“కనిపించని గమ్యాన్ని – పదార్థ విజ్ఞానంతో ‘దృశ్యమానం ‘చేసిన ప్రతిభాశాలి.”

డాక్టర్ శుభావేంకటేష్ అయ్యంగార్. ఈ పేరు భౌతిక, శాస్త్ర ,సాంకేతిక మరియు విమానయాన రంగాల్లో ఉన్నవారికి చిరపరిచితం. ప్రముఖ మహిళా ఏరోస్పేస్ శాస్త్రవేత్తగా స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానం, రక్షణ రంగం ,అంతరిక్ష పరిశోధన, విమానయాన భద్రతలకు సంబంధించిన విశేష
సేవలందించిన ప్రతిభావని శుభావేంకటేశ్ అయ్యంగార్.

బెంగళూరులో మే 14, 1954 వ సంవత్సరంలో జన్మించిన వీరు తల్లిదండ్రులకు తొమ్మిదవ ( చివరి )సంతానమని తెలుస్తోంది. బాల్యం నుండే చదువులో చురుకైన విద్యార్థిని గా గుర్తింపు పొందిన శుభ గారికి తండ్రితో అనుబంధం చాలా ఎక్కువగా ఉండేదట. వారి ప్రోత్సాహంతోనే భౌతిక శాస్త్రంలో అడుగు పెట్టాను అంటారామె. బెంగళూరులో యం.యస్.సి ఎలక్ట్రానిక్స్ చదివే సమయంలో తండ్రి మరణం వారికి శరాఘాతమైనా తట్టుకుని నిలబడి ఆర్థిక ఇబ్బందులను, దూరాభారాన్ని సైతం లెక్కచేయక చదువు కొనసాగించి బంగారు పతకాలు సాధించడం విశేషం మరియు అభినందనీయం.

సి .ఎస్. ఐ .ఆర్. – ఎన్ .ఎ. ఎల్. (నేషనల్ ఏరోస్పేస్ లాబరేటరీ)లో ఉద్యోగం పొంది అంచెలంచెలుగా ఎదిగిన వీరు ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ మెటీరియల్ సైన్స్ విభాగాల్లో డాక్టరేట్ పట్టా పొందారు. నాలుగున్నర దశాబ్దాల పాటు ఆ సంస్థలో వివిధ హోదాలలో ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించి, ‘తొలి స్వదేశీ రన్ వే విజిబిలిటీ సిస్టం “దృష్టి” పరికర ఆవిష్కర్త’ గా , భారత వాతావరణ శాఖ భాగస్వామ్యంతో నాలుగు మీటర్ల వరకు వాతావరణ మార్పులను కొలిచే పరికరాన్ని రూపొందించి, ఆ పరికరాలను విదేశాల నుండి దిగుమతి చేసుకొనే అవసరాన్ని, నిర్వహణ ఖర్చులు తగ్గించి దేశం తలెత్తుకునేలా చేసిన శాస్త్రవేత్తగా గుర్తింపు పొందారు .

వాతావరణ మార్పులైన వర్షం, పొగ మంచు, ఇతర కారణాలతో విమానం టేక్ ఆఫ్, ల్యాండింగ్ సమయంలో విమానయాన రంగం ఎదుర్కొంటున్న క్లిష్టతరమైన సమస్యలకు, ప్రయాణికుల భద్రతకు చక్కటి పరిష్కారంగా ‘దృష్టి’ని రూపొందించారు . ఇది రన్ వే పై కనిపించే దూరాన్ని కొలిచే స్వదేశీ పరికర వ్యవస్థ .సాధారణ వాతావరణం లో రన్ వే చాలా దూరం వరకు కనిపిస్తుంది. పొగ మంచు మరేవైనా సమస్యలున్నప్పుడు రన్ వే సమీప వాతావరణంలోని కాంతి ప్రసారాన్ని కొలిచి దాని ఆధారంగా ‘దృశ్యమానత’ను లెక్కించి విమానయాన సిబ్బందికి అందిస్తుంది .దాని ఆధారంగా పైలెట్లు ,ఎయిర్ ట్రాఫిక్ సిబ్బంది తమ విధుల్లో అప్రమత్తత కలిగి ఉంటారు. పొగ మంచు ఉన్నప్పుడు కనిపించే దూరం తగ్గుతుంది ‘దృష్టి ‘పరికరం కొలిచి , రన్ వే విజువల్ రేంజ్ పై పైలెట్లు ఎంత దూరం చూడగలరో తెలియజేస్తుంది .ఈ పరికరం వాతావరణ సమస్యలు ఉన్నప్పటికీ పొగ మంచు 25 మీటర్ల అనుకూల వాతావరణంలో 2000 మీటర్లకు పైగా దూరాన్ని కొలుస్తుంది. ఏయిర్ ట్రాఫిక్ ని కంట్రోల్ చేసి ఎంతవరకు సురక్షితమో స్పష్టంగా తెలియజేస్తుంది. ఈ ‘మొట్టమొదటి స్వదేశీ (రన్ వే దృశ్యమానతను కొలిచే )పరికరం దృష్టి ‘తయారీ ఆలోచనకు 2007 సంవత్సరంలో అంకురార్పణ జరిగినట్లు
2011లో తొలిసారి ఢిల్లీ ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రారంభించారని అప్పటినుండి దేశంలోని అన్ని ప్రధాన విమానాశ్రయాల్లో ఉపయోగిస్తున్నారని గుర్తు చేసుకుంటారు. పైలెట్లకు ,కంట్రోలర్లకు అత్యంత కీలకమైన సమాచారాన్నందిస్తూ విమానయాన భద్రతను బలోపేతం చేసిన ఈ ‘ దృష్టి’ పరికరవ్యవస్థను భారత వైమానిక దళం కూడా ఉపయోగిస్తుండటం గమనారం. “ప్రపంచ వాతావరణ సంస్థ”, అంతర్జాతీయ విమానయాన సంస్థలు ,ఇతర దేశాలు కూడా ఇదే వ్యవస్థను ఉపయోగించాలని సూచించడంతో ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందిందీ వ్యవస్థ . దీనితో ఆమె ప్రతిభ ప్రపంచమంతటా వ్యాపించిపోయింది.

డాక్టర్ శుభ దేశ రక్షణ సామర్ధ్యానికి’ అగ్ని క్షిపణి ‘దాని నిర్దేశిత లక్ష్యం చేరడానికి అడ్డంకిగా ఉన్న క్లిష్టతర సాంకేతిక సమస్యను పరిష్కరించారు. 3,000 కె. ఉష్ణోగ్రతలను , మాక్ 5 వేగాలను తట్టుకోగల స్వదేశీ పరికరాల (భాగాల) సామర్థ్యాన్ని పెంపొందించేందుకు విశేష కృషి చేశారు. ఈ పరికరాలు రామ్ జెట్, స్క్రాంజెట్ ఇంజన్లకు, భారత ఉపగ్రహ ప్రయోగాలకు ఎంతగానో తోడ్పడ్డాయి.

ఆమె పరిశోధనలు పలుదేశాల దృష్టినాకర్షించగా ఆమె సమర్పించిన పరిశోధక పత్రాలు ‘నాసా’ అధికారిక నివేదికలో చేర్చబడ్డాయి. ‘దృష్టి’ ఆవిష్కారానికి ముందు మన దేశం ఖరీదైన ఈ పరికరాల దిగుమతికై అధిక ద్రవ్య వినియోగం చేసేది. ఈ పరికరం ఆవిర్భావంతో విదేశాలనుండి దిగుమతి చేసుకునే అవసరానికి పరిష్కారం చూపి, స్వదేశీ పరిజ్ఞానాన్ని సుసంపన్నం చేసిన ఘనత పొంది, దేశం సగర్వంగా తలెత్తుకునేలా చేసారీ శాస్త్రవేత్త.

నచ్చిన అంశంపై ఉత్సుకత, ప్రణాళికాబద్ధత, పనిలో ఏకాగ్రత ,అంకిత భావంతో తమ నాలుగున్నర దశాబ్దాల ఉద్యోగపర్వంలో అంచెలంచెలుగా ఎదిగి ‘దృష్టి’ రూపకల్పన చేసి దేశ ఆర్థిక వ్యవస్థలో తన వంతు భాగస్వామ్యాన్ని అందించడమే కాకుండా ప్రపంచ దేశాలలో తన, తనదేశ ప్రతిష్టను ఇనుమడింపచేసిన మహిళామణిగా, వృత్తిలో విశేష సేవలు అందించినందుకు గాను లభించిన అవార్డులలో ఇరవై (20) వృత్తిపరమైనవికాగా, సమూహంగా పదమూడు( 13 ),
కార్పొరేట్ స్థాయిలో
మూడు ( 3) .
బాల్యంలో ఏడు( 7). మొత్తం 43 అవార్డులు సొంతం చేసుకున్న విద్వన్మణికి
మొట్టమొదట స్వదేశీ సాంకేతికత స్వావలంబనలో చేసిన కృషికి గాను ‘2015 లో మేక్ ఇండియా అవార్డు’లభించింది . 90 పైగా పరిశోధనా
పత్రాలు సమర్పించడమే కాకుండా పరిశోధక విద్యార్థులకు గైడ్ గా కూడా వ్యవహరించారు.

ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద మహేంద్ర గారు స్పందిస్తూ , విమానాలు సురక్షితంగా ల్యాండ్ అవ్వడానికి రూపొందించిన అద్భుతమైన ఆవిష్కరణ ‘దృష్టి’ అని పేర్కొంటూ శుభా అయ్యంగార్ గారిని అభినందించడం గమనార్హం.

మహిళల ఉన్నత విద్య అనంతమాత్రాంగానే కాకుండా అందనంత ఎత్తులో ఉన్న కాలంలో సైతం తండ్రి ప్రోత్సాహంతో భౌతిక శాస్త్రంలో లోతైన అధ్యయనం చేసి ఉద్యోగంలోకి అడుగుపెట్టి అందరి మన్ననలు పొందిన వీరు సామాజికంగా, ఆర్థికంగా ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నప్పటికీ వృత్తిలో విజయకేతనం ఎగురవేయడం శ్లాఘనీయం.

“భారతదేశం సాంకేతికతలో స్వావలంబన సాధించాలంటే యువత ముఖ్యంగా మహిళలు పరిశోధనారంగవైపు’దృష్టి’ సారించాలంటారామె.”

2026 సంవత్సరానికి
భారత ప్రభుత్వం ఆమె అందించిన విశేష సేవలకు గాను ‘పద్మశ్రీ ‘పురస్కారంతో సత్కరించింది .”ఆసక్తి ,పట్టుదల, కృషి ఉంటే అసాధ్యాన్ని సైతం సుసాధ్యం చేయొచ్చని నిరూపించారీ ప్రజ్ఞాశాలి.

“నిజమైన సంతృప్తి అవార్డులు పొందినప్పుడు రాదని సమాజానికి తమ వంతుగా తిరిగి ఎంతో కొంత ఇవ్వడంలోనే నిజమైన ఆనందం లభిస్తుందంటూ” చెప్పే వీరిని స్ఫూర్తిదాయకంగా తీసుకుని తమను తాము వెన్ను తట్టుకుంటూ నేటి యువత ముందుకు సాగాలని ఆకాంక్షిస్తూ-

Written by Radhika suri

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

మగ మహారాజులు

సామెతల ఊట- సునందమ్మ నోట