రమక్కతో ముచ్చట్లు

ఆగమైపోకు అదీ…నీకు వరమే!

శనార్తులు అందరికీ!
మంచి గున్నర.

ఒక మహిళ జీవితం ఒక సుదీర్ఘమైన, సున్నితమైన, అద్భుతమైన ప్రయాణం. ఈ ప్రయాణంల ప్రతి దశకు ఒక ప్రత్యేకమైన అర్థం, ఒక అంతర్గత మార్పు, ఒక కొత్త బాధ్యత ఉంటది. చిన్నప్పటి సంది ఒక్కోతీరు, వయసుకు వచ్చినంక ఇగ ఋతు చక్రం షురూ అయితది (Menstruation). ఆడికెల్లి మొదలైంది.. మల్ల ఆమెకు వయసు మీద పడ్డంక ఒక మలుపు ఉంటది దాన్నే మెనోపాజు (Menopause) ముట్లు ఆగిపోవుడు అంటరు.
అక్క ఏంది, ఇయ్యాల గీ ముచ్చట ఎత్తుకొచ్చింది అను కుంటున్రా..!? మనమందరం తెలుసుకోవాల్సిన చాన పెద్ద ముచ్చట ఇది. ఆగం అయితున్నరు కొంతమంది. మా దోస్త్ ఒక ఆమె ఈ ముట్ల ఆగిపోయినాక, అదే వారీ..మెనోపాస్ వచ్చినంక పిచ్చిది అయిపోయి, తనను తాను పొడుసుకొని ఆత్మహత్య చేసుకోనీకి పోయింది. కూరగాయలు కోసే మొండి కత్తి గనుక ఏం కాలే. బచాయించింది బిడ్డె!
ఇప్పుడు చెప్పుండి, దీని కత ఏంది? ముచ్చట ఏంది.. మనం తెలుసుకోవాల్నా వద్దా!
నేను,ఒకసారి పేపర్ల ఒక ఆర్టికల్ చదివిన. మన దేశం కాదు వేరే దేశంల ఒకామే,ప్రతి నెల ఋతుచక్రం మొదలుగానే,ఆమెకు తెలువకుండనే హత్యలు చేస్తూ ఉందంట. ఇది ఏంది అంటే ఆమెలో అప్పుడు వచ్చిన స్ట్రెస్ భావోద్వేగాలు, హార్మోన్ల మార్పు కారణము, ఆమెకు తెలువకుండనే అట్ల చేస్తున్నది అని, ఆమెను ఆసుపత్రిల షేరీక్ చేసిన్రంట పోలీసులు. అర్థమయితుందా తమ్మీ! మనము, మన పిల్లలకి ఎంత నేర్పుకోవాలి. పెద్ద వయసు వస్తుంటే, ఎంత సుద్రాయించుకోవాలి అని!
అసలు దీని ఎనక సైన్స్ ఎంతుంది. ఆధ్యాత్మిక ఎంత అవుసరం,కుటుంబంల ఆదరణ ఎంత అవసరమో ఇవన్నీ తెలుసుకోని మనల్ని మనం మార్చుకోవాల్సిన అవుసరం ఉందంటరా,లేదంటరా చెప్పుండి.

ఏమన్న ఆశ్చర్యం అనిపిస్తలేదా మీకు! గింత కత ఉంటదా అని! ఈ మేనోపాజు ఎనక చానా పెద్ద కత ఉంటది. అందరం, బాగా గుర్తు పెట్టుకొని ఎన్నో విషయాలు ముచ్చట చెప్పుకోవాల్సిన పెద్ద మాట ఇది.
ఆడోళ్ళే కాదు, మొగోళ్ళు సుత తెల్సుకోవాలి.
శరీరం, మనసు, భావోద్వేగాలు నిరంతరం మారుతా ఉంటయి. ఈ రెండు దశలు వేర్వేరు అనిపించినా, నిజానికి ఇవి ఒకటే. హార్మోన్ల వ్యవస్థకు ప్రారంభం మరియు ముగింపు లెక్క. అందుకే ఈ రెండు దశల మధ్య ఉన్న సంబంధాన్ని అర్థం చేసుకునుడు, ఆ మార్పులను ఒప్పుకునుడు నేర్సుకోవాలి.
నిజానికి ఒక ఆడపిల్లకు పదకొండు నుంచి పద్నాలుగు ఏండ్ల నడుమ మొదటి ఋతుచక్రం మొదలైతది. దీనిని Menarche అంటరు. ఇది ఒట్టి రక్తస్రావం కాదు, ఇది ఒక కొత్త జీవన దశకు ఆహ్వానం. ఈ సమయంల శరీరంల ఈస్ట్రోజెన్, ప్రోజెస్టిరోన్ అనే హార్మోన్లు సక్రియమవుతయి. శరీరాకృతి మారుతది, భావోద్వేగాలు సున్నితంగ మారుతయి, ఒక బాధ్యతా భావం మొదలయితది. ఈ దశల సరైన ఆహారం, శుభ్రత, భావోద్వేగములల్ల కుటుంబం సూపే ఆదరణ చానా ముఖ్యమైనవి. ‘పెద్ద మనిషి అయ్యింది బిడ్డె’ అని దావత్ చేసి ఊకునుడు కాదు.
ఐరన్, కాల్షియం, ప్రోటీన్ ఎక్కువగ ఉండే ఆహరం ఇయ్యాలె, దాని గురించి సరైన అవగాహన నేర్పాలి, భయాలు లేకుండ ఈ దశను స్వీకరించుడు అవుసరం.ఇది తల్లి చెప్పాలె. ఈ దశల ఆడబిడ్డను గట్టిగ పట్టుకోవాలి. శరీరమును, మనసును, బుద్ధిని గట్టిగ చెయ్యాలి. తనను తాను ఎట్ల తీర్చిదిద్దుకోవాల్నో అన్న విషయం నేర్పాలి. ఇది తల్లి, నాయనమ్మలు,అమ్మమ్మలు తోనే అయితది. ఇంట్ల నాయిన, అన్నలు సుత ఆ టైంల పెద్దమనిషి అయిన ఆడపిల్లతోని ఎట్ల మాస్లాల్నో నేర్సుకోవాలి. ఇది మానసిక స్థిరత్వం. ఆ తరువాతి దశల ఆరోగ్యానికి పునాది వేస్తది.
ఇట్ల హార్మోన్ల ఆధారంగ స్త్రీ శరీరం ఎన్నో ఏండ్లు తన ప్రయాణాన్ని కొనసాగిస్తది. కానీ ఒక దశల ఈ హార్మోన్ల ఉత్పత్తి తగ్గిపోతది. సాధారణంగ నలపై నుంచి యాభై ఏండ్ల మధ్య పూర్తిగ ఆగిపోతది, ఇగో… ఇదే మెనోపాజు. ఇది ఒక్కరోజుల జరిగే మార్పు కాదు. ముందుగాల పెరి-మనోపాజు దశ ఉంటది. ఇంబాలెన్స్ మొదలైతది. అసమానంగ మారుతది. కొన్నిసార్లు ఎక్కువగ, కొన్నిసార్లు తక్కువగ వచ్చుడు, కొన్ని నెలలకు ఆగిపోవుడు ఉంటది. మెల్లగ మొత్తం ఆగిపోతది. ఆ తరువాతి దశలల్ల హార్మోన్ల స్థాయిలు తక్కువగ ఉంటయి.
మనోపాజు సమయంల శరీరంల జరిగే మార్పులు చాన కష్టంగుంటయి … ఇదే పెద్ద లొల్లి ఇగ! ముఖ్యంగ ఈస్ట్రోజెను తగ్గిపోతుంటది.దాంతోటి శారీరకంగ, మానసికంగ చానా మార్పులు కనిపిస్తయి. ఒక్కసారిగ వేడి అనిపించుడు చెమటలు పట్టుడు (hot flashes), రాత్రిసందిల చెమటలు పట్టుడు (night sweats), నిద్రలేమి, శరీర బరువు పెరుగుతది, కీళ్ల నొప్పులు, చర్మం ఎండిపోవడం ఇట్ల చాన అవస్థలు ఉంటయి. ఇవి కొంతమందికి ఎక్కువ కష్టపెట్టయి. కొందరిని మాత్రము చాన యాష్ట పెడ్తయి.
ఇక్కడ అందరూ… ఆడోళ్ళే కాదు, ఇంట్ల ఉన్న మొగోళ్ళు సుత గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏందంటే..శరీరకంగ రోగాలు వచ్చుడు కన్న, మానసికంగ డిప్రెషన్ అయితరు. కొందరికి అయితే, పిచ్చి పట్టినట్టు అయితది. చిన్న చిన్న విషయాలకే చిరాకు పడడం, ఆందోళన, నిరాశ,శ్రద్ధ తగ్గిపోవుడు, ఊకెనే ఏడ్పు వచ్చుడు, నేనైతే నా దోస్తు ఒకామెను చూసిన. ఆమె, ‘నాకు ఎవరో చేతబడి చేసిండ్రు’ అని పిచ్చి పట్టినట్టు చేస్తుండే. మొగుడు పిల్లలు పాపం మస్తు ఆగమయ్యిన్రు.
‘నేను ఎవ్వరికి అవసరం లేదు, నా మీద అందరికీ ప్రేమ తగ్గిపోయింది’ అని వాళ్ళని చూసి వాళ్లే జాలి పడుడు,సెల్ఫ్ ఎస్టీమ్ అంటరు కదా.. అది మొత్తం పోతది ఇగ.
సైన్సు ఏమి చెబ్తది అంటే…ఈస్ట్రోజెన్ తగ్గిపోవడం తోని,మెదడుల సెరోటోనిన్ అనే న్యూరోట్రాన్స్‌మిటర్ స్థాయిలు పడిపోతయి. ఇది మన మూడ్‌ను నియంత్రించే ముఖ్యమైన రసాయనం. ఇది తగ్గిపోతే డిప్రెషన్, ఆందోళన వంటి సమస్యలు పెరుగుతయి అని! అందుకే మెనూ పాస్ టైంల కొందరు ఇట్ల పిచ్చిపిచ్చిగ చేస్తరు. మీరు చూసినరో.. లేదో గాని కొందరిని చూస్తే మనము నిజంగ వాళ్లకి పిచ్చి పట్టిందని అనుకుంటము. మెంటల్ హాస్పిటల్ డాక్టర్లు ఒక పేరు చెప్తరు అది ఏందంటే…Menopausal Psychosis అట. మరికొందరికి Major Depressive Disorder లేదా Anxiety Disorder వస్తది అని అంటరు!
ఈ స్థితికి గురైనోళ్లు,’ ఇంట్ల నన్ను తప్పుగ అర్థం చేసుకుంటరు, ఏం చేసిన నన్ను పట్టించుకుంటలేరు, నన్ను అంటున్నరు. నేనిగా ఉండొద్దు.’ అని కొంతమంది ఆత్మహత్యలకు (suicidal tendencies)సుత ప్రయత్నం చేస్తరు. అర్థమైతుందా.. తమ్మి! ఈ స్థితిల గనుక మీ ఇంట్ల మీ అమ్మనో అక్కనో ఉంటే ఎంత మంచిగ చూసుకోవాల్నో.
దీన్ని నిర్లక్ష్యం చెయ్యొద్దు.
ఈ పరిస్థితులకు కారణం కేవలం మనసు బలహీనత కాదు, ఇది పూర్తిగ శారీరక-మెడికల్ కారణాలతో కూడిన సమస్య. హార్మోన్ల మార్పులు, న్యూరోకెమికల్ అసమతుల్యత, కుటుంబ పరిస్థితులు, ఒంటరితనం,ముఖ్యంగ పిల్లలు పెద్దవాళ్లయి దూరమవడం, బాధ్యతలు తగ్గిపోవడంతోని ఒక ఖాళీ భావన ఏర్పడుతది. దీనిని empty nest syndrome అంటరట. ఇది సుత డిప్రెషన్‌కు దారి తీస్తది అంటరు మానసిక చికిత్సకులు.
ఇసొంటి పరిస్థితుల్ల మెడికల్ ట్రీట్మెంట్ చాన అవుసరం. వైద్యులు రోగి స్థితిని అర్థం చేసుకుంటరు. అవసరమైతే antidepressant మందులు ఇస్తరు. ఇవి సెరోటోనిన్ స్థాయిలను పెంచి మూడ్‌ను స్థిరపరుస్తయి. anxiety ఎక్కువగ ఉంటే anxiolytics వాడుతరు. psychosis లక్షణాలు ఉంటే antipsychotic మందులు ఉపయోగిస్తరు. కొన్ని సందర్భాలల్ల hormone replacement therapy ద్వారా ఈస్ట్రోజెన్ స్థాయిని కొంతవరకు భర్తీ చేస్తరు. అయితే ఈ చికిత్సను వైద్యుల పర్యవేక్షణలో మాత్రమే తీసుకోవాలి. ఇది సదివి మందులు తెచ్చుకునేరు వారీ.. పైలెం.
మందులు ఒక్కటే వేసుకుంటే తగ్గే కత కాదు ఇది. వాళ్లకి ధైర్యం ఇయ్యాలే. మానసికంగ ఓదార్పును, ప్రేమను అందించాలి. psychotherapy కూడా చాలా అవసరం. ముఖ్యంగా cognitive behavioral therapy ద్వారా వ్యక్తి తన ఆలోచన విధానాన్ని మార్చుకోవడం నేర్పాలి. ఇది నెగెటివ్ ఆలోచనలను తగ్గించి, జీవితాన్ని సానుకూలంగా చూడటానికి సహాయపడుతది.
ఇక్కడ కుటుంబం పాత్ర అత్యంత కీలకం ఒక స్త్రీ ఈ దశల ఎదుర్కొంటున్న మార్పులను అర్థం చేసుకోవడం కుటుంబ సభ్యుల బాధ్యత. ఆమె ప్రవర్తనల మార్పులు వచ్చినప్పుడు విమర్శించడం కాకుండ సహనం చూపాలి. ఆమెతోని మాట్లాడాలి, వినాలి, ఆమెకు మద్దతు ఇవ్వాలి. భర్త, పిల్లలు ఆమెకు అండగ ఉంటే ఆమె ఈ దశను చాలా సులభంగ దాటగలదు. చిన్న చిన్న ప్రేమపూరితమైన మాటలు సాలు మనిషికి ప్రాణం పోయనీకి ఏమంటరు?! గౌరవం, సహకారం ఆమెకు గొప్ప ఔషధం అయితది.
జీవనశైలి మార్పులు సుత ఈ దశల ఎంతో ముఖ్యమైనవి. సరైన ఆహారం తీసుకునుడు, రోజూ వ్యాయామం చేసుడు , యోగా, ధ్యానం అసొంటివి చెయ్యాలి. కాల్షియం, విటమిన్ D ఎక్కువగా తీసుకోవాలి. అవి ఎముకలను బలంగ ఉంచుతయి. మంచి నిద్ర చానా అవుస్రం.
ఆధ్యాత్మిక దృష్టికోణంల చూస్తే, మెనోపాజు ఒక అంతర్ముఖ యాత్ర. ఈ దశల స్త్రీ తనను తాను తిరిగి కనుగొనే అవకాశం పొందుతది. జీవితంల ఇప్పటివరకు చేసిన ప్రయాణాన్ని విశ్లేషించి, మిగిలిన జీవితాన్ని మరింత అర్థవంతంగ మార్చుకోవచ్చు.మొత్తానికి చూస్తే,ఋతుక్రమం ప్రారంభం అయినప్పట్నుంచి మెనోపాజు వరకు స్త్రీ జీవితం ఒక సంపూర్ణ హార్మోనల్ ప్రయాణం. ప్రారంభ దశల తీసుకున్న జాగ్రత్తలు, జీవనశైలి, మానసిక ఆరోగ్యం అన్నీ ఇప్పుడు అక్కరకు వస్తయి. అందుకే ఈ రెండు దశల మధ్య ఆమె ఆరోగ్యం మీద అందరికీ దృష్టి ఉండాలి.
మనకు తెలిసిన మంచి ఇంటి చిట్కాలు, ఆరోగ్యంకి సంబంధించిన ఆసనాలు అటువంటివి కొన్ని మీకు చెప్తా! అందరూ మంచిగ యాది పెట్టుకోండి.
మనోపాజు సమయంల anxiety, irritability, depression ఎక్కువగ ఉంటయి అనుకున్నం కదా..ఇవి తగ్గించనీకి ప్రాణాయామం అద్భుతమైన సాధనం.
అనులోమ విలోమ, నాడీ శుద్ధి ప్రాణాయామం, భ్రమరి ప్రాణాయామం చానా బాగా పనిచేస్తాయి ఒత్తిడిని యాంగ్జైటీ ని ఆత్రుతను తగ్గించుడే గాక మంచి సుఖ నిద్ర కూడ పడతది. అసలుకు పోతే ఇవి అందరికీ చాన బాగా పనిచేస్తయి. మంచిగ నిద్ర పడతది. పనంత అయిపోయినంక, రాత్రి పండుకునేటప్పుడు ఒక ఐదు నిమిషాలు చేసి పండుకోవచ్చు అందరం.
ఇగ రెండోది, యోగాసనాలు. ఇవి శరీరానికి బలం, మనసుకు సమతుల్యం ఇస్తయి.
మెనోపాజు సమయంల మెటబొలిజం తగ్గిపోతది, ఎముకలు బలహీనమవుతయి. కాబట్టి కొన్ని ప్రత్యేక ఆసనాలు ఉపయోగకరంగ ఉంటయి. అవి ఏందంటే…
తాడాసనం,భుజంగాసనం,పశ్చిమోత్తానాసనం, వజ్రాసనం,శవాసనం. రోజు ఒక పదిహేను నిముషాలు ధ్యానం సుత మేలు చేస్తది.

ఇప్పుడు ఆయుర్వేదం గురించి ముచ్చట తెలుసుకుందాం.
ఆయుర్వేదం ప్రకారం మెనోపాజు సమయంలో వాత దోషం పెరుగుతది. దీన్నుంచి ఉపశమనం పొందనీకి,
అశ్వగంధ, శతావరి, బ్రాహ్మి, యష్టిమధు చాలా బాగా పనిచేస్తాయి ఇవి ఎవరైనా సరే తీసుకోవచ్చు వీటి నుంచి సైడ్ ఎఫెక్ట్స్ వుండై!
రోజూ గోరు వెచ్చని పాలలో తేనె కలిపి తాగడం, అవిసె గింజలు తీసుకోవడం, పసుపు పాలు తీస్కోవడం,రోజూ కనీసం ముప్పై నిమిషాలు నడువడం, పొద్దున్న పూట ఎండ కిరణాలు తగిలేటట్టు కూసోడం, చాయిలు కాఫీలు బందు చేయాలి.
ముఖ్యంగ నేను చెప్పే ముచ్చటి ఏందంటే…. ఎవరికైనా బాగా డిప్రెషన్ అయ్యి పిచ్చిపిచ్చి ఆలోచనలు వస్తే ఇంట్లో వాళ్ళు గమనించుకోండి ఒక మంచి మానసిక వైద్యుణ్ని మాత్రం తప్పకుండ కలవాలి.
ఈ ప్రపంచంలో ఎన్ని సమస్యలు ఉన్నాయో అన్ని పరిష్కారాలు సుత ఉన్నయి. ప్రతిరోజు మన జీవనశైలి ఆరోగ్యకరంగ ఉండాలి. మంచి ఆలోచనలు చేసుడు,.దైవ ప్రార్థన చేసుడు, కృతజ్ఞత కలిగి ఉండుడు, ఎదుటి వాళ్ళ బాధలను అర్థం చేసుకునే హృదయం మనల ఉంటే మన మనసు, శరీరము ఎప్పుడూ ఆరోగ్యంగ ఉంటది.

మీ అందరికీ చివరికిగా ఒకటి చెప్తా! మెనోపాజు ఒక వ్యాధి కాదు.అది ఒక మార్పు. ఈ మార్పును శరీరం, మనసు, ఆత్మ మూడు స్థాయిలల్ల అంగీకరించాలి.
ప్రాణాయామం మనసును శాంతపరుస్తది.
యోగాసనాలు శరీరాన్ని బలపరుస్తయి.
ఆయుర్వేదం సహజ సమతుల్యాన్ని తీసుకొస్తది.
ఈ మూడు కలిస్తే, మనోపాజు ఒక కష్టదశగా కాకుండా, ఒక “స్వీయ పరిణతి దశ”గ మారుతది.
“శ్వాసను నియంత్రించగలిగినవారు, భావాలను కూడా నియంత్రించగలరు. భావాలను నియంత్రించగలిగినవారు జీవితాన్ని సులభంగ నడిపించగలరు.”
చివరగా చెప్పాలంటే, మనోపాజు ఒక ముగింపు కాదు. అది ఒక కొత్త ప్రారంభం. ఈ దశలో వచ్చే సమస్యలు భయపడాల్సినవి కావు, అవి అర్థం చేసుకోవాల్సినవి. సరైన అవగాహన, వైద్య సహాయం, కుటుంబ మద్దతు ఉంటే ఈ దశను ఒక ముష్కిల్ లెక్క కాకుండ, ఒక ప్రకృతి పరమైన సహజమైన మార్పులెక్క మార్చుకోవచ్చు.
“స్త్రీ జీవితంల ప్రతి మార్పు ఆమెను మరింత పరిపక్వంగ, బలంగ, జ్ఞానవంతురాలిగ తీర్చిదిద్దుతది. అదే ప్రకృతి ధర్మం. మెనోపాజు సుత అసువంటి మహత్తరమైన మార్పే!
ఉంట మరి పైలం.
కుటుంబం అంటే ఒకరి ఎడల ఒకరు శ్రద్ధ పెట్టి చూసుకునుడే.మర్చిపోకండి.

ప్రేమతో
మీ
రమక్క.

Written by Ramadevi Kulkarni

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ఓ ప్రేమ కథ (మోహన రాగం)-8వ భాగం

పచ్చని ఆకులు