“ఎదురు చూపు

కథ

సాయంకాలం ఆఫీసు నుండి గేటు తీసుకుని లోపలికి వచ్చిన సరిత ఎదురుగా తోక వూపుకుంటూ వచ్చిన ఇజ్జూ దాని వెనుకే ముద్దుగా పడుతూ లేస్తూ వస్తున్న దాని నాలుగు పిల్లలు చూడంగానే ఆశ్చర్యంగా నిలబడి పోయింది.

కొద్దిగా తేరుకుని …తనవంకే చూస్తున్న తల్లి కుక్కను చూస్తూ …

“నీ సంతానాన్ని కూడా తీసుకొచ్చేవా?

ఇన్ని రోజుల నుండి ఎక్కడికెళ్ళావు… అంటున్న సరిత వంకే చూస్తూ … ఇంకొక రెండడుగులు ముందు కొచ్చి నిలబడింది తోక వూపుతూ ..

“సారీ… పర్మిషన్ లేకుండా నా పిల్లలతో వచ్చేసాను తప్పలేదు “

అన్నట్లుగా వుంది దాని చూపు. నవ్వొచ్చింది సరితకు.

సరే వస్తానుండు తలుపు తాళం తీసుకుని లోపలికెళ్ళింది సరిత.

వంట గదిలో కెళ్ళి ఒక గిన్నెలో పొద్దుటి అన్నం పెట్టుకుని కొద్దిగా పాలు పోసి తెచ్చింది .

గిన్నె చూస్తూనే గబగబా ముందుకు వచ్చింది.

గిన్నె దాని ముందు పెట్టి … తిను నీళ్ళు తెస్తాను అంటూ లోపలికెళ్ళి వచ్చే లోపల ఎంతో ఆత్రంగా తింటుంది.

ఆ తల్లిని తిననీయకుండా ఒక్క సారిగా నాలుగు పిల్లలు ఎగబడి పాలు తాగుతున్నాయి. దాన్ని చూస్తే జాలి వేసింది.

“సృష్టిలో మనుష్యులలోనైనా, జంతువులలోనైనా …ఆడతనం, అమ్మతనం ఒకటే కదా” అనిపించింది.

లోపలికెళ్ళి కాఫీ కప్పుతో వచ్చి కుర్చీ లో కూర్చుని కుక్క పిల్లల వంకే చూస్తుంది ఎంతో ముద్దుగా వున్నాయి.

కొద్ది రోజుల క్రితం ఒకరోజు ఉదయమే గేటు పక్కనే ముడుచుకుని పడుకున్న కుక్క కనిపించింది.

ఎందుకో అది చాలా భయపడుతున్నట్లుగా వుంది.

సరితను చూడగానే లేచి దూరంగా జరుగింది అది లేచిన చోటంతా నెత్తురు.

సరితకు అర్థమైంది దాని మీద మగ కుక్కలేవో దాడి చేసినట్టు తెలుస్తుంది.

స్వతహాగా కుక్కలంటే ఇష్టం వుంది అలా అని ఎత్తుకుని ముద్దులాడేంత లేదు. ఆ పరిస్థితిలో దానిని చూడగానే గుండె తరుక్కుపోయింది పోయింది … చాలా విషయాల్లో మనిషికి జంతువుకు తేడా తెలియటం లేదు . వెంటనే లోపలికి వెళ్ళి గిన్నెలో పాలు పోసుకు వచ్చి గేటు లోపలి వైపు కు పెట్టి ” ఇజ్జూ “అంటూ పిలిచింది. అది తలెత్తి తననే నా అన్నట్లుగా చూసింది.

నిన్నే రమ్మన్నట్లుగా గిన్నె చూపింది …సరిత.
మెల్లిగా లేచి వెళ్ళి భయ పడుతూనే పాలు తాగటం మొదలు పెట్టింది . సరిత లోపలికెళ్ళి పని చూసుకుని వచ్చేసరికి గేట్ లోపల వైపు గోడవారగా ముడుచుకుని పడుకుంది.
తరిమేయాలని అనిపించ లేదు. పాపం అనిపించింది.
“నోరు లేదు కాబట్టి ఏమి చెప్ప లేదు … బాధ కూడా చెప్ప లేదు.
” నోరున్న ఆడపిల్లల సంగతి ఇంతకంటే భిన్నంగా లేదుకదా…
“నోరు వుంది కాబట్టి అందరికీ చెప్తారేమో …అందుకే నోరుమూసి చంపి బూడిద చేసి మరీ వదిలేస్తున్నారు.
అదృష్టం …నోరులేదు కాబట్టి బ్రతికి వుంది. మనిషైనా,కుక్కైనా పెద్ద తేడా కనపడటం లేదు.
ఒక వారం రోజులు అలాగా ముడుచుకుని పడుకునే వుంది . చూసినప్పుడంతా చాలా బాధగా అనిపించేది.
దేవుడు కూడా మగవాడు కాబట్టా… ఆడతనానికి ఈ శిక్ష వేసాడా… అనిపించేది.
రోజూ రెండు పూటలా అన్నం పెట్టటం మాత్రమే చేసేది సరిత.
మెల్లిగా కోలుకుంది… గేటు బయట వరకు వెళ్ళి వచ్చేది.
సరిత వున్నా లేకున్నా ఇల్లు చక్కగా కాపలా కాసేది .
గేటుకు క్రింద వున్న చిన్న గ్రిల్ నుండి రాక పోకలు చేసేది . ఒక నెల తర్వాత దాని పొట్ట పెరగటం మొదలు పెట్టింది.
రోజూ పెట్టే అన్నం కాక కాసిని పాలు కూడా పోయటం కూడా మొదలెట్టింది . అప్పుడప్పుడు ఆఫీస్నుండి వస్తూ ఏదో స్వీట్ కూడా తెచ్చి పెట్టేది .
దానికోసం ఒక మెత్తటి గోనె ఒకటి వరండాలో వేసి అక్కడ పడుకోమని చెప్పింది. అర్ధం చేసుకుని బుద్దిగా దానిపైనే పడుకునేది. తర్వాత తర్వాత బయటకు వెళ్ళటం కూడా తగ్గించింది..
సరిత దానికి పెట్టుకున్న పేరు “ఇజ్జూ”
సడన్గా ఒక పది రోజులు ఎటు పోయిందో తెలియ లేదు . అలవాటై పోయిందేమో చాలా బాధ పడింది సరిత. ఏదో ఒక టైమ్ వస్తుందని ఎదురు చూస్తూ వుంది. చనిపోయిందేమో అనే ఆలోచన కూడా వచ్చింది .
పది రోజుల తర్వాత ఇలా వచ్చింది సంతానంతో.
సరిత చాలా సంతోష పడింది.
మళ్ళీ వరండాలో గోనెసంచి పై సెటిలైంది ఇజ్జూ.
పడుకున్న తల్లి పొట్టలోకి దూరి పోయి ఒక దానితో ఒకటి పోటీ పడుతూ పాలు తాగుతూ నిద్ర పోతున్న ఆ బుజ్జి పిల్లలని చూస్తుంటే… కన్నపేగు కదిలింది
సరితకు తన కొడుకు వసంత్ గుర్తొచ్చాడు

ఐదు సంవత్సరాల క్రితం… ఆ కుక్క పిల్లలలాగే ఇరవై మూడేళ్ళ వయసులో పక్కలో పడుకుని …
“నేను అమెరికా వెళ్తానా అమ్మా.. నాకు సీట్ వస్తుందా…సీట్ వస్తే నన్ను పంపిస్తావుకదా…ఎంతో ఆత్రంగా అమాయకంగా అడిగేవాడు
“తప్పకుండా పంపిస్తాను నాన్నా… ఇంత మంచి మార్కులతో ఇంజనీరింగ్ పాసైన నీకు మంచి యూనివర్సిటీ లోనే వస్తుంది.
ఎక్కువ ఆలోచించకు ..
తనకు సర్వస్వం అయిన కొడుకును వదిలి వుండాలనే గుండె నిండిన దిగులును గొంతు దాటి రానీయక.
ఎంతో ధైర్యం చెప్పేది సరిత.
వాడు పదోతరగతి చదువుతున్నపుడు ఒక రోజు స్కూల్ నుండి వస్తూనే …
“అమ్మా..రఘు వాళ్ళ అన్నయ్య అమెరికా వెళ్తున్నాడట. MS చేయటానికి. డిగ్రీ అయిపోగానే రఘు కూడా వెళ్తాడట.
అక్కడ చదివితే మంచి ఉద్యోగాలు వస్తాయంట.
నేను కూడా అమెరికా వెళ్ళి చదువుతానమ్మా…
ఎంతో అమాయకంగా చెప్తున్న వసంత్ ను చూస్తే సరితకు నవ్వు వచ్చింది.
” నవ్వుతూ …వసంత్ ను దగ్గరకు తీసుకుని అలాగే వెళ్తువు … అమెరికా వెళ్లాలంటే ముందు టెన్త్ క్లాస్ ఫస్ట్ క్లాస్ లో మంచి మార్కులతో పాస్ అవ్వాలి ఆ తర్వాత ఇంటర్ కూడా మంచి మార్కులతో పాస్ అవ్వాలి .. తర్వాత ఇంజనీరింగ్ సీట్ రావాలి.
ఆతర్వాత నాలుగు సంవత్సరాలు మంచి మార్కులతో పాసయితే… అమెరికాలో మంచి యూనివర్సిటీలో
సీటు వస్తుంది . మరి నువ్వు ఇప్పటి నుండే ఆ ప్రయత్నం లో వుండాలి అంటూ మెల్లగా చెప్పింది సరిత. శ్రద్ధగా విన్నాడు .వసంత్” అమ్మ చెప్పినట్లు అప్పటినుండి అమెరికా వెళ్లటమే ధ్యేయంగా పెట్టుకుని చదివాడు వసంత్.
క్యాంపస్ సెలక్షన్స్ లో ఇండియాలోని పెద్ద పెద్ద కంపెనీల నుండి ఆఫర్స్ వచ్చినా కూడా వెళ్ళే లేదు.
నిజానికి సింగిల్ మదర్ గా సరిత చేసే బ్యాంకులో చిన్న క్లర్క్ ఉద్యోగానికి వసంత్ ని అమెరికా పంపటం కష్టమైనదే …
అమెరికా వెళ్లాలనే వసంత్ సంకల్పానికి పంపాలనే సరిత ధృఢ నిశ్చయానికి ముందు మిగతా విషయాలేవి అడ్డంకులు కాలేదు.
వసంత్ కు రఘు కు కూడా అనుకున్నట్లుగా వేరు వేరు మంచి యూనివర్సిటీలో సీట్ వచ్చింది.
ముందుగా రఘు వాళ్ళ అన్న శశిధర్ దగ్గరకు వెళ్ళి అక్కడనుండి ఎవరి కాలేజీలకు వాళ్ళు వెళ్లేలా ప్లాన్ చేసుకున్నారు. శశిధర్ ఫోన్లో సరితతో మాట్లాడాడు.
“మీరు ధైర్యంగా వుండండి ఆంటీ …వసంత్ సంగతి నేను చూసుకుంటాను కంగారు పడకండి . చాలా ధైర్యం చెప్పాడు.
వసంత్ వెళ్లే రోజు దగ్గరకొచ్చే కొద్దీ సరితకు చాలా గుబులు గా వుంది .

వసంత్ చాలా సంతోషంగా వున్నాడు. రఘు తోకలసి వెళ్ళ టానికి అవసరమైనవన్నీ షాపింగ్ చేస్తున్నాడు.
ఎన్నో చెప్పాలని అనుకుంది సరిత .. వసంత్ ను చూస్తుంటే ఏమీ చెప్పాలని అనిపించటం లేదు. కానీ… ఒక్క మాట మాత్రం అడిగింది.
“నన్ను వదిలి వెళ్తుంటే దిగులుగా లేదా నాన్నా…సరిత
“ఆమాట వింటూనే ఏవో సర్దుకుంటున్న వసంత్ లేచి వచ్చి
తల్లి పక్కనే కూర్చుని తల్లి వొడిలో తల పెట్టుకుని … చాలా దిగులుగా వుందమ్మా… వుండగలనా లేదా అని భయ మేస్తుంది.
“కానీ వీటన్నిటినీ చిన్నగా చేస్తూ నా కోరిక చాలా పెద్దగా కనిపిస్తుందమ్మా … రెండు సంవత్సరాలు నిర్విఘ్నంగా జరిగి నాకు మంచి ఉద్యోగం రాగానే… నిన్ను తీసుకెళ్ళి పోతానమ్మా … మనం అక్కడే వుందాము. ఎంతో ఉద్వేగంగా చెప్తున్నాడు వసంత్.
“చిన్నగా నవ్వుతూ వసంత్ తల నిమురుతూ …
ముందు అక్కడ ఎలా వుండాలో శశి అన్నయ్యను అడుగుతూ జాగ్రత్తగా వుండు. తర్వాత విషయాలు మెల్లిగా ఆలోచిద్దాము .
ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో … ఫోన్లు చేస్తూ వుండు. నీకు నేను నాకు నువ్వు తప్ప మనకు ఎవరూ లేరు.
అలా చాలా సేపు అలాగే కూర్చున్నారు ఇద్దరూ.
అనుకున్నట్లుగా వసంత్ అమెరికా వెళ్లిపోయాడు. ఇల్లంతా చాలా శూన్యంగా మారిపోయింది సరితకు.
ఎపుడూ రెండు రోజులు కూడా వుండలేదు వాడిని వదిలి చాలా దిగులు పడింది సరిత.
వెళ్లిన దగ్గరనుండి ప్రతి రోజూ రెండు పూటలా ఫోన్ చేసేవాడు
తన రూమ్, రూమ్మేట్ ని కాలేజీ క్యాంపస్ నీ వీడియో కాల్ చేసి చూపేవాడు. శశిధర్ ద్వారా కాలేజీలో ఒక ప్రొఫెసర్ కి హెల్ప్ చేయటానికి పార్ట్ టైమ్ చేరాడు. మొదటి సంవత్సరం పూర్తయ్యేనాటికి మంచి మార్కులతో పాటుగా ప్రొఫెసర్ల అందరి అభిమానాన్ని చూరగొన్నాడు.
మెల్లగా అమెరికాకు అలవాటు పడ్డాడు. రెండవ సంవత్సరం ఇంకో ముగ్గురి తో కలిసి బయట రూమ్ తీసుకుని వుంటున్నాడు.
ఇక్కడ సరిత కూడా కొంత అలవాటు పడి పోయింది.
రోజులు గడుస్తున్నాయి . రెండవ సంవత్సరంలో క్యాంపస్ సెలక్షన్ లో మంచి కంపెనీ లో ఉద్యోగం కూడా వచ్చింది . ఇంక వసంత్ సంతోషానికి హద్దే లేదు.
“వసంత్ కల నెరవేరినందుకు సరిత కూడా ఆనందంగా ఊపిరి పీల్చుకుంది.
“అమెరికాని లక్ష్యంగా పెట్టుకుని వసంత్ ఎంత కష్ట పడ్డాడో తనకే తెలుసు. పిల్లల్లో వుండే చిన్నచిన్న ఆనందాలను, సరదాలను కూడా వాడు అనుభవించలేదు. దేవుడి దయ వలన వాడు అనుకున్నట్లుగా అన్నీ జరిగి పోయాయి . జీవితం మంచి దారిలో పడింది. వాడి జీవితం ఏ ఒడిదుడుకులు లేకుండా జరిగి పోవాలని దేవుడికి నమస్కారం చేసుకుంది.
“ఉద్యోగంలో చేరే ముందు ఇండియా వస్తానని చెప్పాడు.
అప్పటినుండి సరితకు కొడుకును చూడాలనే ఆతృత ఎక్కువైంది. వాడికి ఇష్టమైనవన్నీ లిస్ట్ వ్రాసి పెట్టుకుంది.
తెలియని ఒక అలజడి … పాపం చాలా రోజుల తర్వాత వస్తున్నాడు. వాడికోసం ఏదోచేయాలి … ఆరాటం సరితను నిలబడనీయటం లేదు.
నెల రోజుల కొరకు వసంత్ వచ్చాడు. రఘు, శశి కూడా వచ్చారు. వచ్చిన దగ్గరనుండి అమెరికా గురించి కబుర్లు చెప్తూనే వున్నాడు.
తల్లిగా తను అనుకోకూడదేమో… కానీ అమెరికా వెళ్లాక వసంత్ మంచి కలర్ వచ్చాడు. కొద్దిగా వళ్ళు వచ్చింది
వాడి నడకలో నడతలో ఆత్మ విశ్వాసం కొట్టొచ్చినట్టు కనపడుతుంది. దిష్టి తీయాలి అనుకుంది సరిత బయటకు వెళ్ళి స్నేహితులను కలసి రావటం, కాలేజీకి వెళ్లి లెక్చరర్స్ అందరినీ కలిసిరావటం, రోజుకొక కార్యక్రమంగా జరుగుతుంది. రఘు, శశి కూడా ఇంటికి వచ్చి సరితతో కబుర్లు చెప్తున్నారు . రఘు తప్ప చిన్నప్పటినుండి వాడికి చెప్పుకోతగ్గ స్నేహితులు లేరు. రఘు ఇంట్లో కూడా వసంత్ అంటే అందరికీ అభిమానం .రఘు కూడా బాగా బిజీగ వున్నాడు.
ఇంట్లో వున్న సమయం అంతా ఫోన్లతో గడిచి పోతుంది. కాసేపు పక్కనే కూర్చుని మాట్లాడటానికి అవటం లేదు.
చూస్తూండగానే రెండు వారాలు సమయం గడిచి పోయింది. సరితకు దిగులు మొదలైంది . మళ్ళీ వసంత్ వెళ్ళి పోతాడు. ఇప్పుడు ఉద్యోగంలో చేరితే మళ్ళీ ఎప్పుడు వస్తాడో తెలియదు. తెలియని అలజడి మొదలైంది. తను మనసులో అనుకున్న ఒక్క మాట కూడ వాడికి చెప్ప లేకపోతుంది సరిత.
చెప్పలేక పోవటం కాదు వసంత్ అవకాశం ఇవ్వటం లేదు.
వసంత్ చిన్నప్పటినుండి అన్ని విషయాల్లో కూడా వయసును మించిన అవగాహన వున్న వాడు. తల్లి ఏమి చెప్తుందో తెలుసు .కొద్ది రోజులు అమెరికాలో వుండి ఇండియా వచ్చెయ్యమని చెప్తుంది. ఆమెకు అబద్దం చెప్పటం వసంత్ కు ఇష్టం లేదు.
కానీ తను ఎప్పుడో నిర్ణయించుకున్నాడు. అమెరికా వెళ్ళటమంటూ జరిగితే ఎలాగైనా అక్కడే స్థిరపడాలని . తల్లిని కూడా తనతో తీసుకు వెళ్లి పోవాలని. ఇందుకు తల్లి ఒప్పుకోదు కానీ ఒప్పించాలి.ఆ అవకాశం వచ్చినపుడే తల్లితో గట్టిగా మాట్లాడాలని … అందుకే తల్లికి మాట్లాడే అవకాశం ఇవ్వటం లేదు వసంత్ .తిరుగు ప్రయాణం రోజు దగ్గరకొచ్చింది. చాలా హడావిడిగా వున్నాడు. సరిత కూడా వసంత్ కు కావలసినవన్నీ సర్ది పెట్టటం లో మునిగి పోయింది.
అయినా మనసు మాత్రం గుబులు గుమ్మం దాటటం లేదు.
వసంత్ వెళ్ళేటప్పుడు మాత్రం తల్లిని వాటేసుకుని “కొద్ది రోజులు ఓపిక పట్టమ్మా … అన్నీ సర్దుకుంటాయి. అంటూ తన కంటి నీటిని కనపడనీయకుండా బయటకు వచ్చాడు.

“రఘు, శశి కూడా కారు తీసుకుని వచ్చారు. లగేజ్ కారులో పెట్టి కళ్ళనిండా నీరు నింపుకు బేలగా నిలబడిన సరితను …
దగ్గరగా తీసుకుంటూ బెంగ పడకండి ఆంటీ… మేము వున్నాముగా … కలిసే వుంటాము వసంత్ ను మేము చూసుకుంటాం అంటూ ఓదార్చి… కారు ఎక్కారు. వారి కంటే “ముందే కారులో కూర్చున్న వసంత్ తల్లి వంక చూస్తూ చేయి ఊపాడు.
కన్నీటితో నిండుకున్న కళ్ళు కారు మలుపు తిరిగే వరకు చూస్తూనే వున్నాయి.
కళ్ళు తుడుచు కుంటూ లోపలకు వచ్చి సోఫాలో నిస్సత్తువగా కూలబడి పోయింది సరిత.
అలా కళ్లు మూసుకు పడుకుందో … ఫోన్ రింగ్ తో కళ్ళు తెరిచింది.
వసంత్ ఫోన్ చేస్తున్నాడు. హడావిడిగా ఫోన్ తీసుకుని చెవి దగ్గర పెట్టుకుంది సరిత.
” అమ్మా…బోర్డింగ్ అయిపోయింది. ఫ్లైట్ లోకి వెళ్తున్నాను. వెళ్ళాక కాల్ చేస్తాను…జాగర్తమ్మా.. వసంత్ గొంతు కూడా భారంగా అనిపించింది.
“అలాగే జాగ్రత్త నాన్నా … అని సరిత మాట్లాడు తుండగానే సరే అమ్మా అంటూ ఫోన్ పెట్టేసాడు వసంత్.
వాడు కూడా బాధ పడుతున్నాడు అది అర్ధమవుతుంది సరితకు.
“వాడిని బాధ పెట్ట కూడదు వాడికెలా ఇష్టమైతే అలాగే వుంటాడు. వాడి మీద ఎలాంటి వొత్తిడి తేకూడదని గట్టిగా అనుకుంది సరిత.
వసంత్ కు రెండు సంవత్సరాల వయసు లో భర్త సుభాష్ నుండి విడిపోయింది అందులో తన ప్రమేయం లేకుండానే జరిగి పోయింది కారణం … భర్త వేరే అమ్మాయితో సంబంధం లో వుండటమే … అత్తగారింటినుండి ఎలాంటి స్పందన లేదు.
పుట్టింట బరువుగా వుండలేక పోయింది. తన మూలంగా చెల్లెలి పెళ్ళి, తమ్ముడి చదువుకు ఆటంకం కలుగుతుందేమో …అనే తండ్రి ఆలోచనతో వసంత్ బాధ్యతను తిరస్కరించారు. వసంత్ ను భర్తకే తిరిగి ఇవ్వమన్నారు.
ససేమిరా ఒప్పుకోలేదు సరిత. తండ్రి చెప్పించిన డిగ్రీ చదువు
ఒక ప్రైవేటు బ్యాంక్ లో చిన్న క్లర్క్ వుద్యోగం ఇచ్చింది … అది పుట్టిన వూరికి దూరంగా …రెండేళ్ల వసంత్ ను తీసుకుని హైదరాబాద్ కు వచ్చింది సరిత. బ్యాంకు లో సరితతో పని చేసే వారందరు తన నడవడిని మెచ్చుకునే వారు. అందరూ అభిమానించేవారు.
ఎవరి అండ సహకారం లేకుండానే ఒక యజ్ఞంలా వసంత్ ను పెంచుకుంది.
వసంత్ కూడా చిన్న నాటినుండి కూడా తల్లిని ఎపుడూ ఏ విషయం లోను ఇబ్బంది పెట్టలేదు. ఏనాడు తండ్రిని గురించి అడగ లేదు. అన్నీ తెలిసినట్లుగా వుండేవాడు.
వసంత్ కు ఊహ వచ్చాక అడిగింది ఒక్కటే… అమెరికా పంపమని … దాని కోసమే కష్ట పడ్డాడు చివరికి సాధించుకున్నాడు.
వసంత్ వెళ్ళి ఉద్యోగంలో చేరాడు. కాలేజీ లో వున్నంత కాక పోయినా సమయం వున్నపుడు ఫోన్లు చేస్తూనే వున్నాడు. రెండు సంవత్సరాలలో తను అమెరికా వెళ్ళటానికి తీసుకున్న బ్యాంక్ లోన్స్ అన్నీ తీర్చేసాడు.
ఒక్కసారి వచ్చి వెళ్లమని అడిగే తల్లికి సమాధానం చెప్పలేక పోయేవాడు. పని చేస్తున్న కంపెనీ వీసా ప్రాసెస్ లోవుంది. ఇండియాకు వస్తే తిరిగి అమెరికా రావటం కష్టమవుతుంది. అదే చెప్తూ వచ్చాడు వసంత్.
మెల్ల మెల్లగా ఫోన్లు కూడా తగ్గినయి … వీకెండ్స్ లో ఏదో కాసేపు . యాంత్రికంగా రోజులు గడిచిపోతున్నాయి. రఘుది కూడా అదే సమస్య … మధ్యలో శశి మాత్రం రెండు సార్లు వచ్చాడు. వసంత్ వుండేది వేరే చోట అయినా రఘుతో సమానంగా వసంత్ ను కూడా చూసుకుంటాడు. వచ్చినపుడు సరితకు ధైర్యం చెప్తుంటాడు. ఉద్యోగంలో జేరి మూడు సంవత్సరాలు అయిపోయినా ఇంకా వసంత్ కు రఘుకు H1 వీసాలు రాలేదు.
ఇంకా ప్రాసెస్ లోనే వున్నాయంటున్నారు. అందరూ అయోమయం లో వున్నారు.
6 నెలల క్రితం శశి వచ్చినపుడు… ఇంకొక సంవత్సరం చూసి రఘు ఇండియా వచ్చేస్తాడు అని చెప్పాడు.
“అప్పుడే వసంత్ గురించి కూడా అడిగింది సరిత.
“వసంత్ వచ్చే విషయం ఏమి చెప్పటం లేదు ఆంటీ …
వాడికి ఇండియాకు వచ్చే ఉద్దేశం లేదు. ఎలాగైనా అక్కడే సెటిల్ అవ్వాలని వుంది. వీసా ఆలస్యమవుతుంది . రూల్స్ మారిపోయాయి . దాదాపుగా అందరి పరిస్థితి అలాగే వుంది. ఏమి కాదులెండి.
వాడి కి వీసా వస్తుంది లెండి అంటూ ధైర్యం చెప్పాడు వసంత్.
“ఎందుకో ఇంకేదో చెప్పాలని చెప్పలేక పోతున్నట్లుగా వుంది శశి వాలకం.
” ఏంటి శశీ …ఏదో ఆలోచిస్తున్నావు.. ఇంకేమైనా చెప్పాలా… అడిగింది సరిత..
అవును … నేను చెప్పేది విని మీరు ఎలా ఫీల్ అవుతారో అని భయంగా వుంది ఆంటీ… కొద్దిగా ఆలోచిస్తూ అన్నాడు శశి.
“ఏమైంది ? వసంత్ ఎలా వున్నాడు… వాడికేమైనా జరిగిందా? కంగారుగా అడిగింది సరిత.
“లేదు అలాంటిదేమి లేదు. వాడు బాగానే వున్నాడు వెంటనే బదులిచ్చాడు శశి ..
మరి ఇంకేమిటి అన్నట్లు చూసింది సరిత.
“వసంత్ ఒక అమెరికన్ అమ్మాయితో డేటింగ్ చేస్తున్నాడు. వాడి కంపెనీ లోనే పని చేస్తుంది . వీడిని బాగా ఇష్ట పడుతుంది.
ఆ అమ్మాయిని పెళ్ళి చేసుకుంటే ఆ అమ్మాయి ద్వారా అమెరికాలో సెటిల్ అవ్వొచ్చని వసంత్ ఆలోచన. కానీ …ఈ విషయం మీకు చెప్పొద్దన్నాడు కానీనాకే మీకు చెప్పాలని పించింది నెమ్మదిగా చెప్పాడు శశి.
‘ఎక్కడో ఆకాశం నుండి బలవంతంగా ఎవరో తోసేసిన ఫీలింగ్ . కొంత సేపు అలాగే స్థాణువులా కూర్చుండి పోయింది.
కొంత సేపటికి తేరుకుని పెదాలపైకి సన్నని నవ్వును తెచ్చి పెట్టుకుని …
“వాడి ఆనందానికి, ఇష్టానికి నేనెప్పుడూ అడ్డు రాను శశీ !
ఆ విషయం వాడికి కూడా తెలుసు … చిన్నగా చెప్పింది సరిత.
అవును ఆ అమ్మాయి తల్లి తండ్రులకు తెలుసా వాళ్ళు ఒప్పుకున్నారా .. అమాయకంగా అడిగింది సరిత.
అమెరికాలో తల్లి తండ్రులు ఒప్పుకోవటం అలా ఏమి వుండదు ఆంటీ ..
“ఇరవైయొక్క సంవత్సరాలు దాటితే వాళ్ళ ఇష్టమొచ్చినట్లు వుండచ్చు. పెళ్ళి చేసుకున్నా వద్దనుకుంటే క్షణాల్లో రద్దు చేసుకుంటారు. వీళ్ళను చూసి ఇప్పుడు మన వాళ్ళు కూడా ఇలాగే తయారవుతున్నారు ..నేను చాలా చెప్పాను వసంత్ వినటం లేదు. వాడు అక్కడ స్థిరపడటం కోసం చాలా పెద్ద రిస్క్ తీసుకుంటున్నాడు కొద్దిగా బాధ గా చెప్పాడు శశి
“చాలా సేపు అక్కడి విషయాలు చెప్పి సరితకు ధైర్యం చెప్పి వెళ్ళిపోయాడు శశి.
” ఎక్కడో తన మనసులో ఏ మూలో వున్న శంక నిలువెత్తున నిజమై ఎదురు నిలబడినట్లుగా వుంది .ఇలాంటిది తను ముందునుండి ఊహిస్తుందా …అర్ధం కావటం లేదు. వసంత్ ముఖంలో భర్త పోలికలు కనపడినపుడు భయపడేది. ఇప్పుడు వసంత్ లో భర్త సుభాష్ కనపడటం ఇన్ని సంవత్సరాల తన జీవితానికి అర్ధం లేకుండా పోయింది అనిపించింది.
సుభాష్ కూడా అంతే … తను భవిష్యత్ లోఉన్నతంగా ఎదగటానికి ఆస్తి పరురాలితో సంబంధం
పెట్టుకున్నాడు. ఆవిడను పెళ్ళి చేసుకోవాలంటే నానుండి విడాకులు కావాలి అదే చెప్పాడు
“నీకు నీ కొడుకును పెంచుకోవటానికి సరిపడా డబ్బు ఇస్తాను విడాకులు ఇవ్వమని అడిగాడు సుభాష్.
” తను ఏమి మాట్లాడ లేదు. ఎవరికి తల్లి తండ్రులకు కూడా చెప్పలేదు. మౌనాన్ని అంగీకారంగా తెల్లవారే విడాకుల కాగితాల మీద సంతకం చేసి కొడుకును తీసుకుని గడప దాటింది సరిత.
తనకు తెలుసు తల్లి తండ్రులు ఈ విషయాన్ని అంగీకరించరని. వారికి బరువుగా వుండటం కూడా సరితకు ఇష్టం లేదు . పసివాడితో ఎలా బ్రతకాలి. తన వ్యక్తిత్వాన్ని చంపుకుని జీవచ్ఛవంలా తను బ్రతక లేదు .
” కొంత డబ్బు ఇస్తా అన్న సురేష్ మళ్ళీ ఆ మాట ఎత్త లేదు. ఇచ్చినా తీసుకునేది కాదు. అది సురేష్ కు తెలుసు.
తను అనుకున్నట్లే పుట్టింట ఎవరూ సరిత చేసిన పని సమర్థించ లేదు, సహకరించలేదు.
ఇవాళ వసంత్ విషయం వినగానే… మనసు బండబారి పోయింది .. వసంత్ అలా ఆలోచిస్తాడని నమ్మ లేక పోతుంది .
తన పెంపకంలో సంస్కారానికి అలాంటి ఆలోచనలు రావనుకుంది సరిత కొద్ది రోజులు కంటికి నిద్ర రాలేదు వాడి మీద కోపం కాదు. తెలియని ఒక అసహనం.
‘వసంత్ అమెరికా నుండి ఎప్పుడో ఫోన్ చేస్తాడు ఒక పదినిమిషాలు ఏవో క్షేమ సమాచారాలడుగుతాడు.
తను కూడా ఏమీ తెలియనట్లుగానే మాట్లాడుతుంది. మనసులో మెలి పెట్టే బాధను అణుచుకుంటుంది సరిత ..అలా కాలం గడుస్తుంది… అప్పుడప్పుడు శశి,రఘు మాట్లాడుతున్నారు .సమయం చాలా యాంత్రికంగా గడుస్తుంది.
వసంత్ ఎప్పుడూ తనకు ఆసరా కావాలని కోరుకోలేదు. వాడు జీవితంలో ఉన్నతంగా ఎదగాలని, ఆనందంగా వుండాలి అని మాత్రమే కోరుకుంది సరిత. వసంత్ ఇంత స్వార్థంగా వుంటాడని ఊహ కూడా లేదు . అందుకే ఆలోచన రాలేదేమో . ఒంటరి దానిగా జీవితం లో ఎన్నో ఒడిదుడుకులు ఎదురు దెబ్బలు ໖໐໖.
అయినా ఎప్పుడూ ధైర్యం కోల్పోలేదు.
అయినా వసంత్ ను స్వార్ధపరుడని ఎందుకనాలి… నేనేమి చేసాను సురేష్ నుండి విడాకులు తీసుకుని వచ్చే రోజున నా ఆత్మ గౌరవమే గొప్ప అనుకున్నాను కానీ …వసంత్ కి తండ్రి నీడ ఖచ్చితంగా కావాలని అనుకోలేదు . అలా అనుకుంటే… విడాకులు తీసుకోకుండా వసంత్ కోసమే నిలబడేది కదా … అలా చేయలేదు.
“తనతో పాటు వాడిని బయటకు తెచ్చినందుకు తండ్రి లోటు తెలియ కుండా బాధ్యతగానే పెంచుకుంది కానీ వాడి మనసులో ఏముందో ఎప్పుడు అడగ లేదు వాడు చెప్ప లేదు. ఇక్కడ నా వ్యక్తిత్వం అనే మాట నా స్వార్థమే కదా…అలాంటపుడు వసంత్ ని స్వార్థపరుడనే హక్కు నాకెక్కడిది? ఒకరికి న్యాయం అనిపించింది మరొకరికి అన్యాయమనిపించవచ్చు. ఇక ముందు వాడిని తప్పుపట్ట కూడదు. వాడి కోరిక, వాడి ఆశయం నెరవేర్చుకోవటం కొరకు వాడికి వచ్చిన అవకాశం ఉపయోగించు కోవాలనుకున్నాడు. తప్పేముంది?
పలురకాలుగా ఆలోచిస్తుంది సరిత
ఇలా ఆలోచించాక మనసు కొద్దిగా తేలికగా అనిపించింది.
“ఇంతకీ తన ఆత్మ గౌరవం గెలిచిందా లేక అమ్మతనం గెలిచిందా అంటే..
ముమ్మాటికి అమ్మతనానికే ప్రధమ స్థానం.” ఆత్మ గౌరవం ముఖ్యం అనుకుంటే వసంత్ ను కూడా ఆరోజే వదిలేసుకునేది.
అలా చేయలేదు .అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ కూడా గెలిచేది అమ్మతనమే!
“అప్పటినుంచి వసంత్ తో మామూలుగానే మాట్లాడుతుంది. ఎప్పుడు వస్తావు అని అడగటం మానేసింది సరిత.
తల్లి కదా …తన రాక కోసమైతే ఎదురు చూస్తూ నే వుంది.
“ఆ సమయంలో ఇజ్జూ, దాని పిల్లలు వాటితో కాలక్షేపం మనసుకు కొంత వూరట కలిగించాయి.
“ఇజ్జూ పిల్లలు కాస్త పెద్దగా అయినాయి . వాటంత అవే బయటకు వెళ్ళి వస్తున్నాయి.
అలా వెళ్లిన పిల్లలు మెల్ల మెల్లగా వారానికి ఒకసారి ఏదో తల్లిని చూడటానికి అన్నట్లుగా వచ్చేవి .కాసేపు తల్లి చుట్టూ తిరిగి ఆటలాడి మళ్లీ ఏదో పెద్ద పని వున్నట్లు పరుగున వెళ్లి పోయేవి.
అవి వచ్చిన కాసేపు ఇజ్జూ ముఖంలో ఒక ఆనందం కనిపించేది… కొన్ని రోజులకు అవి రావటం మానేసాయి.ఎటు వెళ్లాయో కూడా తెలియదు.
ఈ మధ్య పాపం ఇజూ కూడా బయటకు ఎక్కువ వెళ్ళటం మానేసింది . పెట్టింది తిని అలా వరండాలో పడుకుని గేట్ వంక చూస్తూ వుంటుంది. పిల్లలు వస్తాయేమో అని చూస్తున్నట్లు అనిపించేది.

” బయట కుక్కల అరుపులు వినిపించినపుడు మాత్రం అలర్ట్ అయి గేట్ వరకు వెళ్ళి కాసేపు అరచి వచ్చి మళ్ళీ తన స్థానం లో కూర్చుని నా వంక చూసేది. ఏదో నాతో చెప్పాలన్నట్లుగా వుండేది.
“దాని పిల్లల పైన ఎవరైనా దాడి చేసారనో ఏమో … తెలియదు.
“పిల్లలు వస్తారేమో అని ఎదురుచూస్తూ ఇజ్జూ..
“అమ్మా …నేను వస్తున్నా అనే వసంత్ మాట కొరకు ” ఎదురు చూస్తూ సరిత ఇలా ఇద్దరూ అమ్మలు గా ఒకే దారిలో పిల్లల కొరకు ఎదురు చూపు.

Written by Vijaya Goli

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ఓమంచి పుస్తకం

మన మహిళామణులు – కర్లపాలెం స్వరాజ్యలక్ష్మి గారు!