రమక్కతో ముచ్చట్లు -36

ఆగమైతున్న ఆడబిడ్డలు- అమ్మా నాయినల తప్పులు.

అందరికీ శనార్తులు!

మంచి గున్నర?
ఏందో తమ్మీ! నాకైతే మస్తు మనాది అయితుంది. కడుపుల అంత దేవినట్లు గాబరైతుంది.ఎవడో ఒక పొట్టేగాడు నూటాయాభై మంది మైనరు ఆడిపిల్లలను అత్యాచారం చేసి, అమ్మేశిండంట. ఇంకొక కాడ మంచిగ సదువుకోని ఉజ్జోగం సుత చేస్తుంది ఒక పొల్ల, ఆ పిల్లను సుత ఏమి జెప్పిండో ఏమో వేరే దేశమే తీస్కొని పోయి, మొత్తం లాపతా జేసిండు. ఇట్ల గివే వార్తలు ఈ నడుమ, గుండె జలదరించి పోతుంది.
ఎక్కడో ఒక తావుల “ప్రేమ” పేరుతో మోసం…
ఇంకొక తావుల మతం మార్చించడం,ఇగ లేకుంటే నమ్మకం పెట్టుకున్న పిల్లగాని చేతిల మోసపోయి ఆత్మహత్య చేసుకున్న ఆడపిల్ల… అత్యాచారాలు, బ్లాక్‌మెయిల్లు, వీడియోలతోని బెదిరింపులు…సమాజంల ఉన్నమా అని గుబులైతుంది. ఏంది ఇది!??
మనందరం ఆలోచించాల్నా సప్పుడు జెయ్యక బుక్కెడు తిని పండాల్నా…???!!
ఇది కేవలం కొన్ని కుటుంబాల బాధ కాదు.
ఇది సమాజం మధ్యల నిశ్శబ్దంగ మండుతున్న అగ్నికుండం.
‘ఈ కాలం పిల్లలు చెడిపోయిన్రు’ అని ఒక మాటతోని తేల్చి పడేశే ముచ్చటనా ఇదీ!
బాధపడ్డ కుటుంబం వాళ్లకేనా నొప్పి. మనకేమి లేదా? అసలు మన ఆడపిల్లలు ఎందుకింత మోసపోతున్నరు, చదువుకున్నోళ్లు, చదువుకోనోళ్లు, పల్లెలు ఉండేటోళ్లు, పట్నంల ఉండేటోళ్లు.. అందరూ ఒక తీరే తయారయితున్రు. ఎందుకిట్ల జమయితున్రు? ఏమైతుంది? అసలు పిల్లల దిమాక్ ఎందుకు ఇట్ల ఖరాబ్ అయితుంది అని మనకు ఆలోచించాల్సిన బాధ్యత ఉందా.. లేదా? చెప్పుండి అందరూ!!
ఆడబిడ్డలు ఎందుకు ఇంత గనం మోసపోతున్నరు?ఎక్కడ తప్పు జరుగుతుంది? ఇండ్ల తల్లిదండ్రుల పాత్ర ఎంత?సమాజం బాధ్యత ఎంత?
సోషల్ మీడియా ప్రభావం ఎంత? ఇదే ఇయ్యాల్ల ముచ్చట! ఇది నిజంగ ఖాస్ ముచ్చట. తప్పక మనం ఆలోచించాల్సిన ముచ్చట!

నాకు అనిపించేది ఏందంటే.. ఇది చిన్న ముచ్చట కాదు, ఎన్క పెద్ద కత ఉంటది. కుటుంబాల బలహీనత, భావోద్వేగం,ఆకలి, సంస్కార లోపం, ఒంటరితనం, అవగాహనలేమి అన్నీ కలిసిన పెద్ద సామాజిక సంక్షోభం ఇది.
ప్రేమ అనే పవిత్రమైన భావన… పిల్లల బలహీనతగ మారినప్పుడు, కొందరు దాన్ని ఒక వలలెక్క వాడుతున్నరు.
ముఖ్యంగ టీనేజ్ వయసుల ఉన్న అమ్మాయిలు భావోద్వేగాలకు తొందరగ స్పందిస్తరు.అది వయసుకున్న లక్షణం.
ఒక మంచి మాట…ఒక చాక్లేటు
‘నువ్వే నా ప్రపంచం’అన్న ఒక్క వాక్యం…
చాలా సార్లు వాళ్ల మనసును కరిగించేస్తయి.
ఇంట్ల తల్లిదండ్రులు బిజీగ ఉంటరు,
కొంతమంది పిల్లలతోని కూసోని మాట్లాడరు.వాళ్ల బాధలు, భయాలు, సందేహాలు వినరు.
అప్పుడు బయట ఎవడో ఒకడు ప్రేమగ పలకరించంగనే…’ఇదే నిజమైన ప్రేమ’ అని నమ్మేస్తరు. ‘నువ్వు అందంగున్నవు’ అన్న మాట నుంచి మొదలై ‘నీ ఇల్లు, మీ అమ్మ నాయిన ఎట్లున్నరు, మీ ఆచారం ఎట్లుంది, మీ పరిస్థితి ఎట్లుంది, అసలు మీకు రీతే లేదు, మేము చూడు ఎంత పద్ధతిగ ఉన్నామో…’ అనే కాడికి పిల్లల బ్రెయిన్ మొత్తం వాష్ చేసే కాడికి పోతున్రు. ఇట్ల నుంచే మోసం మొదలయితుంది. చాట్‌లు…తర్వాత కాల్స్…తర్వాత వ్యక్తిగత ఫోటోలు…ఆ తర్వాత బ్లాక్‌మెయిల్…
చివరికి అమ్మాయి జీవితమేచీకటై పోతుంది. ఇంత కత జరుగుతుంటే అమ్మా అయ్యలకు మాత్రం ఏమి తెల్వదు. ఇదే నిజమైన ట్రాజెడీ అంటే! తల్లిదండ్రుల తప్పు ఎంతుంది, అసలు వాళ్ళ తప్పేమి లేదా అని జెర ముచ్చట పెడ్దాం.
పిల్లలు తప్పు చేశారు అననీకి ముందు…
వాళ్లను ఎట్ల పెంచుతున్నం అన్నది సూడాలి. డబ్బు ఇస్తున్నరు… కానీ సమయం ఇస్తలేరు. ఇప్పటి చాలా మంది అమ్మా అయ్యలు పిల్లలకు మంచి ఫోన్లు కొంటున్నరు.ఖరీదైన డ్రెస్‌లు ఇస్తున్నరు.
కానీ రోజుకు పది నిమిషాలు సుత వాళ్లతోని కూసోని మాట్లాడ్త లేరు. మార్కులు ఉద్యోగము, సదువు, బంగారం గొనుడు వాళ్లకి గిది చెపుడే తప్ప…
ఒక ఆడపిల్ల మనసుల ఎన్నో సందేహాలు ఉంటయి.శరీరంల మార్పులు, భావోద్వేగాలు…ఆకర్షణలు…భయాలు…
ఇవి చెప్పుకోనీకి ఇంట్ల వాతావరణం లేకపోతే… బయట ఎవడో ఒకడు మొపైతడు.ఇగ కొందరైతే
భయం పెడ్తరు … నమ్మకం ఉండది వాళ్లకు, తమ పిల్లల పైన.అరుస్తరు.కొడతరు.
అవమానిస్తరు.అప్పుడు పిల్లలు నిజాలు దాచడం నేర్చుకుంటరు.
ఒక అబ్బాయితో మాట్లాడినా…
భయంతోని చెప్పరు.
ఆ భయం తర్వాత పెద్ద ప్రమాదంగ మారుతది.పిల్లలకి క్రమశిక్షణ అవసరమే. ఇల్లు అంటే ధైర్యం, ఒక భద్రత అంతే గానీ, ఇల్లు అంటే జైలు లెక్క ఉంటే ఎట్ల.
ఇగ ఇంకొక రకం ఉంటరు ‘మా పిల్ల శాన మంచిది’ అన్న గుడ్డి నమ్మకం ధృతరాష్ట్రలు వీళ్ళు.
‘మా బిడ్డె అసొంటి పని జెయ్యదు.మేము గీశిన గీటు దాటదు’ అనే బ్రమల ఉంటరు.
గీటు మాట అటుండని, గేటు తీసి దేశమే దాటిపోతున్రు. ఇట్లెందుకు అయితుంది మనం ఏడ మారాలి. ఎంత ఇగురం ఉండాలి అని ఆలోచించాల్సిన సమయం ఇది, ఏమంటరు.
ఈ రోజుల్ల సోషల్ మీడియా ప్రభావం ఎంత ఉందో అర్థం చేసుకోవాలి.
ఇన్‌స్టాగ్రామ్‌, రీల్స్‌, ఫేక్ అకౌంట్లు…
ఎవరు నిజమో ఎవరు నటిస్తున్నరో గుర్తించడం శానా కష్టం.పిల్లలను నమ్మాలి.
కానీ వాళ్ల ప్రపంచం గురించి తెలుసుకుంట ఉండాలి.
సోషల్ మీడియా…అదొక నిశ్శబ్ద మృగం. కంటికి కానరాని భూతం.
ఇప్పటి పిల్లల జీవితాలల్ల ఫోన్ ఒక ప్రపంచం అయిపోయింది.
పగలు, రాత్రి రీల్స్…ఫేక్ లవ్ వీడియోలు…
అసభ్య కంటెంట్…లైక్‌లు, ఫాలోవర్లు…
ఇవి పిల్లల మనసును మెల్లగ మార్చేస్తున్నయి.
సినిమాలల్ల సుత ప్రేమను ఒక మత్తు అనే చూపిస్తున్నరు.’ప్రేమ కోసం ఏమైనా చేయాలి’ అన్న తప్పుడు సందేశాలు పెరుగుతున్నయి.
పిల్లలు నిజ జీవితం, సినిమా మధ్య తేడా మర్చిపోతున్నరు.

చాల కుటుంబాలల్ల పిల్లల ముందే తల్లిదండ్రులు గొడవలు పడుడు,తిట్లు, కొట్లాటలు, అవమానాలు…
ఆ వాతావరణంల పెరిగిన పిల్లలకు ప్రేమ అంటే ఏందో సుత అర్థం కాదు.ఇంట్ల ఆప్యాయత లేకపోతే…బయట దొరికిన చిన్న శ్రద్ధ కూడా పెద్ద ప్రేమలెక్క అనిపిస్తది.
ఇక్కడ ఇంకొక గట్టి ముచ్చట ఏమి చెప్పాలి అనుకుంటున్న అంటే… ప్రతి దేశానికి, ప్రతి కుటుంబానికి కొన్ని సంప్రదాయాలు, భక్తి -భయము, ఆచారాలు-వ్యవహారాలు,నమ్మకాలు ఉంటయి. సదువు, మార్కులు, ఫ్యాషన్లు,ఉజ్జోగాలు ఎంత ప్యాకేజిలు వస్తయి… అని తప్ప మన భారతదేశంల పిల్లలకు సంప్రదాయాలు విలువలు కట్టు-బొట్టు, భాషా రీతి, పండుగలు దాని వెనుకున్న గొప్ప పరమార్థం చెప్పుడు మరిశి పోయినం.
దేశ సంస్కృతి మూలాలు ఎంత గొప్పవి,ఎంత విజ్ఞానము, ఎంత ధైర్యము, ఎంతటి జాగృతి, ఎంతగా ఎదుటి వాళ్ళని అర్థం చేసుకొనుడు మన మూలాలల్ల ఉన్నవి అన్నదే మరిచిపోయినం. అందుకే
మత మార్పిడులు… భావోద్వేగాల మీద దాడి జరుగుతుంది.
ఇది చట్టం సమస్య కాదు.
మనుషుల ఆలోచనల సమస్య.
ఆడపిల్లను మనిషిగా కాకుండా వస్తువుగ చూసే మానసిక రుగ్మత పెరుగుతుంది.
పోర్నోగ్రఫీ, అసభ్య కంటెంట్, మద్యం, డ్రగ్స్…
ఇవి యువతల నియంత్రణ కోల్పోయే పరిస్థితి తెస్తున్నయి. గుడ్ టచ్చు బ్యాడ్ టచ్చు కాదు. No touch మొదలు పెట్టాలి.
ఇది తలలకు ఎక్కాలి అంటే సంస్కృతి సంప్రదాయాల ఎడల గౌరవం- భయము ఉండాలి. అది కుటుంబం ఇయ్యాలి.
కుటుంబం పిల్లలకు ఇందుల అవగాహన ఇవ్వకపోవడం… ప్రమాదకరమైనది అని అర్థం చేసుకోవాలి. మార్పు ఇంట్లనే రావాలి. కుటుంబమే అన్నింటికీ ఆసరా!
చాలామంది ఇట్ల అంటరు…
“ఆడపిల్లను బయటకు పంపొద్దు.”
“ఫోన్ ఇవ్వొద్దు.” ‘చదువు చాలు.” ఇది తప్పు!
ఇవి పరిష్కారాలు కావు.ఆడపిల్లను బంధించటం కాదు… బలంగా తయారు చేయాలి.వాళ్లకు నేర్పాల్సినవి..
ఎవ్వరినీ గుడ్డిగా నమ్మొద్దు, వ్యక్తిగత ఫోటోలు షేర్ చేయొద్దు,ఎమోషనల్ బ్లాక్‌మెయిల్ గుర్తించడం,
“లేదు” అని చెప్పడం నేర్పాలి.
ప్రమాదం అనిపిస్తే వెంటనే ఇంట్ల చెప్పగలగాలి, అట్లుండాలి ఇల్లు. ఆడబిడ్డె సుత ఆర్థికంగ స్వతంత్రంగ ఉండాలి. తన కుటుంబమేంది, మూలాలేంది, దేశ సంస్కృతి ఏంది అన్న ఆలోచన చిన్నప్పటి నుంచే చెప్పాలి. దీనికి గట్టిగా నిలబడేది, గట్టిగా ఆసరా అయ్యేది ‘ధర్మమే’ ఇది అర్థం చేసుకోగలిగితే చాలా కుటుంబాలు బాగుపడతయి. ‘ధర్మో రక్షతి రక్షితః’ అన్నరు
విద్య అంటే మార్కులే కాదు
ఇప్పటి విద్యా వ్యవస్థలో జీవిత పాఠాలు తగ్గిపోయినయ్.
పిల్లలకు మ్యాథ్స్‌, సైన్స్‌ నేర్పుతున్నరు.
కానీ దేశం అంటే ఏంది, మన వీరులు ఎలా ఉండేటోళ్ళు,మన సంస్కృతి ఏంది?
మోసాలను ఎట్ల గుర్తు పట్టాలి?
సోషల్ మీడియా ప్రమాదాలు ఎట్లుంటయి ?
భావోద్వేగాలను ఎట్ల బాలన్స్ చెయ్యాలి ?
ఇవి ఎవరూ చెప్పడం లేదు.
స్కూల్స్‌, కాలేజీలు కూడా ఈ విషయాలల్ల బాధ్యత తీసుకోవాలి.
సమాజం సుత తప్పు చేసినవాడినే తప్పు అనాలి.
బాధితురాలిని అవమానించడం ఆపాలి.
ఎందుకంటే చాలామంది ఆడపిల్లలు సమాజం భయంతోనే లోపల్లోపల్నే బాధ పడుతున్నరు.బయటకు చెబ్తలేరు.
ఆడబిడ్డ అంటే కుటుంబ గౌరవం మాత్రమే కాదు. సమాజం బాధ్యత సుత. చానా.. మంది ఇంకా ఆడపిల్లను “ఇంటి పరువు”గా మాత్రమే చూస్తున్నరు.కానీ ఆమె సుత ఒక మనిషి.ఆమెకి కలలు ఉంటయి.భావాలు ఉంటయి.బలహీన క్షణాలు ఉంటయి కదా!
ఆమెతో స్నేహంగా మాట్లాడే కుటుంబాలు పెరగాలి.’పిల్లల్ని కట్టేసి కాపాడలేం కదా చెల్లె! వాళ్లకు సరైన మార్గం సూపాలి. మన సంస్కృతిని పరిచయం చెయ్యాలి.’
ఈ ఒక్క మాటల చెప్పాల్నంటే వాళ్ళతో మాట్లాడాలి.వాళ్ల స్నేహితుల గురించి తెలుసుకోవాలి.
ఫోన్ లాక్కోవడం కాదు…ఫోన్ ఎలా వాడాలో నేర్పాలి. తల్లిదండ్రితో మనసు విప్పి అన్ని చెప్పుకునేటట్టు పెంచాలి. రహస్యాలు మెయింటైన్ చేసేటట్టు కాదు.
బిడ్డా!ఒక్క ముచ్చట…
ప్రేమ అనేది జీవితమంతా కాదు.
ఎవరైనా “నీ కోసం చస్తా” అంటే అది ప్రేమ కాదు.
నీ గౌరవాన్ని కాపాడితేనే అది ప్రేమ.
నిన్ను కుటుంబానికి దూరం చేస్తే…
నీ ఆత్మగౌరవం తగ్గిస్తే…
నీ భయాలను ఉపయోగించుకుంటే…
అది ప్రేమ కాదు… ప్రమాదం.యాదుండని బిడ్డా, ఆగం గాకు. ప్రేమ పేరుతో అంగట్లే అమ్ముతున్నరు. జెర పైలం.
ఇగ శివరాఖరున మళ్ళీ పెద్దోళ్లకు జెప్తున్నా….
ఆడపిల్లలను భయపెట్టే సమాజం కాదు…
వాళ్లు ధైర్యంగా నిలబడే సమాజం కావాలి.
ఎందుకంటే ఒక ఆడబిడ్డ కాపాడబడితే…
ఒక కుటుంబం నిలబడుతది.
ఒక తరం నిలబడుతది.
ఒక సమాజం బతుకుతది.

పైలం తమ్మీ, జెర సూస్కో!

 

ప్రేమతో
మీ
రమక్క

Written by Ramadevi Kulkarni

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ఓ ప్రేమ కథ (మోహన రాగం)- 9వ  భాగం

గిల్టునగ