గత శతాబ్దపు అసాధారణ మహిళ శ్రీమతి ఇందిరా ప్రియదర్శిని .అద్భుతమైన చొరవ ,ధైర్యం ,నిర్భయం ,రాజనీతి ఆమె ఆభరణాలు. సరిగ్గా 109 సంవత్సరాల క్రితం ఆమె జవహర్లాల్ నెహ్రూ , కమలాదేవి దంపతులకు అలహాబాద్ లోని ఆనంద భవన్ లో జన్మించింది . నాయనమ్మ మగ పిల్లవాడు పుడతాడని భావించి ,అమ్మాయి పుట్టిందని నిరాశ చెందారట. తాతగారైన మోతీ లాల్ గారు మన చిన్నారి పాప వెయ్యి మంది పుత్రులతో సమానమైన ఖ్యాతిని సంపాదిస్తుంది అన్నారట .ఆమె తాత గారి అంచనాలను దాటి కోటి కొక్కరై ప్రకాశించారు.
ఇందిరకు ప్రియదర్శిని అనే పేరు పెట్టింది రవీంద్ర నాధ్ ఠాగూర్ గారు .ఆమె చిన్నతనంలో పశ్చిమబెంగాల్లోని శాంతినికేతన్ లో చదువుకున్నారు .ఆమె వ్యక్తిత్వాన్ని చూసి ముచ్చటపడిన విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ ప్రియదర్శిని (చూడ ముచ్చటైన రూపం కలది) అనే పేరు పెట్టారు
నెహ్రూ కుటుంబం రాజకీయాలలో మునిగి తేలుతూ ఉండడం వలన ఆమెలో బాల్యం నుండే తానూ దేశం కోసం ఏదైనా చేయాలనే ఆరాటం మొదలైంది .13 సంవత్సరాల వయసులో కాంగ్రెస్లో చేరాలని సంకల్పించారు. నాటి నిబంధనల ప్రకారం సభ్యులకు 18 సంవత్సరాలు నిండాలి .ఆ బాలికకు కోపం వచ్చింది .ప్రతి ఒక్కరికి దేశానికి సేవ చేసే హక్కు ఉంది అని భావించారు .తానే స్వయంగా ఒక సంఘాన్ని స్థాపించారు .శ్రీరామునికి సహాయం చేసిన వానరులను దృష్టిలో పెట్టుకుని దానికి వానరసేన అని పేరు పెట్టారు .ఈ సంఘటన జరిగింది 6 ఏప్రిల్ 1930 .అందరూ ఆశ్చర్య పడేలా అనతికాలంలోనే దాని సభ్యుల సంఖ్య 6 వేలకు పెరిగింది .ఆ సంస్థ కార్యకలాపాలు బహుముఖంగా విస్తరించాయి .ఈ సేన ద్వారా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్య పత్రాలను చేరవేయడం నిరసనకారులకు సేవలు చేయడం వంటి పనులు చేసేవారు .చిన్న వయసు నుండి ఆమెలో నాయకత్వ లక్షణాలు ప్రస్ఫుటంగా కనిపించేవి .
మన నాయకులలో అరుదుగా కనిపించే లక్షణం ఒకటి ఆమెలో ఉండేది .చిన్నదో పెద్దదో వారి వారి సామర్థ్యాన్ని బట్టి ప్రతి సభ్యునికి ఏదో ఒక పనిని కేటాయించేది.
ఒకసారి ఇందిరాగాంధీ ఆలిండియా రేడియోకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన భావాలను ఇలా వెలిబుచ్చారు .నాకు సంగీతం , పక్షులు, పర్వతాలు అంటే చాలా చాలా ఇష్టం .కానీ ఇవన్నిటి కంటే ఒక సామాన్య మానవుని జీవితంలో సంతోషాన్ని కలుగజేసే పనులు చేయడం అంటే ఇంకా ఇష్టం .
దేశంలో బియ్యం కొరత ఉన్నప్పుడు వారింట్లో అన్నం వండడం మానేశారట ఆ పరిస్థితి చక్కబడే వరకు .
తన కు వచ్చిన ఉత్తరాలకు చాలా భాగం ఆమే జవాబులు ఇచ్చేవారట .ఆమె జీవితంలో బాల్యం నుంచి ప్రియమైన నేస్తాలు ఉత్తరాలే .ఓయ అనే , ఒక టర్కీ బాలుడు ఆమెను ఆమె సక్సెస్ కు రహస్యం ఏమిటి అడిగితే ఇలా బదులిచ్చారు .
నా సక్సెస్ సీక్రెట్ ఏమిటని అడిగితే జవాబు చెప్పడం కొంచెం కష్టమే అనిపిస్తుంది .జీవితంలో ముఖ్యమైన అంశం ఏమిటంటే ఒక సామాజిక ప్రయోజనం కోసం కృషి చేయడం. అంతేకానీ మన కోసం ఆలోచించడం కాదుఅని నా భావం .
బాల్యం నుండి ఒంటరితనం ఆమెను నీడలా వెంటాడింది .తల్లిదండ్రులు చెరసాలలో ఉన్నప్పుడు తాను జైలులో ఉన్నప్పుడు కూడాఅదే పరిస్థితి . భర్త మరణం, తండ్రి ,కుమారుల మరణం వీటితో జీవితం శూన్యంగా మరింత ఒంటరితనం లోకి వెళ్ళిపోయినట్లు మొదట్లో భావించారు .ఆమె దుఃఖం తొలగిపోలేదు కానీ, దాన్నే ఒక బలమైన ఆయుధంగా మార్చుకొని తన శక్తి యుక్తులను ప్రజల సేవకు మరలిం చారు .
రాజీవ్ పుట్టిన తర్వాత కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉన్నారు . ఆమె భావాలు మన అంతరంగాన్ని కదిలిస్తాయి.సంజయ్ గాంధీ పుట్టినప్పుడు ఇలా అన్నారు .కుటుంబ సభ్యులు రాజకీయాల్లో గడపడం వలన నా బాల్యం అసాధారణంగా గడిచింది బాల్యమంతా అభద్రతాభావంతో ను ఒంటరితనం తోనూ గడిచిపోయింది .అందువల్లనే నా పూర్తి కాలాన్ని పిల్లల పెంపకంలో గడప దలచాను .ఒక చిన్న మొక్క ఎదగడానికి నీరు ఎంత అవసరమో ఒక పసిపాపకు తల్లి ప్రేమ ,సంరక్షణ అంత అవసరం. ఆమె దృష్టిలో గడపడం సంఖ్యాత్మకం టే (quantity)గుణాత్మకంగా(quality) ఉండాలి ..ఆ ముగ్గురు కలిసి ఆడేవారు పాడేవారు .చర్చించుకునేవారు. చదివేవారు .అవి వారి ముగ్గురి జీవితాల్లో బంగారు ఘ డియలు.
ఒకసారి ఒక ఉద్యోగినుల బృందం ఆమెను కలవడానికి వచ్చారు. ప్రసంగ వశాన తాము ఎన్నో చేయాలనుకుంటున్నాము కా ని సమయాభావం వల్ల చేయలేకపోతున్నామని వాపోయారు. ఆమె దానికి అంగీకరించలేదు .క్రమ శిక్షణ ,సమయపాలన మన కు పెట్టని ఆభరణాలు .తెలివితేటలతో మీ సమయాన్ని మీ అదుపులో ఉంచుకుంటే అసంభవం అన్న మాట ఉండదు అని స లహా ఇచ్చారు
ఆధ్యాత్మికత మరియు యోగ
రాజకీయాల్లో అత్యంత కఠినంగా కనిపించే వ్యక్తిగత జీవితంలో తీవ్రమైన శివ భక్తురాలు .ప్రతిరోజు ఉదయం క్రమం తప్పకుండా తప్పక గాయత్రీ మంత్రాన్ని జపిస్తూ, యోగ సాధన చేసేవారు
ఆమెను మనం ప్రధానిగా గౌరవించడం కాదు. ఆమె వ్యక్తిత్వం ఎందరినో ఆకర్షించింది .వారి కుటుంబానికి సన్నిహితురాలు ,ప్రఖ్యాత స్వాతంత్ర సమరయోధురాలు అయిన పుపుల్ జయకర్ ఇందిరాగాంధీ వ్యక్తిత్వాన్ని ఇలా నిర్వచించారు.
అత్యంత విషాద భరితమైన, ఆందోళన పూరితమైన సంఘటనలను అనుభవిస్తున్న సమయంలో కూడా ఆమె చాలా తేలికగా తనను ఆ పరిస్థితుల నుండి వేరు చేసుకుని ఆలోచించ గలిగేది .అదేఆమె అంతర్గత శక్తి .ఆశక్తి ఆమెను రాజకీయ నాయకులనుంచి సామాన్య ప్రజలవరకు వయస్సుతో నిమిత్తం లేకుండా ఆకర్షించగలిగింది .
ఆబాల గోపాలం ఆమెను డైనమిక్ అండ్ డ్రమాటిక్ పర్సనాలిటీ గా అంగీకరించారు .ప్రధానిగా ఉన్న సమయంలోకార్యాలయంలో చాలామంది ఆమేను మేడం అని పిలవడానికి ఇష్టపడేవారు కాదు. కార్యాలయ సిబ్బంది మరియు సహచరులు ఆమె అధికారిక హోదాకు గౌరవంగా సర్ సంబోధించేవారు .
లండన్ లోని ప్రసిద్ధ మేడమ్ టుస్సాడ్స్ మైనపు మ్యూజియంలో మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్న తొలి భారతీయ మహిళా రాజకీయ నాయకురాలు ఇందిరా గాంధీ
1965 వ సంవత్సరంలో ఒక విదేశీ పత్రిక ఆ సంవత్సరపు మ్యాన్ ఆఫ్ ది ఇయర్ ను ఎన్నిక చేయమని అడిగితే ప్రజలు అత్యుత్సాహంతో శ్రీమతి ఇందిరాగాంధీని ఎన్నుకున్నారు.
ఇందిరాగాంధీ వ్యక్తిత్వంలో అత్యంత ప్రధానమైన లక్షణం ఆమె గుండె నిబ్బరం. క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఆమె భయపడకుండా దృఢంగా నిలబడేవారు. 1971 భారత పాకిస్తాన్ యుద్ధ సమయంలో అంతర్జాతీయ శక్తుల నుండి తీవ్ర ఒత్తిడి వచ్చినప్పటికీ ఆమె వెనక్కి తగ్గకుండా బంగ్లాదేశ్ ఏర్పాటుకు మద్దతు ఇచ్చారు .జాతీయకరణ ,రాజభరణాల రద్దు వంటి విప్లవాత్మక నిర్ణయాలు ఆమె రాజకీయ సాహసానికి నిదర్శనాలు .అందుకే ఆమెను విపక్షాలు సైతం ఉక్కు మహిళగా దుర్గాదేవిగా అభివర్ణించాయి
భారతదేశంలోని స్త్రీల స్థితి గతులను గురించి విదేశీ పర్యటనలలో దొరికే ఖాళీ సమయాల్లో ఆమె చాలా ఆలోచించేది .దేశమంతటా శిశు సంక్షేమ సంస్థలను నెలకొల్పారు. అధిక శాతం నిరక్షరాస్యులు ఉన్న దేశంలో సమాచార విస్తరణ ఆవశ్యకతను అంచనా వేయగలిగారు. గ్రామీణ టీవీ సెట్స్ ఏర్పాటు చేయించారు. ప్రపంచంలోని సంగతులన్నీ ముంగిట్లోకి తెచ్చారు .
ఆమె జీవిత విశేషాలను బయోడేటా లాగా ఎవరైనా చెప్తారు .చదువుతారు .కానీ ఆమె అంతరంగపు లోతుల్లోకి చొచ్చుకొని పోవాలంటే 1984 జనవరి 6న ఫ్రాంక్ఫర్ట్ ర్ అలజి మైన్ జైటుమ్గ్ అనే జర్మనీ వార్తాపత్రిక తయారు చేసిన ప్రశ్నావళి కి శ్రీమతి గాంధీ జవాబులను పరికిస్తే అంతరంగం అవగతమవుతుంది .
మీ జీవితంలోని అత్యంత దురదృష్టకరఘడియలేవీ అన్న ప్రశ్నకు ఆత్మీయుల మరణం అని జవాబు చెప్పారు .
చరిత్రలో మీ అభిమాన వ్యక్తులు ఎవరు అనే ప్రశ్నకు ఆదిశంకరాచార్య ,లియోనార్డో డా విన్సీ అని బదులిచ్చారు .
మీరు ఎలా మరణించారు అనుకుంటున్నారు అనే ప్రశ్నకు హుందాగా నా వారికి అతి తక్కువ శ్రమ ఇచ్చేలా అని జవాబిచ్చారు
ఇందిరాగాంధీ వ్యక్తిత్వం అనేది పట్టుదల, దేశభక్తి ,నాయకత్వ లక్షణాల సమాహారం. రాజకీయ నిర్ణయాలు కొన్ని వివాదాస్పదమైనా ఒక లీడర్ గా ఆమె చూపిన అచంచలమైన ఆత్మవిశ్వాసం ,సంక్షోభాలను ఎదుర్కొన్న తీరు నేటికీ ఎందరో మహిళలకు మరియు కాబోయే నాయకులకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయి.
ఇప్పుడు అర్థమైందా ఇందిరాగాంధీ అంటే ఏమిటో .ఆమె నిజంగానే ప్రియదర్శిని .ఋషి లా జీవించారు .ఆమె వాక్కు జీవితాన్ని అనుసరించింది .అదీ ఇందిరాగాంధీ అంటే .ఆమె నిజంగా ప్రియదర్శిని .
ఏమంటారు?