నా వంగదేశ యాత్ర

పుస్తక సమీక్ష

యాత్ర అనేది కేవలం ఒక ప్రయాణం కాదు, ఇది ఒక అన్వేషణ. యాత్రలు, చేయటానికి ఉత్సాహం ఉండాలి. కొంతమంది దృష్టిలో యాత్రలు అంటే రొటీన్ పని నుంచి డైవర్షన్ కోసం చేసే ఔత్సాహిక ప్రయాణం మాత్రమే. కానీ కొంతమందికి ఇదొక తృష్ణ. తనివితీరని తృష్ణతో ప్రసిధ్ధి చెందిన ఆధ్యాత్మిక ప్రదేశాలతో పాటు మారుమూల ప్రాంతాలు ప్రాంతాల్లోని చిన్న ఆలయాలని, ఆఖరికి గ్రామదేవతలని కూడా వదలరు.
అలాంటి వారిలో రమాశాండిల్య ఒకరు. నిరంతర యాత్రా పిపాసి. ఎన్నో యాత్రలు చేసిన రమ గారు, తను చూడటమే కాదు, ఆ ప్రదేశాలలోని ఆధ్యాత్మికతను ‘ఆస్వాదించి, అనుభవించి’ ఆ ‘రుచిని’ మనకి కూడా చూపించారు తన రచనా విశేషాలను పుస్తక రూపంలో ప్రచురించి.
అలా రాసిన పుస్తకాల్లో ఒకటి ‘నా వంగదేశ యాత్ర ‘ (కళ-కత్తా). కళ-కత్తా అని తను కింద క్యాప్షన్ పెట్టటంతోనే మనందరికీ ఆ పుస్తకం చదవాలనే ఉత్సుకత కలిగించారు.

బెంగాల్ చరిత్ర, వారసత్వ సంపద , చారిత్రక ప్రదేశాలు, కట్టడాలు, స్మారక చిహ్నాలు, బెంగాలీ ప్రజల ఆచార వ్యవహారాలు. కళలు, సంగీతం, నృత్యం, పండుగలు, ఆహారపు అలవాట్లు, సంప్రదాయాలు. రవీంద్రనాథ్ ఠాగూర్, సుభాష్ చంద్రబోస్ ల ఇళ్ళు, ప్రయాణంలో ఎదురైన ఆసక్తికరమైన సంఘటనలు ఇలా ప్రతి ఒక్కటి నూట ఇరవై పేజీల పుస్తకంలో చక్కగా రాసారు.
భాషలో సరళత, కథనంలో ఆసక్తి, విషయ వివరణలో స్పష్టతతో పుస్తకం చదువుతున్నంత సేపూ మనందరినీ కలకత్తా వీధుల్లో విహరింపచేసారు రమా శాండిల్య గారు.
వారి రచనల్లో అన్నీ వాస్తవాలే కనపడతాయి. అందమైన ప్రదేశాలని ఎంత ఆనందంతో వర్ణించి రాసారో, కొన్ని ప్రదేశాలు చూచినప్పుడు కలిగిన నిరుత్సాహం కూడా మనతో పంచుకున్నారు. శాంతి నికేతన్ చూడగానే తనకు కలిగిన అనుభూతి ఆమె మాటల్లో …
“ఊహల్లో ఉన్న శాంతినికేతన్, యదార్థంగా మేము చూస్తున్న శాంతినికేతన్ కు చాలా తేడాగా అనిపించింది. ఊహ ఎప్పుడూ నిజం కాదు. ఊహకు, వాస్తవానికి ఆమడ దూరం అనే విషయం ఎప్పుడు కొత్త పాఠమే.”
“కళలు ,భాషలని బోధించే ఒక విశ్వవిద్యాలయం ఇంత నీరసంగా, నిశ్శబ్దంగా ఉండటం ఒక డిసప్పాయింట్ గా అనిపించింది. బాల్యం నుంచి కలలు కన్న కలల రాజ్యం ఇదేనా అనిపించింది”

ఇలా తనకు కలిగిన ప్రతి ఒక్క భావన నా వంగదేశ యాత్ర లో మనతో పంచుకున్నారు రమా శాండిల్య గారు.
హౌరా బ్రిడ్జి, దక్షిణేశ్వర్ కాళీబరి, వేలూరు మఠం, కలకత్తా కాళీ. ఇంకా చాలా ప్రదేశాలు తాను చూసినవి మనకళ్ళకి కూడా చూపించారు రమ గారు తను పుస్తకం ద్వారా.2015 లో నేను కలకత్తా యాత్ర వెళ్ళాను‌. అప్పుడు నేను కూడా ఈ ప్రదేశాలు అన్నీ, ఏవో ఒకటి రెండు తప్పితే మిగిలినవన్నీ చూసాను. నేను కేవలం చూసాను అంతే. రమా గారి పుస్తకం చదువుతున్నప్పుడు వాటిని పునశ్చరణ చేసుకుంటూ ‘ఆస్వాదించాను’. అంత గొప్పగా నా వంగదేశ యాత్ర పుస్తకం రాశారు రమా శాండిల్య గారు.

నేను పూర్తి వివరాలు సమీక్ష లో కావాలనే ఇవ్వలేదు. ఎందుకంటే పుస్తకం మొత్తం చదివితే కలిగే అనుభూతి వేరు. “నా వంగదేశ యాత్ర” అంత ఆనందానుభూతిని మనకి కలిగిస్తుంది.
ప్రతి ఒక్కరూ చదువవలసిన పుస్తకం. ఎవరికైనా ప్రతులు కావాలంటే +91 96187 66600 ఈ నెంబర్ కి ఫోన్ చేసి పొందవచ్చు.

Written by PVS Krishnakumari

పేరు. : పీ. ( వల్లూరు) వి. యస్. కృష్ణ కుమారి
భర్త : పోతరాజు వేణుగోపాల కృష్ణ మూర్తి ( రిటైర్డ్ ఫైనాన్స్ ఆఫీసర్ హై కోర్టు)
పుట్టిన తేది. ఆగష్టు, 14
తండ్రి. : వల్లూరు కోటేశ్వరరావు
తల్లి : వల్లూరు రాజ్యలక్ష్మి
పిల్లలు : నీలా సుందరి ( కూతురు )
రవిశంకర్ ( అల్లుడు)
శ్రీవాత్సవ ( కుమారుడు)
‌. మృణాళిని ( కోడలు)

జన్మస్థలం : వల్లూరు , గుంటూరు జిల్లా
విద్యాభ్యాసం. : పొన్నూరు, విజయవాడ ,
క్వాలిఫికేషన్ : బి.ఏ. బీఈడీ
వృత్తి. : ప్రిన్సిపాల్ అండ్ కరస్పాండెంట్ శ్రీవాణి మోడల్ స్కూల్ ( సొంత స్కూల్)
ప్రవృత్తులు. : సంగీతం, సాహిత్యం
సాహితీ ప్రయాణం. : 2010 లో మొదటిసారిగా కవితలతో మొదలైంది. వార్త, మన తెలంగాణా, సత్యం ఆన్లైన్ మ్యాగజైన్ లలో వందకి పైగా కవితలు
2015 లో మొదటి కథ ' ఓ సీత కథ' నవ్య వారపత్రికలో ప్రచురితమైంది. ఆ తర్వాత నవ్య, పాలపిట్ట, నమస్తే తెలంగాణా, జాగృతి, ఉషోదయ వెలుగు, వార్త ఆదివారం అనుబంధం, ఉషా మ్యాగజైన్ లలొ దాదాపు ఇరవై ఐదు కథలు, బహుమతులు , సాధారణ ప్రచురణకు ప్రచురితమైనాయి.
కథా మంజరి, కథా వేదిక, తరుణి ఇంకా అనేక ఫేస్ బుక్ గ్రూప్ లలో యాభైకి పైగా కథలు రాగా, ఇరవై కథలకి బహుమతులు వచ్చాయి.
నవలలు : జీవన విపంచి
వేద సుధామయం.
నేల నుండి నింగికి ( అముద్రితం)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

అనుభవాలకు ఆదికావ్యం ఆడదాని జీవితం…

అమ్మకం