రమక్కతో ముచ్చట్లు -37

చా… టి…!

అందరికీ శనార్తులు.

ఒక వారం కింద మేము షిరిడి పోతున్నం ట్రైన్ల. ఇక ట్రైన్ ప్రయాణం అంటే ఎట్లుంటది, మస్తుగుంటది. భారతదేశం మొత్తం నక్ష దించినట్టు ఉంటది. అమ్ముకునేటోళ్లు, ముచ్చట్లు పెట్టుకునేటోళ్లు, మూటలు, ముల్లెలు, పిల్లలు బ్యాకలు, వాళ్ళ లొల్లి, పెద్దోళ్ల ఆగం, మంచిగ అనిపిస్తది. అదొక మినీ భారతం లెక్క. ఇక్కడ నాకు గమ్మతు అనిపించిన ఒక ముచ్చట చెప్తున్న,
దూరం నుంచి ఒకాయన చా…టి, చా…టి అని ఒర్లుకుంట వస్తుండు. నాకు గీ చా
.. టి ఏందో అర్థమే కాలేదు. ఇగ మా బోగి దాకా వచ్చేదాక చూసిన మస్తు గమ్మతనిపించింది.
నిజం చెప్పుండి ఎవల్ల కన్న అర్థమైందా ఏందో?!. చాయ్ అమ్ముతున్నడు. చాయ్… టి రెండు కల్పి ఆ పిల్లగాడు చా… టి చేసిండు. వార్ని అనుకున్న. అందరు చాయ్ కొన్నరు. ఇరవై రూపాయలు ఇచ్చి నేను సుత చాయ్ తీసుకున్న. అదేట్లన్నుండని, బాగుంటే బాగుంది అనుకుంట తాగుతరు.బాగ లేకుంటే తిట్టకుంట తాగుతరు మనోళ్లు చాయిని. అట్లుంటది చాయ్ మీద ప్రేమ!
ఏమంటవ్ తమ్మీ! చాయ్ … ఇది ఒక ఎమోషన్!
మన భారతదేశంల కులం, మతం, భాష, ప్రాంతం ఏదన్న గానీ …
అందరినీ ఒక్క టేబుల్ దగ్గర కూస బెట్టగలిగే శక్తి దేనికన్న ఉందంటే అది చాయ్‌కే ఉంటది.
ఒక కప్పు చాయ్ ముందు పెద్దోడు-చిన్నోడు అనే తేడా ఉండదు.
కూలీ పని చేసే వాడి చేతిలోనూ చాయ్ గ్లాసే కనిపిస్తది…
కోట్ల కంపెనీలు నడిపే సీఈఓ టేబుల్ మీద సుత చాయ్ కప్పే కనిపిస్తది.
తేడా ఉంటే గ్లాస్‌ల ఉంటది…
కానీ ఆవిరిల మాత్రం అందరి బతుకుల అలసటే ఉంటది.
తెలంగాణల అయితే చాయ్ అనేది కేవలం పానీయం కాదు.
అది మన సంస్కృతిల కలిసిపోయిన ఒక అలవాటు… ఒక అనుబంధం… ఒక విశ్రాంతి… ఒక ఓదార్పు… ఒక చిన్న పండుగ.
“రా… ఒక చాయ్ తాగుదాం” అనే మాటల
ఎన్నో ఎమోషన్స్ దాగి ఉంటయి.
కొన్నిసార్లు అది స్నేహానికి ఆహ్వానం.
కొన్నిసార్లు బాధ చెప్పుకునే అవకాశం.
కొన్నిసార్లు ప్రేమకు ప్రారంభం.
కొన్నిసార్లు జీవితానికి చిన్న విరామం.
చాయ్ దుకాణం సామాన్యుడి పార్లమెంట్ లెక్క.
మన ఊర్లల్ల చాయ్ బండ్లను గమనిస్తే
అవి చిన్న చిన్న పార్లమెంట్లలెక్కనే ఉంటయి.
దేశ రాజకీయాల నుంచి పక్కింటి గొడవల దాక అన్నీ ముచ్చట్లు ఆడనే నడుస్తయి
పొద్దుగాల ఐదు గంటలకే
ఒక మూలల కూలీలు కూర్చుంటరు.
ఇంకో మూలల ఆటో వాళ్లు.
కొంచెం దూరంల ఉద్యోగులు.మధ్యల నిరుద్యోగుల గ్యాంగ్.
అందరి చేతులల్ల ఒక్కతీరే గ్లాసులు.
కానీ ప్రతి ఒక్కరి తల లల్ల వేర్వేరు కతలు నడుస్తుంటయి.
ఒకడు అప్పుల గురించి ఆలోచిస్తుంటడు.
మరొక్కడు ప్రేమ విఫలం గురించి బాధపడుతుంటడు.
ఇంకొకడు జీతం పెరగాలని కలలు కంటుంటడు.
కానీ ఆ రెండు నిమిషాల చాయ్ టైమ్‌ల
అందరూ ఒకటై నవ్వుతరు.
అందుకే చాయ్ బండి అనేది కేవలం వ్యాపారం కాదు.
అది సమాజానికి చిన్న రిలాక్సేషన్ సెంటర్.
“చాయ్ తాగుదాం రా” అత్యంత భావోద్వేగమైన డైలాగ్!
అది కేవలం చాయ్ కోసం పిలుసుడు కాదు.
ఆ మాటలోl
“నీతో కాసేపు గడపాలనుంది” అనే భావం ఉంటది.
కొంతమంది కోపంగ ఉన్న సుత
“ముందు చాయ్ తాగు” అంటే కాస్త శాంతిస్తరు.
కొంతమంది ప్రేమను సుత సూటిగ చెప్పలేక
“చాయ్‌కు వస్తవా?” అని మొదలు పెడుతరు.ఎంతోమంది రచయితలు
ఒక కప్పు చాయ్‌తోనే కవితలు రాస్తరు.
సదువుకునే విద్యార్థులు,
రాత్రి పరీక్షల సమయంల
చాయ్‌తోనే నిద్రను ఓడిస్తరు.
అందుకే చాయ్ అనేది మనిషి జీవితంల
ఒక చిన్న పాత్ర కాదు. చాలాసార్లు అది ఒక మానసిక ఆధారం.
అసలు ఈ చాయ్ భారతదేశానికి ఎట్ల వచ్చిందో జెర సూద్దాం.
ఇప్పుడు మనం చాయ్‌ను భారతీయ సంప్రదాయం అనుకుంటున్నం.
కానీ చాయ్ మొదట భారతదేశంల పుట్టింది కాదట.
చైనా దేశంల వేల ఏళ్ల కింద
టీ ఆకులను ఔషధంలెక్క ఉపయోగించేటోల్లట .తర్వాత బ్రిటిష్ వాళ్లు
టీ వ్యాపారంల బాగ లాభాలు ఉన్నయని తెలుసుకోని చైనా మీద ఆధారపడకుండ
భారతదేశంలనే టీ పంటలు పెంచాలని నిర్ణయించిన్రట.బ్రిటిషోడి కతనే గిట్లుంటది మరీ.
అస్సాం, డార్జిలింగ్ ప్రాంతాలల్ల
టీ తోటలు మొదలుపెట్టిన్రట.
మొదట్ల భారతీయులు టీని అస్సలు పట్టించుకోలేదట.
“ఏందీ ఈ చేదు నీళ్లు?” అనుకునేటోల్లట .
అప్పుడు బ్రిటిష్ కంపెనీలు ఫ్రీగ టీ పంచుడు మొదలుపెట్టిన్రట.
రైల్వే స్టేషన్లల, బజార్లల
టీ అలవాటు చేశిన్రట. ఇది దొరలు తాగే చాయ్ అని దానికి ఒక పెద్ద కితాబు సుత ఇచ్చుడు మొదలుపెట్టిన్రట. ఇగ
మన భారతీయుల తెలివి తెలిసిందే కద,
అదే టీని తీసుకుని
అండ్ల పాలు, చక్కెర, అల్లం, ఇలాచిలు కలిపి కమ్మగ తయారు చేసుడు మొదలు పెట్టిన్రు.ఇట్ల
బ్రిటిష్ వాళ్లు టీ ఇస్తే దానికి మనోళ్లు మన ఎమోషన్ కలిపిన్రు.
ఇప్పుడు చాయిల ఎన్ని రకాలు, ఎన్ని కతలు, ఎన్ని ఫ్లేవర్లు, ఒక్కొక్క ప్రాంతంల చాయ్ ఒక్కొక్క తీరు దొరుకుతది.
చాయి బండి పెట్టి కోటీశ్వరులైన వాళ్ళు కోటి మంది మీద ఉన్నరు.
మన తెలంగాణల చాయ్‌కు ఒక ప్రత్యేక స్థానం ఉంది.
ఇక్కడ “కట్టింగ్ చాయ్”, “ఇరానీ చాయ్”, “మలాయి చాయ్” అన్న పేర్లు సుత వినిపిస్తయి.
హైదరాబాద్ ఇరానీ చాయ్ అయితే
ప్రపంచ ప్రఖ్యాతి పొందింది.
ఒక కప్పు ఇరానీ చాయ్,
పక్కన ఉస్మానియా బిస్కెట్…
ఇది తెలంగాణ మనుషులకి చిన్న స్వర్గం.
ఎంత టెన్షన్‌లో ఉన్న, కప్పు చాయ్ చేతిల పడగానే మనసు కాస్త నెమ్మదిస్తది.
కొంతమందికి పొద్దుగాల్ల సూర్యోదయం కనిపించకపోయినా పర్వాలేదు
చాయ్ మాత్రం కనిపించాలి.
చాయ్.. పేదవాడి రిలాక్సేషన్ థెరపీ.
ధనవంతులు టెన్షన్ తగ్గించుకోనీకి
రిసార్ట్స్‌కి పోతరు.
విదేశీ టూర్లు చేస్తరు.
కానీ పేదవాడికి ఒక ఐదు రూపాయల చాయే రిలీఫ్.
రోజంత ఎండల పని చేసి
చెమటతోని అలసిపోయి, ఒక చాయ్ తాగితే
అతనికి అది అమృతంలెక్క గొడ్తది.
ఆ గ్లాస్‌ల ఒట్టి టీ ఉండదు.కొంచెం శక్తి…
కొంచెం ఆశ…కొంచెం ఓదార్పు సుత ఉంటయి!

చాయ్‌ మంచిదా, చెడ్డదా అని ఆలోచిస్తే
ఎక్కువ కాకుండ రోజుకు ఒక మూడు కప్పులు ఏమి కాదు అంటరు డాక్టర్లు.
చాయ్ తోని కొన్ని ఉపయోగాలు సుత ఉన్నయి.
అలసట తగ్గుతది
మైండ్ కొంచెం యాక్టివ్ అవుతది
పని మీద ఫోకస్ పెరుగుతది
కొంత రిలాక్సేషన్ కలుగుతది. చల్లని వాతావరణంల శరీరానికి హాయిగ ఉంటది.
అందుకే చాలా మంది
పని మధ్యల చిన్న టీ బ్రేక్ తీసుకుంటరు.
ఆ ఐదు నిమిషాల చాయ్ టైమ్
కొన్నిసార్లు గంటల ఒత్తిడిని తగ్గిస్తది.
కానీ… చాయ్ కూడా హద్దులోనే మంచిది
ఏది ఎక్కువైనా ప్రమాదమే.
రోజుకు పది పన్నెండు చాయ్‌లు తాగేవాళ్లు సుత ఉంటరు.
వాళ్లకు చాయ్ అలవాటు కాదు…
అది చిన్న అడిక్షన్.
ఎక్కువగ చాయ్ తాగడం వల్ల
యాసిడిటీ,నిద్రలేమి,గుండె వేగం పెరగడం
ఒత్తిడి,చక్కెర సమస్యలు వంటివి రావచ్చు.
ఇంకా కొందరు,భోజనం మానేసి చాయ్‌తోనే బతుకుతరు.
కడుపు మాత్రం లోపల “అన్నం పంపించండి బాబోయ్” అని ఏడుస్తుంటది.ఆలోచించుండి జెర.
చాయ్ మీద మనుషులకు ప్రేమ ఎందుకింత అంటే..ఇది కేవలం రుచికోసం కాదు.
చాయ్‌తో జ్ఞాపకాలు కలిసిపోతయి.
కొంతమందికి అమ్మ చేతి చాయ్ గుర్తుంటది.
కొంతమందికి కాలేజీ కాంటీన్ గుర్తుంటది.
కొంతమందికి ప్రేమ కథ గుర్తుంటది.
చాలాసార్లు
మనిషి చాయ్‌ను కాదు…
ఆ క్షణాలను ప్రేమిస్తడు.
వర్షం పడుతుంటే
కిటికీ దగ్గర కూర్చొని చాయ్ తాగడం…
రాత్రి ఫ్రెండ్స్‌తో రోడ్‌సైడ్ చాయ్…
పరీక్షల ముందు నిద్ర పోకుండా చాయ్…
ఇవన్నీ జీవితంల చిన్న చిన్న జ్ఞాపకాలుగ మిగిలిపోతయి.
ఇప్పుడు చాయ్ కూడా స్టేటస్ అయిపోయింది.
ఎక్కడో ఒక కేఫ్‌లో కూర్చొని
కప్పు ఫోటో తీసి
“Tea vibes” అని స్టేటస్ పెడుతున్నరు.
కానీ నిజమైన చాయ్ ఎమోషన్
అక్కడ కాదు.వర్షంల తడుస్తూ
రోడ్ పక్కన బండి దగ్గర వేడి వేడి చాయ్ తాగిన వాళ్లకే ఆ అసలు ఫీలింగ్ తెలుస్తది.
రచయితలకు,కవులకు
చాయ్‌కు సాహిత్యంతో విడదీయలేని సంబంధం ఉంటది.
ఎంతోమంది రచయితలు
రాత్రిళ్లు చాయ్ తాగుతూ రచనలు చేస్తరు.
కవిత పుట్టడానికి
కొంతమందికి ప్రేమ అవసరం.
కొంతమందికి బాధ అవసరం.
కానీ చాలామందికి ఒక కప్పు చాయ్ సుత అవసరమే!
చాయ్ తాగుతూ…జీవితాన్ని పరిశీలించే వాళ్లు ఎక్కువగ ఆలోచిస్తరు.
అందుకే చాయ్ బండ్ల దగ్గర
ఎక్కువ ఫిలాసఫీలు పుడుతుంటయి.
చాయ్.. భారతదేశాన్ని కలిపిన పానీయం.
భారతదేశంల భాషలు మారుతయి.
ఆహారాలు మారుతయి.
సంస్కృతులు మారుతయి.
కానీ ఒక విషయం మాత్రం కామన్ అదే ‘చాయ్’.
ఉత్తర భారతదేశంలో“చాయ్” అంటరు.
తెలంగాణల “చాయి” అంటరు.
ఎక్కడైనా దాని మీద ప్రేమ మాత్రం ఒకటే.
రైల్వే స్టేషన్‌ల “చాయ్ చాయ్” అని అరుస్తున్న శబ్దం, ( ఇప్పుడు నేను విన్న “చా… టి” శబ్దం సుత )
మన భారతదేశానికి ఒక ప్రత్యేకమైన గుర్తు.
చాయ్ నిజంగా అవసరమా…అంటే..
శరీరానికి కాకపోవచ్చు,
కానీ మనసుకి మాత్రం కొన్నిసార్లు అవసరమే.ఎందుకంటే ఇది కేవలం టీ కాదు.అలసిపోయిన మనిషికి చిన్న విశ్రాంతి.బాధలో ఉన్నవాడికి చిన్న ఓదార్పు.స్నేహితులకి ఒక కారణం.
ప్రేమికులకి ఒక మొదలు.రచయితకి ఆలోచన.పేదవాడికి చిన్న ఆనందం.
అందుకే
ఈ దేశంలో ఎన్నో విషయాలు మారిపోయినా..
ఒక విషయం మాత్రం మారదు.
“రా… ఒక చాయ్ తాగుదాం” అనే పిలుపు.
ఎందుకంటే
భారతదేశంలో చాయ్ అనేది
కేవలం పానీయం కాదు…
అది నిజంగానే ఒక ఎమోషన్..! ఒక అనుభూతి.
ఉంట మరి పైలం, ఒక కప్పు చాయ్ తాగొస్త.

Written by Ramadevi Kulkarni

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

చిలక కథ……

నేను ఓడిపోలేదు