రమక్కతో ముచ్చట్లు-32

జనవరిల పుట్టి ఫిబ్రవరిల సచ్చిపోయేది!

అందరికీ శనార్థులు.
మంచి గున్నర?

జనవరిల పుట్టి ఫిబ్రవరిల సచ్చిపోయేది ఏందక్క ఇది కత అంటున్నర, జెర ఆగుండి ఆడికే వస్తున్న.
అవునుల్లా… మీకు హ్యాపీ న్యూ ఇయర్ చెప్పలే కద, చెప్పినట్టే.. చెప్పినట్టే!

ప్రతి యాడాది డిసెంబర్ ముప్పైఒకటి రాత్రి దునియా మొత్తం జనాలు ఇగ తత్త్వవేత్తలైపోతరు. గడియారం పన్నెండుకు దగ్గర పడుతుంటే.., మనసుల “ఈపారి తప్పక మారాలె”అని గట్టిగ అనుకుంటరు. లోపలి కెంచెల్లి ఒక ఇత్తనం మోలుస్తది. చేతిల ఫోన్, పక్కన కేక్, టీవీల కౌంట్‌డౌన్… ఈ మూడు ఉరుకుతుంటయి.. ఇగ షురూ…’ నేను మారిపోత’ అని మురుస్తరు. తన బతుకును కొత్తగ డిజైన్ చేయడం. అప్పటివరకు ఎలాంటి ప్లాన్ లేకుండ బ్రతికినోళ్లు సుత, ఒక్క నిమిషంల “రేపటికెంచెల్లి నేను వేరే మనిషిని” అని డిక్లేర్ చేస్తరు. దాని కొక పేరు పెట్టుకున్నరు అదే ‘న్యూ ఇయర్ రిజల్యూషన్’ అని ఇంగ్లిపీసుల అంటరు.

గీ ‘న్యూ ఇయర్ రిజల్యూషన్స్’ మనుషులు అసలకుపోతే గమ్మత్తు జీవులు. ఇవి ఆసుపత్రిల పుట్టయి, ఇంట్ల పెరుగయి. ఫేస్‌బుక్ స్టేటస్‌లో పుడతయి, వాట్సాప్ గ్రూప్‌ల బ్రతుకుతయి, ఇగ ఫిబ్రవరి నెల వచ్చిందాంటే ‘గుర్తుకొస్తున్నాయి….’ పాట అయిపోతయి. జనవరిల పుట్టి , ఫిబ్రవరిల కాలం చేస్తయి.ఇగ కొన్ని అయితే జనవరి రెండో వారంలనే తుస్సు మంటయి.కొన్ని జెర దో నంబర్ బాపతు,సంక్రాంతి పండుగ దాక వచ్చి పతంగితో బాటు బో ( కైంచి) అయిపోతయి.

డిసెంబర్ చివరి రోజుల్ల మనుషులు పడే కతలు గిన్నిన్ని కావు, ‘ఆత్మపరిశీలన చేస్కుంటున్నరా.. అంటడు ఒకడు, ‘యే… సూడురా కొత్త మనిషిని సూస్తవ్’ అని.
‘అన్ని బందు ఇగ, పొద్దుగాల్నే వాకింగ్ పోదం’ అంటడు ఇంకోడు.
‘బరువు తగ్గాలి వదినె’ అంటది గీ వదినె. ఒక్క కత గాదు. ట్రాక్ సూట్లు సుత కొంటరు.’పోయిన యాడాది లెక్క కాదు, ఈ సారి సూపిస్త’ అంటడు ఇంకో సుబ్బడు మామ.
పాపం, ఎప్పటికప్పుడు మనిషి మారుదం అని మస్తు తిప్పల పడ్తరు. ‘ఆశ చేత మనిషి ఆయువు గలన్నాళ్ళు తురుగుచుండు భ్రాంతి తిప్పలేక మురికి భాండమందు ముసురు ఈగల భంగిన్…’ అని చిన్నప్పుడు సదువుకున్నం కద, గట్లనే గివన్ని తీర్మానాలు.
గీ ‘న్యూ ఇయర్ రిజల్యూషన్స్’ కోరికలు ఇని, ఇని దేవుడు సుత రంది అయితడు అనుకుంట.
జనవరి ఒకటో తారీఖు తెల్లారి నంక, సూర్యుడు సుత కొత్తగ అప్పుడే పుట్టునట్టు నిగనిగ అనిపిస్తడు. అలారం మోగుడే ఆలస్యం ‘ఈ రోజు నుంచి నేను మారిపోయిన మనిషిని’ అని షురూ పెడ్తరు, రకరకాల రిసొల్యూషన్సులు. నిన్నటి దాంక అలారం కు ఒక కాన్ బైరి ఇచ్చి, మల్ల దుప్పట్ల దూరినోళ్లు, ఈ రోజు మాత్రం యోగ మ్యాట్ తీసి కూర్చుంటడు. ఆ యోగ మ్యాట్ చూసి ఇంట్లోల్లకే భేజ ఖరాబ్ కావాలి. “అగొ ఏమైంది?’ అన్నట్టు సూస్తరు. అదే జనవరి జయంజయం.
జనవరిల జిమ్‌ల పరిస్థితి చూస్తే కుంభమేళ యాదికి వస్తది. ఎక్కడ సూడు కొత్త మొకాలే. ట్రెడ్‌మిల్ మీద నడుసుకుంట సెల్ఫీలు, డంబెల్స్ వట్టుకుని రీల్స్, “డే వన్” అని క్యాప్షన్‌ల తోని స్టేటస్‌లు…. ట్రైనర్లకు సుత గీ హంగామా ఎర్కనే ఉంటది. ‘వీళ్లల్ల సగం మంది సంక్రాంతి దాటరు, మిగత సగం ఫిబ్రవరి ఫస్ట్ వీక్‌కే ఫట్ మంటరు అని తెలుసు,అందుకే హుషారుతోని ఆళ్ళు సుత ఆర్నెల్ల ఫీజు అడ్వాన్సు అంటరు. ఒక నాలుగొద్దులు అయినంక నువ్వు వస్తేంది, సస్తేంది.
రిజల్యూషన్స్‌లల్ల మస్తు పాపులర్ ఏందంటె ఆరోగ్యం. “ఈ సంవత్సరం నుంచి డైట్”, “ఈసారి మాత్రం ఫిట్ అయిత”, “శెక్కెరె ముట్టుకుంటే ఒట్టే ఇగ”, “బయట తినుడు ముచ్చట లేదు” ఇట్ల ఇగ జొర్రీగ లెక్కనే జూయ్య్ మంటయి… గివన్నీ జనవరి మొదటి వారం దాంకనే, అయినంక ఒక్కటొఒక్కటి అటుక ఎక్కుతుంటయి. రెండో వారంల నుంచి పండగలు షురు. “ఒక్క రోజు తింటే ఏమైతది.. తీ?”, “అమ్మ చేతి వంట కద”, “పండుగ నాయే” గిట్ల మొదలైతయి… ఆశల ఈగలు జుయ్యు మనుకుంట తిరుగుడు.
.రిజల్యూషన్‌లు ఒకటెంక ఒకటి సమాధులల్ల జేర్తయి.

ఇంకో ఫేమస్ రిజల్యూషన్ ఉంటది పొదుపు జేసుడు. “ఈ యాడాది దుబారా బందు ‘“ షాపింగ్ మానేస్త”, “సేవింగ్స్ పెంచుత” అని బ్యాంక్ అకౌంట్‌కి మాటిస్తరు. కానీ జనవరిలనె మన గాచారం బాగాలేక ఆన్‌లైన్ సేల్స్ షురూ అయితయి. “న్యూ ఇయర్ ఆఫర్”, “ఎండ్ ఆఫ్ సీజన్ సేల్”, “లిమిటెడ్ టైమ్ డీల్” అని ఫోన్ల నోటిఫికేషన్స్! ‘అయిపాయె… పొదుపు రిసల్యూషన్ గాలికి వాయే ‘
అట్లుంటది మరి షాపింగ్ ల కత అంటే!

సదువు రిజల్యూషన్స్ అయితే పెద్ద కామెడీ!. “రోజుకు ఒక గంట పుస్తకం చదువుత”, “ప్రతి రోజు ఇంగ్లీష్ ప్రాక్టీస్”, “కొత్త స్కిల్ నేర్చుకుంట” అని పెద్ద పెద్ద మాటలు. జనవరి ఒకటో తారీఖు పుస్తకం తెరుస్తరు. రెండు కమ్మలు సదువంగనే నిద్ర వస్తది. “ఇయ్యాల చాన పని ఉంది, రేపు సూత్తాంతీ,మొదలైతే పెట్టిన కద అని మూత పెడుతరు. ఆ మూత ఇక ఆరు నెలల దాకా తీసిడే ఉండదు.
పుస్తకానికి సెలవు ఇస్తరు.
కొంతమంది రిజల్యూషన్స్ అయితే మరీ ఇచ్చెంత్రం, ఎమోషనల్‌! “ఈ యాడాది కోపం తగ్గిస్త”, “నెగటివిటీ మానేస్త”, “అందరితోని మంచిగ ఉంట” అని వాళ్ల మీద వాళ్లే ఒట్టు పెట్టుకుంటరు . కానీ ట్రాఫిక్‌లో ఒక ఆటో అడ్డం వస్తే, ఆ రిజల్యూషన్ మొత్తం హారన్‌తోని బయటకు తన్నుక వస్తది. మనిషే మారి పోతరు… ఈగ తర్వాత కత ఎట్లుంటది.. ఎవల్లను,ఎవల్లు ఏమి తిట్టుకుంటరు అన్నది మనం లెక్క కట్టలేము.

అంత వీజీ కాదు.. కోపంను కుదువ పెట్టుడు అంటే!
ఒకటా రెండా ఇట్ల చెప్పుకుంట పోతే హజార్ పచాసు ఉంటయి.

రిజల్యూషన్స్‌కు అసలు శత్రువు నీ నిజమైన జీవితమే. జనవరి మొదటి వారం మనసుల ఉన్న ప్లాన్, రెండో వారం పనిభారం, మూడో వారం అలసట, నాలుగో వారం నిర్లక్ష్యం, ఇట్ల ఒక్క దాని ఎనుక ఒకటి రిజల్యూషన్ సన్నబడి పోతుంటయి. ఫిబ్రవరి వచ్చే టప్పటికి అది ఓ మూల కూసోని “నన్ను ఎందుకు పుట్టించినవ్రో?” అని మనాది పడుతుంటది.

సోషల్ మీడియా రిజల్యూషన్స్ సుత తక్కువదేమి కావు. “ఈ యాడాది ఫోన్ వాడకం తగ్గిస్త”, “సోషల్ మీడియా డీటాక్స్”, “స్క్రీన్ టైమ్ తగ్గిస్త ” అని స్టేటస్ల పెట్టి, అదే స్టేటస్‌కు వచ్చే లైక్స్, కామెంట్స్ సూడనీకి గంటలకు గంటలు ఖరాబ్ జెస్తుంటం.

ఇది రిజల్యూషన్‌కు తాత లెక్క!
న్యూ ఇయర్ రిజల్యూషన్స్ అసలు సమస్య ఏందంటే..మనం వాటిని మన సామర్థ్యానికి కాదు, మన కల్పనకు తగినట్టు తయారు జేస్తం. నిన్నటి దాంక ఏమీ చేయని మనిషి, తెల్లారి నుంచి అన్నీ చేయాలని అనుకుంటడు. పొద్దుగాల ఐదు గంటలకు లేశి యోగం, ఆఫీస్, జిమ్, పుస్తకం, ఫ్యామిలీ టైమ్, సెల్ఫ్ కేర్… ఇవన్నీ ఒకే రోజుల పెట్టేసి, ఆ రోజు రాత్రికి అలసిపోయి పడిపోతడు. అప్పుడు రిజల్యూషన్ కూడా దుప్పట్లకి దూరిపోతది.

ఫిబ్రవరి వచ్చే యాళకు రిజల్యూషన్స్ గురించి మాట్లాడుడు సుత మానేస్తం. ఇదే కత ప్రతీ యాడాది జరుగుతది.
అందుకే చెలల్లె, తమ్మి…!
నేనేం చెప్త అంటే… మనకి ఎంత చేతనైతదో..సూసుకోని మెల్లమెల్లగ ఒకదాని ఎనుక ఒకటి మార్చుకుంట పోవాలి. అన్నీ సూసి ఒక్కటి సుత చేయకుండ హైరానా పడొద్దు.
మనిషి అన్నాక మారాలి. మార్పు మంచిది. మార్పు ప్రగతికి సూచిక అంటరు. అన్నింటికన్న ముఖ్యంగ మన ఆరోగ్యం మీద ఖ్యాల్ ఉండాలి. ఆరోగ్యమే మహాభాగ్యం. ఇప్పుడు నేను కొత్తగ చెప్పేదేమీ లేదు. ఎసొంటి కాలుష్యం ఉన్న దునియాల బతుకుతున్నం, అందరికీ ఎరుకున్న మాటనె జర మన మీద మనం శ్రద్ధ పెట్టుకోవాలె. కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటుంటే దిమాకు ఎప్పుడు తాజాగుంటది. మతిమరుపు జెల్ది రాదు. అందుకనే కొత్త కొత్త విషయాలు, చిన్నగ నెలకొకటి నేర్చుకోవాలి.
మంచి పుస్తకం సదవడం, మంచోళ్ళ సోపతి పట్టుడు చేయాలి. ఒక్కసారె అన్ని చేయొద్దు. శరీరము బుద్ధి మనసు అని అలసిపోయి, మూలకు పడేస్తం. అందుకని రిజల్యూషన్లు అనే పెద్ద పెద్ద మాటలు వద్దు గాని, మనల్ని మనం సక్కగ చూసుకుంట ఇంటినీ, సమాజంల సుత మన వంతు బాధ్యతగ మంచి చేద్ధం.
రిజల్యూషన్లు పెట్టుకునుడు తప్పేం కాదు కానీ, మన తాకత్తును వట్టి పెట్టుకున్నట్లనే ఉంటది కతంత. ఎంత దమ్ముంటే అంతనే ఎత్తుకోవాలి బరువును. శక్తిని మించి బరువు ఎత్తుకోవద్దు. మొత్తంకి
మోసం వస్తది.అలిసిపోయి, యాష్టకు వచ్చి, అన్నీ మానేస్తం.
ఇదీ ముచ్చట. ఇప్పుడు జెప్పుర్రి
జనవరిల పుట్టి ఫిబ్రవరిల సచ్చిపోయేది ఏందో సమజయిందా!!
అవ్.. ఇంతకు హ్యాపీ న్యూ ఇయర్ చెప్పేస్త పటుండ్రి.

ఉంట మరి పైలం.

మీ
రమక్క.

Written by Ramadevi Kulkarni

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

అంపశయ్య మీద రైతు భీష్ముడు

అంతరంగ మధనం