స్వచ్ఛమైన ప్రేమ

ఉపాధ్యాయులు పొందే మధురాతి మధురమైన అనుభవాలు మరెవరూ పొందరనుకుంటా. బాల్యంతో దోస్తీ కట్టే ఉపాధ్యాయ జీవితం తానే బాల్యం అయిపోతుంది.అందుకే అనుభూతుల నెమరువేతలో అందరిలో ముందుంటుంది.
ఇక మరో బుజ్జి కన్నయ్య విషయానికొస్తే…
అవి కరోనా రోజులు. ఎప్పటిలాగే పొద్దున్నే లేచి వంటావార్పు చేసుకుని బాక్స్ కట్టుకొని మరిచిపోకుండా మాస్క్ పెట్టుకొని బడికి బయలు దేరాను. ఎందుకో కొంచెం ముక్కులు దిబ్బడేసినట్లుండి మాస్క్ పెట్టుకోవటానికి మనసు అంగీకరించడం లేదు.కానీ తప్పదు కదా! తలంత దిమ్ముగా ఎలాగో వుంది.అయినా బడికంటూ వెళ్ళిన తరువాత తరగతిలోకి వెళ్ళకుండా ఉండటమనేది నాకు అస్సలు ఇష్టముండదు.పాఠం కొంచెం చెప్పి ఏదైనా వర్క్ ఇద్దాం అని వెళ్ళాను కానీ నా వశం కావటం లేదు. హాజరు పట్టిక తీసి చిన్నగా పేర్లు పిలుస్తుంటే ఓ బుజ్జి కన్నయ్య నా వైపే తదేకంగా చూస్తూ పిల్లలను సైలెంట్ గా ఉండండి హాజరు పలకండి అని అల్లరి చేయకుండా నాకు సహకరించడంతో అటెండెన్స్ ఘట్టం ముగిసింది.
ఆ పిలిచే లోపే చాలా సార్లు మాస్కు తీస్తూ పెడుతూ నన్ను నేను సంభాళించుకునే ప్రయత్నంలో ఉన్నాను కానీ నా వల్ల కావడం లేదు.ఊపిరాడనట్టుగా ఉండటమే కాకుండా కడుపులో వికారం కూడా మొదలైంది.
నా అవస్థను మొదటినుంచీ గమనిస్తున్న ఆ బుజ్జి కన్నయ్య నా దగ్గరకు వచ్చాడు.”ఏమైంది మేడం. ఆరోగ్యం బాగా లేదా అలా ఉన్నారు? అంటూ ఎంతో అనునయంగా అమ్మలా అడిగే సరికి నా కళ్ళలో సన్నని నీటి పొర.
ఇక నాకు ధైర్యాన్ని ఇస్తున్నట్లుగా నా చేతిమీద చెయ్యి వేసి “ఒరేయ్! మేడం గారికి చేతవ్వడం లేదు. మీరెవ్వరూ అరవొద్దు నిన్నటి పాఠం చదువుకోండి.వర్క్ ఏమైనా ఉంటే చేస్కోండి అంటూ అందర్నీ నిశ్శబ్దంగా ఉంచాడు.
ఇక నాతో వీళ్ళని నేను చూసుకుంటా గానీ “పాఠం వద్దు,ఏం వద్దు” మీరు స్టాఫ్ రూం కి వెళ్లి కూర్చోండి మేడం!”అన్నాడు. “ఏం కాదు లేరా నాన్నా! ఈ పీరియడ్ అయ్యాక వెళ్తాలే ” అని పాఠం చెప్పడానికి పుస్తకం తీయబోతుంటే తూనీగలా ఎప్పుడు వెళ్ళాడో ఏమో హెచ్చెం మేడంతో చెప్పి వచ్చాడు.
వెంటనే మేడంవచ్చి ఏమైంది మేడం అని కంగారు పడుతూ అడిగారు. అడగడమే కాదు ఆ బుజ్జి కన్నయ్య,మేడం చెరోవైపు చెయ్యి పట్టుకుని స్టాఫ్ రూం లో కూర్చోబెట్టారు. వెంటనే ఓ సారు వెళ్ళి ఊళ్ళోని ఆర్.ఎం.పి డాక్టరును పిలిపించారు.
ఆ డాక్టర్ గారు పరీక్ష చేసి మాస్క్ ఎక్కువ సేపు పెట్టుకోవడం,ముక్కలు దిబ్బడ వేయడం మూలాన సరైన ఆక్సీజన్ అందక అలా అయిందంటూ మాస్క్ తీయించి గాలి ప్రసరణ మంచిగా జరిగే మరో మాస్క్ తో పాటు ఓ రెండు టాబ్లెట్లు ఇచ్చి వేసుకోమని చెప్పారు.
అలా ఓ రెండు గంటల తర్వాత వికారం ,తల దిమ్ము తగ్గి కుదుట పడ్డాను.
ఇక ఆ బుజ్జి కన్నయ్యకు ఆ రోజంతా నా మీదే ధ్యాస. మిగతా విషయాల పాఠాలు విన్నాడో లేదో తేప తేపకు వచ్చి స్టాఫ్ రూం లోకి తొంగి చూసి వెళ్ళడం. ఏమాత్రం ఖాళీ దొరికినా దగ్గరికొచ్చి ఇప్పుడు ఓకేనా మేడం ఎలా ఉన్నారు? అంటూ ఎన్ని సార్లు అడిగాడో… ఆ బుజ్జి కన్నయ్య స్వచ్ఛమైన ప్రేమను పొందడం నిజంగా నా అదృష్టం కదా! పిల్లలంటే అలా ఉండాలి. వాళ్ళలో చిన్నప్పటి నుంచే ప్రేమ, అభిమానం, అనురాగం, బాధ్యత కనిపించాలి. అవే వాళ్ళను మంచి మనుషుల్లా మానవీయ విలువల పౌరుల్లా తీర్చి దిద్దేవి.

సునిశిత పరిశీలన
****
నిజ్జంగా తరచూ ఏమిటి.ఎప్పుడూ అనుకుంటూ ఉంటాం పిల్లలకేం తెలియదని. చుట్టూ ఉన్న సంఘటనలను, విషయాలను అర్థం చేసుకునే స్థాయి ఉండదని… ఇలా పిల్లలను చాలా తక్కువ అంచనా వేస్తుంటాం. కానీ ఓ మహానుభావుడు అన్నట్టు వారికీ మనసుంటుందనీ,ఆ మనసు పెద్దవాళ్ళ మనసు కంటే ఎంతో విశాలంగా ఉండి ఎంతో గొప్పగా ఆలోచిస్తుందని తెలిసినప్పుడు అబ్బురంగానూ మీదు మిక్కిలి ఆనందంగానూ ఉంటుంది.

317 జీవో అశనిపాతం లాంటిది. ఖమ్మం జిల్లాలో ముప్పై సంవత్సరాలుగా పని చేస్తున్న నేను ప్రమోషన్ లో జూనియర్ని అంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం నాగుపల్లి ఉన్నత పాఠశాలలో పోస్టింగ్ ఇచ్చారు.
పాఠం చెప్పడానికి ఆరవ తరగతి గదిలోకి వెళ్ళగానే ఓ బుజ్జి కన్నమ్మ లేచి “మీకు వేరే స్కూల్ కు ట్రాన్స్ఫర్ అయిందటగా మేడం? అంది.”అవునురా బంగారూ!” అన్నాను.
“మరి మీరు వెళ్ళిపోతే పాపం హెచ్చెం మేడం ఒక్కరే అవుతారు కదా మేడం!” అనగానే ఎంత పెద్ద మనసుతో ఆలోచించిందీ బుజ్జి కన్నమ్మ అనుకుంటూ వుండగానే ” మీ బదులు మళ్ళీ మేడమే రావాలి.మేడం వస్తనే బాగుంటుంది. అప్పుడు మేడం ఒక్కరు కాకుండా మేడమ్ కు తోడు ఉంటారు”అంది.అసలు ఆ బుజ్జి కన్నమ్మ బుర్రలో ఉన్న అమ్మ మనసుకు కళ్ళు చెమ్మగిల్లాయి.ఎంతైనా ఆడపిల్లలు అమ్మల్లాగే ఆలోచిస్తారు అనడానికి నిదర్శనం ఇదే కదా అనిపించింది.
మరి నేను వెళ్తుంటే నీకేం బాధగా బంగారూ? అడిగాను ఏమంటుదో విందామని.
మీరు ఇక్కడే ఉండాలని ఉంది మేడం.కానీ మిమ్మల్ని ఇక్కడ ఉంచరటగా మేడం అని వెంటనే మీరుంటే మాతో కథలు కవితలు రాయిస్తారు తెలుగులో రకరకాల పోటీలు పెట్టి మంచి మంచి కథల పుస్తకాలు బహుమతిగా ఇస్తారు.టీచర్స్ డే, చిల్డ్రన్స్ డే అప్పుడు మంచి మంచి కార్యక్రమాలు పెడతారు. మీరెళ్ళినంక ఎవరొత్తారో ఏమో! ఇవన్నీ పెడతారో పెట్టరో? ఆరిందలా అంటున్న ఆ మాటలకు కొద్దిగా నవ్వు వచ్చింది కానీ తనలోని సునిశిత పరిశీలనకు ఆశ్చర్యం, ఆనందం రెండూ కలిగాయి.
ఇలాంటి బుజ్జి కన్నమ్మ లకు చిన్నప్పటి నుంచే మంచి ప్రోత్సాహం, శిక్షణ ఇస్తే చదువొక్కటే కాదు సమాజాన్ని అర్థం చేసుకుంటూ ఉన్నత స్థాయికి తప్పకుండా ఎదుగుతారు. అలా ఎదగాలి ఈ బంగారు బుజ్జి తల్లులూ,తండ్రులూ. ఈ బుజ్జి కన్నమ్మకు నా దీవెనలు ఆశీర్వాదాలు ఫలించి తనో సామాజిక వేత్తగా పేరు తెచ్చుకోవాలని మనసారా కోరుకుంటున్నాను.

Written by Urimalla Sunanda

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

కాగితం పడవ – భాగం 8

లోకాభిరామాయణం – 8