ఒడిపిళ్ళు – 34

ధారావాహిక నవల

సోమ్లా నాలుగు రోజులుగా పక్కవారి పొలంలో కూలీకి పని చేస్తున్నాడు. ఐదో రోజు వారాంతపు సంతకు వెళ్ళాడు. అక్కడ కొన్ని తినుబండారాలను, బియ్యాన్ని, తీపి పాకాన్ని కొన్నాడు. ఆరవ రోజు వీటన్నింటిని మూట కట్టుకొని, ఒక ఎదురు బద్దకు చివరన తగిలించుకొని, భుజం పై పెట్టుకొని, తన బిడ్డలను కలవడానికి బయలుదేరాడు. వర్షం తీవ్రంగా కురుస్తోంది. కప్పుకోవడానికి ఏమీ లేదు తడిసి ముద్దయిన అతను, అడవిలో నెమ్మదిగా నడుస్తున్నాడు. మధ్యలో ఎదురైనా సెలయేళ్ళు, వరదలు కడుతున్నాయి, వాటినుండి కష్టంగా నెమ్మదిగా నడుస్తూ ముందుకు సాగాడు.

సూర్యాస్తమయానికి ముందు అతడు గమ్యాన్ని చేరాడు. వర్షంలో తడిచి చలికి వణుకుతూ ఉన్నాడు. నడుముకు ఒక పంచ మాత్రమే కట్టుకుని ఉన్న అతని బట్టల నుండి, నీళ్లు బొట్లు బొట్లుగా కారుతున్నాయి. పని నుండి తిరిగి వెళుతున్న కార్మికుల సమూహం అతనికి ఎదురయింది. వారంతా ఎర్రమట్టితో మురికిగా ఉన్నారు. వారి భుజాల మీద గడ్డపారలు, పలుగులు మోస్తున్నారు. యువతీ యువకులు సంఘటితంగా కలిసి నడుస్తూ, నవ్వుతూ హాస్యం ఆడుకుంటున్నారు. ఒకరినొకరు తోసుకుంటూ ముందుకు వెళ్లారు. వారి తర్వాత మరొక గుంపు ఎదురయింది. కానీ అతడికి ఆ బృందంలో జిలీ, బిలీ కనిపించలేదు. అతడు ఆ వెళ్తున్న గుంపులలో చాలా జాగ్రత్తగా అమ్మాయిలను పరిశీలించాడు. అతని భుజం పై ఉన్న వస్తువుల మూటను చూసి, కొందరు యువకులు అతనితో హాస్యమాడారు. “ఆ మూటలో ఉన్న వస్తువులన్నీ మా కోసమేనా తాతా” అని ఒకడన్నాడు.

“కాదు ఎవరో తన బంధువును కలవడానికి, వేరే ఊరికి వెళ్తున్నట్టున్నాడు. జాగ్రత్త ముసలోడా! నిన్ను పులి ఎత్తు పోగలదు” అన్నాడు ఇంకొకడు.

అప్పుడు సోమ్లా “సరసుపదార్ గ్రామం నుండి వచ్చిన సాలీ, మాలీలను మీరు చూశారా!” అని అడిగాడు. వారంతా గట్టిగా నవ్వుతూ తమ దారిన వెళ్ళిపోయారు.

ఇప్పుడు సోమ్లా బిడ్డలకోసం వెతికి వెతికి అలసిపోయాడు. తనకు తాను ఆ గుంపులో తప్పిపోయాడు. అక్కడ వరుసలో ఉన్న గుడిసెల్లో కార్మికులు నివసించే చోటికి వచ్చాడు. చీకటి పడింది, చలి పెరిగింది. అప్పుడప్పుడు ఒక నక్షత్రం మెరిసి మాయమవుతోంది, మబ్బుల మధ్య. అతడు అలిసిపోయి కుంటుతూ నడుస్తున్నాడు. భుజం మీద తన బరువును మోస్తూ, ఆ గుడిసెల నడుమ నడస్తూ “సాలీ.. మాలీ…” అంటూ కేకలు పెడుతున్నాడు. అతని పిలుపులకు చాలామంది గుడిసెల నుండి బయటికి వచ్చి చూస్తున్నారు. ప్రతిసారి బయటికి వచ్చిన వారి దగ్గరికి వెళ్లి వారి ముఖాలను ఆ చీకట్లో పరకాయించి చూస్తున్నాడు సోమ్లా. మళ్లీ మళ్లీ బిడ్డలను పిలుస్తూ తన అరుపులను కొనసాగిస్తూ ముందుకు నడుస్తున్నాడు.

సాయంకాల సమయంలో అక్కాచెల్లెళ్ళు ఇద్దరూ అలంకరించుకొని, రామి కోసం ఎదురు చూస్తున్నారు. బాధతో అరుస్తున్న ఆ గొంతును తలుపు దగ్గర విని సాలీ ఉరికొచ్చింది. మాలీ తన చీర పూర్తిగా కట్టుకోకుండా అది నేల మీద వేలాడుతూ ఉంటే పరుగెత్తుకొచ్చింది. అక్కడ వారి తండ్రి ఉన్నాడు. ఒక్కసారిగా ఆనందంతో గట్టిగా అరిచారు. అతడు మాత్రం కన్నీళ్లు కారుస్తూ అక్కడే నిలబడ్డాడు. వారితో కఠినంగా మాట్లాడాలని ప్రయత్నించాడు. కానీ అతని గొంతు అందుకు సహకరించలేదు.

“అయితే మీరిద్దరూ నన్ను వదిలేసి వచ్చారన్న మాట” అన్నాడు సోమ్లా.

అక్కాచెల్లెళ్ళు ఇద్దరూ ఒక్కసారిగా తప్పు చేసినట్టు సిగ్గు పడ్డారు. వెనుకకు తగ్గి ఏడుస్తూ.

అతడు తలుపు బయటే అచేతనంగా అతని కాళ్ళు నెలలో పాతుకు పోయాయా అన్నట్టు నిలబడ్డాడు. చిన్న గాసునూనె దీపం వెలుతురు ఎర్రగా ఇంటి నుండి అతని ముఖానికి ఒకవైపు పడుతోంది. అతని వెనక అంతా నల్లటి చీకటి రాత్రి. ముడతలు పడిన ఎముకల గూడు వంటి అతని శరీరం మసక చీకటిలో వారికి కనబడింది. కానీ ఉన్నట్టుండి అతడు ప్రేమగా ఆనందంతో వారిద్దరినీ దగ్గరికి తీసుకున్నాడు.

బిడ్డలు ఇద్దరు తండ్రి భుజాలపై పడి ఏడుస్తూ గుడిసెలోకి తీసుకుని వచ్చారు అతన్ని.

*** *** *** *** ***

శుక్రుజానీ తన బిడ్డలు ఇద్దరిని ఇంటికి తీసుకు వెళ్ళాలి అనుకున్నాడు. కానీ వారు తిరిగి ఇంటికి వెళ్లడానికి తొందర చూపలేదు.

“ఎప్పుడు రావాలి అనిపిస్తే అప్పుడు వస్తాం మేము” అన్నారు.

“అయినా వచ్చిన తరువాత అక్కడ ఏమి మంచి జరుగుతుంది మాకు” అన్నారు.

“మీరు దాని గురించి బాధ పడవలసిన అవసరం లేదు” అని సమాధానమిచ్చాడు సోమ్లా.

“మీరు మరీ చిన్న పిల్లలు. మీకు అగౌరవం కలిగే విధంగా, నాకు సహాయం చేయడానికే మీరు ఈ పని చేస్తున్నారు. కానీ నాకు దాని కంటే, చావడమే మేలు అనిపిస్తుంది” అన్నాడు.

“కానీ మనం ఎలా బ్రతకగలం” అని వారు ప్రశ్నలు కొనసాగించారు .

“నేను ఎప్పుడైనా ఏదైనా సాధించ గలను. ఎంత దూరమైనా నా పిల్లలపై ఎటువంటి భారాన్ని నేను మోపను” అని అతడు ఉదాసీనంగా సమాధానం చెప్పాడు.

ఆ సమయంలో వారు ఎవరు ఏమీ మాట్లాడలేదు.

ఆ రాత్రి సూపర్వైజర్ కూడా సోమ్లాకు నచ్చ చెప్పడానికి వచ్చాడు. అతడు రెండు మెరిసే వెండి రూపాయలను సోమ్లాకు ఇచ్చి, “ఇదిగో ఇది తీసుకో, నీ ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టుకో, నువ్వు కూడా ఇక్కడే ఉండు. నీకోసం పని నేను ఏర్పాటు చేస్తాను. కానీ, సాలీ, మాలీలను ఇంటికి తీసుకుపోయి కొత్త కష్టాలు ఎందుకు తెచ్చుకుంటావు” అన్నాడు.

అక్కాచెల్లెళ్ళు ఇద్దరూ అతని మాటలను ఆతృతగా సమర్ధించారు. ఒక నిమిషం తండ్రి కూడా దానికి ఆశపడ్డాడు. రెండు రూపాయలు అంటే చాలా పెద్ద మొత్తమే. అతన్ని చూస్తే దయగలవాడు, బుద్ధిమంతుడు లాగా ఉన్నాడు, అతను వేసుకున్న బట్టలను బట్టి అధికారిలా కనిపిస్తున్నాడు అయినా తామున్న ఆ చిన్నగుడిసె లోనికి వచ్చి, తమ బాధల గురించి మాట్లాడడానికి వెనుకాడడం లేదు. అతని ముందు వినయంగా వంగి “మీరు దయ కలవారు స్వామీ! కానీ నా బిడ్డలను ఇంటికి వెళ్ళడానికి అనుమతించండి. నేను ఇక్కడ ఉండి వారు చేసే పని నేను చేస్తాను. వారు ఈ వర్షంలో అంత కఠినమైన పని చెయ్యలేరు అనారోగ్యం పాలవుతారు. వారిని ఇంటికి వెళ్ళేందుకు అనుమతి.ఇవ్వండి” అని ప్రార్థించాడు సోమ్లా.

సూపర్వైజర్ గంభీరంగా సిగరెట్టు పొగను పీల్చి వదులుతూ “నువ్వు చెప్పినట్టు చేసేటట్లయితే, ఇక్కడ పనిచేస్తున్న యువతులనందరిని ఇంటికి పంపి, నీవంటి వృద్ధులను మాత్రమే ఉంచాలి. కాంట్రాక్టర్ నీలాంటి ఎముకల సంచులకు డబ్బు ఖర్చు పెడతాడని అనుకుంటున్నావా ? నువ్వు” అన్నాడు.

ఆ మాట సోమ్లాని పొడిచినట్టు అయింది.

” నీకు నేను ముసలి వాడిలా కనిపిస్తున్నా కదా! అయితే సరైన భోజనం లేనందున ఇలా ఉన్నాను. కానీ నాతో సమానంగా నీ మనుషుల్లో ఎవరు పని చేయగలరు, చూపించు” అన్నాడు సోమ్లా.

సూపర్వైజర్ అన్నాడు “అయినప్పటికీ, నువ్వు ఇంటికి వెళ్లడం మంచిది. నీ బిడ్డల గురించి బాధపడనవసరం లేదు. వారిని ఆకలితో చావడం చూడాలనుకుంటున్నావా? అంతా బాగానే ఉన్నారు కదా?”

కానీ ఆ వృద్ధుడు తన మనసు మార్చుకోలేదు అతని మాటలను మధ్యలోనే ఆపేసి,

“నేను దానిని అంగీకరించను” అన్నాడు. సూపర్వైజర్ కి తెలుసు, కొండ ప్రాంతం మనుషులు ఒక్కసారి మొదలు పెడితే అనుకున్నది సాధించే వరకు వాదిస్తూనే ఉంటారు. బలవంతంగా వారితో ఏమి చేయించలేము. అతడు ముఖం తిప్పుకొని బయటికి వెళ్లిపోయాడు.

తండ్రి బిడ్డలతో మళ్ళీ మాట్లాడడం మొదలుపెట్టాడు. అతనికి కష్టాలు నష్టాలు గురించి తెలుసు. కానీ వ్యవసాయానికి కాకుండా వేరే పనులు తన బిడ్డల చేయడం అంగీకారం కాదు. పరజజాతి యువతులు తన తండ్రి కోసం తన భర్త కోసం మాత్రమే పని చేయాలి. సోమ్లా కొన్ని సంవత్సరాలుగా పంట పండిస్తున్నాడు. అది తన సొంత శక్తితో పాటు తమ పూర్వీకులు అందించే ఆశీర్వాదం అని అతడు భావిస్తున్నాడు. తన బిడ్డలు ఆ రోడ్డు పనుల్లో పనిచేయడం అతని దృష్టిలో గౌరవం కాదు, మర్యాద కాదు.

“ఇటువంటి జీవితానికి సిగ్గుపడాలి” అన్నాడు.

“ఎందుకు ?” అంటూ వాదించారు అతని బిడ్డలు.

“ఇటువంటి పనిలో ఏమి తప్పు ఉన్నది” అన్నారు. కానీ తండ్రి వారి వాదనకు లొంగ లేదు. అతనికి తెలుసు నవతరం వాదించడంలో ఆనందం పొందుతారని.

“వద్దు, ఇదే చివరి మాట. నాకు డబ్బులు వద్దు. ఏదో ఒక రకంగా మనం మనల్ని పోషించుకుందాం. మన ఇంటికి పోదాం” అన్నాడు.

అంతటితో ఆ సమస్య పరిష్కారమైంది.

గాయపడ్డ మనసులతో అయిష్టంగా, సాలీ మాలీ తమకు సంబంధించిన వస్తువులన్నింటినీ మూటగట్టుకొని, తలపై మోస్తూ ఇంటి దారి పట్టారు. తండ్రి వెనుక. వారు రోడ్డు పని క్యాంపు వదిలి వెళ్లడానికి బాధపడ్డారు. ఇంకా తమ గుడిసె దగ్గర నాటిన సొర, బీర, గుమ్మడి పాదులు తీగలు పాకుతున్నాయి. మల్లె మొక్క పరిమళాలతో చిన్నచిన్న మొగ్గలను అప్పుడే మొదలు పెట్టింది.

*** *** *** *** *** ***

సాలీ, మాలీలు పాత పద్ధతులకు అలవాటు పడడానికి ప్రయత్నించారు. ఇంటిదగ్గర జీవితం ఇంతకు ముందులా లేదు. సాయంకాలాలు వారు చాలా అశాంతిగా అస్పష్టమైన ఆశలతో ఉంటున్నారు. వారు రోడ్డు పని దగ్గర ఉన్నప్పుడు అలంకరించుకున్న విధంగా చక్కటి బట్టలు కట్టుకొని ఆనందిస్తున్నారు. కానీ రాత్రి గడిచిన కొద్దీ వారిని నిస్పృహ, అలసట వేధిస్తోంది. మౌనంగా కింద పడుకుని నిద్ర పోతున్నారు. చాలా అరుదుగా యువతులు ఉండే డార్మిటరీకి వెళ్తున్నారు.

కానీ, సోమ్లా మాత్రం ఆనందంగా ఉన్నాడు. ఇంతకుముందు చేసిన పని కంటే రెండింతల పని చేస్తున్నాడు. అతను పూర్తిగా అలసట లేకుండా ఉన్నాడు. ముందు అతడు తన ఇంటిని మరమ్మత్తు చేయాలనుకున్నాడు. అది అంత సులభమైన పని కాదు. ఇంటికప్పు వరిగడ్డితో కప్పాలి పంటకోత అయిపోయిన తర్వాత దానికోసం వెతకడం చాలా కష్టం. వరిగడ్డి దొరకనప్పుడు అడవిలో దొరికే రక్కసి గడ్డితో ఇళ్ల కప్పులు వేస్తారు. అది కూడా పంటకు వచ్చి ఎండే వరకు దానిని ఉపయోగించడం సాధ్యం కాదు. చివరకు ఏదో రకంగా సోమ్లా తన ఇంటి పైకప్పు మరమ్మత్తు చేశాడు. ఇప్పుడు సమస్య తన కుటుంబానికి ఆహారాన్ని వెతుక్కోవడం.

అతడు తన గ్రామ పెద్ద దగ్గరకు వెళ్లాడు.

“నీకు తెలుసు. నా భూములు తనకా పెట్టి వున్నాయి. కాబట్టి నాకు కొంత భూమిని ఏర్పాటు చేసినట్టయితే, సేద్యం చేసుకొని నా కుటుంబం బతుకు తాము. పొలము అద్దెను క్రమంగా తప్పకుండా చెల్లిస్తాను. నువ్వు చేసే సహాయానికి, నా పిల్లలు ఎప్పటికీ కృతజ్ఞత కలిగి ఉంటారు” అని అన్నాడు.

గ్రామపెద్ద సోమ్లాకు సహాయం చేస్తానని మాట ఇచ్చాడు. కానీ ఆగ్రామానికి సంబంధించిన భూమి అందుబాటులో లేదు. తమ గ్రామానికి దగ్గరలో ఒక చిన్నఊరి దగ్గర భూమి అతి త్వరలో తన అధికార ఆధీనంలోకి వస్తుందని, అప్పుడు ఇవ్వడానికి ప్రయత్నిస్తాను అని చెప్పాడు.

 

ఈ మధ్యకాలంలో పక్కవారి పొలాల్లో విత్తనాలు నాటడానికి, కలుపు తీయడానికి సాలీ, మాలీతో కలిసి కూలికి వెళ్ళాడు. రోజంతా పనిచేసి సాయంత్రానికి కొంత మాండ్యా ధాన్యం, కొన్ని రాగి నాణాలను పొందగలిగారు.

ఇతరుల పొలాల్లో పనిచేస్తున్నప్పుడు అతనికి తన సొంత భూములు గుర్తుకు వచ్చేవి. అవి కూడా పక్కనే ఉండేవి. అతి త్వరలో షావుకారు అందులో సేద్యం మొదలుపెడతాడు. సమయం దొరికినప్పుడు వెళ్లి తన పొలాల పక్కన కూర్చొని అన్యమనస్కంగా అక్కడ మొలిచిన కలుపు మొక్కలు అన్నింటిని తొలగించేవాడు. ఆ పొలం తనకా పెట్టిందని గుర్తుకు వచ్చే వరకు అందులో పని చేసేవాడు.

వాస్తవాన్ని గుర్తించే సరికి. అతడు తనకు వయసు పైబడినట్టు అతని కళ్ళు మసకబారేవి. తీవ్రంగా ఆలోచిస్తూ కూర్చునేవాడు. అతని నుదురు ముడతలు పడి, తల బరువెక్కి కిందకు వంచుకునే వాడు. కళ్ళు మసక బారి కన్నీళ్లు కాలువలు కట్టేవి. ఎవరైనా చూస్తున్నారేమోనని చుట్టూ చూసి కళ్ళు తుడుచుకునే వాడు.

*** *** *** *** **** ***

రోడ్డు పనిలో ఉన్న అప్పటి అనుభవాలు సాలీ, మాలీలను చాలా సన్నిహితం చేశాయి. ఇంటికి వచ్చిన కొన్ని రోజుల వరకు వారు మౌనంగా పనిచేస్తూ విచారంగా ముఖాలు ముడుచుకుని ఉండేవారు. తర్వాత కొన్ని రోజులకు పని చేస్తూ చేస్తూ ఒక్కసారిగా నవ్వులతో మామూలు అయిపోయారు. అప్పుడప్పుడు వారు పనిచేస్తున్నప్పుడు అశాంతిగా విశ్రాంతిలేనట్టుగా అనిపించినప్పుడు పనిని ఆపి, రోడ్డు పనిలో విషయాలను గుర్తు తెచ్చుకొని నవ్వుకునే వారు.

కాక్లా వారిద్దరిని మొండిగా అనుసరిస్తూ ఉండేవాడు. అతడిని వారు అపహాస్యం చేసే వారు. సాలీ తనకోసం పూలు కోసితెమ్మని ఆజ్ఞ వేసేది.

మాలీ మామూలుగా “సాయంత్రం మా ఇంటికి రాగలవా” అని అడిగేది. అతడి ముఖం వెలిగిపోయేది. అక్కా చెల్లెళ్ళు ఇద్దరూ దొర్లి దొర్లి నవ్వుకునే వారు. అతడు ఎప్పుడూ వారి చుట్టూ వేలాడుతూ తిరుగుతూ ఉండేవాడు. వారికి కావలసిన చిన్న చిన్న పనులను వినయంగా చేసేందుకు ఆనందంగా పరిగెత్తే వాడు.

ఒకరోజు సాయంత్రం వారంతా పని నుండి ఇంటికి తిరుగుముఖం పట్టారు. ఆకాశం ఉన్నట్టుండి మంచుతో మూసుకుపోయింది. మిగిలిన వారంతా రక్షణ కోసం పరుగులు పెట్టారు. కాక్లా, సాలీ మాలీల వెంట ఉన్నాడు. వారు ముగ్గురు విశాలంగా ఉన్న పెద్ద మర్రి చెట్టు కిందికి చేరారు.

“నా కాళ్లు నొప్పి పెడుతున్నాయి. నేను ఇంత కంటే పరిగెత్తే లేను” అన్నది సాలీ. వారు చెట్టు కింద కూర్చున్నారు.

“కాక్లా నా కాలికి ముల్లు గుచ్చుకున్నది. కొంచెం చూడవా” అని సాలీ అడిగింది. అతడు ఆమె కాలిని చేతిలోకి తీసుకొని పరిశీలించాడు. కాలిలో ఉన్న ముల్లును తీసేశాడు.

సాలీ ఇప్పుడు కొంచెం నొప్పి తగ్గింది అన్నది.

మళ్లీ సన్నటి జల్లు మొదలైంది.

“కాక్లా నాకు చలేస్తున్నది. నీ వద్ద ఉన్న వస్త్రాన్ని మాపై కప్పవా ” అని సాలీ అడిగింది. అతడిపై చుట్టుకున్న నూలు వస్త్రాన్ని తీసి వారిద్దరి మధ్య కావు నిలబడి ముగ్గురికి కలిపి కప్పుకొని, దగ్గరగా కలిసి నడవడం మొదలు పెట్టారు తమ ఇంటి వైపు. సాలీ, మాలీ ముసిముసి నవ్వులు నవ్వుతూ నడిచారు.

“మా లో ఎవరిని వధువుగా ఎంపిక చేసుకుంటావు, కాక్లా నాకు చెప్పు” అని అడిగింది సాలీ.

కాక్లా చాలా ఇబ్బంది పడ్డాడు.

“వద్దు వద్దు, మీరు అటువంటి మాటలు మాట్లాడవద్దు” అన్నాడు.

“పర్వాలేదు చెప్పు. సిగ్గు పడాల్సిన అవసరం లేదు. మాతో చెప్పు” అంటూ వారు కొనసాగించారు.

అమ్మాయిలు ఇద్దరు నవ్వుతూ ఊగిపోయారు. కాక్లా కూడా వారితో పాటు నవ్వాడు.

వారు ఇంటికి చేరారు కాక్లా ధైర్యంగా వారిని అతుక్కొని ఉన్నాడు. వారి అవహేళనలను అతను లెక్కచేయ లేదు, నిరాశ చెందలేదు.

*** *** *** *** *** *** ***

సోమ్లా చివరకు గ్రామపెద్దను ఒప్పించగలిగాడు. సొంతయజమాని లేని భూమిని అతడికి అప్పగించేందుకు. ఆ భూమి ఊరికి దూరంగా ఉన్నది. అయినప్పటికీ ఒక చిన్న ఊరికి దగ్గరలో ఉన్నది. అది ఇంతకుముందు సేద్యానికి దున్ననిది. కొండ పైభాగంలో ఉన్నది. ఆ భూమి నిండా పొదలు, తుప్పలు పలుచగా ఉన్నాయి. దానిలో పండే పంటను సోమ్లా అంచనా వేశాడు. (20బషెల్స్ అంటే) 160 గాలన్ల మాండియా ధాన్యాన్ని, కొద్దిగా కష్టపడితే పండించవచ్చు అనుకున్నాడు. పై భాగంలో కందులు, మిరపకాయలు పండుతాయి. అక్కడ పొదలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ముందు షరతుల ప్రకారం వాటన్నింటినీ తొలగించాల్సి ఉన్నది.

తనకిచ్చిన భూమిచుట్టూ విస్తారంగా అడవి పెరిగి ఉన్నది. అడవి తనను ఆహ్వానించినట్టు అనిపించింది అతనికి. అక్కడ చిరుధాన్యాలను పండించవచ్చు అది సారవంతమైన నేల అక్కడ ఉన్న చెట్లను నరక వచ్చు. కానీ ఫారెస్ట్ గాడ్ పట్టుకుంటాడని భయం. అయినా ఏం చేస్తాడు? అక్కడ విలువైన చెట్లు ఏమీ లేవు, బూరుగు చెట్లు సాల్ వంటివి లేవు అక్కడ. ఉన్నదంతా పనికిరాని తుప్పలు పొదలు అదంతా శుభ్రం చేయమని ఎవరు అతను బలవంతపెట్టారు. ఎందుకు అనవసరంగా ఫారెస్ట్ గార్డ్ తో గొడవ అనుకున్నాడు.

కానీ అతడు ఒంటరివాడు కూలి మనుషుల్ని పెట్టుకోలేడు. అక్కడున్న చెత్తను శుభ్రం చేయడం కష్టమే. కానీ వాటన్నిటికీ అంగీకరించిన తర్వాతే గ్రామ పెద్ద తనకు ఆ భూమిని కేటాయించాడు.

పక్కనే ఐదుగురు కొండ జాతి వారు నివసిస్తున్నారు. చెట్లు నరకడం వాటిని కాల్చడం అడవిలో సేద్యం చేయడం వంటి పనులలో కొండ జాతి వారిని మించిన నిపుణులు ఉండరు. తనకు ఒకరు తోడుంటే సరిపోతుంది. కానీ ఇద్దరు కొండ జాతి వారిని సాయం అడుగుదాం అనుకున్నాడు. అయితే ఒకరికి పని లేనప్పుడు మరొకరి సేద్యంలో సాయం చేయడం కొండజాతి తెగలలో సర్వసాధారణం. అక్కడ అ పని చేసినందుకు వేతనం చెల్లించడం ఉండదు.

కానీ ఇప్పుడు పరిస్థితి వేరు తాను వారి పనిలో సాయం చేయలేడు. కాబట్టి కొండ జాతి వారిని తన పనికి సాయం చేయమనే హక్కు తనకు లేదు.

*** *** *** *** ***

పరజజాతిలో ఒక తండ్రికి పెళ్లి గాని అమ్మాయిలు ఉంటే అతడికి సంపదను సమకూర్చుకోవడానికి మంచి అవకాశం ఉంటుంది. ఎందుకంటే కన్యాశుల్కం కింద కొంత డబ్బు వస్తుంది ఏదో ఒక రోజున. సోమ్లాకి ఇద్దరు పెళ్లివయసుకు వచ్చిన అమ్మాయిలు ఉన్నారు. కానీ వారిని పెళ్లి కొరకు అర్ధించే యువకులు ఇంతవరకు రాలేదు. సేద్యం మొదలు పెట్టడానికి ముందే తన బిడ్డలకు వివాహం చేసి పంపాలని సోమ్లా భావిస్తున్నాడు. తన పొలంలో తాను సొంతగా నిలబడి పని చేయాలనుకుంటున్నాడు. కానీ కన్యాశుల్కం ఇస్తానంటూ పెళ్ళికొడుకు ఎవరూ రావడం లేదు.

అతడు ఏదో ఒకటి చేయాలనుకున్నాడు. అతని ఇద్దరు కొడుకులు గోటీలుగా ఉన్నారు. అందుకని తన బిడ్డలను యువతుల డార్మెటరీకి వెళ్ళమని, సామూహిక నృత్యాలలో పాల్గొనమని వారిని ప్రోత్సహించాడు. అలా పంపడానికి వారి వెంట తోడుగా వెళ్లేవాడు. అప్పడప్పుడు వారాంతపు సంతకు వెళ్లి పొగాకు, కిరసనాయిలు తెమ్మని, తన బిడ్డలకు చెప్పేవాడు. ఇటువంటివి తేవడానికి ఇంకెవరు ఉన్నారని, వారితో అనేవాడు.

తన బిడ్డలను ఆనందంగా ఉంచడానికి ప్రయత్నం చేసేవాడు. మంచి దుస్తులు వేసుకోమని చెప్పేవాడు. తల దువ్వు కొమ్మని, మీ అమ్మ ఉంటే ఇలా మిమ్మల్ని చింపిరి జుట్టుతో చూసేదా? అని ప్రతిదానికి వాళ్ళ అమ్మను గుర్తు చేస్తూ వారిని నిపుణులుగా, అనుభవజ్ఞులుగా తీర్చిదిద్దడానికి ప్రయత్నించేవాడు.

“అయినా నేనేమి చెప్పగలను. ఒక ముసలి ఎద్దు లాంటివాడిని. నాకు ఏమి తెలుసు. మీరు ఎదిగిపోయారు. మీ అమ్మ ఉంటే మీ బాధ్యత తీసుకునేది” అంటూ బాధపడుతూ ఉండేవాడు.

అతడు వారి తల్లి గురించి మాట్లాడుతున్నప్పుడు అతని గొంతు వణికేది. కళ్ల వెంట నీళ్లుకారేవి. బిడ్డలిద్దరూ తన తండ్రి గురించి,

“మన తండ్రి వృద్ధుడు అయిపోయాడు” అనుకునేవారు. ఆ విధంగా అతని ప్రయత్నాలు వృధా అయ్యేవి.

అటువంటి సమయాల్లో కాక్లాపరజ వచ్చేవాడు. నెమ్మదిగా… “ఎందుకు అమ్మాయిలు విషాదంగా ఉన్నారు” అని అడిగేవాడు.

“నువ్వు ఊహించ లేవా? ఎందుకంటే మమ్మల్ని చూడడానికి నువ్వు రాలేదని” అంటూ మాలీ పడి పడి నవ్వేది. నవ్వీ నవ్వీ వాళ్ళ కళ్ళవెంట నీళ్ళు వచ్చేవి.

**** *** *** ****

మేఘాలు గుంపులుగా ఆకాశంలో కనుచూపుమేర చుట్టుకొని ఉన్నాయి. మబ్బులన్నీ కలిసి ఒక వాయిద్యగోస్టి వలె వర్షాన్ని ఎడతెగకుండా కురిపిస్తున్నాయి. అది జూలై నెల.

చీకటికి భంగం కలగకుండా సూర్యుడు రాలేదు. ఆ చీకట్లో ఒకరికొకరు కనబడటం లేదు. చిన్న నల్లటి చుక్క బొట్లవలె పర్వత శిఖరాల మీద కనిపిస్తున్నారు కొందరు ఒంటరిగా, కొందరు గుంపులుగా. నల్లగా చిమ్మిన బురద, చెట్లమీద, అడవిలో దూరం నుండి చూసేవారికి రాళ్లకు, కట్టెమొద్దులకు, బురదమట్టి కుప్పలకు తేడా తెలియడం లేదు. వికృతమైన నీడలు పైకి లేచి ఆ బురదలో గాలికి గిర గిర తిరుగుతున్నాయి. ఆవిర్లు మేఘాలుగా మారుతూ కనిపించని వారెవరో గుర్రపుస్వారీ చేస్తున్నట్టు కల్లోలంగా ఉంది ఆకాశం. ఆ సమయంలో కొత్తమేఘ సమూహాలు వెనుకకు తగ్గి అదృశ్యం అవుతున్నాయి.

వర్షం తబలా వాయిస్తున్నట్టు, వాటికి ఆ కొండలపై సమాధానం చెబుతూ దబదబ మంటూ పారలు, కాపిస్కులు కలిసి కొండలను తవ్వుతూ పంటకు అనుగుణంగా నేలను మారుస్తూన్నాయి. వాటి కింద సమతలంగా ఏర్పడిన పొలాలు చాలా దూరం లోయల వైపు వ్యాపించి ఉన్నాయి. గ్రామాలు, నివాస భూములతో నిండిపోయి ఉంది. రకరకాల మోటైన వర్షపు దుస్తులు ధరించి వారు వారి పొలాల్లో పని చేస్తున్నారు. కొందరు కలుపుమొక్కలను పీకేసి నాటు వేయడానికి మడులను తయారు చేస్తున్నారు. చాలా వరకు ఆ పొలాలకు యజమానులు సుంధీలు , కుముటీలు. వారంతా వడ్డీ వ్యాపారులు, ఇతర వ్యాపారాలు చేసేవారు. వాటిలో కొందరు గిరిజనులు మాత్రం సొంత భూములలో పనిచేస్తున్నారు.

అక్కడ ఒక కొండ శిఖరం పైన బల్లి అతుక్కున్నట్టుగా కొందరు మనుషులు ఒక చిన్న నేల ముక్కను ఎంపిక చేసుకొని పని చేస్తున్నారు. వారంతా భూములు కోల్పోయిన వారు. వారికి ఏమీ మిగల్లేదు. కొండ లోయల్లో నివాస ప్రాంతాలకు దిగువన ఎవరు సిద్ధం చేయని నేలను వారు సేద్యం చేస్తారు. అయినప్పటికీ వరదలో ఒక భాగమైన వారికి తోడు సహచరులుగా డేగలు, కొండ గద్దలు. వెంటాడే ఏకాంత ఆత్మలు కొండల్లో కార్మికులు చూస్తూ ఉంటారు. అక్కడి గాలి ఈ జన్మకు మరో జన్మకు మధ్య వంతెనగా ఉన్న ఎత్తులను తుడిపేస్తూ ఉంటుందని వారు ఖచ్చితంగా నమ్ముతారు. వరద నీరువారి చెవుల్లో గర్జిస్తోంది. వారి ఆలోచనలన్నింటినీ చెదర కొడుతూ కేవలం పని జరిగేలా చేస్తోంది. వారి ఆశలు పెరిగి ఆకాశంలో చిత్రాల్లా కనిపిస్తున్నాయి. అవి చాలా స్వేచ్ఛగా ఉన్నాయి.

సోమ్లా తన బిడ్డలను లోయలో పనిచేయడానికి పంపాడు. తను కొండపై పనిచేస్తున్నాడు. వర్షపు చినుకులు అచ్ఛాదన లేని అతని శరీరంపై పొడుచుకుంటూ ఉంటే పరవశం చెందుతున్నాడు. ఇదే అతడికి తెలిసిన అతడు ఇష్టపడే జీవితం. కానీ కొన్ని రోజులు దాని రుచి అతడు మర్చిపోయాడు. ఇప్పుడు తిరిగి తన గ్రామంలో ఆ కొండలలో అనుభవించ గలుగుతున్నాడు. రోజులు గడుస్తున్న కొద్దీ చాలా కష్టపడి పని చేస్తున్నాడు. అతడు ఏకాకి. కానీ అతనికి చింతించే సమయమే లేదు. అతని ముందు నల్లటి మేఘాలు చుట్టుకొని పోరుకు సిద్ధంగా ఉన్నాయి. ఆకాశం నీలము ఆకుపచ్చ రంగుల మిశ్రమంతో, ఇంకా ఇనుప బూడిదరంగు పులుముకున్నట్టుగా ఉన్నది. పప్పుధాన్యాల పొలాలన్నీ చారికలు చారికలుగా కనిపిస్తున్నాయి. పగటి వెలుతురు లేక సమయాన్ని కొలవడానికి అలవాటు పడిన నీడలు కనిపించడం లేదు.

అటువంటి ఒక రోజు మేఘాలన్నీ ఉరుముతూ ఉండగా, డుంబగూడ గ్రామం నుండి నంద్యా పరజ అనే యువకుడు తనకోసం వధువును వెతకడానికి బయలుదేరాడు. అతని భుజం మీద ఒక ఎదురుబద్ద చివరన అతని వస్తువుల మూట ఉన్నది. అతడు ఒంటరి యువకుడు. అతని తల్లిదండ్రులు మరణించారు. తండ్రి గత సంవత్సరమే దూరం అయ్యాడు. అతడికి భూమి లేదు, బాధ్యతలు లేవు గృహ సంబంధమైన బాదరబందీలేవీ లేవు. అతడికి సొంత ఆస్తి ఏమీ లేదు. కానీ దృడంగా బలిష్టమైన శరీరం ఉంది. మొదటి వాన కురిసినప్పుడు వివాహం చేసుకోవాలని అతడు నిర్ణయించుకున్నాడు. కానీ నిరుపేద యువకులు భర్తలుగా మారడం కష్టం. అతడు తన ఊరిని వదలాలని నిర్ణయించుకున్నాడు. వర్షంలో కొండ ప్రాంతాల్లో తిరుగుతూ తనకోసం నిర్దేశించబడిన అమ్మాయి కోసం వెతుకుతున్నాడు. ఆమె కనిపించగానే తనకు తాను ఆమె తండ్రికి గోటీగా కన్యాశుల్కం చెల్లించే వరకు పనిచేస్తానని చెప్పాలనుకున్నాడు.

అతడికి నాలుగుపంచ గుడ్డలతో పాటు, తాగడానికి ఒక చౌకబారు రాతెండి కప్పు, మూడు సొరకాయబుర్ర ఫ్లాస్కులు, ఒక వెదురు చేతికర్ర, ఒక డుంగుడుంగా ఉన్నాయి. ఇవి కాక కొంత మాండ్యా పిండి వండుకు తినడానికి. ఇది అతనికి ఉన్న ఆస్తులు. ఒక పెద్ద ఊరిలో పరజా కుటుంబాలు ఉన్న ఊరిలో ప్రవేశించినప్పుడు, ఒకటి రెండు రోజులు అక్కడ ఆగి గిరిజన కుటుంబాలను అడిగేవాడు. “ఎవరైనా తమ బిడ్డలకు పెళ్లి చేయాలనుకుంటే. వారి తండ్రికి నేను గోటీగా మారడానికి సిద్ధంగా ఉన్నాను” అని చెప్పేవాడు. సాయంత్రాలు యువతులు ఉండే డార్మెటరీ తలుపుల ముందు నిలబడి వంగి చూసే వాడు, అతని భుజం పై బరువును మోస్తూ. కొన్నిసార్లు డుంగుడుంగా తీసి వేళ్ళతో మీటుతూ సంబంధించిన వారికి ప్రకటించే వాడు. ఎవరికైనా వరుడు కావాలా అంటూ.

కానీ ఫలితం లేకపోయింది. అతడు ప్రాధాన్యతగల వాడిగా కనిపించలేదు. అతని తలపై తలపాగా లేదు. శరీరంపై సరైన దుస్తులు లేవు. అతడు అక్కడి నుండి నడుస్తూ ముందుకు సాగే వాడు.

అతని వద్ద ఉన్న మాండ్య పిండి అయిపోయినప్పుడు. ఎవరి దగ్గరైనా పనిచేసి కొంత డబ్బు సంపాదించుకుని, తిరిగి ప్రయాణం సాగించేవాడు. ఇంటినుండి బయలుదేరి ఒక పదిహేను రోజులు తిరిగిన తర్వాత, ఒక గ్రామంలో సోమ్లా, అతనిఇద్దరు కుమార్తెల గురించి విన్నాడతడు. ఆరోజు రాత్రి ‘సార్గిగూడా’లో పడుకొని. మరుసటి రోజు పొద్దున్నే ‘సరసుపదార్’ కు బయలుదేరాడు.

దారిలో సోమ్లా ఇంటికి దారి అడుగుతూ వచ్చాడు. అతడు ఇంటికి వచ్చేసరికి, ఇంట్లో ఎవరూ లేరు. అతడు బయట వరండాలో కూర్చుని వేచి ఉన్నాడు. తరువాత మాలీ కనిపించింది. ఆమె తన పొలంలో పని చేస్తూ తనకూ సాలీకి భోజనం తీసుకుపోవడానికి ఇంటికి వచ్చింది.

‘నంద్యా’, మాలీ ఒకరి నొకరు తల నుండి కాలి వరకు చూసుకున్నారు. అతడు నవ్వుతూ తన భుజంపై ఉన్న ఎదురుబద్ద నుండి డుంగుడుంగా తీసి వేళ్ళతో మీటాడు.

“నువ్వు ఎవరు ? నీకు ఏమి కావాలి?” అని మాలీ అతనిని అడిగింది.

“నేను నీకోసం వెతుకుతూ వచ్చాను ప్రియతమా, నేను నీ వరుడిని” అన్నాడు.

ఆమె అసంతృప్తితో, సమాధానం చెప్పకుండా ఇంటి లోపలికి పోయింది. తమకు కావలసిన భోజనాన్ని తీసుకుని తిరిగి పొలాల్లోకి నడవడం మొదలు పెట్టింది. నంద్యా అరుస్తూ ఆమెను అనుసరించాడు.

“ఓ అమ్మాయి నా మాట విను. నీకు కోపం వచ్చినట్టుంది” అంటూ పరుగెత్తాడు.

ఆమెను చేరుకున్న తర్వాత ఆమె పక్కన నడుస్తూ.

“నీ మూటను కూడా నేను మోస్తాను, ఇవ్వూ” అన్నాడు. తనభుజం మీద ఉన్న బరువును చూపిస్తూ, “చూడు నేనెంత బరువు మోస్తూన్నానో, అందులో నీ మూట నాకు బరువు కాదు. నీ బరువు కూడా నాకు ఇవ్వు” అన్నాడు.

ఆ తర్వాత అర్థవంతంగా “మీ నాన్న ఎక్కడున్నాడు, నాకోసం అతనిని పిలవకూడదా?” అన్నాడు. మాలీ నవ్వింది. నంద్యా రాగాన్ని అందుకున్నాడు:

“రా మనం చేతులు కలుపుదాం

మన ఆటలు ఆడుదాం”

“నీకు తెలుసా? ఈ వర్షంలో నీకోసం ఎంత దూరం నుండి వచ్చానో” అన్నాడు.

తర్వాత ఒక మూట విప్పి ఆమెకు మిఠాయిలు ఇచ్చాడు. ఆమె తీసుకున్నది.

ఎక్కడయినా అమ్మాయిలు అమ్మాయిలే , మిఠాయిలు మిఠాయిలే. అవి చాక్లెట్లైనా, కాండీలైనా లేదా పాకంలో ముంచిన బియ్యం పిండి మురుకులైనా ఒకటే.

ఆ తర్వాత మాలీ సిగ్గుపడడం ఆపి. తన తండ్రి ఎక్కడున్నాడో చెప్పింది.

” మరిన్న మిఠాయిలతో మళ్ళీ వచ్చి నిన్ను కలుస్తాను” అని చెప్పి. నంద్యా ముందుకు నడిచాడు

సోమ్లా కొండపైన పని చేసుకుంటూ ఉన్నాడు. అక్కడికి ‘నంద్యా’ వచ్చాడు.

“ఒక్కరు చేసేకంటే, ఇద్దరు కలిసి పని చేస్తే మంచిది. నా దగ్గర నా సొంత పారలేదు. మనిద్దరం పక్కపక్కనే కలిసి పని చేయడానికి. కనుక నీ గొడ్డలిని నాకు ఇచ్చి, నువ్వు విశ్రాంతి తీసుకో. నేనెంత వేగంగా నేలను తవ్వుతానో చూస్తూ ఉండు” అన్నాడు.

సోమ్లా ఆశ్చర్యంగా చూస్తూ సమాధానం చెప్పేలోపే నంద్యా తన శరీరంపై ఉన్న తాటాకుల ‘వాన కోటును తొలగించి, తన సామాన్ల కావడిని పక్కనపెట్టి. అతని చేతిలో ఉన్న గొడ్డలి తీసుకుని నేలను తవ్వడం మొదలు పెట్టాడు. అచ్చాదన లేని అతని ఉబ్బిన కండరాలు, బలిష్టమైన భుజాలు తేలికగా ఒక లయగా కదులుతున్నాయి. అతడు ఒక్కసారి కూడా సోమ్లా వైపు తిరిగి చూడలేదు. సోమ్లా పొగాకును నములుతూ, నవ్వుతూ ఆ యువకుని పనిని చూస్తూ ఉన్నాడు. ఇంత విశాలమైన బలిష్టమైన యువకుణ్ణి పెంచింది ఎవరో అనుకున్నాడు. అతడు ఆ రాతినేలను వేగంగా బలంగా తవ్వడం కొనసాగించాడు.

“సరే నువ్వు మంచి పనిమంతుడవు. గొడ్డలితో నేలను తవ్వడంలో, కానీ రోజంతా నా పని చేయడానికి కుదరదు. ఆ గొడ్డలి నాకు వెనక్కి ఇచ్చెయ్యి” అన్నాడు సోమ్లా.

నంద్యా పని ఆపకుండా “ఎందుకు చేయకూడదు. నేను నీ గోటీని” అంటూ అతి సాధారణంగా అతని భుజాలపై నుండి చూసి, పని కొనసాగించాడు.

సోమ్లా ఆశ్చర్యంగా “ఏమన్నావు నువ్వు” అన్నాడు. నంద్యా గొడ్డలి కింద పడేసి, అతనికి దగ్గరగా వచ్చి, ఆ వృద్ధుని ఎదురుగా నిలబడ్డాడు.

అతని వైపు సూటిగా చూస్తూ తన గురించి చెప్పాడు. అతని ఊరు, అతని పూర్వీకులు, అతని గురించి అంతా వివరించి. తన కోసం వధువును వెతుక్కుంటూ సోమ్లా ఊరికి వచ్చినట్టు మాలీని కలిసి, ఆమెను ఎంపిక చేసుకున్నట్టు. కన్యాశుల్కంగా చెల్లించవలసిన డబ్బును గోటిగా మారి పనిచేసి తీర్చుకుంటానని, చాలా మామూలుగా సూటిగా చెప్పాడు .

ఆ వృద్ధుడు అంతా విన్న తర్వాత “సరే కానీ, నువ్వు నీ వధువుగా సాలీని ఎంపిక చేసుకుంటే బాగుండేది. ఆమె మాలీ కంటే పెద్దది” అన్నాడు. నంద్యా ఉదాసీనంగా మారి “మీకు చెప్పవలసినది చెప్పాను. నిర్ణయించ వలసినది మీరు. ముందుగా నేను మాలీని చూశాను. ఆమెను ఎంపిక చేసుకున్నాను” అన్నాడు.

సోమ్లా నుదురు ముడివేసి ఆలోచనలో పడ్డాడు. ఒక వృద్ధుడు ఒక యువకుడు కొండ శిఖరంపై ఒకరికి ఒకరు అభిముఖంగా నిలబడ్డారు. పక్కనే దట్టమైన అడవి లోతైన లోయలు, అంచున ఒక వరుసగా కొండలు. వంకర్లు తిరుగుతూ మెలి పెట్టినట్టుగా దూరంగా అంతం లేకుండా ఒక క్రమంలో కొండ శిఖరాలు. ఒక పొగ మేఘం వ్యాపిస్తూ తమ వైపు వచ్చి తమ వైపుగా వేగంగా వస్తున్నది. అది పాలసముద్రం చుట్టుకున్నట్టుగా కనిపిస్తున్నది. దాన్ని చూస్తున్న సోమ్లాకు ప్రపంచమంతా తన చుట్టూ కుదించుకు పోయి చివరకు ఒక చిన్న కేంద్రంగా మారి ఆలోచన కలిగించిందని అనుకున్నాడు.

అతడు తన చేతిని చాపి నంద్యాని పట్టుకున్నాడు. వారిద్దరూ ఒకరినొకరు స్నేహపూర్వకంగా ఆలింగనం చేసుకున్నారు. ఒకరికొకరు పొగాకు ఇచ్చిపుచ్చుకున్నారు. మాట్లాడకుండా నంది నంద్యా మళ్ళీ తన గొడ్డలి తీసుకుని పనిలోకి వెళ్ళాడు. సోమ్లా ఒక బండ మీద కూర్చొని అతనిని చూస్తూ ఉన్నాడు. గాలికి తేలుతూ వస్తున్న మేఘాలు వర్షం కురిపిస్తూ తమ తలలను తడుపుతూ ముందుకు పోయాయి. వర్షాన్ని అనుసరిస్తూ ఆవిరి వంటి పొగ అంతటా వ్యాపించి, చుట్టూ ఏమీ కనిపించకుండా మసకగా చేసింది.

**** *** ****

*** *** *** *

Written by Jwalitha

కవి, రచయిత, అనువాదకురాలు, ఫ్యామిలీ కౌన్సిలర్, సామాజిక కార్యకర్త, ప్రచురణకర్త, ప్రకృతి ప్రేమికురాలు, తెలంగాణ ఉద్యమ కారిణి అయిన జ్వలిత అసలు పేరు విజయకుమారి దెంచనాల.
‘బహళ’ అంతర్జాతీయ అంతర్జాల త్రైమాసిక మహిళా పత్రికను 2021నుండి నడుపుతున్నారు.
వీరి రచనలు-
కాలాన్ని జయిస్తూ నేను, సుదీర్ఘ హత్య, అగ్ని లిపి, సంగడి ముంత అనే నాలుగు కవితా సంపుటులు; ఆత్మాన్వేషణ, రూపాంతరం అనే రెండు కథల సంపుటులు; జ్వలితార్ణవాలు అనే సాహిత్య సామాజిక వ్యాసాల పుస్తకం; ఎర్రరంగు బురద, ఆత్మార్ణవం, జగన్నాటకం, ఒడిపిళ్ళు అనే నాలుగు నవలలు మొత్తం 11 పుస్తకాలు రచించారు. ముజహర్ నగర్ లో దీపావళి, ‘పరజ’ వంటి అనువాదాలతోపాటు, బహుజన కథయిత్రుల పరిచయం, మెరిసే అనువాదాలు, అనువాద నవలలు పేరుతో శీర్షికలను నిర్వహించారు.
స్వీయ సంపాదకత్వంలో ఖమ్మం కథలు, మల్లెసాల చేతివృత్తికథలు, కొత్తచూపు స్త్రీల కథలు, పరివ్యాప్త, సంఘటిత, రుంజ, కరోనా డైరీ, లేఖావలోకనం, గల్పికా తరువు, ఓరు వంటి పదో సంకలనాలను ప్రచురించారు. గాయాలే గేయాలై, పూలసింగిడి వంటి అనేక పుస్తకాలకు సహసంపాదకత్వం వహించారు.
మర్డర్ ప్రొలాంగేర్, వుండెడ్ లైవ్స్ పేరుతో వీరి కవిత్వం ఆంగ్లానువాద పుస్తకాలు వెలువడ్డాయి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

నేలతల్లి నవ్వింది 3   

మౌనానికి ఆవల….