నేలతల్లి నవ్వింది 3   

ధారావాహిక నవల

రైతులందరినీ సమావేశపరిచారు రామనాథం. వారితో  తాము అనగా శివరామకృష్ణ, సీతారామయ్య, లింగమయ్య, చెంచ్వార్, మణికంఠ తో సహా కలసి కలెక్టర్ గారికి విన్నవించిన సంగతి తెలిపాడు.

” మీ పొలాలు రక్షించుకోవలసిన బాధ్యత మీదే! ఆందోళన చేయండి! అవసరమైతే హైకోర్టు!సుప్రీంకోర్టు! వరకు వెళ్దాం. న్యాయం మనవైపే ఉంది. అంటూ వారికి సూచనలు ఇచ్చారు. ఒక ప్రణాళిక ప్రకారం మీరు నడుచుకోవాలి. మీరు ఎటువంటి పరిస్థితుల్లో తలొగ్గ వద్దు. మీరందరూ గవర్నమెంట్ వారి వాహనాలను ఊరిలోకి రానీయకుండా రహదారిలో కూర్చొని ధర్నా చేయమని సందేశాలు ఇచ్చారు.

రవీంద్రకు వయసులో సహజంగా ఉండే ఉడుకు రక్తమే కాక సాహసోపేతమైన వ్యక్తిత్వం కలవాడు.
లింగమయ్య దగ్గర ఒక రాత్రి గడిపి మరుసటి దినం చెంచ్వార్ (చెంచులు పెద్దల్ని చెంచ్వార్ అంటారు) గూడానికి బయలుదేరారు.

లింగమయ్య రవీంద్రని అడవిలో చెట్లు నరకబడ్డ ప్రాంతానికి తీసుకెళ్లాడు. అప్పటికే చాలా చెట్లు నరకబడ్డాయి. అక్కడ ఒక టెంట్లో చెట్లు నరకటానికి ఉపయోగించే  పరికరాలు ఉంచబడ్డాయి. వాటిమీద ఎండుకొమ్మలు పరచి ఉంచారు ఆ ప్రదేశానికి జీపులో వచ్చినట్లు టైర్ల ఆనవాళ్లు కొండ దిగువ వరకు చూపెడుతున్నాయి. కొండ దిగువన ఏదేని గ్రామం ఉందా అని అడిగాడు రవీంద్ర.

“లేదు దొర! అటు దిక్కు అడవి ఇంకా దట్టంగా ఉండి పోను పోను నల్లమల అడవులలో కలుస్తుంది..
ఆఁ అయితే ఇటు దిక్కు అడవి గుండా ఇరవై మైళ్ళ కి హైవే ఉండాది.” అంటూ తనకి తెలిసిన సమాచారం చెప్పాడు చెంచ్వార్. ఆ రాత్రి చెంచుగూడెంలో బస చేశాడు రవీంద్ర.

రాత్రి పదిన్నర కాకుండానే జీపుల చప్పుడు తో గూడెం అంతా మేల్కొంది. సింహాలు గుంపు గూడెం మీద పడ్డట్టు గూడెం అంతా అల్లల్లాడిపోయింది.

కొంతసేపటికి ఆ చప్పుడు ఆగింది. నెమ్మదిగా చెట్ల కొమ్మలు నరకటం చప్పుడు, రంపపు కోత చప్పుడు అడవిని కోలాహలం చేస్తున్నాయి.

రవీంద్ర చెంచ్వార్ని  లేపి టార్చ్ లైట్ తీసుకొని నెమ్మదిగా అడవిలోకి వెళ్ళసాగారు. కొంత దూరంలోనే అడవి అంతా పెట్రొమాక్స్ లైట్లతో
పట్టపగలల్లే దేదీప్యమానంగా ఉంది. దాదాపు అరవై మంది చెట్లను నరికే పనిలో ఉన్నారు. ఆరడుగుల ఒక వ్యక్తి తలమీద హాట్ తో అక్కడి వాళ్లకి పని పురమాయిస్తున్నాడు. ఒక పది పదిహేను మంది సాయుధులు చుట్టుపక్కల కాపలా కాస్తున్నారు.

“బాబయ్య! వాళ్లు చాలా దుర్మార్గులు. వెనక్కి పోదాం.” అంటూ రవీంద్రని తొందర చేశాడు చెంచ్వార్.

రవీంద్ర తన మొబైల్ లో అక్కడి వాతావరణం వీడియో తీసి వెంటనే కలెక్టర్ గారి వాట్సాప్ కి మెసేజ్ పంపించాడు.

నెమ్మదిగా గూడెం దారి పట్టాడు. తెల్లవారి ఐదున్నర అవుతుందనగా అడవి అంతగా నిశ్శబ్దం.ఆరు గంటల ప్రాంతాన కలెక్టరు అభిషేక్ రవీంద్ర కి కాల్ చేశాడు.
జరిగినదంతా చెప్పాడు రవీంద్ర.

“నేను కొంత పోలీస్ ఫోర్స్ తో  చెంచుగూడానికి వస్తాను. మీరు అక్కడే ఉండండి. అని అన్నాడు
కలెక్టర్ అభిషేక్.

‌సరే అని కాలకృత్యాలు తీర్చుకొని కలెక్టర్ రాక కోసం ఎదురుచూడ సాగారు.

★★★

లింగమయ్య ద్వారా రవీంద్ర చెంచుగూడెంలో ఉన్నాడని తెలుసుకుంది బృంద.

“లింగం కాకా! అక్కడ వసతి ఉందా!” అని అడిగింది.

ఒక గుడిసె ఉంది వెదురు మంచంతో. కానీ మీ అటోంటోళ్లు తినడానికి మా దగ్గర ఏముండాది?
అయితే మేకపాలు మస్తు దొరుకుతాయి అన్నాడు
లింగంమయ్య.

“నేను రవీంద్ర సార్ కు భోజనం తయారు చేస్తా. అందజేస్తావా!”అని అడిగింది బృంద.

“గట్టనే బిడ్డ. కలెక్టర్ బాబు నన్ను మీ ఇంటి దగ్గర ఉండమన్నారు ఆ బాబు వస్తారట చెంచుగూడెం పోవాల.” అన్నాడు లింగమయ్య.

“మరి ఆ సారు అంత దూరం నడుస్తారా?” అనుమానం వెలిబుచ్చింది.” బృంద.

“లేదు బిడ్డా! ఈడనుంచి అడవికి చుట్టూ తిరిగి జీపు పోతది.” అని అంటుండంగనే  మూడు జీపులు మణికంఠ ఇంటి మదు ముందు ఆగినాయి.

మణికంఠ సాదరంగా తమ కుటీరంలోకి అభిషేక్ ని ఆహ్వానించి బృంద తన వారసత్వపు వైద్యానికి వారసురాలని పరిచయం చేశాడు. ఇక్కడ అడవులలోని ఆయుర్వేద మూలిక అధ్యయనానికి వచ్చినట్లు తెలిపాడు.

అభిషేక్ బృందని  తమతో రమ్మని ఆహ్వానించాడు.

వెతకబోయిన తీగ కాలికితగిలినట్లు రోగి పాలే కోరాడు వైద్యుడు పాలే కోరాడన్నట్లు అయింది బృందకి. గబగబా వంట ప్యాక్ చేసుకుంది మాణిక్యాంబ బృంద కలిసి ఆలు కూర, రొట్టెలు పులిహార అంతకుముందే చేసింది.

“బామ్మా ! వండినదంతా  తీసుకెళ్తా. అడవి కదా ఎవరికైనా కావాలంటే ఉంటుంది.” అని,  జాబు కోసం ఎదురు చూడకుండా కాకి ప్యాంటు మీద క్రీమ్ కలర్ షర్టు కాళ్ళకి షూస్, గాగుల్స్, హేట్ , బాక్ పాక్ తో రెడీ అయింది.  బృందని చూసి భుజాలు ఎగరేశాడు అభిషేక్.

మణికంఠ కొన్ని మూలికల పేర్లు చెప్పి అవి ఈ కాలంలో దొరుకుతాయి గుర్తుపట్టి తీసుకురమ్మని చెప్పి పంపాడు.

త్రోవ పొడుగునా అభిషేక్ ఎన్నో సందేహాలు ఆయుర్వేదపు వైద్య విధానం గురించి వెలిబుచ్చగా అన్నిటికీ ఎంతో స్పష్టంగా ఓపికగా వివరించింది బృంద. బృందని లింగమయ్య తమ గూడెం దగ్గర దింపుదామనుకుంటే తాను చెంచు గూడానికి వస్తానని అడిగింది. సరే! అని చెంచుగూడానికి అందరూ బయలుదేరారు.

★★★

అభిషేక్, చన్చ్వార్, లింగమయ్య, రవీంద్ర, బృంద అక్కడ చెక్క కుర్చీ లాంటి కుర్చీల మీద కూర్చున్నారు.

చెంచ్వార్, రవీంద్ర రాత్రి తాము చూసినదంతా కలెక్టర్ అభిషేకి చెప్పారు. కలెక్టర్ పర్సనల్ సెక్రటరీ ఆదిత్య  రవీంద్ర చెప్పినదంతా నోట్ చేసుకున్నాడు.

ఏదో గుర్తుకు వచ్చినట్లు రవీంద్ర “సార్! నాకు తెలిసి రాత్రిపూట అంతమంది ఆ ప్రదేశానికి తరలివస్తారనిపించటం లేదు.వారు ఈ అడవిలోనే ఎక్కడో బసచేస్తున్నారనిపిస్తోంది.” అని అనుమానం వెలిబుచ్చాడు.

“మీరు సరిగ్గానే ఊహించారు. నేను అదే ఆలోచిస్తున్నా. రోజు వారు అంత దూరం నుంచి వచ్చి పదిన్నరకల్లా వస్తే ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ,(ఎఫ్ ఆర్. ఓ.) కి తెలియకపోవటం అనే అవకాశం ఉండదు. ఒకరోజు కాకపోతే ఇంకొక రోజు పట్టుబడక మానరు. అలాగే కరెక్ట్ గా ఐదు గంటలకి పనులు ఆపు చేస్తున్నారంటే వారి నివాసాలు ఈ అడవిలోనే  ఉండి ఉండాలి అన్నాడు. వారిలో ఎవరు దొరికినా అసలు వ్యక్తిని దొరకబుచ్చుకోవటం తేలిక.” అన్నాడుఅభిషేక్‌

“మిస్టర్ రవీంద్ర మీరు మాకు ఈ కేసులో సహాయ సహకారాలు అందించాలని నా రిక్వెస్ట్.” అన్నాడు అభిషేక్

“అయ్యో! ఎంత మాట నేను ఎన్.జి.ఒ ని అది నా బాధ్యత. పర్యావరణ పరిరక్షణ మా ధ్యేయం.” అన్నాడు రవీంద్ర.

అక్కడ నుంచి కాలినడకన చెట్లు నరికిన ప్రాంతానికి వెళ్లారు. కెమెరామెన్ అక్కడ అన్నిచోట్ల ఫోటోలు తీశారు ఏమైనా క్లూ దొరుకుతుందేమోనని.
చెట్టునినరికే వాళ్ళు చెట్టు కొమ్మలని ముందు నరికి తరవాత మొదలు నరకటంతో పెద్దపెద్ద చప్పుళ్ళకి ఆస్కారం లేదు. అక్కడ ఉండే వన్యప్రాణులు ఆ చప్పుళ్ళకి అప్పటికే అక్కడ నుంచి పారిపోయిన ఆనవాళ్లు కనపడ్డాయి.

“ఇంకొక విషయం సార్ వర్షాకాలంలో ఈ కొండల మీదుగా వచ్చే జలపాతాలు నేరుగా గ్రామాలలోకి చొచ్చుకొని పోకుండా ఈ అడవి కాపాడుతోంది. ఆ జలపాతాలు అడవిలో సెలయేర్లుగా ప్రవహించటంతో దిగువ పొలాలకు సమృద్ధిగా భూగర్భ జలాలు అందుబాటులో ఉన్నాయి. అందుకే ఇక్కడ పొలాలు ఇంత సస్యశ్యామలంగా ఉన్నాయి.ఈ విధంగా అడవి నరకటం వలన ఈ నీరు పల్లెలని ముంచగలదు. అంతేకాక ఇక్కడ ఏ పరిశ్రమ పెట్టిన ప్రమాదమే.” అంటూ మెత్తగా కలెక్టర్ ని హెచ్చరించాడు రవీంద్ర.

రవీంద్ర మాటల్లోని అంతరార్థం అర్థమై చిరునవ్వుతో ‘ఈజిట్ సో!’ అంటూ భుజాలు ఎగరవేశాడు కలెక్టర్ అభిషేక్.

అక్కడ పడగొట్టిన చెట్టు కొమ్మల మీద అందరూ సేద తీరడానికి కూర్చున్నారు.మొండేలతో చెట్లు, చెల్లాచెదురుగా పడివున్న పక్షుల గూళ్ళు, అందులోంచి పగిలిన గుడ్లు.చచ్చిన రెక్కలు రాని, రెక్కలారని పక్షి పిల్లలతో ఆ పరిసరాలు హృదయ విదారకంగా ఉంది.

ఇంతలో ఎలా వచ్చిందో బృంద పదిమంది గూడెం పిల్లల్ని తీసుకొని అక్కడికి వచ్చింది. బృందా అందరికీ రొట్టెను కూర పులిహార ఆకుల్లో పెట్టి ఇచ్చింది.

అప్రయత్నంగా “బృందా! ఇంత అడవిలోపలికి ఎందుకు వచ్చావు? సేఫ్టీ కాదు?” అంటూ అప్రయత్నంగా అరచినంత పని చేశాడు రవీంద్ర.

మీరు పర్యావరణ పరిరక్షణార్థం వస్తే మేము మా ఆయుర్వేద మూలికల అన్వేషణార్థం వచ్చాం. మీరు పరోక్షంగా మా పని చేస్తున్నారు. అంటూ రాని కోపం నటిస్తూ అంది బృంద.

“బృందా మేడం! నాకు ఇవాళ డ్యూటీ చేస్తున్నట్టు లేదు ఏదో వనభోజనానికి వచ్చినట్లుంది పులిహోర రోటి కూర ఒక్క స్వీట్ తప్పించి.” అన్నాడు అభిషేక్

“సార్! బృందా అనండి చాలు. నేను అన్ని విధాలా మీ కంటే చాలా చిన్నదాన్ని.” అంది వినయంగా బృంద.

ఇంతలో చెంచ్వారు బాదం ఆకుల్లో ఉడకపెట్టిన చిలకడ దుంపలు తేనెలో ముంచినవి అందరికీ ఇచ్చాడు.

ఓ! స్వీట్ వచ్చేసింది అన్నారు అందరూ.

అభిషేక్ కొంత పోలీస్ ఫోర్స్ నుంచి చెట్లు నరుకుతున్న వారికి అంతరాయం కలిగించమని డైరెక్ట్ అటాక్ చేయవద్దని, వీలైతే ఆ కార్యకలాపాలలో ఉన్న ఎవరినైనా పట్టుకొని తన ఎదుట ప్రవేశ పెట్టమన్నాడు.

ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ని మరుసటి దినం కలెక్టర్ ఆఫీసులో కలవమని మెసేజ్ పంపించాడు అభిషేక్.

తిరుగు ప్రయాణంలో బృందని మణికంఠ ఆచార్యుల వద్దదించి కలెక్టర్ ఆఫీస్ కి వెళ్ళాడు అభిషేక్.

★★★

ఆరోజు రాత్రి మరల అడవిలోని శబ్దాలను పోలీసులు రవీంద్ర చెంచ్వార్ మరియు యువకులైన చెంచుఅనుచరులు,లింగమయ్యలు వినిపించడంతో అప్రమత్తులయ్యారు. చెంచ్వార్ మరియు చెంచుయువకుల సహాయంతో పోలీసు బలగం ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టింది. వారి పనులకు అంతరాయం కలిగించడమే ధ్యేయంగా పోలీసులు గాలిలో కాల్పులు జరిపారు.ఆ కాల్పులకు చలించక  పోవటమే కాక వారు పోలీసు బలగం మీద ప్రత్యక్షంగా కాల్పులు జరిపారు. అంతేకాక వారి కార్యకలాపాలను చెంచులే తెలిపి ఉంటారన్న కోపంతో విచ్చలవిడిగా కాల్పులు జరుపుతూ పరారవ్వ ప్రయత్నించారు.

ఆ కాల్పులలో చెంచువారు అనుచరుల లో ఒకరికి  తూటా గుండ్లు చొచ్చుకొని పోగా ఇంకొక ఐదుగురికి భుజం లోంచి, కాళ్ళలోను తూటాలు చొచ్చుకొని పోయాయి. పోలీసులకి స్వల్ప గాయాలు అయ్యాయి. వెంటనే గాయపడ్డ చెంచులను మణికంఠ దగ్గరకు పంపారు. బాగా తూటా గుండ్లు తచొచ్చుకొని పోయిన చెంచును ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ఇంతలో రవీంద్ర గురించి చూసిన చెంచువారికి రవీంద్ర కనిపించలేదు. పోలీసులు కాల్పులు జరుపుతూ ఆ దుండగుల్ని వెంబడిస్తూ వెళ్లారు.

తెల్లవారింది రవీంద్ర జాడలేదు. చెంచ్వార్ అడవి అంతా గాలించగా ఒక సెలయేరు దగ్గర రక్తస్రావంతో స్పృహ తప్పి పడి ఉన్న రవీంద్ర కనిపించాడు. చాతిలో ఎడమవైపు గుండు తగలటంతో కొంచెంలో ప్రాణాపాయం తప్పింది.

ఈ విషయం తెలిసిన అభిషేక్ పోలీసు బలగంతో ఆ స్థలానికి చేరుకొని విస్తృతమైన గాలింపు చేపట్టి చుట్టుప్రక్కల అడవిలో టెంట్లలో ఉన్న వ్యక్తులను అరెస్టు చేశారు .

అభిషేక్ రవీంద్రను గ్రామంలో మణికంఠ ఆచార్యుల వారి దగ్గరకు ప్రాథమిక వైద్యానికి పంపారు.

★★★

బృంద గాయాన్ని ద్రావకంతో శుభ్రం చేసి తదుపరి వైద్యం గురించి తాత వైపు చూసింది.

“బృందా! ఇటువంటి గాయాలకి  ‘వ్రణగ్రంధి’ ఆవశ్యకం. అనగా ఒక రకమైన సర్జరీ. దీని ద్వారా గాయమై దెబ్బతిన్న కణాలను తొలగించడం వలన గాయం వేగంగా మానుతుంది. ఇప్పుడు రోగికి ‘మంజిష్ఠ’, ‘గుడుంచి’, పసుపులతో గాయం పరిస్థితి  బట్టి కట్టు కట్టాలి. గాయం బాధ పెడితే కుమారి (అలోవెరా) లేపనం గాయం మంటని తగ్గించడమే కాక శిలీంధ్రాలు (ఫంగస్), బ్యాక్టీరియా వైరస్ వంటి సూక్ష్మజీవులు నించి గాయాన్ని కాపాడుతుంది.”అని బృందకి వైద్య విధానాన్ని సూక్ష్మంగా తెలియచెప్పాడు మణికంఠ.

“బృందా! రోగికి వైద్యంతో పాటు గాయం తగ్గటానికి రోగి త్వరగా కోలుకోవడానికి ఆహారం అత్యంత ఆవశ్యకం. రవీంద్ర అయిన వాళ్ళని పిలిపిస్తే బాగుంటుంది.” అన్నాడు మణికంఠ.

బృందా మాణిక్యంబ కలిసి రోగికి కావలసిన ఆహారం తయారు చేశారు.

అప్పుడప్పుడే కళ్ళు తెరుస్తున్న రవీంద్ర మోహం లోకి ఆతురుతగా చూసింది బృంద.

కనులు విప్పి నట్లే విప్పి మరల కన్నులు మూసుకున్నాయి రవీంద్రకి.

అప్పుడే వచ్చిన సీతారామయ్య పల్స్ చూసి స్టెతస్కోప్ తో పరిశీలించాడు. ఏమి ప్రమాదం లేదు అని నిర్ధారించాడు.

అభిషేక్ శివరామకృష్ణకి ఫోన్ చేసి రవీంద్ర సంగతి కనుక్కొని ఒక గంటలో తాను అక్కడ ఉంటానని తెలిపాడు.

★★★

కలెక్టర్ అభిషేక్ ని చూసి,” కలెక్టర్ గారు రవీంద్ర బంధువులకి తెలుపుతే బాగుంటుందేమో!” అన్నాడు శివరామకృష్ణ.

“అవును అందుకే వచ్చాను.నాకు మణికంఠ ఆచార్యుల వారి మీద సంపూర్ణ విశ్వాసం ఉంది. వైద్యం కొనసాగించండి.ఆచారవర్యా!” అన్నాడు అభిషేక్.

చిరునవ్వుతో శివరామకృష్ణ భుజాన్ని తట్టి ” నేనే రవీంద్ర బంధువుని. రవీంద్ర కి తల్లితండ్రి అన్నను నేనే. మా పిన్ని బాబాయి వరదల్లో కొట్టుకుపోతే ఆ జిల్లా కలెక్టర్ నైనుండి ఆ గ్రామం మునుగుతుందని తెలిసి రాజకీయ నాయకుల కబంధ హస్తాలని ఎదిరించలేక గ్రామం గ్రామం కొట్టుకుపోతుంటే నిస్సహాయంగా చూస్తూ ఉన్నా. అందుకే నా తమ్ముణ్ణి పర్యావరణ పరిరక్షణా ఉద్యమంలో ఉన్న వ్యక్తిగా తీర్చి దిద్దాను. ఇక్కడి ఎన్జీవోలు అయితే వారి కార్యకలాపాలు గవర్నమెంట్ కి తెలిసిపోతాయని ఒక ప్రణాళిక ప్రకారం ఈ మీ గ్రామ ప్రజల సమస్యను తీర్చి మీ గ్రామాలను కాపాడాలని ఎప్పటికప్పుడు ఇక్కడ కార్యకలాపాలు తెలుసుకోవటానికి బాంబే నుంచి రవీంద్ర ని లాంగ్ లీవ్మీద నా పర్సనల్ ఇంట్రెస్ట్ తో పిలిపించాను. రవీంద్ర నా ఆదేశాను ప్రకారం పని చేస్తున్నాడు రవీంద్రుని కాపాడండి. మీ పొలాలు మీ అడవిని కాపాడే బాధ్యత రవీంద్ర ది అన్నాడు అభిషేక్.

అందరూ చిత్తరువులయినారు. ఏ కలెక్టరు తమ పొలాలని మందుల ఫ్యాక్టరీకి ఇవ్వమని మాట్లాడాడో ఆ కలెక్టర్ పరోక్షంగా తమకింత సహాయం చేస్తున్నాడని తెలియదు.

శివరామకృష్ణని, రామనాథంని మరియు సీతారామయ్యలని పిలిచి వారికి సూచనలు ఇచ్చాడు కలెక్టర్ అభిషేక్.

అడవులు నరుకుతున్న ఆ రియల్ ఎస్టేట్ వ్యక్తులు ఇద్దరని వారి కార్యకలాపాలకి స్థానిక ఎమ్మెల్యే మద్దతు హస్తం ఉందని తెలిసిందని ఈ సమస్య తొందరగానే ముగింపుకి వస్తుందని ఆందోళన చెందవద్దని ధైర్యం చెప్పి రవీంద్రుని కలిశాడు.

“ఎలా ఉన్నావురా రవి” అన్నాడు అభిషేక్ రవి తల నిమురుతూ.

“పరవాలేదు.” అన్నాడు రవీంద్ర.

“వీరు నిన్ను పట్నం హాస్పిటల్లో చేర్చమంటున్నారు. ఏమంటావు?” నవ్వుతూ అన్నాడు అభిషేక్.

“నన్ను పట్నం హాస్పిటల్లో చేరిస్తే మీ వైద్యం మీద మీకు నమ్మకం లేదనుకోవాలి. అంతేకాదు అడవులు ఆయుర్వేద మూలికలు అన్నీ మిథ్యే అని ప్రచారం అవుతుంది. నాకు ఆచార్యుల వారివైద్యం మీద వారి సేవమీద పూర్తి నమ్మకం ఉంది.” అంటూ క్రీగంట బృందని చూశాడు.

“వైద్యం మీద ఏమో కానీ, సేవమీద నీకు నూటికి నూరుపాళ్ళు నమ్మకం ఉంది. అవునా!” అంటూ ఎవరికీ వినపడనంత నెమ్మదిగా అన్నాడు  అభిషేక్.

“ఏమ్మా బృందా ఏమంటావు?” అన్నాడు అభిషేక్.

అభిషేక్ ఆంతర్యం గ్రహించినవాడై మణికంఠ ఆచార్యులు కృతజ్ఞతతో నమస్కరించారు.
మణికంఠ రెండు చేతులు పట్టుకుని, “పెద్దవారు ఈ చేతులు ఆశీర్వదించడానికి కానీ నమస్కరించకూడదు. అంటూ సెలవు తీసుకున్నాడు అభిషేక్.

★★★
సశేషం

Written by Devulapalli VijayaLaxmi

దేవులపల్లి విజయ లక్ష్మి
విద్యార్హత. Bsc.B Ed
వృత్తి. రిటైర్డ్ టీచర్ (st Ann's Taraka)
వ్యాపకాలు కవితలు,కధలు వ్రాయటం, చిత్రలేఖనం(తైలవర్ణ చిత్రాలు వేయటం.)పుస్తక పఠనం,అల్లికలు,సంగీతం ఆస్వాదించటం ,దేశం నలుమూలల పర్యటించటం మొదలైనవి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

“విద్యను ఒసగుమా ఒజ్జ గణపతీ!

ఒడిపిళ్ళు – 34