జరిగిన కథ
మోహన్ వాళ్ళ ఇంట్లో సత్యనారాయణ వ్రతం చేస్తున్నారని రాగమాలను పిలుస్తాడు. రాగమాల వెళ్లడానికి ఇబ్బంది పడుతుంది అయినా మోహన్ బలవంతం వల్ల వాళ్ళ ఊరికి వెళ్తుంది.
అక్కడ అందరూ బాగానే పలకరిస్తారు. మోహన్ అక్క తన పెళ్లి సంబంధాల గురించి చెప్తూ బాధపడుతుంది
ఇక కథలోకి వెళ్దాం!
రాగ మాలకు వెంటనే నిద్ర పట్టింది. కానీ మధ్య రాత్రి మెలకువ వచ్చింది. కాసేపు అటు ,ఇటు చూసింది ఎక్కడుందో అర్థం కాలేదు. మెల్లిగా జ్ఞాపకం వచ్చింది మోహన్ వాళ్ళ ఊరికి వచ్చానని.
లేచి కూర్చొని, పరిసరాలను గమనించ సాగింది. ఇంటి చుట్టూ పెద్ద అరుగులు, అరుగుల చుట్టూ అందమైన డిజైన్లతో ఉన్న గోడలు. చక్కటి బాల్కనీని తలపిస్తున్నాయి. వాకిట్లో వేసిన పందిరి మీద పరుచుకున్న రాధా మాధవ చెట్టు తీగలు. పూలన్నీ వికసించి, చక్కని పరిమళాన్ని వెద జల్లుతున్నాయి. శుక్లపక్షం కాబట్టి చంద్రుడు వెన్నెలను ప్రసరిస్తూ పరిసరాలను అందంగా కనువిందు చేస్తున్నాడు.
‘మోహన్ చెప్పినట్లు నిజంగానే ఇల్లు బాగుంది. ఇంకా లోపల చూడనే లేదు. ఈ వాకిలి,పందిరి ఎంతో అందంగా ఉన్నాయి. ఆ రోజుల్లో ఇంత బాగా కట్టారు. వాళ్ల తాతగారు ఆ కాలంలో ఎన్నో రకాల ఇళ్ళను పరిశీలించి ఈ రకంగా కట్టారని ఎప్పుడు అతను చెప్తూ ఉంటాడు’అని అనుకున్నది.
ఆమెకు ఎంతోసేపటికి కానీ నిద్ర పట్టలేదు. మళ్లీ ఉదయమే మెలకువ వచ్చి,లేచి కూర్చుంది. అందరూ కొత్తవాళ్లు,లోపలికి వెళ్లాలంటే మొహమాటంగా అనిపించింది. శుభశ్రీ ఇంకా పడుకునే ఉంది. దాదాపు ఒక అరగంట సేపు అలాగే కూర్చుంది. అతి కష్టం మీద శుభశ్రీ లేచింది.
“నువ్వు లేచావా? నాకు ఆలస్యంగా లేవడం అలవాటు”అన్నది .
“నేను మరీ ఆలస్యంగా లేవను. ఈమధ్య మరీ తొందరగా లేవడం అలవాటైపోయింది
బంధువుల ఇంట్లో ఉంటున్నా కదా! వాళ్ళు చాలా తొందరగా నిద్ర లేస్తారు”అని రాగమాల అన్నది.
“సరే, వెళ్లి బ్రష్ చేసుకుందాం పద!”అన్నది శుభ శ్రీ.
ఇద్దరూ లోపలికి వెళ్లారు. అప్పుడు ఇంటిని పరిశీలనగా చూసింది.
పెద్ద చతుష్షాల భవంతి. వెలుతురు కోసం మధ్యలో తెరిచి ఉంచిన గవాక్షం .నీళ్లు పోవడానికి కింద చతురస్రాకారంలో కట్టిన గచ్చు. నాలుగు భవంతుల చుట్టూ పడక గదులు. ఒకవైపు వంటిల్లు. ఆ వంటిల్లు కూడా చాలా పెద్దదే. ఆ లోపలికి ఆవ కాయలు పెట్టుకునే గది. అటు నుండి బయటకు వెళితే గ్రిల్స్ తో కట్టిన వరండా. అక్కడే ఫంక్షన్ల కోసం వంటలు చేసు కుంటారట. పెద్ద పెద్ద కట్టెల పొయ్యిలు ఉన్నాయి. స్టవ్‌ల వాడకం కూడా ఎక్కువగా లేనట్టుంది. టీ పెట్టు కోవడానికి, పప్పు వండు కోవడానికి బొగ్గుల పొయ్యిలు ఉన్నాయి.
ఆతర్వాత బయటకు వెళ్తే నీళ్ళ బావి, (బాత్రూం) నీళ్ల గది , అటు నుండి ఇంటి చుట్టూ ఖాళీ స్థలము. ఇంటి వెనకాల జామ, తుత్తురు చెట్లు ఉన్నాయి.
బ్రష్ తెచ్చు కోనందు వల్ల, వేప పుల్ల తెచ్చుకొని పళ్ళు తోము కుంటూ, పెరడంతా గమనించ సాగింది .
లోపలికి వచ్చిన తర్వాత శుభశ్రీ ఇద్దరికీ రెండు గ్లాసుల్లో చాయ్ తెచ్చి ఇచ్చింది.
చాయ్ తాగిన తర్వాత..
“నేను స్నానం చేస్తాను” అని శుభశ్రీని అడిగింది.
“ఇదిగో ఈ బాత్రూం లో స్నానం చేయి. వేడి నీళ్లు లోపల కాగు తున్నాయి. చల్లటి నీళ్లు బావిలో నుండి తోడుకొని తీసుకొని వెళ్ళాలి. అదిగో అక్కడ తోడి పెట్టి ఉన్నాయి. అవి తీసుకొని వెళ్ళు”అని చెప్పింది.
లోపలికి వెళ్లి రాగమాల తన బట్టలను తెచ్చుకుంది. తనకు ఎంతో ఇష్టమైన అమ్మ చీర కట్టుకోవాలి అనుకుంది. తెల్లని చీర మీద నల్లటి పూలు, చుక్కలు ఉంటాయి. ఆ చీరంటే రాగ మాలకు చాలా ఇష్టం.
బాత్రూం ద్వారం ఎత్తు చాలా తక్కువగా ఉంది. అది చూసుకోకుండా లోపలికి వెళ్ళిపోయింది.
“అమ్మా,”అంటూ తల పట్టుకొని అక్కడే నిలబడింది.
మోహన్ గబగబా అక్కడికి వచ్చి..
” ద్వారం ఎత్తు తక్కువగా ఉంటుందని చెప్పడానికే వచ్చాను. ఈ లోపల తగిలించు కున్నావా”అన్నాడు.
పరవాలేదు అన్నట్లుగా చూసి తలుపు వేసుకుంది.
లోపల కట్టెల పొయ్యి. దానిమీద పెద్ద అండ ( నీళ్లు కాచే పాత్ర) . కట్టెల పొయ్యి మంటతో రూమంతా పొగతో నిండి , చీకటిగా కూడా ఉంది. ఏమీ కనిపించడం లేదు. స్నానం చేస్తుంటే కళ్ళ వెంబడి నీళ్లు కారి పోతూనే ఉన్నాయి. గబగబా స్నానం చేసి చీర చుట్టుకుని బయటకు వచ్చింది. లోపల బట్టలు వేసుకునే పరిస్థితి కూడా లేదు. అక్కడే ఉన్న శుభశ్రీ “ఈ గదిలోకి వెళ్లి కట్టుకో” అని ఒక గదిని చూపించింది.
లోపలికి వెళ్లి చీర కట్టుకుంది. అప్పుడప్పుడు చీర కట్టుకోవడం అలవాటు ఉన్నందువల్ల ఎక్కువ సమయం తీసుకోలేదు. అక్కడే పౌడరు, తిలకము, కాటుక ఉన్నాయి .అవి తీసుకొని తయారవుతూ ఉంటే మోహన్ వచ్చాడు.
“తయారయ్యావా? ఓ, చీరలు కూడా కట్టుకుంటావా? బాగున్నావు.
నీకు తెలుసా ఇది నా గది. నువ్వు ఇందులోకే ముందు వచ్చావు. ఎలా ఉంది”? అని అడిగాడు.
“ఇది నీ గదా? చాలా బాగుంది. సరే, బయటకు వెళ్ళు ఎవరైనా చూస్తే బాగుండదు”అని చెప్పింది నవ్వుతూ.
ఇంతలో శుభశ్రీ తయారయి వచ్చి..
“రాగమాల! సత్య నారాయణ స్వామి పీటని అలంకరించాలి వస్తావా”? అని అడిగింది.
“సరే అక్క! వస్తాను”అని బయటకు వచ్చింది.
“చీర కట్టు కున్నావా? బాగున్నావు”అన్నది శుభశ్రీ ప్రశంసగా చూస్తూ…
ఒక చిన్న నవ్వు నవ్వి, పీట చుట్టూ మామిడి తోరణం కట్ట సాగింది.
చుట్టూ బంతిపూలు అలంకారం చేసి, పీట మీద ముగ్గు వేసింది. ఆ తర్వాత పీటను ఇద్దరు కలిసి తీసుకెళ్లి ఎదురుగా ఉన్న భవంతిలో పెట్టారు.
ఇంతలో కొంతమంది బంధువులు వచ్చారు. అందులో ముఖ్యమైనది మోహన్ మేనత్త గారు.
ఆవిడ రావడంతో ఇల్లంతా సందడి మొదలయ్యింది. గల గల మాటలు నవ్వులు ఎక్కువయ్యాయి. ఈ నవ్వులు చూస్తేనే రాగ మాలకు కొంచెం మతి పోయేది . ‘చిన్న చిన్న విషయాలకే ఇంతగా నవ్వుతారు అనుకునేది’ ప్రతిసారి…
ఆమె రావడంతోనే రాగ మాల ను చూసి..
“ఈ అమ్మాయి ఎవరే శుభా”? అని అడిగింది.
శుభశ్రీ ఆమె ఎవరో చెప్పింది.
ఆ తర్వాత ఆమె టీ త్రాగి, నోము కోసం అన్ని తయారు చేయసాగింది.
మోహన్ వాళ్ళ నాన్న గారు వచ్చి…
” నువ్వుంటేనే అన్ని సక్రమంగా జరుగుతాయి చెల్లి” అన్నాడు.
ఆ మాటలకి ఆమె మురిసి పోయింది..
ఇంతలో కొంచెం అందంగా, స్టయిల్ గా ఉన్న ఒకబ్బాయి వచ్చాడు. అతను మోహన్ మేనత్త కొడుకు. ఇంకా ముచ్చట్లు జోరందుకున్నాయి.
వాకిట్లో కి చూసిన రాగమాల ఆశ్చర్య పోయింది.లోపలికి వస్తున్న మహిళను చూస్తూ సంతోషంగా దగ్గరకు వెళ్ళింది.
ఆ మహిళ ఎవరో కాదు రాగమాల తల్లి వసుంధర.
“ఏంటమ్మా నువ్వు ఇక్కడికి వచ్చావు? నిన్ను ఇక్కడ చూడడం నాకు ఆశ్చర్యంగా అనిపించింది”అని అన్నది.
“నాకు కూడా నిన్ను ఇక్కడ చూడటం ఆశ్చర్యంగానే ఉంది. అసలు నువ్వు ఎలా వచ్చావు? అది ముందు చెప్పు”అన్నది వసుంధర.
“శుభశ్రీ అక్క రమ్మని ఉత్తరం పంపించింది. వాళ్ల చిన్న తమ్ముడి తో వచ్చాను”అని చెప్పింది.
“అవునా! రామారావు అన్నయ్య గారు ఇంటికి వచ్చి మరీ రమ్మని పిలిచారు. మీ నాన్న సంగతి తెలుసు కదా! ఎక్కడికి వెళ్లరు. నన్ను వెళ్ళమని చెప్తే మన నర్సింహాడిని తీసుకొని వచ్చాను”అనీ వసుంధర చెప్పింది.
“మరి నీకు వీళ్ళ ఇల్లు ఎలా తెలుసు?”అన్నది.
“ఈ ఊళ్లో నా పుట్టింటి బంధువులు ఉన్నారు. అదే మీ అమ్మమ్మ వైపు వాళ్ళు. వాళ్ళ ఇంటికి వెళ్లి, వాళ్ళు చూపిస్తే వచ్చాను”అని చెప్పింది.
ఇంతలో లోపల నుండి వచ్చిన శుభశ్రీ..
“అదేంటి అమ్మను వాకిట్లోనే నిల్చబెట్టి మాట్లాడుతున్నావా? లోపలికి రండి అత్తయ్యా”అని పిలిచింది.
వసుంధర, రాగమాల ఇద్దరూ లోపలికి వచ్చారు. లోపలికి వెళ్లి కాళ్లు కడుక్కున్న తర్వాత, అందరికీ ప్లేట్లలో ఉప్మా పెట్టి అందించారు.
మోహన్ మేనత్త వసుంధర కి ముందు నుండే పరిచయం. నిజం చెప్పాలంటే, రెండు కుటుంబాలకి ముందు నుండి పరిచయాలు ఉన్నాయి.
వాళ్ళిద్దరూ సరదాగా మాట్లాడుకో సాగారు.
మెల్ల మెల్లగా బంధువులంతా వచ్చారు. వ్రతం ప్రారంభం అయింది.
మోహన్ తల్లి శ్రీదేవి ,తండ్రి రామారావు సత్య నారాయణ స్వామి వ్రతం కోసం పీటల మీద కూర్చున్నారు.
శ్రీదేవి గారు చక్కని పింక్ కలర్ లో ఉన్న బెనారస్ పట్టు చీర కట్టుకున్నారు. రాగ మాలకు ఆ చీర ఎంతో నచ్చింది.
అప్పట్లో పెళ్లిళ్లు చేసినప్పుడు, ఆడపిల్లలకి ముఖ్యమైనవి రెండు పట్టు చీరలు కొనే వాళ్ళు. ఒకటి పెద్ద పట్టుచీర .రెండవది చిన్న పట్టు చీర. పెద్ద పట్టుచీర తప్పకుండా బనారస్ పట్టు చీరనే ఉండేది. అందులో రెండు రంగులు మాత్రమే వచ్చేవి. వంగ పండు రంగు గులాబి రంగు.
చిన్న పట్టుచీర కంచి పట్టుచీర. మిగతావి వేరే పట్టు చీరలు కొనే వాళ్ళు. బనారస్ పట్టు చీర తెలుగువారి పెళ్లిళ్లలో ప్రత్యేకమైన స్థానాన్ని నిలబెట్టుకుంది. ఇప్పటికీ ఆనాటి చీరలు చాలా చక్కగా ఉన్నాయి .ఇంట్లో ఉతికినా కూడా, ముడతలు పడకుండా వెండి జారీ తో తళతళ మెరిసిపోతూ ఉంటాయి. వాటిని కరిగిస్తే చాలా వెండి కూడా వస్తుంది. ఆరోజుల్లో చీరలు అంతటి నాణ్యత ఉండేవి.
పూజారి గారు వ్రతం చక్కగా జరిపిస్తున్నారు. శ్రద్ధగా చూస్తున్న రాగ మాలకి, వాళ్ళిద్దరి స్థానంలో తను, మోహన్ ఉంటే బాగుంటుంది అని అనిపించింది. దేవుడు తధాస్తు అన్నాడేమో.
వ్రతం అయ్యాక అందరూ తీర్థ ప్రసాదాలు తీసుకున్నారు. అందరి భోజనాలు అయిపోయాయి. వసుంధర ,రాగమాల వెళ్లడానికి సిద్ధపడ్డారు.
“అమ్మా! బస్టాండ్ కి వెళ్లి పోదాము. నువ్వు మన ఊరి బస్సు ఎక్కు. నేను టౌన్ వైపు బస్సు ఎక్కు తాను. నీకు తోడుగా నరసింహులు ఉన్నాడు కదా! మరి వెళ్దామా”అని రాగమాల అడిగింది.
ఇద్దరు వెళదామని అనుకొని, లోపలికి వెళ్లి శ్రీదేవి గారికి వెళ్ళొస్తామని చెప్పారు. ఆవిడ ఇద్దరికీ పసుపు కుంకుమ పెట్టి తాంబూలం ఇచ్చింది.
మోహన్ కోసం కోసం రాగమాల కళ్ళు ఇల్లంతా వెతికాయి. కానీ ఎక్కడా కనిపించలేదు. వెళ్తామని చెప్పిన తర్వాత ఎక్కువసేపు అక్కడే ఉండడం ఇబ్బందిగా అనిపించింది. అందుకే ఇద్దరు కలిసి బస్టాండ్‌కు వెళ్లిపోయారు. ముందుగా తల్లి వెళ్లాల్సిన బస్సు వచ్చింది. వసుంధర, నరసింహులు బస్సు ఎక్కి వెళ్ళిపోయారు.
ఇంతలో తన బస్సు రావడం కనిపించి, ముందుకు వస్తుంటే వెనుక నుండి మోహన్ పిలుస్తూ వచ్చాడు.
“ఏంటి చెప్పకుండానే వెళ్ళి పోతున్నావ్?”అన్నాడు.
“నీకోసం చూశాను. కానీ కనిపించలేదు. ఇంకా అక్కడే నిలబడితే బాగుండదని వచ్చేసాము. సరే, బస్సు స్టార్ట్ అవుతుంది. నేను బస్సు ఎక్కు తాను. రేపు కలుద్దాం”అని చెప్పి రాగమాల బస్సు ఎక్కింది.
అతను అక్కడే చూస్తూ నిలబడ్డాడు.
రాగ మాల బస్సు ఎక్కి కిటికీ దగ్గర సీట్లో కూర్చుంది. కిటికీలో నుండి చూస్తే అతను అక్కడే నిలబడి ఉన్నాడు. ఆమెకు అతన్ని చూస్తే ఎందుకో బాధనిపించింది. అతని ముఖంలో కూడా బాధ కనిపించింది.
టౌనుకు చేరుకొని ఇంటికి వెళ్లిపోయింది. కాళ్లు చేతులు కడుక్కుని, బట్టలు మార్చుకొని హాల్లో ఉన్న మంచం మీద పడుకుంది. వీళ్లింట్లో రాత్రి తొందరగా భోజనాలు చేస్తారు.అందరూ వంట గదిలో భోజనాలు చేస్తున్నారు .
“రాగ మాల! నువ్వు కూడా భోజనానికి రామ్మా” అని సుమిత్ర పిలిచింది.
“భోజనం చాలా లేటుగా చేసాము. ఇప్పుడు ఆకలిగా లేదు అత్తయ్య!”అని చెప్పి కళ్ళు మూసుకుని పడుకుంది.
ఇంతలో మోహన్ పిలిచినట్లు అనిపించింది.
“అయినా అతను ఎందుకు వస్తాడు! ఇంట్లో పూజ జరిగింది బంధువులంతా ఉన్నారు అని”అనుకొని అలాగే పడుకుంది .
“రాగా”మళ్లీ పిలుపు వినిపించింది.
టక్కున లేచింది రాగ మాల. అయితే అక్కడ మోహన్ నిలబడి ఉన్నాడు.
“ఏంటి ఇలా వచ్చావు? మీ చుట్టాలంతా ఇంట్లో ఉన్నారు! దేని గురించి ఇంత తొందరగా వచ్చావు?”అన్నది ఆశ్చర్యంగా.
“ఏమో! నువ్వు వెళ్ళిన తర్వాత ఉండాలని పించలేదు. అందుకే వచ్చేసాను. నేను వచ్చేటప్పుడు అమ్మ భోజనం చేస్తుంది. “వెళుతున్నాను” అని చెప్తే..
“ఎందుకంత తొందర, ఇంకా నా భోజనం కూడా కాలేదు” అని అన్నది.
“కొంచెం పని ఉందమ్మా” అని చెప్పాను .అప్పుడు
“మీ ఫ్రెండ్ వెళ్ళిపోయిందని వెళ్ళి పోతున్నావా”? అని అమ్మ కొంచెం కోపంగా అన్నది” అని చెప్పాడు.
“మరి ఎందు కొచ్చావు?” అన్నది.
“చెప్పాను కదా!” అన్నాడు.
ఇంతలో కిషన్ రావు పిలిచాడు.
“కొంచెం తిని వెళ్ళు రాగ మాలా” అన్నాడు.
“ఇప్పుడు రాదు లెండి! బలవంతం చేయకండి ” అని సుమిత్ర అనడం వినిపించింది.
“ఇప్పుడు నువు వెళ్ళు, ఇప్పటికే వాళ్ళు ఏదేదో మాట్లాడుతున్నారు. అమ్మా, నాన్నకి వాళ్ళ ద్వారా తెలిస్తే బాగుండదు” అని చెప్పింది.
అతను వెళ్ళిపోయాడు.
“ఇంకా ఈ విషయం నాన్చకుండ అమ్మకి చెప్పాలి” అని ఆమె అనుకున్నది.
దక్షిణామూర్తి గారికి బంధువులలో ఒక అబ్బాయికి రాగ మాల ను ఇవ్వాలని ఇష్టంగా ఉండేది. ఆమె డిగ్రీ సెకండ్ ఇయర్ లో ఉన్నప్పుడు అతను వేరే సంబంధం చేసుకున్నాడు. దక్షిణామూర్తి గారు చాలా బాధ పడ్డారు.
డిగ్రీ అయ్యాక పెళ్లి సంబంధాలు చూద్దామని అనుకున్నారు. ఇంకా ఇంట్లో వీళ్ళ విషయాలు ఏమీ తెలియవు.
సుమిత్ర కుటుంబంతో మంచి పరిచయం మోహన్ కి కలిగింది. వాళ్ళు కూడా బాగా మాట్లాడ సాగారు. కిషన్ రావు గారి పెద్ద కూతురు పిల్లలతో వచ్చింది. పెద్ద పిల్లవాడికి మూడేళ్లు ఉంటాయి. ముద్దుగా ఉండేవాడు. పాప వయసు సంవత్సరం.
మోహన్ బాబుతో ఎక్కువగా ఆడుకునే వాడు. సుమిత్ర కు అలా ఆడుకోవడం ఎంతో నచ్చేది.
“నా మనవడు అంటే మోహన్ కు ఇష్టం” అంటూ మురిసి పోయేది.
ఒకసారి వాడిని ఫోటో స్టూడియో కు తీసుకెళ్లి ఇద్దరు ఫొటోస్ తీయించు కున్నారు. ఆమెకు ఇంకా సంతోషం కలిగింది. అందులో ఇంట్లో అందరూ ఆమె ఆజ్ఞనే పాటిస్తారు కాబట్టి ఇంక ఎవరికి మోహన్ రావడం అభ్యంతరం లేదు.
కాలేజీలో రివిజన్ క్లాసెస్ అవుతున్నాయి. అందరూ బిజీ గా ఉంటున్నారు.
ఒక రోజు కాలేజీకి వెళ్ళే దారిలో మోహన్ కలిసి..
“రాగా..రాగా,” అంటూ చెప్పడానికి తడ బడుతున్నాడు.
“ఏమయ్యింది” అని అడిగింది..
“అక్కకి పెళ్ళి చూపులు అయ్యాయి.సంబంధం ఖాయమయినట్లె..కానీ, అక్క నన్ను ఇప్పుడే రావొద్దు అని చెప్పింది.ఎందుకంటే ఇంతకు ముందు రెండు సంబంధాలు నాకే నచ్చక కుదర నివ్వలేదు.ఇప్పుడు కూడా అట్లా చేస్తానని అనుకుందేమో! అందులో ఇప్పుడు మనకి లాస్ట్ అసైన్మెంట్ ఎగ్జామ్స్” అన్నాడు.
“అవునా! మంచి వార్త. అవును మనకి టైం లేదు కదా!” అన్నది.
“మా అక్క పెళ్లి కుదిరింది అని చెప్తే నువ్వు ఎక్కువ సంతోష పడలేదు, ఎందుకు?” అని అన్నాడు.
“అరే ఇంతకన్నా ఎలా చెప్పాలి?” అన్నది..
“ఏమో! నాకు నచ్చలేదు” అంటూ వెళ్లిపోయాడు.
‘ఇతనికి చిన్న విషయానికే కోపం వస్తుంది ఎందుకిలా చేస్తాడో!’అని అనుకున్నది.
ఇంటికి వెళ్ళాలనీ రెండు అడుగులు వేసి, మోహన్ వెళ్లిన వైపు నడిచింది.
ఇంటికి వెళ్ళిన అతను బయట కుర్చీలో కూర్చున్నాడు.
లోపలికి వచ్చిన ఆమెను చూసి..
“ఇదేంటి! ఇలా వచ్చావు?”అన్నాడు కంగారుగా.
“నువ్వు అలిగి వస్తె నాకు ఏమి తోచలేదు.అందుకే వచ్చాను” అని అన్నది.
“ఏమో అట్లనిపించింది.మా అక్క అంటే చాల ఇష్టం.ఎన్నో సంబంధాలు చూసిన తర్వాత ఇది కుదిరింది. అందుకే నేను చాలా సంతోష పడ్డాను”అన్నాడు.
“నాకు కూడా సంతోషంగానే ఉంటుంది కదా”అన్నది ఆమె.
“నిజమే, సరే నువ్వు వెళ్ళు” అన్నాడు.
రాగ మాల ఇంటికి వెళ్ళిపోయింది.నాలుగు రోజుల తర్వాత అక్క మాలతి వచ్చిందని ఊరికి వెళ్ళింది.ఇంట్లో పిల్లలందరూ ఉన్నారని తల్లి తండ్రులు సంతోషించారు.
ఎగ్జామ్స్ వస్తున్నాయని తనకు ఎగ్జామ్స్ అయ్యేవరకు రావడం కుదరదని చెప్పింది. వసుంధర మాలతి రాగమాల కలిసి సినిమాకు వెళ్లారు. మాలతి వాళ్ళది పల్లెటూరు. నాలుగు రోజులు సంతోషంగా గడిపింది.
సరిగా పరీక్షల టైంలో మళ్లీ ఒక అవాంతరం వచ్చి పడింది