ఆలస్యం అమృతం విషం….అంటూ ఉంటారు.
అంటే ఆలస్యం చేస్తే అమృతం అయినా విషం అవుతుంది. చేయవలసిన పనిని నిర్దృష్టమైన సమయానికి చేయకపోతే జరిగే నష్టాన్ని హెచ్చరించే సందర్భంలో ఈ సామెతను వాడుతుంటారు .
జీవితంలో సమయపాలన అన్నది చాలా ముఖ్యం.
ఏ పని అయినా సకాలంలో చేయటం వల్ల సత్ఫలితాలు వస్తాయి.
ఆలస్యం చేయటం వల్ల ఒక్కోసారి మంచి జరుగుతుంది. అదే ఆలస్యం వల్ల ఒక్కోసారి చెడు జరుగుతుంది. అందువల్ల ఎంతో ఆలోచించి గానీ నిర్ణయం తీసుకోకూడదు.
ఏదైనా కానీ సందర్భాన్ని బట్టి త్వరగా లేదా నిదానంగా నిర్ణయాలు తీసుకోవటం మంచిది.
అమృతమైనా సమయానికి ఇస్తే మంచిదే కానీ అదే అమృతాన్ని ఇవ్వటంలో జాగు చేస్తే విషం గా మారే అవకాశం ఉంటుంది.
మన జీవితంలో వచ్చే అద్భుతమైన అవకాశాలు అమృతం లాంటివి .వాటిని వాయిదా వేస్తే అవి చేజారిపోయి మనకి నష్టాన్ని మిగులుస్తాయి.
కొందరిలో బద్దకం పాలు ఎక్కువ ఉంటుంది.ఏ పనైనా సరే చేద్దాంలే అని ఆలస్యం చేస్తుంటారు.అందువల్ల ఎన్నో అవకాశాలు పోగొట్టుకుంటారు.ఇది దాదాపు చాలా మందికి అనుభవమే.కాలం ఎవరి కోసమూ ఆగదు. పోగొట్టుకున్నది తిరిగి రాదు.
విద్యార్థులు కూడా చూడండి .పరీక్షల సమయంలో చదవడం వాయిదా వేస్తే ,చివరి నిమిషంలో తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురై ఒక్కొక్కసారి ఫెయిల్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
ఉద్యోగ ఇంటర్వ్యూలకు, ముఖ్యమైన పోటీలలో పాల్గొనేటప్పుడు, సమయపాలన చాలా అత్యవసరంగా పనిచేస్తుంది.
తత్ఫలితంగా జీవితాంతం బాధపడాల్సి వస్తుంది.
అందుకే మంచి పనులు చేసేటప్పుడు వెంటనే చేయాలి.చెడు చేసేటప్పుడు నిదానంగా ఆలోచించి చేయాలి.
అందుకే…
ఏ పని చేసినా సంయమనం పాటించాలి.భగవంతుడి సృష్టిలో అందరికీ తెలివి వుంటుంది. ఆ తెలివిని సక్రమంగా వాడితే ఫలితాలు అమృతతుల్యమౌతాయి.లేదంటే చేదు అనుభవాలు మిగులుతాయి.
సమయాన్ని గౌరవించే వాడే సమాజంలో గొప్పవాడు అవుతాడు. ప్రతి క్షణాన్ని సద్వినియోగం చేసుకోవడం వల్ల జీవితంలో ఆనందాన్ని అనుభవిస్తాడు.
అంతేకాదు నేటి ఆధునిక సాంకేతిక ప్రపంచంలో పోటీ చాలా ఎక్కువగా ఉంది ప్రపంచం చాలా వేగంగా దూసుకుపోతూ ఉన్నది ఇటువంటి సమయాలలో ఒక్క క్షణం ఆలస్యం చేసిన మనకంటే తక్కువ ప్రతిభావంతులు కూడా మనల్ని దాటి ముందుకు వెళ్తారు.
ఈ రోజుల్లో కార్పొరేట్ రంగంలో ప్రతి పనికి ఒక గడువు ఉంటుంది. దాన్ని డెడ్ లైన్ అంటారు. ఒక కొత్త ఆలోచనను లేదా ప్రాజెక్టును మార్కెట్లోకి సకాలంలో తీసుకురాకపోతే ప్రత్యర్థులు ఆ అవకాశాన్ని కాజేస్తారు.
మనపై అధికారులు ఇచ్చిన పనిని సక్రమంగా సకాలంలో చేయకపోతే మన సమర్థతపై వారికి సందేహం వస్తుంది. అలాగే ఆరోగ్య విషయంలో కూడా వెంటనే డాక్టర్ ని సంప్రదించాలి. చిన్నదే కదా అనుకుంటే అది ప్రాణాంతకం అయింది కూడా కావచ్చు..
భగవంతుడిచ్చిన ప్రతి క్షణం అపురూపమైనది.
“అపురూపము ప్రతిక్షణం జారిపోనీయకు విలువైనది జీవితం ఓడిపోనీయకు” అన్నట్లుగా
భగవంతుడు ఇచ్చిన అద్భుతమైన జన్మను సార్ధకం చేసుకుంటూ ప్రతిక్షణాన్ని విలువగా చూస్తూ ఎందుకు సాగాలి. విజయం సాధించాలి.
కనుక ఏ పని చేయడానికి ఆలోచన చాలా ముఖ్యం .చూసి అడుగులు వేయండి.