భూగోళ వృత్తంలో
ఒంటరిగా కూర్చొని
సూర్యచంద్రుల సాక్షిగా ……
జనారణ్యం రణగొణ ధ్వనుల మధ్య …….
ఆకలి కేకల జీవనపోరాటాల తోడుగా ……
రెక్కలు ముక్కలైన
శ్రామిక చెమటను
అక్షర హస్తాలతో తుడుస్తూ …….
అప్పుల ఊబిలో చిక్కుకుపోయిన
రైతు కుటుంబాల్ని
కవితా గానంతో ఓదారుస్తూ ………
కర్కశ మృగాళ్ళ దాడిలో
అత్యాచారానికి గురైన ఆడపడుచులకు
అక్షర శక్తిని నూరిపోస్తూ ………
అధిక ధరలకు చిల్లుపడిపోతున్న
మధ్యతరగతి బతుకు జేబుని
ధ్యైర్యవచనాలతో కుడుతూ ……….
అరిగిపోతున్న నిరుద్యోగి కాళ్ళకు
అక్షరాల రక్షణ తొడుగుతూ ……..
కార్పోరేట్ గారడీ మార్కెట్టులో
బురిడీ పడిపోతున్న అమాయక జనాన్ని
వస్తుస్వామ్య సంకెళ్ళ నుండి కవితాక్షరాలతో
విముక్తుల్ని చేస్తూ ……….