పచ్చటి కొండలతో నిండిన పరిసరాలు ప్రశాంతమైన పిల్లగాలులు చెదిరిన మనసుకి ఎంతో ఊరటనిచ్చాయి. ఎంతో సేద తీరింది తరుణ్ మనసు .ఒకవైపు రంగురంగుల పూలు పరచుకున్న ప్రకృతి కాంత తన ఫియాన్సీని జ్ఞాపకం చేస్తుంది.అన్ని రంగులు కలిసిన మల్టీ కలర్స్ అంటే ఇష్టం తనకి.కానీ జీవితంలో డిఫరెంట్ షేడ్స్ నీ ఇష్టపడదు.ఒక్క’ లవ్ ‘షేడ్ మాత్రమే ఇష్టమంటుంది.తను ఎన్నిసార్లు నచ్చజెప్పటానికి ప్రయత్నించినా నాకే నువ్వు సొంతం.నీ ప్రేమ నాకే కావాలి అని అంటుంది తన్మయి.మళ్లీ మనసు చెదిరినట్లు అయింది.చెలి తలపులు మదిలో మెదలగానే ఊహల పల్లకిలో విహరించినట్లు ఉండాలి కానీ తన ఫియాన్సీ మదిలో మెదలగానే మనసు మెలి పెట్టిన బాధ మిగులుతోంది.
జీవితంలో ఒక్క లవ్ షెడ్ మాత్రమే ఉండటం ఎవరి జీవితంలో నైనా సాధ్యమా? నువ్వు నాకే సొంతం అని మొదటిసారి విన్నప్పుడు ఆ మాట పాతదైనా,ఆ తలపే కొత్తగా అప్పుడే వింటున్నట్లుగా అనిపించి ఒళ్ళు పులకరించినట్లుగా ఉండేది . కానీ రాను రాను తన ఇంటి పరిస్థితుల్లోఇమడడం తన్మయికి కష్ట సాధ్యమని అనిపించడం మొదలైంది.
అది ఎప్పుడు అంటే పెళ్లి ప్రస్తావన వచ్చినప్పుడు- “ఇలానే కలిసి ఉందాం. “కొంచెం సేపు ఆగాక’ సహజీవనం ‘చేద్దామా?అని అనగానే అవాక్కయ్యాను.అదేమీ నిద్రలోని కలవరింత కాదు. ఆ మాట అంటున్నప్పుడు కళ్ళు మూసుకుని ఏదో లోకంలో ఉన్నట్లు ఆమె పెదవులు మాత్రం కదిలాయి . ఆమె ఆ మాటలు మెలకువ లోనే అంటుందని అని చెప్పకనే చెబుతుంది.
ఆశ్చర్యంగా ఏం మాట్లాడుతున్నావు?’ అది సాధ్యమయ్యే పనేనా ‘అని తల పట్టుకున్నాడు. తనను ప్రేమించడం తాను చేసిన తప్పిదమా? ప్రేమ,ఎప్పుడు,ఎలా, ఏ క్షణంలో పుడుతుందో ఎవరు చెప్పగలరు?నేను రాంగ్ డెసిషన్ తీసుకున్నానా? అని ఒక్కసారి పునరాలోచించుకున్నాడు.మళ్లీ అనుకున్నాడు డిసైడ్ చేయటానికి తను ఎవరు?అది తన ప్రమేయం లేకుండానే నిర్ణయం జరిగిపోయింది కదా!
ఆమె ఆలోచనలు ఎంతో విశాలమైనవి. ఆమె ఎంతో సేవా భావం కలిగినది.ప్రపంచంలో ఎక్కడ,ఏ మూల ఏమి జరిగినా తానే మొదట స్పందించి బాధపడేది.ఏదో ఒకటి చేయలేకపోతే ఆమె హృదయం వేదనాభరితమయ్యేది.ఇవాళ రేపు ప్రపంచంలో ఏమి జరిగినా అందరికీ తెలిసిపోతుంది. ప్రపంచం చాలా చిన్నదిగా అయిపోయింది. పిడికిట్లో ఇమిడిపోయిందేమో అన్న భావన కలుగుతుంది.
మనిషిగా జన్మించి వినాశనం సృష్టించే యుద్ధం కోరుకుంటూ ఇతరుల అంతం కోరుకోవడం రాక్షస ఆనందం కాక మరేమిటి.? ఒక తెంపరి, ఒక మూర్ఖుడు వీరిరు వురి మధ్య పంతాలకు ఏ సంబంధం లేని మనుషులు ఎందుకు చనిపోవాలో? ఇది ఎప్పటికీ అర్థం కాని ప్రశ్న.అమెరికా ఈనాడు ఇరాన్ పై ప్రత్యక్ష దాడి చేస్తుంది.ఈ యుద్ధాలలో పిల్లలు, స్త్రీలే గాయపడుతున్నారు, ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు.కనీస యుద్ద నీతిని కూడా పాటించటం లేదు. వారందరి కోసం అందరి సంతకాలు సేకరించి, తన యుద్ధ వ్యతిరేకతను ప్రకటించడంలో అందరికంటే ముందడుగులో ఉంది తన్మయి.యుద్ధమే ఒక సమస్య అయినప్పుడు ఇక ఇది ఏ ఇతర సమస్యలకైనా పరిష్కారం ఎలా కాగలదు?ఇదీ ఆమె సమాజం ముందుంచే ప్రశ్న. ఆ ప్రశ్నకు సమాధానంగా” ఎవరూ అవును యుద్ధమే పరిష్కారం అని అనలేరు .”
ఇలా తన ఫియాన్సీ గురించిన ఆలోచనల సునామీలో కొట్టుకుపోతున్న అబ్బాయిని చూసి తండ్రి ఉండబట్ట లేక కారణం తెలుసుకోకుండా ఆగలేకపోయాడు. ఒక వయసు దాటాక పుత్రుడితో స్నేహితుడి లాగా మెలగాలట తరుణ్ తల్లి గారైన శ్యామల చెప్పింది.ఆ ఒక్క మాటను తూ.చా.తప్పకుండా,ఎదురు మాట్లాడకుండా పాటిస్తాడు అభిరామ్.ఎందుకంటే ఒక స్త్రీగా సంతానం పట్ల బాధ్యత గల గృహిణిగా,ఆ మాట చెప్పడం తన విధి అని అనుకున్నది, చెప్పింది. ఎంతైనా చదువుకున్న సంస్కారవంతురాలు కదా!తన వివేకంతో అత్తగారి ఆలోచనలలో మూర్ఖత్వం ఉందని గ్రహించినా కూడా,పెద్దలను గౌరవించాలనే ఒకే ఒక సంస్కార గుణం తనని పెంచిన వారి నుండి వారసత్వంగా తెచ్చుకున్నది కాబట్టి సహనం అలవర్చుకున్నది.
కొడుకు బాధకు కారణం అడిగాడు అభిరామ్. అప్పుడు తన్మయితో తన పరిచయం ప్రేమగా మారిందని, ఇప్పుడు ఆ అమ్మాయి చేసిన సూచన చూచాయగా చెప్పాడు.అలాగే వయసుకు మించిన పరిణతిని,సామాజిక బాధ్యతలో ప్రధాన భాగస్వామ్య వహించాలనే ఆమె తాపత్రయం గురించి చెప్పాడు. తాను ఆమె మేధను చూసి ప్రేమించానని,అందరి మధ్య మెలుగుతూ తన ఉనికిని చాటుకునే ప్రయత్నం,సాహసాన్ని ప్రశంసిస్తాను నేను.ఏ కష్టం వచ్చినా, నష్టం జరిగినా ఎదుర్కునే ధైర్యాన్ని, సహనాన్ని ఆమె తల్లి’ప్రగతి ‘నుండి నేర్చుకున్నది. కానీ ఆమె చేసిన ప్రపోజల్ ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నాను నాన్నగారు అన్నాడు తరుణ్ ఎంతో బాధగా.
వీరు పెళ్లి రిజెక్ట్ చేయడం లేదు, పెళ్లి ని రీడిఫైన్ చేస్తున్నారు.కుటుంబంలో మనుషుల మధ్య సంబంధాలలో రిఫైన్మెంట్ కోరుకుంటున్నారు.
అభిరాం వాళ్ళది వ్యవసాయ కుటుంబం.తల్లి పరమేశ్వరి కోడ ల్ని అణచి ఉంచటానికి శత విధాలా ప్రయత్నిస్తూ ఉంటుంది. జీతగాళ్ల మీద అరుస్తూ, గద మాయిస్తూ, పనులు పురమాయిస్తూ, కోడలి ముందు దర్పం వెళ్ళబోస్తుంది. కోడలు శ్యామల ఎంత విద్యావంతురాలు అయినా, తనకెంత చదువు రాకపోయినా, ఎవరిని ఎక్కడ ఉంచాలో తనకు తెలిసినంత బాగా ఇంట్లో ఎవ్వరికీ తెలియదు అన్నట్లుగా ప్రవర్తించేది. తనకున్న తెలివితేటల్లో వెయ్యో వంతు కూడా ఎవరికీ లేనట్లు, తన తర్వాత ఇంకెవరికి రావన్నట్లు ఉండేది ఆమె మూర్ఖ ధోరణి. అభిరామ్ తల్లికి అడుగులకు మడుగులొత్తుతూ, విధేయుడిగా నడుచుకునేవాడు. కోడలికి తనకు యజమానికి జీతగాడికి ఉన్న సంబంధం మాత్రమే అనుకునేది. అత్తగారిగా కోడలికి ఏమాత్రం విలువ ఇచ్చేది కాదు. తాను ఒకప్పుడు ఆ స్థానంలో ఉండి వచ్చిన దానిని అనే విషయం ఎప్పుడో మర్చిపోయింది. కొన్ని ఏళ్లుగా ఆమె పెత్తనం లోనే ఆ ఇల్లు నడుస్తున్నది మరి. భోంచేసే వెండి కంచం కూడా ఆమెకి,తన కొడుక్కే పరిమితం అనుకునేది. ముఖ్యంగా ఆమె కోడల్ని తన వెండి కంచంలో భోంచేయటానికి అనుమతించేది కాదు. ఇదంతా తన తండ్రి చూస్తూ కూడా మౌనంగా ఉంటాడు. అలా ఆమె పెత్తనం కొనసాగుతోంది తన ఇంట్లో.
తరుణ్ పుట్టకముందు కోడలికి చాలాసార్లు పిల్లలు దక్కకపోవడం,అందుకు కారణం అన్ని పనులు కోడలు చేతే చేయించడం, కడుపులో పిండం కదలి నెలలు నిండకముందే బిడ్డ పుట్టి పోవడం జరిగింది.అత్తగారుగా కోడలికి సేవ చేయడం మహా పాపం అని అనుకునేది. స్వతంత్రంగా ఆలోచించే తన్మయి ఇదంతా చూస్తూ భరించగలదా? స్త్రీలు “ గృహిణి పాత్రలో ఉంటూ, ఒక చట్రంలో గిరగిరా తిరుగుతున్నట్లుగా,ఆ పరిధిలో నుండి సామాజిక జీవితంలోకి రావాలని అనుకుంటారు కానీ బయటికి వస్తే కుటుంబాలు నిలబడవు అన్న భావనలో ఉంటారు.కానీ తమ జీవితాలను బలి చేస్తూ కుటుంబాలు నిలబడాలా అనే ప్రశ్న వేసుకోరు కదా!—-“ అని ప్రముఖ రచయిత్రి ఓల్గా చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి. ఆంధ్రజ్యోతి దిన పత్రిక లో ‘వివిధ ‘అనే శీర్షికలో ప్రముఖ స్త్రీవాద రచయిత్రి ‘ఓల్గా ‘గారితో ఇంటర్వ్యూ లో ఒక ప్రశ్నకు సమాధానంగా పై మాటలు అన్నవి ఇప్పుడు ఇక్కడ సరిగ్గా సరిపోతాయి అని అనుకొని, ఈ ప్రశ్న లు తన్మయి మనసు లో ఉదయిస్తే? ’Thank less job ‘అని అంటుందేమో!
శ్యామల తండ్రిని పిలిపించి తల్లి దగ్గరికి పంపించడం, రెస్ట్ పీరియడ్ అయినాక మళ్ళీ రప్పించడం, మామూలు వ్యవహారం అయిపోయింది. తరుణ్ కడుపులో పడ్డట్టు తెలియగానే,తరుణ్ వాళ్ళ తాతగారు వెంటనే వచ్చి తల్లి ప్రభ నీడలో జాగ్రత్తగా కాలు నేల కానకుండా,అపురూపంగా చూసుకొని తరుణ్ పుట్టాక అన్నప్రాసన మైనాక గాని పంపలేదు.
మనవడి పెళ్లి కూడా ముచ్చటగా, వాళ్ళ హోదాకి తగినట్లుగా ఘనంగా జరిపించాలని కోరుకుంటోంది తరుణ్ కి నాయనమ్మగా. సంప్రదాయంగా పెళ్లి జరిపించాలని, ఏ చిన్న ఆచారమూ వదిలిపెట్టకుండా ఆడంబరంగా ‘న భూతో న భవిష్యతి’ అన్నట్లుగా ఊళ్ళో అందరూ నాలుగు కాలాలు చెప్పుకునేటట్లుగా ఉండాలని సరదా పడుతోంది పరమేశ్వరమ్మగారు. తన తండ్రి కూడా అమ్మ మాటలకు తల ఊపుతూ’ తానా అంటే తందానా ‘అంటూ తాళం వేస్తుంటాడు. అలా ఆమె మాటకు ఎదురు చెప్పే సాహసం ఇంత ఎవరూ చేయలేదు ఆ ఇంట్లో.
ఆడంబరంగా జీవించడం అమానవీయంగా తలచే ‘తన్మయి ‘కి , వివాహం ఒక ముచ్చటే కాదు భాధ్యతగా భావించే ‘తన్మయి ‘ వాళ్లమ్మగారి ఆలోచనలకి, తన వాళ్ళ అభిప్రాయాలకి పొత్తు కుదురుతుందా అన్న సంశయం కూడా కలిగింది తరుణ్ కి.
అలా ఆమె పెత్తనం ఇంకా కొనసాగుతూనే ఉంది. అలాంటి ఇంట్లో తన్మయి అడ్జస్ట్ అవ్వగలదా? అన్న అనుమానంతో కూడిన భయం కలిగింది తరుణ్ కి.
అశోకవర్ధన్ ఒక కంపెనీలో ఎగ్జిక్యూటివ్.పొడవుగా, ఉంగరాల జుట్టుతో అందంగా ఉంటాడు, తెలుపే గొప్పతనానికి నిదర్శనం అని అనుకుంటాడు.ముట్టుకుంటే మాసిపోతాడేమో అన్నట్టు ఉండే ఛాయతో, తెలుపే అందం,తెలిపే నాగరికత, నల్లగా ఉన్న వారందరూ అనాగరికులనే అంటాడు. పురుషాహంకారం. స్త్రీని కేవలం ఒక వస్తువుగా చూసే మనస్తత్వం ఆయనది. ఒక వస్తువు నచ్చకపోతే దాన్ని వదిలేసి ఇంకో వస్తువుని తెచ్చుకోవాలని చూస్తాడు.
మహిళలు కేవలం అందంగా తయారవ్వాలి, స్టేటస్ కోసం ఉద్యోగం చేయాలి, జీతం కోసం కాదన్నట్లుగా వ్యవహరించాలి. మహిళలు పురుషుల ఆజ్ఞలను పాటిస్తూ,గీసిన గీటు దాటకుండా, తనను తాను నియంత్రించుకుంటూ అదుపులో ఉండాలి.
తన్మయి వాళ్ళ అమ్మ చామన ఛాయ, సంస్కారం ఉట్టిపడే ఆమె కళ్ళను చూడగానే గౌరవభావం కలుగుతుంది ఎవరికైనా. కానీ అశోకవర్ధన్ యొక్క తెలుపు మీది వ్యామోహం ‘ చర్మం రంగు మనిషికి అంతటి అహంకారాన్నిస్తుందని, ఇంతటి వివక్ష ఎదుర్కోవాల్సి వస్తుందని, వ్యక్తిత్వానికి అస్సలు విలువ లేదని, అతడిని చూశాక తెలిసింది.మనసులోనే బాధనణిచివేసుకునేది. పైకి ప్రశాంతంగా ఉన్నట్లు నటించేది.
తన్మయి కోరిందే తడవుగా ఏది కోరితే అది కొనిపెట్టేవాడు. ఎందుకంటే తన్మయి వాళ్ళ నాన్న అశోకవర్ధన్ పోలికే. మంచి మంచి బొమ్మలు, ఫ్రాక్స్ కొనిపెట్టేవాడు. అందరికీ చూపించమని చెప్పేవాడు. అలా తన ప్రేమ ప్రదర్శించి గొప్ప తండ్రి అని అనిపించుకోవాలి అని తాపత్రయపడేవాడు. కానీ ప్రగతి పట్ల ఎలాంటి ఎమోషన్స్ ని ప్రదర్శించేవాడు కాదు.
తన్మయి వాళ్ళమ్మ గంభీరంగా కనిపించే సెలయేరు. కానీ లోపల ఉప్పెనలా చెలరేగే ఆలోచనలు, ఆమెని కల్లోలానికి గురి చేస్తూనే ఉంటాయి. చెమర్చిన కళ్ళని ఆమె అప్పుడప్పుడు ఒత్తుకోవడమే అందుకు సాక్ష్యం. తన్మయి ఇదంతా గమనిస్తూనే ఉంది. జీవితమంటే నిర్వేదం, నిరాసక్తత కలిగాయి ప్రగతికి.కానీ ‘తన్మయి’ ‘కోసం తనని తాను ఆవేశానికి గురికాకుండా నియంత్రిచుకునేది.
వాళ్ళింట్లో ఎన్నో పార్టీలు జరుగుతుంటాయి. ఆ పార్టీ జరుపుకోవడానికి ఏవో చిన్న చిన్న సంఘటనలో కారణమవుతాయి. అశోకవర్ధన్ గారి క్లోజ్ ఫ్రెండ్ ‘మనీషా’ గారి కుక్క గర్భం దాల్చిన కారణంగా ఆమె సంతోషంగా కబురు చెప్పిందని, ఆ సంతోషాన్ని సెలెబ్రేట్ చేయడానికి తన్మయి వాళ్ళిం ట్లో పార్టీ గ్రాండ్ గా అరేంజ్ చేయాలని ‘అశోకవర్ధన్ ‘ నిర్ణయించాడు. ఆ నిర్ణయంలో ప్రగతి కి పాత్ర ఏమీ లేదు. కానీ పార్టీని’ grand success’ చేయాల్సిన బాధ్యత మాత్రం ప్రగతిదే. “మనీషా ఎంతో అందంగా ఉంటుంది మరి.”
మనం మనిషా గారి సంతోషాన్ని సెలెబ్రేట్ చేద్దాం. మన ఇంట్లో ఆ పార్టీ అరేంజ్ చేయాలి. పార్టీలో ఐటమ్స్ అన్ని ‘never before never again ‘ అన్నట్లుగా ఉండాలి అంటూ ఆర్డర్ చేశాడు హోటల్లో ఆర్డర్ చేసినట్టుగా. అలాంటి పార్టీలలో ఇంటి నిండా జనం ఉంటారు కానీ ‘ప్రగతి ‘ అక్కడ ఎక్కడా కనిపించదు. భర్త గౌరవానికి భంగం కలగకుండా, మనసులోని బాధను దాస్తూ సంతోషాన్ని నటించగల అనుభవాన్ని సంపాదించుకుంది ఇన్నేళ్ల కాపురంలో.
అలా కొన్నాళ్ల కాపురం చేసిన తర్వాత’ నువ్వు నాకు తగవు ‘అని విడిపోయాడు. ఆనాటి నుండి ‘ప్రగతి’ కళ్ళు చెమ్మగిల్లటం మరిచిపోయాయి. కూతుర విజయాలలోనే ఆనందం వెతుక్కోవటంలో సక్సెస్ అయ్యింది. కానీ తండ్రి తల్లి మనసును తీవ్రంగా గాయపరిచినట్టుగా తల్లి నిర్విరామంగా వారం రోజులు కంటికి మింటికి ఏకధారగా ఏడ్చిన సంఘటన పదేళ్ల తన్మయి మనసులో చెరగని ముద్ర వేసింది. అంతలా ఎందుకు ఏడుస్తారో గ్రహించలేని అమాయక వయసు కాదు కదా తన్మయిది. ఆ గాయం తాలూకు గుర్తులు మనసులో నాటుకుపోయాయి.
అశోకవర్ధన్ కి కూతురు అంటే ఎనలేని ప్రేమ. అటు తరుణ్ తండ్రికి కొడుకంటే అమితమైన ప్రేమ. ఆ ఇద్దరి తండ్రుల ప్రేమ కలిసి వారిని ఒక అడుగు వెనక్కి లాగాయి. మన ప్రవర్తనే పిల్లలు వేదనకు, విచారానికి కారణమవుతుంటే పెద్దలైన మనము ఇకనైనా మారకుంటే మన జీవితాలకు అర్థం లేదు. ఇంతకాలం నిరర్ధకంగా జీవితాలను ఖర్చు చేశాం. ఇకనైనా జీవితం పట్ల దృక్పధాన్ని మార్చుకొని,అభ్యుదయం వైపుకి చేయి చేయి కలిపి సాగాలని నిర్ణయించుకున్నారు.