చిలక కథ……

ఒక చిలక…

చిన్న గూటిలో పుట్టింది,
ఆకాశమంత ప్రేమలో పెరిగింది…

తన రెక్కల కంటే,
తనకు నీడగా నిలిచిన చెట్టునే
ఎక్కువగా నమ్మింది…

ఎప్పుడూ ఎగరాలని కాదు,
తన వాళ్లు సంతోషంగా ఉండాలని
కోరుకున్న చిలక అది…

ఒక రోజు…

కాలం అనే గాలి బలంగా వీచి,
ఆ చిలకకు అండగా ఉన్న
బలమైన కొమ్మనే విరిచేసింది…

అందరూ అన్నారు…

“ఒక కొమ్మే కదా విరిగింది” అని…

కానీ వారికి తెలియదు…

ఆ కొమ్మతో పాటు
ఆ చిలక ధైర్యం,
భరోసా,
కూడా విరిగిపోయాయని…

అయినా…

గూటి బాధ్యతల కోసం
తన గాయపడిన రెక్కలతోనే
ఎగరడం నేర్చుకుంది…

తనకు ఇష్టమైన దారులను వదిలి,
తన వాళ్ల కోసం
కొత్త దారుల్లో నడిచింది…

ఆకాశంలో ఎగురుతున్నట్టు కనిపించినా,
ఆ ఎగరడంలో
ఒక అలసట దాగి ఉంది

ప్రతి నవ్వు వెనుక
ఒక నిశ్శబ్ద కన్నీరు దాగి ఉంది

చాలామంది అడిగారు…

“ఎంత ఎత్తుకు ఎగిరావు?” అని…

కానీ ఎవరూ అడగలేదు…

“ఎన్ని తుఫాన్లు దాటి వచ్చావు?” అని…

ఇప్పటికీ ఆ చిలక
ఆకాశాన్ని చూస్తూనే ఉంటుంది…

ఎగరలేక కాదు…

ఎప్పుడో పోగొట్టుకున్న
తన ప్రశాంతతను వెతుకుతూ…

ఎందుకంటే…

కొన్ని పక్షులు గూటిని కోల్పోవు,
గూటిలా అనిపించిన ప్రపంచాన్నే కోల్పోతాయి…

“నువ్వు ఎగరలేవు” అని చెప్పిన మాటలను దాటుకుని…

“నీకంత ధైర్యం లేదు,
నువ్వేమీ సాధించలేవు” అని
తక్కువ చేసిన చూపులను దాటుకుని…
గాయపడిన రెక్కలతోనే
మళ్లీ ఆకాశాన్ని చేరాలని ప్రయత్నించింది…

తుఫాన్లు తనను ఆపాలని చూసినా,
తనను వెంటాడే జ్ఞాపకాలు తనను వెనక్కి లాగినా,

“నేను చేయలేను” అని ప్రపంచం నమ్మినా,
“నేను ప్రయత్నిస్తాను” అని తనను తాను నమ్ముకుంది…

ప్రతి సారి పడిపోయి,
ప్రతి సారి ఏడ్చి,
ప్రతి సారి మళ్లీ లేచింది…

ఎందుకంటే…ఆ చిలకకు ఎగరడం మాత్రమే కాదు,
తన గూటిని కాపాడుకోవడం కూడా తెలుసు…

అలా… ప్రతి అవమానాన్ని ఒక మెట్టుగా మార్చుకుని,
ప్రతి కన్నీటిని ఒక బలంగా మార్చుకుని,

ప్రపంచం తనను బలహీనమని భావించినా,
కాలం తనను పరీక్షించినా,దాటుకుని
నిలబడుతోంది ఆ చిలక…

తన కుటుంబం కోసం తన భయాలను దాటుకుని, తానే తనకు బలంగా మారి…
అలసిపోయినా, విరిగిపోయినా, ఆత్మ విశ్వాసమనే రెక్కలతో ఎగురుతున్నది…

Written by Teega Likitha

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

స్త్రీ జ్ఞానశక్తి విశ్వావర ఆత్రేయ

రమక్కతో ముచ్చట్లు -37