ఇదో  కొత్త కథ

2026 జూన్ తరుణి సంపాదకీయం

రెండు ముఖ్యమైన విషయాలను ఈ సంపాదకీయంలో ప్రస్తావించాలనుకున్నాను . ఒకటి- అమ్మాయిలపై జరుగుతున్న అన్యాయాలు, రెండు- ఆడవాళ్లే సమాజాన్ని నిలబెట్టే ప్రతిభావంతులు సంసారాన్ని నడిపించే సారథులు అంటూ వాళ్లు చేస్తున్న ఈ సేవకి నెలకు 30,000 వరకు వాళ్లు సంపాదించినట్టే అని ఒక స్టేట్మెంట్ వినడం-  ఈ రెండు అంశాలను ప్రస్తావించుకోవాలిక్కడ.

ఆడపిల్లలను పెంచుకోవడం ఇంత కష్టంగా ఉంటుంది అని ఓ పదేళ్ల క్రితం వరకు ఎవ్వరు అనుకోలేదు. ఈ మధ్యకాలంలో అమ్మాయిల విషయంలో ప్రమాదాలు ఏ మూల నుండి ఎలా వచ్చి పడతాయో తెలియడం లేదు . ఒకప్పుడు రక్షకులే భక్షకులు అనే మాట అంటుండేవాళ్ళు. ఇది ఆనాడు పోలీసులలో దుర్మార్గంగా ప్రవర్తించిన వాళ్లను చూసి ఇలా అన్నారు. కానీ, ఇప్పుడు ఆ పరిస్థితి కాదు. ఇప్పుడు పోలీసులు రక్షణ వ్యవస్థను బాగానే చూస్తున్నారు కానీ కుటుంబ వ్యవస్థ ,సమాజ వ్యవస్థ ఈ విషయంలో ముందుకు వచ్చాయి . ఇంటి వాళ్లే, బాగా తెలిసిన వాళ్లే అమ్మాయిలను చూస్తే చాలు వెర్రి వేషాలు వేస్తున్నారు. తాత ,మామ, చిన్నాయన, అంకుల్ అంటూ ఎన్నో పేర్లతో వావివర్సలతో పిలుచుకుంటూ ఉన్న ఆడపిల్లలను అన్యాయం చేయడానికి వాళ్ళకి ఎలా మనసు పోతుందో అర్థం కావడం లేదు . వీళ్ళు మా వాళ్ళు అనే దగ్గరతనం ఆ పిలుపులలో కనిపిస్తుంది . మమ్మల్ని బాగా చూసుకుంటారు అనే ధైర్యం వాళ్ళ లోపల కలుగుతుంది .అలాంటి వాళ్ళతో ఏ సంకోచం లేకుండా మాట్లాడుతుంటారు అమ్మాయిలు. అమ్మాయిలే కాదు  అబ్బాయిలైనా ! ఇదే అదనుగా తీసుకొంటారు సదరు వ్యక్తులు.

అలా గౌరవంతో దగ్గరతనంతో పిలుస్తున్న ఆ అమ్మాయిలను ఎట్లా చూడాలి ఏ దృష్టితో చూడాలి ఏ ఉద్దేశంతో వాళ్లలో ఉండాలి అనే జ్ఞానం లేని మనుషులు?  కాదు.. కాదు  .. కానేకాదు . అన్ని తెలిసిన మనుషులే . కానీ మాయ లాంటి ఒక క్రూరత్వం కమ్మి వాళ్లలో రాక్షసుడు ప్రవేశిస్తాడు.

అంతే ఆ అమ్మాయి ఎంత మంచి పరిస్థితిలో ఉన్నది ఎంత ఘోరమైన పరిస్థితిలో ఉన్నది ఎలా ఉన్నది అని కూడా చూడకుండా వివేకం కోల్పోయి మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారు. దీని వల్లనే మనుషులంటేనే నమ్మకం పోతుంది. ఇక మగవాళ్ళు అంటే మరీను ఈ మధ్య జరిగిన ఒక కేసు చాలా బాధకు గురి చేసింది .12 ఏళ్ల పిల్లని 45 ఏళ్ల వాడు  అత్యాచారం చేయాలని చూడ్డం వంటి వార్తలు వినగానే జుగుప్స కలుగుతుంది . ఎవరిని నమ్మాలి? ఎవరిని నమ్మకూడదు ? అనేది పాపం ఆ పిల్లలకి ఎలా తెలుస్తుంది ? ఇటువంటివేవీ అనుభవంలోకి రావు కదా!  ఆ అమ్మాయికి ఇప్పుడు పక్క ఎముకలు విరిగి , ఊపిరితిత్తుల్లో రక్తం చేరి ఆరోగ్యం మొత్తం పాడై హాస్పిటల్లో చికిత్స పొందుతున్నది.

      నేరం చేసిన వాడు తప్పించుకుంటాడు అనుకోవడం  వాళ్ళ భ్రమ . ఎక్కడో ఒక దగ్గర ఏదో విధంగా పట్టుబడతాడు. ఎప్పుడో అప్పుడు శిక్షకు గురవుతాడు . ఇది తెలియదా మరి వీళ్ళకు? తెలిసినా కామంతో కళ్ళు మూసుకుపోయినప్పుడు ఏం కనిపిస్తాయి? ఏం ఆలోచన లోకి వస్తాయి ? ఏవి రావు ….అని అర్థమవుతుంది . దేవుడు శిక్షిస్తాడు.

అనో… మనస్సాక్షి అనేది లేదా అనో… మనం ఎవరమైన ఏమైనా అన్నామంటే చెవిటి వాళ్ల ముందు శంఖం ఊదినట్టే ! ఇవి ఏవి వాళ్ళ మనసుకు ఎక్కవు. ఆ ‘ప్రస్తుతం’ లోనే వాడు ఉంటాడు, తప్పు చేయడానికి వెనుకాడడు. అంతే! తర్వాత ఏ విధమైన మానసిక పరివర్తన కలిగినా ఏం లాభం?  పోయే పరువు పోతుంది, జరిగే అన్యాయం జరిగిపోతుంది . చరిత్రలో ముద్దాయిగా నిలబడిపోతాడు .జీవితమంతా బ్రతికున్నంత వరకు ఈ బాధ ఈ అవమానం వేధిస్తూనే ఉంటుంది. ఇంత జ్ఞానం లేని వాళ్ళు ఉంటారా? ఉండరు ! వీళ్లను గుర్తించి ఎవరైనా నాలుగు మాటలు మంచిగా చెబితే బహుశా ఇటువంటి వింత ప్రవృత్తిని మానుకుంటారేమో కానీ ఎలా ఎవరు చేస్తారు? ఎక్కడ ?

 చేతుల్లో ఫోన్లు పట్టుకొని సంఘటనను రికార్డు చేస్తూ వెర్రి ఆనందం పొందుతున్నారు ప్రజలు. ఇటువంటి సమయంలో నాలుగు మంచి మాటలు ఎవరైనా చెబితే ఎవరు పట్టించుకుంటారు? అందుకేనేమో సామాజిక సేవ చేసే వాళ్ళు కూడా కరువైపోతున్నారు. ఈ పరిస్థితులు దాపురించడానికి కారణాలు ఏమిటి? ఎవరిని నిలదీయాలి పెరుగుతున్న సాంకేతిక సౌలభ్యాల వలన, అందులో వచ్చే వివిధ విషయాల పైన చేస్తున్న వీడియోలు యూట్యూబ్ ఛానల్ లో వస్తున్న వీడియోలు ఇవన్నీ మనుషుల్ని వాళ్ళ మనసులని అతలాకుతలం చేస్తున్నాయి.

   ఒక ప్రశాంతత లేదు. ఒక నెమ్మదితనం లేదు. ఒక హాయి గొలుపే విషయం లేదు. ఆందోళన, భయము, అనుమానము ఇవే వాళ్ళ జీవితాలతో ఆటలాడుకుంటున్నాయి.

       ఇక స్త్రీలు చేస్తున్న ఇంటి పని వంట పని వెలకట్టలేనివి అని అందరికీ తెలుసు. ఇలా తెలిసిన ఓ పెద్దాయన వెలకట్టి చెబితూ  ఎంతవరకు ఇవ్వవచ్చో చెప్పాడు .అంటే రోజుకో వెయ్యి రూపాయలు అంతమేరకు డబ్బును ఇస్తే బయట కూలి వాళ్ళు ఎలా చేస్తారో అంత వర్త్ ఫుల్ అనే స్టేట్మెంట్ ఇచ్చాడు . ఇది సబబుకాదు . 30,000 ఏంటి ? 30 వేలు సంపాదిస్తున్న స్త్రీతో పోల్చడం ఏమిటి ? ఇది చాలా తప్పు. మనసు శరీరము పెనవేసుకుని స్త్రీలు ఇంటి పనుల్లో లీనమవుతారు.

ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి వరకు ఈ యాంత్రికంగా చేస్తూ పోయినా.. మనసు వాళ్లని తడుతూనే ఉంటుంది అనుక్షణం భర్త లేచాడా ఏం చేయాలి ఈరోజు వంటలోకి ? అతనికి ఇష్టమైనట్టు చేస్తే నచ్చుతాడు కదా.. పిల్లలు ఈ పదార్థాలు అయితే బాగా ఇష్టంగా తింటారు. పిల్లల ఆరోగ్యం అవసరం కదా ఇలాంటి ఆలోచనలతోనే ఆ మహిళ వంటింట్లోకి వెళ్తుంది . చేస్తున్నంతసేపు వంటలో ప్రేమను ఆప్యాయతను కలిపి వండుతుంది. ఇది అనుభవంలో మాత్రమే చెప్పగలుగుతారు. అనుభవం లేని పురుషులు అటువంటి స్టేట్మెంట్స్ పాస్ చేస్తారు అయితే దీన్ని సంపూర్ణంగా వ్యతిరేకించాల్సిన అవసరం కూడా లేదు. కనీసం… కనీసం ఇప్పటికైనా ఇంత విలువ అని చెప్పారే అని కూడా ఒకసారి ఒక పాజ్ ఇచ్చి, పాజిటివ్ గా  ఆలోచించాల్సిన అవసరం ఏర్పడింది. అంత కనా కష్టమైనటువంటి పరిస్థితులలో స్త్రీల జీవితాలు మగ్గిపోయాయి ఏళ్లుగా… వాళ్ళు చేసే పనికి ఏ గుర్తింపు లేదు ఇన్నాళ్లు. ఇది అందరికీ తెలిసిన విషయమే ఇప్పుడు ఇటువంటివి చూసి , ఈ కాలం లో నా జీవితం ఎందుకు ఫణంగా పెట్టాలి అని అమ్మాయిలు అనుకుంటున్నారు .ఇది!  ఇంతగా చదువుకొని ఎందుకు వీళ్లకు బానిసలా ఉండాలి అనుకొని కాస్త స్వేచ్ఛగా ఉద్యోగం చేస్తూ డబ్బు సంపాదించుకుంటూ వాళ్ళ సాధికారత కోసం ప్రయత్నం చేస్తే వాళ్ళని మళ్లీ ఇదే పురుషలోకం మిస్ యూజ్ చేస్తున్నది. మళ్ళీ ఇక్కడ కూడా వాళ్లకు జరుగుతున్న అన్యాయాలను ఈ అమ్మాయిలు గుర్తించలేకపోతున్నారు. తన డబ్బు తన హోదా తన అందం ఇవి ఉపయోగించుకుంటున్నాడు కదా అనే ఆలోచన లేకుండా సహజీవనము అనో  కోలీవింగ్ అనో తన జీవితాన్ని నాశనం చేసుకుంటున్నానని అనే స్పృహ కూడా లేకుండా నేటి యువతరం మసులుతోంది. ఈ పరిణామాలన్నీ భవిష్యత్తులో ఎక్కడికి దారి తీయనున్నాయో!  ఇలా జరగడానికి కారణాలను తరచి చూడాల్సింది ఆ ఆ ఇండ్లలో ఉండే తల్లిదండ్రులు అక్క చెల్లెలు పిన్నమ్మలు మేనత్తలు నానమ్మలు అమ్మమ్మలు వీళ్ళు మాత్రమే! వీళ్లు మూడో కన్నును తెరిచి మహిళల సమస్యను ఇళ్లల్లో చర్చించినప్పుడు మాత్రమే అడ్డుకట్ట వేయబడుతుంది. ప్రస్తుత కాలంలో అమ్మాయిలు కొత్త దోపిడీకి గురవుతున్నారు అని తెలియజేయాల్సిన బాధ్యత ఇంటి వాళ్ళదే మళ్లీ కేవలం ఆడవాళ్లే చెప్పాలా?  ఏం నాన్న అన్న తమ్ముడు చిన్నాన్న మేనమామ వీళ్ళు చెప్పొద్దా? ఈ ప్రశ్న ఉదయిస్తుంది. చెప్పొచ్చు చెప్పాలి కానీ చెప్పరు అందుకే ఇళ్లల్లో ఉన్న ఆడవాళ్లే ఆడపిల్లలకు పురుషుడు ఏ విధంగా తనను ఉపయోగించుకుంటాడు అర్థం చేయించాలి ఇలా చెప్పినంత మాత్రాన ప్రేమ పెళ్లి అనేవి మరుగున పడతాయేమో అని ఆలోచనతో చెప్పకుండా ఉంటున్నారు కొంతమంది స్త్రీలు!  ఇది కూడా ఆలోచించాల్సిన విషయమే!! వాళ్ళకి జీవితం పట్ల వెగటు పుట్టే ప్రమాదం ఏర్పడుతున్నది… అంతా దుర్మార్గమే అందరూ దుర్మార్గులే అని చెప్పాక పెళ్లి చేసుకోవాలనే ఆలోచన పెళ్లి కన్నా ముందు ప్రేమించాలనే స్పృహ ఆ అమ్మాయిలకు ఎలా కలుగుతుంది ? ఇవన్నీ తరచి చూస్తే ఆడపిల్లలకు భద్రత లేదు అనేది స్పష్టంగా కనిపిస్తోంది .

         ఈ భద్రతలేమి అనేది కేవలం ఆడపిల్లలకి అనుకోవడం పొరపాటు దీనివల్ల సమాజానికే భద్రత పోయింది. అని గ్రహించట్లేదు ఈ లోకం. ఎక్కడైతే కుటుంబం విలువలను కాపాడుకుంటూ ఉంటుందో అక్కడే గ్రామం పచ్చగా ఉంటుంది.  ఎక్కడెక్కడ గ్రామాలు పచ్చగా ఉంటాయో ఆ దేశం పచ్చగా ఉంటుంది. ఇది చాలా మౌలికమైన సూత్రం. ఎంత డెవలప్ అయింది? ఎంత కొత్త కొత్త యాప్స్ తీసుకొచ్చాము ? కొత్త కొత్త ప్రయోగాలను చేస్తున్నాము ? రాకెట్ ప్రయోగాలు సాధించుకున్నాము అని బాకాలు ఊదుతు  ఢంకా బజాయించుకున్నంత మాత్రాన దేశం అభివృద్ధి సాధించినట్లు కాదు. దేశాభివృద్ధికి మూలం కుటుంబ వ్యవస్థ. కుటుంబ వ్యవస్థ బాగుండాలంటే స్త్రీలు పురుషులు సమన్వయంతో బ్రతుకుని సాధించుకోవాలి.  ఒక రేడియో సెట్ పనిచేయాలంటే విద్యుత్ తరంగాలు,అణు  ధైర్ఘ్య తరంగాలు రెండు కలిసి పని చేస్తేనే వచ్చినట్టు , ఒక బండికి రెండు చక్రాలు ఉంటేనే బండి సాగినట్టు భార్యాభర్తలిద్దరూ కుటుంబ వ్యవస్థను సరిగ్గా నడిపితేనే సుస్థిరత ఏర్పడుతుంది.

         అందుకే కుటుంబాన్ని నిలుపుకోవాలి. దీనికి ప్రధానంగా స్త్రీలు చాలా ఓపికతో సంయమనంతో తెలివితో కృషితో మాత్రమే సాధించగలరు. వీళ్ళకి చేయూతని ఇవ్వాల్సిన బాధ్యత పురుషులది . కానీ అధికారం, పెత్తనం చెలాయిస్తూ ఆడవాళ్లను అదిమిపెట్టాలనుకునే మగవాళ్లే ఎక్కడ చూసినా కనిపిస్తూ ఉంటారు. దీనివల్ల ఎవరికి లాభం లేదు అనేది పురుష లోకం గ్రహించినప్పుడు కాస్తనైనా మార్పు వస్తుంది.

       ఈ రెండు విషయాలు సమన్వయ పరిచి చూసుకుంటే అమ్మాయిలకి అన్యాయాలు జరగడం స్త్రీలకు అన్యాయాలు జరగడం ఈ రెండింటికి బేసిక్ లైవ్ ఏంటి? బేసిక్ లైఫ్ ఏంటి ? అంటే….  కేవలం మంచి కుటుంబం అనేది ఒప్పుకోక తప్పదు. ఇక సమాజం  కొత్త కథలు అల్లక తప్పదు!!

Written by Dr. Kondapalli Neeharini

డా|| కొండపల్లి నీహారిణి, తరుణి సంపాదకురాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

 సింధూరపు వన్నెలు

కొత్త లోకాలు (కాలమ్)