయలకు టపాసులు తెచ్చి పదిమంది పంచుకుని,నులక మంచాలపై ఎండబెట్టి, పది రోజులు ముందు నుండి కాల్చడం

మొదలుపెట్టి నాగులచవితి వరకు కాల్చేవారు అవునా! మా నాన్న హయాంలో పదివేలకు టపాసులు తెస్తే పదిసార్లు చూసుకుంటూ, లెక్కపెట్టుకుంటూ నాలుగు రోజులు కాల్చేవాళ్ళం. ఇప్పుడిక నా వంతు పాతిక వేలు పెట్టి తెస్తే, నువ్వు, తాతయ్య చెరి రెండు కాకరపువ్వత్తులు, అమ్మా, నాన్న నాలుగు చిచ్చుబుడ్లు నేను, సుప్రియ నాలుగు సరాల లక్ష్మి టపాసులు, నీ ముని మనవడు, మనవరాలు భూ చక్రాలు, విష్ణు చక్రాలు. ఇక వీటిని ఎండపెట్టి ఆర పెట్టే శ్రమేమి లేదు. మనమున్న ఈ అపార్ట్మెంట్లో ఎండ జానెడు జాగాలో వస్తుంది. సూర్యచంద్రులు ఇద్దరు అరుదుగా కనిపిస్తూ, వారి ధర్మాన్ని వారి మానాన వారు చేసుకు పో తుంటారు. టపాసులు బాగా పేలితే డబ్బులు గిట్టుబాటు అయ్యాయని తృప్తిపడతాము. పేలక తుస్సుమంటే, అమ్మినవాడిని కాసేపు తిట్టు కుంటాము. అంతటితో దీపావళి సంబరాలు సమాప్తమవుతాయి.

నువ్వు చెప్పేదంతా నిజమేరా! పండుగల విశిష్టత అంతా పల్లెల్లోనే కనిపించేది, కాలం కొద్ది మార్పులు మన ఊర్లను కబళించాయి. అయినప్పటికీ పర్వదినాల ప్రత్యేకతలు ఇప్పటికీ పల్లెల్లో ఊపిరందుకుంటున్నాయి. నిరుడు దీపావళికి మన పక్కింటి సూరమ్మత్త అమెరికాలో

వాళ్ళ కొడుకు దగ్గర ఉండి వచ్చింది. అక్కడ టపాసులు ఎవరిళ్ల దగ్గర వారు కాల్చకూడదట, అందరూ కలిసి ఒక ఖాళీ మైదానంలో కూడతారట. అక్కడ తారాజువ్వలు రకరకాల రంగులు ఆకారాలతో, ఆకాశంలో పేలుస్తుంటారు, మెరుపులతో కూడి రంగు రంగుల పూలు ఆకాశమంతా వెదజల్లినట్లుంది. అక్కడకూర్చుని అవి చూసి ఆనందించి వచ్చాము. మన లక్ష్మీ టపాసులు టైగర్ టపాసుల్లాగ

పెద్ద శబ్దాలు పొగలు ఏమీ ఉండవు అంటూ చోద్యంగా చెప్పింది. అది సరే, ఇంతకీ చెప్పొచ్చేదేమంటే, మన అవసరాలు ఇబ్బందులు అర్థం చేసుకునే వయసు కాదు పిల్లలది. తుపాకీలు మందు బిళ్ళలు ఇలాంటివి ఏమైనా చిన్న చిన్నవి కొద్దిగా తెచ్చి ఇవ్వు. రెండు రోజులకు ఆ ముచ్చట తీరి ఇక పండగ వరకు పలకరు. ఇంతలో తాతయ్య సౌదా! అని పిలవగానే ఆ! ఇదిగో వచ్చే! అంటూ లేచి వెళ్ళింది మా నానమ్మ.

దీపావళితో నానమ్మ తాతయ్య వాళ్లకు ఒక తీయటి అనుబంధం ఉంది. తాటాకులతో ఉట్టి లాగా చేసిన గుమ్మటాలకు మధ్యలో దీపపు ప్రమిద నుంచి వేగంగా గిరగరా తిప్పుతారు. అదొక విన్యాసం. ఈ దీపాల గుమ్మటాలను వరండాలలో వేలాడదీస్తారు. మా ఊరికి

ఐదు కిలోమీటర్లదూరంలోనే మా నానమ్మ వాళ్ళ ఊరు. దీపావళి నాడు టపాసుల కార్యక్రమం అయిన తర్వాత, మా తాతయ్య తనయీడు స్నేహితులతో కలిసి ఊరంతా సైకిళ్లపై తిరుగుతూ, ఇళ్ళ ముందు వెలిగించిన వరుస దీపాలు, టపాసుల చప్పుళ్ళు ఎంజాయ్ చేస్తూ, పోటీలు పడి సైకిళ్లు తొక్కుతూ, మా నాన్నమ్మ ఊరికి కూడా వెళ్లారట. అనుకోకుండా ఒక ఇంటి ముందు ఆగిపోయి ఆ ఇంటి వరండాలో పట్టు పావడ, పవిట వేసుకుని, కుచ్చులు వేసుకొన్న పొడవాటి జడతో, కవిత నడుము చుట్టూ దోపి బాపు బొమ్మ లాంటి అమ్మాయి గుమ్మటం పట్టుకొని గిరగిరా తిరుగుతుంటే పట్టు పావడా బుట్ట బొమ్మ లాగా, కుచ్చులు జడ కూడా గుండ్రంగా తనతో పాటు తిరుగుతున్నాయి. మా తాతయ్య కళ్ళకయితే కథనరంగంలో కత్తి ఝళిపిస్తున్న ఝాన్సీ లక్ష్మీబాయి లాగా కనిపించిందట. అంతే ఆ సంబంధం ఖాయం అవడం, పెళ్లవడం వేళ్ళు లెక్క పెట్టుకునేలోపు జరిగిపోయాయి.

‘సౌదా’! అని ముద్దార పిలుచుకుంటూ, యాభై ఐదేళ్ల వైవాహిక జీవితంలో ఏనాడు సరదాకు కూడా తాతయ్య నాన్నమ్మ ను నొప్పించలేదు. ఆమె కూడా అంతే గౌరవంతో మసులుకుంటుంది. మా నాన్నవాళ్ళది, మాది అరేంజ్డ్

పెళ్లిళ్లు. ఇక్కడ చెప్పుకోదగ్గ విశేషమేమంటే, ఆలుమగల అనురాగంతో పాటు అత్తా కోడళ్ళ అన్యోన్యత. తాతయ్య నాన్న నేను కూడా వయసు తేడాలేని మంచి స్నేహితుల్లా ఉంటాము.

తాతయ్య, నాన్న వాళ్లు ఊరు వదిలి రాలేమని అక్కడే ఉండిపోయారు. మాది మధ్యతరగతి కుటుంబం. చుట్టూ స్థలం మధ్యలో పెంకుటిల్లు. ఇంటి చుట్టూ స్థలంలో మా అవసరాలకు, పదిమందికి పంచేందుకు సరిపడా కూరపాదులు, పండ్ల చెట్లు, పూల చెట్లు ఉంటాయి.

ఐదు తరాలుగా మా వంశంలో మగపిల్లాడు ఒక్కడే సంతానంగా ఉంటూ వచ్చాము. ఆ రూటు మారి నాకు వంశోద్ధారకుడు తో పాటు, మా నానమ్మ సౌదామిని అందాన్ని, గుణగణాలను పుణికపుచ్చుకున్న పు త్తడిబొమ్మ ఇలాంటి కూతురు పుట్టింది. పాప పేరు సౌగంధి. ఆలోచనల తీరం వెంట అలా వెళ్ళిపోతున్న నేను, లేచి స్నాన పానాలు చేసిరా, టిఫిన్ తిందాం అంటూ తాతయ్య భుజం తట్టి చెప్పి వెళ్ళాడు.

కొద్దిగా పొలం పుట్ర ఉన్నప్పటికీ మారుతున్న కాలంలో పెరుగుతున్న ఖర్చులకు ఈ సర్దుబాటు కుదరదని, అదీకాక నాకు చదువు మీద ఉన్న ఆసక్తితో మంచి మార్కులతోనే

చదువు పూర్తి చేసి మంచి ఉద్యోగంలో చేరాను. అందరం ఇక్కడే ఉందాము అని చాలా దూరం చెప్పి చూసాము అందుకు వాళ్లు చెప్పిన మాట మేము ఇక్కడే ఉంటే మీ పిల్లలకి కూడా ఊరితో మైత్రి, మట్టివాసన విలువ తెలుస్తుంది. వారు రాబోయే రోజుల్లో చెప్పుకునేందుకు ఒక చరిత్ర ఉంటుంది. అదికాక ఎన్ని సౌకర్యాలు ఉన్నా ఆ బంగారు పంజరంలో మేము ఇమడలేము. మూడు నెలలకో ఆర్నెల్లకొక సారీ వచ్చి పది రోజులు ఉంటారు. అప్పుడు మాకు, పిల్లలకు పండుగ లాగా ఉంటుంది, బాబు అమ్మకు నాన్నకు చేరిక, పాప జేజవ్వ, తాతయ్యలకు మురిపాల మూట. తాతయ్య వాళ్ళు ఊరి విశేషాలు తోపాటు భగవంతుని లీలలు, భక్తి విలువ, నీతి కథలు, పండుగల విశేషాలు ఒకటేమిటి ప్రపంచాన్నంత పిల్లలకు పరిచయం చేసినట్లు ఉంటుంది. మేము మాత్రం పండుగలకు పబ్బాలకే కాక తరచూ వెళ్తుంటాము.

ఆ రాత్రి పడుకునేందుకు రూంలోకి చేరిన పాప జై తాతా! దీపావళి కథ చెప్పవా! నువ్వు నా అంత ఉన్నప్పుడు మీ నాన్న నీకు టపాసులు కొనిచ్చాడా? పాప ప్రశ్నల పరంపరనాపుతూ తాతయ్య కథ మొదలుపెట్టగానే, బాబు పరిగెత్తుకు వచ్చి తాతయ్య పక్కన చోటు చేసుకున్నాడు.

జేజీ నీకు కూడా చోటుంది నువ్వు కూడా పడుకో అంటూ పాప తాత వైపు జరిగి చెప్పు చెప్పు కథ చెప్పు అంటూ తొందర చేసింది.

ఆశ్వీయుజ మాసం చిట్టచివరగా అక్టోబర్ నెలలో వచ్చే దీపావళి అమావాస్య వెలుగులు నింపే పండుగ అందరికీ ముఖ్యంగా పిల్లలకు చాలా ఇష్టమైన పండుగ. మా పెద్దలు చెప్పిన దీపావళి కథ పూర్వం కృతయుగంలో హిరణ్యాక్షుడు అనే క్రూరుడు విష్ణుద్వేషి అయిన రాక్షసుడు ఉండేవాడు. వాడి ఆగడాలకు అంతులేకుండా భూదేవిని అపహరించి సముద్రమధ్యంలో దాచగా శ్రీ మహావిష్ణువు వరాహావతారుడై హిరణ్యాక్షుని సంహరించి భూదేవిని రక్షించాడు. ఆ సమయంలో ప్రకృతి పరమాత్మల కలయికతో భూదేవికి ఒక శిశువు కలిగాడు నరకుడను నామంతో పెరిగి పెద్దవాడై ప్రాగ్ జ్యోతిష పురానికి రాజుగా చాలా కాలం పరిపాలించాడు.

ద్వాపర యుగంలో బాణాసురుడు అనే రాక్షసునితో స్నేహం కలిగి ఆ ప్రభావమున ఎవరిని లక్ష్య పెట్టక ఎంతోమంది రాజులను చెఱసాలలో పెట్టాడు. పదహారువేల మంది రాజకన్యలను చెఱపట్టి బంధించాడు. దేవతలను ఋషులను కూడా బాధించసాగాడు. ఒకసారి వశిష్టముని

కోపానికి గురయ్యి తల్లి చేతిలోనే మరణం పొందేటట్లు శపించబడ్డాడు. నరకుని ఆగడాలు మితిమీరడంతో వానికి ముగింపు పలకాలని శ్రీకృష్ణుడు ఆ రాక్షసుని పైకి యుద్ధానికి బయలుదేరాడు. సత్యభామ కూడా వెంట వెళ్ళింది. భీకర యుద్ధం జరుగుతుండగా కార్య కారణాలు తెలిసిన శ్రీకృష్ణ భగవానుడు కొంతసేపు మూర్ఛిల్లగా సత్యభామ యుద్ధానికి ఉపక్రమించిoది. చివరకు భూదేవి అవతారమైన సత్యభామ చేతిలో నరకుడు సంహరింపబడ్డాడు. లోకాలు శాంతిని పొంది, ఆనందోత్సాహాలతో దీపావళి జరుపుకున్నారు.

చెరసాలలోని రాజులందరిని విడిపించి వారి వారి రాజ్యాలకు పంపగా, పదహారువేల మంది రాజ కన్యలను వారి ప్రార్ధనపై శ్రీకృష్ణుడు వారిని పెండ్లాడాడు. నరక చతుర్థి నాడు నువ్వుల నూనెతో తల అంటుకొని వేపాకులు వేసిన నీళ్లతో స్నానం చేస్తారు. ఆ రోజుల్లో బ్రాహ్మణులు, వైశ్యులు తప్ప మిగతా కులాల వాళ్ళందరూ కొన్ని పండుగలకు తప్పనిసరిగా మాంసం తినేవారు. ఈ నరక చతుర్థి నాడు మాంసం పేద, ధనిక, భేదం లేకుండా ఖచ్చితంగా ప్రతి ఇళ్లల్లో వండుతారు కానీ దేవునికి నివేదించము. దీపావళికి నీచు తినరు. శాఖాహారo అన్నం కూరలు పప్పు

పాయసాలతో దేవునికి నివేదన ఉంటుంది. దీపావళి సంబరం అంతా టపాసులతోనే ఉంటుంది. పది పదిహేను రోజులకు ముందుగానే టపాసులు తెచ్చి ఎండబెడుతుంటాము. రోజు ఎండలో ఆరబెట్టి సాయంత్రాలు తిరిగి లోపల పెట్టడం మాకు ఇష్టమైనఒక పెద్ద కాలక్షేపం. వారం రోజుల నుండే టపాసుల మోతలు వినిపిస్తుంటాయి.

పగలు కాల్చే నేల టపాసులు, పాము బిళ్ళలు, రోలు రోకళ్ళు ( పండ్లు లేని ముసలి వాళ్లు ఆకు వక్క రోజూ ఇనుముతో చేసిన చిన్నరోలు రోకలిలో దంచుకుoటారు తమిళనాడులో ఇప్పటికీ కనిపిస్తుంటాయి.) అలాంటివే రోలు రోకలిని తాడుతో ముడి వేసి ఉంటారు. గంధకం పొడిని రోలులో వేసి రోకలినిబిగించి తాడు పట్టుకుని గోడకేసి కొడతారు. ఢామ్ అoటూ పెద్ద శబ్దం వస్తుంది. మందు బిళ్ళల రీలు పెట్టి తుపాకీ పేల్చేవాళ్ళం. రాత్రిళ్ళు పెద్ద పెద్ద శబ్దాలు వచ్చే టపాసులు, రాకెట్లు,చిచ్చుబుడ్లు సురసురాలు, కాకరపువ్వొత్తులు, విష్ణు చక్రాలు భూచక్రాలు జాటీలు కాల్చేవాళ్ళం. తాటి ఆకులతో ఉట్టి లాగా చేసిన గుమ్మటాల మధ్యలో దీపం వెలిగించి పెట్టి తిప్పేవాళ్లం .

ఈ గుమ్మటాల సందడి లోనే మీ జేజి నాకు దొరికింది అని

తాతయ్య చెప్తుంటే జేజి ముసిముసిగా నవ్వు కుంది.

ఈ రెండు రోజులు సంధ్య దీపాలతో పాటు ప్రమిదలలో నూనె ఒత్తులు వేసి పూజ గది దగ్గర, తులసి కోట చుట్టూ, ఇంటి బయట ప్రహరీ గోడలపై దిమ్మెలపై అంతా పెట్టి దీపాలు వెలిగిస్తారు. పిల్లలందరం ఈ కార్యక్రమంలో పాలుపంచుకునేవాళ్ళం. దీపావళి వెలుగులు మా మనసుల్లో నింపుకునే వాళ్ళం. కొత్తగా పెళ్లయిన కూతుళ్లు అల్లుళ్ల రాకతో పండగ ఆనందo మరింత పంచుకునే వాళ్ళం. ఇవర్రా దీపావళి విశేషాలు. ఇక పడుకోండి! పొద్దున్నే స్కూలుకు తయారవ్వాలి కదా! అప్పటిదాకా సర్దుకుని పడుకున్న పాప వెంటనే, అన్నయ్యా! మాకు ఇరుకుగా ఉంది నువ్వు వెళ్లి నానమ్మ వాళ్ళ దగ్గర పడుకోపో అంటూ ఇది తన రాజ్యం అన్నట్లు వాడ్ని గదమాయించి తరిమేసింది. గడుగ్గాయి అంటూ జేజవ్వ పాపను దగ్గరికి తీసుకొని జో కొడుతుంటే నవ్వుతూ నిద్రపోయింది పాప.

Written by Shyama Dasi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ప్రియ దర్శిని (1917 -1984)

యువ కవయిత్రి ఎన్. లహరి